telecom sector
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
టెలికం పీఎల్ఐ స్కీముతో కోట్లాది పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద టెల్కోలు రూ. 2,419 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా 17,753 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. ఇది దేశీ టెలికం పరిశ్రమ చరిత్రలో కీలక మైలురాయని తెలిపారు. అమెరికాకు చెందిన టెలిట్ సింటెరియోన్ కోసం దేశీ సంస్థ వీవీడీఎన్ .. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్స్, డేటా కార్డుల తయారు చేయడానికి సంబంధించిన ప్రొడక్షన్ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. సంక్లిష్టమైన మెషిన్లను నిర్వహించడంలో అమ్మాయిలకు కూడా శిక్షణ లభిస్తుండటమనేది మేకిన్ ఇండియా లక్ష్య విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పీఎల్ఐ స్కీము కింద ఎంపికైన కంపెనీల్లో వీవీడీఎన్ కూడా ఒకటి. 2022 అక్టోబర్‌లో ఈ పథకం కోసం కేంద్రం 42 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆయా సంస్థలు రూ. 4,115 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 44,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. రాజన్‌కు కౌంటర్.. మేకిన్ ఇండియా నినాదాన్ని విమర్శిస్తున్నవారు టెలికం, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ సాధిస్తున్న సామరŠాధ్యల గురించి తెలుసుకునేందుకు వీవీడీఎన్ ప్లాంట్లను సందర్శించాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్‌కు వైష్ణవ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నేడు భారత్‌లో తయారు చేస్తున్న టెలికం పరికరాలు అమెరికా, యూరప్, జపాన్ మొదలైన ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయన్నారు. అత్యంత నాణ్యమైనవిగా భారతీయ ఉత్పత్తులు ఆయా దేశాల ఆమోదయోగ్యత పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో భారత్‌లో అదనంగా ఎంత విలువ జతవుతున్నది ప్రశ్నార్ధకమేనంటూ రాజన్ కొన్నాళ్ల క్రితం సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వైష్ణవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వినియోగ ఉత్పత్తులకు మంచి డిమాండ్
హైదరాబాద్: సాంకేతిక వినియోగ వస్తువుల రంగం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లతో కూడిన టెలికం ఉత్పత్తుల విభాగంలో అమ్మకాల పరిమాణం 4 శాతం తగ్గింది. విలువ పరంగా 12 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, 2022లోని ఇదే కాలంతో పోలిస్తే కొన్ని రంగాలు గణనీయమైన వృద్ధిని చూశాయి. ‘‘భారత కన్జ్యూమర్ మార్కెట్ మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఉంది. మార్కెట్లో వినూత్నమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది. టెక్నికల్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ పరంగా 8 శాతం చక్కని వృద్ధిని ప్రదర్శించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ రంగం (ఆడియో, వీడియో) 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది’’అని జీఎఫ్కే మార్కెట్ నిపుణురాలు సౌమ్య ఛటర్జీ తెలిపారు. జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్‌లైన్ రిటైల్ ట్రాకింగ్ నివేదిక ప్రకారం.. ► స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లు మంచి పనితీరు చూపించాయి. విలువ పరంగా 12 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ విభాగం విలువ పరంగా 14 శాతం, పరిణామం పరంగా 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ముఖ్యంగా రూ.30,000కు పైన ఉన్న స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50 వృద్ధి కనిపించింది. ► ప్రధాన గృహోపకరణాల విభాగం ఆశాజనకమైన పనితీరు చూపించింది. ఎయిర్ కండీషనర్లలో 7 శాతం వృద్ధి కనిపించింది. వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మైక్రోవేవ్ ఓవెన్లు 4 శాతం అమ్మకాల వృద్ధిని చూశాయి. ► మంచి వినోద అనుభవాన్ని భారత వినియోగదారులు కోరుకుంటున్నారు. దీంతో ఆడియో హోమ్ సిస్టమ్‌ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. పీటీవీ/ఫ్లాట్ టెలివిజన్ల అమ్మకాలు 13 శాతం అధికంగా నమోదయ్యాయి. ► ఐటీ రంగంలో డెస్‌్కటాప్ కంప్యూటర్ల అమ్మకాలు 7 శాతం పెరిగాయి. మొబైల్ పీసీ విక్రయాలు 14 శాతం తగ్గాయి. ► రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 29 శాతం పెరిగాయి. -
టెలికం ఆదాయం అంతంతే.. 5జీ వచ్చినా లాభం లేదు!
న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 5జీ ఆదాయ వనరుగా మారలేదు.. మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు. -
జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్ఎం ఇండియా ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం) విధానాలను పటిష్టం చేసే దిశగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) ఇండియా అఫీలియేట్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద ఈఆర్ఎంపై అవగాహన పెంచేందుకు ఇరు సంస్థలు వెబినార్లు, రౌండ్టేబుల్స్, సమావేశాలు మొదలైనవి నిర్వహించనున్నాయి. 140 పైచిలుకు దేశాల్లో ఈఆర్ఎంకు సంబంధించిన నిపుణుల సమాఖ్యగా ఐఆర్ఎం వ్యవహరిస్తోంది. ఐఆర్ఎం ఇటీవలే సిప్లా, అల్ట్రాటెక్ తదితర సంస్థలతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. -
సర్వీసుల నాణ్యత తక్షణం మెరుగుపర్చండి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆపరేట్లను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అలాగే కాల్ అంతరాయాలు, అవుటేజ్ డేటాను రాష్ట్ర స్థాయిలో కూడా వెల్లడించాలని సూచించింది. ప్రస్తుతం లైసెన్స్ ఏరియా ప్రాతిపదికగా ఈ వివరాలను ఆపరేటర్లు ఇస్తున్నారు. టెల్కోలతో సమావేశం సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా ఈ విషయాలు తెలిపారు. అనధికారిక టెలీమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబర్లతో పంపించే అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను గుర్తించేందుకు .. బ్లాక్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాధనాన్ని ఉపయోగించాలని టెల్కోలకు సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సాధనం వచ్చే రెండు నెలల్లో మొత్తం పరిశ్రమ అమలు చేసే అవకాశం ఉంది. దీనితో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, మెసేజీల బెడద తగ్గుతుందని వాఘేలా చెప్పారు. రాబోయే రోజుల్లో నాణ్యతా ప్రమాణాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి అనవసర హెడర్లు, మెసేజీ టెంప్లేట్లను తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ఆయా రంగాల నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు మొదలైన వాటిని కోరనున్నట్లు వాఘేలా చెప్పారు. -
ఎయిర్టెల్ భారీ ప్లాన్: రూ.28,000 కోట్ల పెట్టుబడి, టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్వర్క్ విస్తరణ లక్ష్యంగా ఈ పెట్టుబడి ఉంటుంది. మొబైల్ యాంటెన్నాలు, ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైస్ టెక్నాలజీ డేటా సెంటర్స్‌పై ఈ ఖర్చు చేస్తారు. ‘ఎయిర్టెల్ మూలధన వ్యయం గత మూడేళ్లలో ఖర్చు చేసిన దానికి అనుగుణంగా ఉంటుంది. 5జీ వేగవంతమైన రోల్అవుట్ కారణంగా ఇది హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏడాదిలో ఈ వ్యయంలో పెరుగుదలను చూడవచ్చు. క్రమంగా అదే స్థాయిలో కొనసాగవచ్చు’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నవంబర్ 26 నాటికి కంపెనీ 5జీ నెట్వర్క్ కోసం 3,293 బేస్ స్టేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారి వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులనుబట్టి ధరల శ్రేణి ఆధారపడి ఉంటుందని అన్నారు. అధిక చార్జీలు ఉండవు.. హరియాణా, ఒడిషాలో కనీస రిచార్జ్ విలువ 28 రోజుల కాలపరిమితి గల ప్యాక్‌పై 57 శాతం ధర పెంచి రూ.155గా కంపెనీ నిర్ణయించింది. ఈ పైలట్ ప్యాక్ కింద అన్లిమిటెడ్ కాలింగ్, 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌పై ఆరు వారాల్లో కంపెనీ ఒక అవగాహనకు రానుంది. తదనుగుణంగా ఇతర టెలికం సర్కిల్స్‌లో ఈ ప్యాక్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో 5జీకి ప్రీమియం చార్జీలు విజయవంతం కాలేదని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. 2జీ నుంచి 4జీకి మళ్లడం, ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదార్లు బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ వంటివి కొనుగోలు కారణంగా ఒక్కో కస్టమర్ నుంచి సగటు ఆదాయం అధికం అవుతుందన్నారు. జూలై–సెప్టెంబర్‌లో వినియోగదారు నుంచి ఎయిర్‌టెల్‌కు సమకూరిన సగటు ఆదాయం రూ.190. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.153 నమోదైంది. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
టెలికం టవర్ల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన కొత్త రైట్ ఆఫ్ వే రూల్స్ ప్రకారం.. ప్రైవేట్ భవనాలు, స్థలాల్లో మొబైల్ టవర్లు, స్తంభాలను అమర్చడం, కేబుల్స్ ఏర్పాటుకు టెలికం కంపెనీలకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే సంబంధిత అధికారులకు ముందస్తుగా రాతపూర్వకంగా సమాచారం తప్పనిసరి. భవనం, నిర్మాణం వివరాలు, ఎంత మేరకు భద్రంగా ఉన్నదీ స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి ధ్రువీకరణతో సమాచారాన్ని టెలికం కంపెనీలు అందించాల్సి ఉంటుంది. 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. -
5జీతో దేశంలో 2 కోట్ల కొత్త ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీ ‘5జీ’భారత్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్’(టీఎస్ఎస్సీ) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఉంది. అదే తరహాలో 5జీ సాంకేతికత ఆధారంగా వచ్చే కొత్త ఉద్యోగాలను ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడేళ్లలో సుమారు లక్ష మందికి 5జీ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమలు, నైపుణ్య సంస్థలను ఒక చోటకు చేర్చి, ‘టెలికాం మంథన్ 2022’పేరిట ఇటీవల చర్చించింది. హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ తెలంగాణలో నైపుణ్య శిక్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో టెలికాం రంగంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ టీఎస్ఎస్సీ హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ‘టాస్క్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో టీఎస్ఎస్సీ ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 5జీతో పాటు ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల నైపుణ్య శిక్షణపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 5జీ టెక్నాలజీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలను టాస్క్ ఏకతాటిపైకి తెస్తే.. శిక్షణ, సర్టిఫికెట్ల జారీ టీఎస్ఎస్సీ ద్వారా జరుగుతుంది. కొత్త టెక్నాలజీలపై ఆసక్తి, నేర్చుకునే ఉత్సాహం కలిగిన యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నందునే హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఎస్సీ ప్రకటించింది. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం 5జీ సాంకేతికతలో శిక్షణకే పరిమితం కాకుండా భారత్‌లో 5జీ వాతావరణం అభివృద్ధితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తేవడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. 5జీ రంగంలో సప్లై చెయిన్ పెరిగినకొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నానాటికి పెరిగే డిమాండ్‌ను నెరవేర్చడంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలకంగా మారనుంది. రెండు, మూడేళ్లలో లక్ష మందికి ‘5జీ శిక్షణ’ ప్రస్తుతం 4జీ సాంకేతికత ఆధారిత మొబైల్ ఫోన్లను దేశంలో 80 శాతం జనాభా ఉపయోగిస్తోంది. 4జీ టెక్నాలజీతో పోలిస్తే కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీ వంద రెట్ల వేగంతో పనిచేయనుండటంతో, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల్లో నైపుణ్య శిక్షణ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే పలు సంస్థలు 5జీ టెక్నాలజీతో పాటు ఐఓటీ, ఏఐ, ఎంఎల్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై తమ ఉద్యోగులకు అంతర్గత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చే రెండు, మూడేళ్లలో టీఎస్ఎస్సీ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా లక్ష మంది యువతకు 5జీ సాంకేతికతపై శిక్షణ ఇస్తారు. -
5000 పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్‌లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి. మొబైల్ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువ. టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 900 మెగాహెట్జ్ ద్వారా.. ‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్‌లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) 5జీ నెట్వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్‌లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం. రిలయన్స్ జియో సైతం.. టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. -
న్యూఎనర్జీలోనూ రిలయన్స్ ముద్ర
