
సాక్షి, అమరావతి: ప్రజలు సబ్సిడీలకు(రాయితీలకు) బానిసలయ్యారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీ వంటి వాటికి అలవాటు పడిపోయారని చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాల్‌లో ఈ–ప్రగతి–ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. టెలికం రంగంలోకి రావాలని ధీరూబాయ్ అంబానీకి చెప్పింది తానేనన్నారు. అప్పట్లో తన నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సుల వల్లే దేశంలో టెలికం సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. దానివల్లే ప్రస్తుతం ప్రజలకు ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామిక విప్లవం రావడంలోనూ తన కృషి ఉందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో మొదలైన స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం తన ఆలోచనేనని చెప్పుకొచ్చారు.
వారికి నేనే వడ్డించా.. : ఒరిజినల్ ఐఎస్‌బీ సర్టిఫికెట్ పొందడం చాలా కష్టమని, కానీ ఇక్కడ సులభంగా డిగ్రీ పొందారని సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన అధికారులను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ముంబయి, చెన్నై, బెంగళూరులో పెట్టాలనుకుంటే తాను చాలా కష్టపడి హైదరాబాద్‌కు తీసుకొచ్చానని తెలిపారు. ఆ సమయంలో మెకంజీ వాళ్లను కాఫీకి పిలిచానని, సర్వర్లను కూడా వెళ్లిపొమ్మని, తానే వారికి అన్నీ వడ్డించానని, చివరికి హైదరాబాద్‌లో ఐఎస్‌బీ పెట్టేందుకు ఒప్పించానని చెప్పారు.
హోదా, హామీలు.. మన హక్కులు: చాలా కష్టాలున్నాయని, కేంద్రం డబ్బులివ్వడం లేదని బాబు వెల్లడించారు. ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలన్నీ మన హక్కులని తెలిపారు. వీటికోసం పోరాడుతూనే లక్ష్యం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 96 మంది అధికారులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment