రైతన్న జలఘోష
బోయినపల్లి: రైతన్న సాగు నీటికోసం పెద్ద సమరమే చేస్తున్నాడు. రబీ పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వరదకాలువ పరిస ర ప్రాంతాల్లోని బోర్లు, బావులు సైతం ఎండిపోయాయి. రబీలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను దక్కించుకోవడం రైతులకు కష్టతరంగా మారింది.
ఇక ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరదకాలువ లో నీటివేట సాగిస్తున్నారు. కాల్వలో పెద్ద ఎత్తున గుంతలు తవ్వి వాటి ద్వారా పంటలకు నీరందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటికోసం రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోవడం అన్నదాతలకు గుదిబండగా తయారైంది.
గతంలో ఎస్సారెస్పీ నిండగా వరదకాలువ ద్వారా భారీగా నీరు విడుదల చేశారు. బోయినపల్లి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, ఇల్లంతకుంట తదితర వరదకాలువ పారకం ఉన్న మండలాల్లోని రైతులు పంటలు సాగు చేసుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ త ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటివరకు వర్షాభావంతో శ్రీరాంసాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీరు సమృద్ధిగా లేక ఖరీఫ్‌లో వరద కాలువకు అరకొరగా నీటిని వదిలారు.
దీంతో జిల్లాలో దాదాపు 125 కిలోమీటర్లున్న వరద కాలువ వట్టిపోయింది. సాగు నీటి కోసం తపిస్తున్న రైతులు వరద కాలువలో పొక్లెయిన్‌లతో గుంతలు తవ్వుతున్నారు. గుంతలు, పైప్‌లైన్ల నిర్మాణానికి ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా తవ్విన గుంతల్లో సైతం నీటి ఊటలు కరువై అన్నదాతలు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు.
మరోవైపు బావుల్లో నీరు అడుగంటడంతో మెజారిటీ రైతులు బోరు బావుల తవ్వకాలు చేపడుతున్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి బోర్ల తవ్వకాలు చేస్తున్న రైతులకు బోరు సక్సెస్ కావడం లక్కీ లాటరీగా మారింది. అయినా పట్టువదలని అపరభగీరథుల్లా కొంతమంది రైతులు నాలుగైదు బోర్లు వేస్తున్నారు. వేసవికి ముందే నీటి ఊటలు అడుగంటడంతో వేసవికాలం ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.