6న రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ | Input subsidy to farmers on 6th | Sakshi
Sakshi News home page

6న రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ

Published Mon, Mar 4 2024 4:01 AM | Last Updated on Mon, Mar 4 2024 3:19 PM

Input subsidy to farmers on 6th - Sakshi

ఖాతాల్లోకి కరువు సాయం.. మిచాంగ్‌ పరిహారం

11.59 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,294.58 కోట్లు

 బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి:  దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్‌ సీజన్‌లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్‌ ఆరంభంలో మిచాంగ్‌ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు
ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్‌ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్‌ ప్రభుత్వం అండ­గా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూ­డదన్న సంకల్పంతో ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభా­వంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగ­య్యాయి.

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ­రు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉప­గ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్‌ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపో­యినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు.

22 జిల్లాల్లో మిచాంగ్‌ ప్రభావం
మిచాంగ్‌ తుపాన్‌ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎక­రా­ల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బ­తిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఐదు వేల ఎకరా­ల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.­5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ­తిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు.

భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు
కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు.

వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్‌ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్‌ తుపాన్‌ వల్ల 2023–24 సీజన్‌లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు.

గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సా­యంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది.  –చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement