సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్‌లో జలాశయాల కింద రైతులకు ముందుగానే సాగునీరు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సీజన్‌ను ముందుగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు సోమశిల కింద ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేయాలని గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.
తుపానుల బారిన పడి రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో హెల్త్ హబ్‌లకు భూములను కేటాయించడంతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2022–27 ఏపీ ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి, 2022–27 ఏపీ లాజిస్టిక్ విధానానికి పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు. వరుసగా వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముందస్తు నీటితో మూడో పంటకు అవకాశం
► వైఎస్సార్ హాయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలిజేయడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకుని సమాయత్తం అవుతారు.
► గతంలో ఆగస్టులో నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఖరీఫ్‌కు వివిధ ప్రాజెక్టుల నుంచి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నాం. దీనివల్ల నవంబర్, డిసెంబర్‌లలో వచ్చే తుపానుల బారిన పడకుండా రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. అలాగే రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది.
► గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటి విడుదల చేయనున్నాం. పోలవరం రివర్ స్లూయిస్ డెడ్ స్టోరేజీ నుంచి, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. కృష్ణా డెల్టాకు, గుంటూరు చానల్‌కు జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తాం. పులిచింతలలో 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులిచింతల పునరావాసానికి రూ.100 కోట్లు చెల్లించడంతో ఇది సాధ్యమైంది. దీంతో పట్టిసీమతో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తాం.
► పెన్నా బేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల ప్రాజెక్టుల నుంచి జూన్ 10న సాగునీటిని విడుదల చేస్తాం. సోమశిలలో 56 టీఎంసీల నీరు ఉంది. రాయలసీమలో ఎస్‌ఆర్‌బీసీ పరిధిలోని అవుకు, గోరుకల్లు నుంచి జూన్ 30వ తేదీన నీటిని విడుదల చేస్తాం. నాగార్జున సాగర్ కింద కుడిగట్టు ఆయకట్టుకు జూలై 15న నీళ్లిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా భరోసా
► ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సమస్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
► కొన్ని ప్రాంతాల్లో ఖరీప్ సీజన్ ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కింద ముందస్తుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభించడంతో ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తవని భావిస్తున్నాం. అలాగే మూడో పంట ద్వారా పంటల మార్పిడికి అవకాశం కలుగుతుంది. సాగునీటి విడుదల షెడ్యూల్ ఆధారంగా సాగు నీటి సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం
► ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం మే 13వ తేదీన ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా, మే 16న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తారు. మే 19న పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభిస్తారు.
► జూన్ 6న 4,014 కమ్యునిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్ హార్‌వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్–21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను జూన్ 14న, జూన్ 21న అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా..
► కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్. 38 అదనపు పోస్టులు మంజూరు. అప్‌గ్రెడేషన్ కోసం రూ.8.18 కోట్లు వ్యయం.
► పులివెందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.
► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం.
► మార్క్‌ఫెడ్‌లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు.
► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు.
► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్‌కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్‌కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం.
► రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం. కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ హబ్స్‌లో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూముల కేటాయింపు. మచిలీపట్నంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రి కోసం ఎకరా భూమి కేటాయింపునకు ఆమోదం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు.
► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్‌టైల్ పార్క్‌కు కేటాయింపు.
► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్‌టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.
► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్‌నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి.
► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం.
► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్.
► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు.
► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం.
► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం.
► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం.
► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం.
► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు.
Comments
Please login to add a commentAdd a comment