కల్హేర్: అసలే సాగునీరు అంతంత మా త్రం...ఆపై అనావృష్టి..ఖరీఫ్‌లో వేసిన పంటలన్నీ నాశనమయ్యాయి. వ్యవసాయమే తప్ప మరొకటి తెలియని రైతన్నలు భూమాతనే నమ్ముకుని రబీకి సిద్ధమయ్యారు. కానీ ఈ సారి సొంత భూముల్లో కాకుండా శిఖం భూముల్లో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. సాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే కావడంతో ప్రత్యామ్నాయంగా తేమశాతం ఎక్కువగా ఉండే నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు దృష్టి మళ్లించారు. అనుమతులు లేకున్నప్పటికీ మరో దారిలేక శిఖం భూమిని దున్ని శనగ విత్తనాలు వేసుకుంటున్నాడు.
సాగర్‌లో శనగసాగు
జిల్లాలో విస్తరించిన నిజాంసాగర్ శిఖం భూములు వేల ఎకరాల వరకు ఉంటాయి. ఈసారి వర్షాలు అంతంతమాత్రమే కావడంతో నిజాంసాగర్ శిఖం భూముల్లో నీరు చేరలేదు. ప్రస్తుతం 10 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండడంతో అందులో శనగ పండించేందుకు సమీప ప్రాంతాల రైతులు సిద్ధమయ్యారు. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, బాచేపల్లి, ఖానాపూర్(బి), దామర్‌చెరువుతో పాటు నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన రైతులు ఒకరి చూసి మరొకరు శనగ విత్తనాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం వైపు పరుగు తీస్తున్నారు. వారం రోజులుగా సుమారు 500 మందికు పైగా రైతులు శిఖం భూముల్లో హద్దులు ఏర్పాటు చేసుకుని దుక్కి దున్నడంతో పాటు విత్తనం కూడా వేసేశారు. మరికొంత మంది ఇపుడిపుడే దుక్కికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ శిఖం భూముల్లో 200 వరకు నాగళ్లు, 20 వరకు ట్రాక్టర్లతో దుక్కి పనులు జరుగుతున్నాయి.
దేవుడిపైభారం వేసి
నిజాంసాగర్ శిఖం భూముల్లో సాగు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా రైతులు ఈ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేస్తున్నా, అధికారులు ఎప్పుడొచ్చి అడ్డుకుంటారోనన్న భయంతో హడావుడిగా పనులు కానిస్తున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకోకపోయినా, ప్రతి యేటా సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌కు వదిలే 3 టీఎంసీల నీరు వచ్చినా శిఖం భూములు మునిగిపోతాయి. అయినప్పటికీ వరుణుడు ఈ రబీలోనూ కరుణ చూపడన్న అంచనాలతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు.
శిఖం భూముల కోసం గొడవలు
ఒకరిని చూసి మరొకరు ఇలా రైతులంతా నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధం కావడంతో శిఖం భూమి కోసం డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు రైతులు భూమి కోసం ఘర్షణకు దిగుతున్నారు. గొడవలకు దిగకుండా రైతులు సంయమనం పాటిస్తే కరువు కాలంలో కాసిన్ని శనగలైనా పండించుకుని బతికిపోవచ్చని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఆశల సాగు
Published Fri, Oct 10 2014 12:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement