రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ | Subsidy on investment in farmers accounts | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

Published Sat, May 18 2024 5:29 AM | Last Updated on Sat, May 18 2024 5:29 AM

Subsidy on investment in farmers accounts

నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు 

11.57 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,289.58 కోట్లు 

ఖరీఫ్‌ 23 కరువు సాయం, మిచాంగ్‌ తుపాన్‌ పరిహారం చెల్లింపు 

ఆంక్షలు సడలించిన ఈసీ.. కోడ్‌ సాకుతో అడ్డుకున్న బాబు బృందం

సాక్షి, అమరావతి: చంద్రబాబు బృందం కుట్రపూరిత రాజకీయాలతో నిలిచిపోయిన ఖరీఫ్‌ 2023 కరువు సాయం, మిచాంగ్‌ తుపాన్‌ పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోలింగ్‌ ముగిసే వరకు డీబీటీ పథకాల చెల్లింపులపై ఎన్నికల కమిషన్‌ విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో నేటి నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆరు ప్రామాణికాల ఆధారంగా అంచనా 
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగుపై కొంత మేర ప్రభావం చూపాయి. వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల స్థాయి లాంటి ఆరు ప్రామాణికాల ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు నిబంధనల మేరకు లెక్క తేల్చారు. ఇందులో ఉద్యాన పంటల విస్తీర్ణం 92,137 ఎకరాలు కాగా వ్యవసాయ పంటలు 13,32,108 ఎకరాలున్నాయి.

ఆర్బీకేల్లో జాబితాలు 
ఇక రబీ 2023–24 సీజన్‌ ఆరంభంలో మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఇందులో 64,695 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 5,99,685 ఎకరాలు వ్యవసాయ పంటలున్నాయి. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్‌ తుపాన్‌తో నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు చొప్పున 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీగా లెక్కతేల్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు.

మోకాలొడ్డిన బాబు బృందం 
కరువు సాయంతో పాటు మిచాంగ్‌ తుపాన్‌ పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందంటూ చంద్రబాబు బృందం ఈసీకి ఫిర్యాదు చేసి నిధుల విడుదలను అడ్డుకుంది. ఖరీఫ్‌ వేళ  రైతులకు సాయం అందకుండా మోకాలొడ్డింది. పోలింగ్‌ ముగిసే వరకు ఇతర డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. 

ఈ క్రమంలో మే 10వతేదీన జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఒత్తిళ్లకు తలొగ్గి వివరణల సాకుతో ఎన్నికల కమిషన్‌ తాత్సారం చేయడంతో నిధులు జమ కాలేదు. తాజాగా పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో డీబీటీ పథకాల లబ్దిదారులకు నగదు బదిలీపై ఆంక్షలను ఎన్నికల కమిషన్‌ సడలించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెట్టుబడి రాయితీ జమ చేసేందుకు మార్గం సుగమమైంది.

అర్హులైన రైతుల ఖాతాల వారీగా బిల్లులు జనరేట్‌ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా మొత్తంతో కలిపి ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు రూ.3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీగా అందించినట్లవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement