ఖమ్మం జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, ఖమ్మం : గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒకరకంగా ఉంటే.. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో మాత్రం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ మండలాల్లో రబీకి సాగుతోపాటు తాగునీటికీ ఇబ్బందులు తప్పేలా లేదు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం లోటు ఉంది. దీంతో వర్షాధార పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. గత ఐదేళ్లలో చూస్తే ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. నైరుతి రుతుపవన కాలం లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జూన్‌లో అత్యధికంగా 77.5 మి.మీ, ఆగస్టులో 32.8 మి.మీ లోటు ఏర్పడ డం, ఆ తర్వాత కూడా తగిన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతానికి కీలకమైన ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో, ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ప్రస్తుతం ప్రారంభమైన రబీ సీజన్‌లో వర్షాలు అంతగా లేకపోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 2013 డిసెంబర్‌లో సగటున 6.70 మీటర్ల లోతులో నీరు ఉంటే.. గత ఏడాది డిసెంబర్‌లో 7.75 మీటర్ల లోతుకు వెళ్లింది. సత్తుపల్లిలోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలో 29.80 మీటర్లు, అశ్వారావుపేటలో 32 మీటర్ల లోతులో నీరు ఉందని, ఇక్కడ ఇసుక పొరలు ఉన్నందున కొద్దిపాటి వర్షం పడినా మళ్లీ భూగర్భ జలం పైకి వస్తుందని జియాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. కానీ కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ బోర్లు, బావులతో అధికంగా నీటి వినియోగంతో భూగర్భ జల మట్టం పడిపోతోంది.
పడిపోతున్న జలాలు..
భూగర్భ జలవనరుల శాఖ అంచనా ప్రకారం రబీ సీజన్‌లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోతే సాగు, తాగునీటికి అంతగా ఇబ్బం ది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీ చివరి నాటికి తీవ్రతరమై నీటి కష్టాలు వస్తాయి. డిసెంబర్ చివరినాటికి కూసుమంచి మండలంలో 14.45 మీటర్లు, చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో 14.80 మీటర్లు, తిరుమలాయపాలెం మండలంలో 13.35 మీటర్లు, బూర్గంపాడులోని ఎంపీ బంజరలో 9.90, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో 9.10మీటర్లు, చండ్రుగొండ మండలం రావి కంపాడులో 8.85, కామేపల్లి మండలం కొత్తలింగాలలో 7.57, ఇల్లెందు మండలం ఎస్.నారాయణపురంలో 7.51 మీటర్లలోకి భూగర్భ జలాలు వెళ్లాయి. గత డిసెంబర్‌తో పోలిస్తే సగటున ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటడం గమనార్హం. ఇక్కడ వేసవికాలంలో భూగర్భ జలం మరింత లోతుల్లోకి వెళ్లి పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది.
అధిక వినియోగంతో పాతాళంలోకి...
కురిసిన వర్షం 100 శాతం భూమిలోకి ఇంకితే.. అంతకంటే ఎక్కువగా వినియోగిస్తుండటంతో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని 19 గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లాయి. తిరుమలాయపాలెం మండలం ముజాహిద్‌పురంలో 118 శాతం, కాకరవాయిలో 103, రఘునాధపాలెంలో 106, సుబ్లేడులో 125, హస్నాబాద్‌లో 103 , లక్ష్మీదేవిపల్లిలో 128, జూపెడలో 104, పైనంపల్లిలో 132, సోలీపురంలో 156, మహ్మదాపురంలో 142, బచ్చోడులో 127, బీరోలులో 114, బంధంపల్లిలో 112, హైదర్‌సాయిపేటలో 116, పాతర్లపాడులో 102 శాతం, కూసుమంచి మండలం గైగోళ్లపల్లిలో 203 శాతం, చౌటపల్లిలో 140, పోచారంలో 124, కూసుమంచిలో 116 శాతం నీటి ని వినియోగిస్తున్నారు. ఇక్కడ సాగునీటి కోసం బోర్లు, బావులు వందల సంఖ్యలో ఉండటంతో నీటి వినియోగం అధికంగా ఉంది. రబీలో నీటిని తోడటం ఎక్కువైతే గ్రామాల్లో మంచినీటికి తల్లడిల్లక తప్పదు.
వాల్టా..ఉల్టా..
భూగర్భ జల వనరులను పరిరక్షించడానికి వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టం ప్రధానమైనది. భూగర్భ జలవనరుల శాఖ అనుమతి లేకుండా ఎక్కడైనా ఇసుక తవ్వినా, బోర్లు, బావులు తీసినా కేసు నమోదు చేస్తారు. అయితే గ్రామాల్లో వాల్టా చట్టాన్ని అతిక్రమించి వేల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా వాగులు, వంకల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పొక్లెయిన్లతో ఇసుకను భారీ ఎత్తున తీయడంతో వాగులు, వంకల తీరప్రాంతాల్లో భూగర్భ జలం పడిపోతోంది. వర్షాభావ పరిస్థితులతో నీరు మరింత లోపలికి వెళ్లడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే కొంత మేరకైనా భూగర్భ జలమట్టం పడిపోకుండా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.