న్యూఢిల్లీ: టెలికం రంగంలో మాదిరే న్యూ ఎనర్జీలోనూ (హైడ్రోజన్ తదితర కొత్త తరహా పర్యావరణానుకూల ఇంధనాలు) రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు 5–7 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని అన్ని వ్యాపారాలను మించి వృద్ధిని సాధించే విభాగంగా ఇది అవతరించనుందని చైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ వృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు. న్యూఎనర్జీపై రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తుండడం తెలిసిందే. ‘‘వచ్చే 12 నెలల్లో పర్యావరణానుకూల ఇంధన రంగం (గ్రీన్ ఎనర్జీ) వ్యాల్యూచైన్‌లో కంపెనీ పెట్టుబడులు మొదలవుతాయి. తదుపరి కొన్నేళ్లలో వాటిని పెంచుతాం. వచ్చే 5–7 ఏళ్లలో ఈ నూతన వృద్ధి ఇంజన్ ప్రస్తుతమున్న అన్ని ఇంజన్లను మించి వృద్ధి చూపించనుంది’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. నాలుగు గిగా ఫ్యాక్టరీల పేరుతో మొత్తం గ్రీన్ ఎనర్జీలోని అన్ని విభాగాల్లోనూ చొచ్చుకుపోయే ప్రణాళికలలో రిలయన్స్ ఉంది. తద్వారా అందుబాటు ధరలకే ఇంధనాలను తీసుకురావాలని, భారత్‌ను గ్రీన్ ఎనర్జీ తయారీలో ప్రముఖ దేశంగా మార్చే లక్ష్యంతో ఉంది. సోలార్ విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇలా అన్ని విభాగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సంప్రదాయ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కంపెనీగా ఉన్న రిలయన్స్‌ను.. రిటైల్, టెలికం వ్యాపారాలతో న్యూఏజ్ కంపెనీగా అంబానీ మార్చడం తెలిసిందే. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీని ఆయన తదుపరి వ్యాపార అస్త్రంగా ఎంచుకున్నారు. అందుబాటు ధరలకే ‘‘ప్రపంచంలో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ధరలు భారత్‌లోనే తక్కువ. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌక గ్రీన్ ఎనర్జీ దేశంగా అవతరిస్తాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపులో సాయంగా నిలుస్తాం’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగు గిగా ఫ్యాక్టరీలను ప్రకటించడమే కాకుండా, రూ.5,500 కోట్లతో పలు కంపెనీలను కొనుగోలు చేసింది. 5జీ సేవలకు రెడీ: రిలయన్స్ జియో అతి త్వరలోనే 1,000 పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభించనుంది. ఈ పట్టణాల్లో 5జీ ప్రణాళికలను పూర్తి చేసినట్టు, క్షేత్రస్థాయిలో రిలయన్స్ సొంత టెలికం పరికరాలతో పరీక్షించినట్టు అంబానీ ప్రకటించా రు. ఇటీవలే ముగిసిన 5జీ వేలంలో రూ.88 వేల కోట్లతో స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం తెలిసిందే. రెండో ఏడాది జీతం నిల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది ఎటువంటి వేతనం తీసుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన 2020–21 సంవత్సరానికి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికీ (2021–22) కూడా అదే విధానాన్ని కొనసాగించినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఇక 2019–20 సంవత్సరానికి అంబానీ రూ.15 కోట్ల వేతనం తీసుకున్నారు. అంతేకాదు 2008–09 నుంచి ఆయన అదే స్థాయిలో వేతనాన్ని తీసుకుంటున్నారు. -
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది. వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది. -
టెలికంలోకి అదానీ!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్‌ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్ అంబానీ), ఎయిర్టెల్ (సునీల్ మిట్టల్), వొడాఫోన్ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్ ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది. గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్‌లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. -
నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. "మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..!) -
స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.6,000 క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న భారతి ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా రూ.12,000 వరకు ధర గల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. శామ్సంగ్, షావొమీ, వివో, ఒప్పో, రియల్మీ, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, లెనోవో, మోటరోలా బ్రాండ్ల ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150కిపైగా మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రూ.249 ఆపైన ధర గల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను 36 నెలలపాటు రిచార్జ్ చేయాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత రూ.2,000, మిగిలిన రూ.4,000లను 36 నెలలు పూర్తి అయ్యాక చెల్లిస్తారు. అలాగే స్క్రీన్ పాడైతే ఒకసారి ఉచితంగా మారుస్తారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ వైపు వినియోగదార్లను అప్‌గ్రేడ్ చేసేందుకే ఈ చొరవ తీసుకున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?
టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? పూర్వరంగం 1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్డ్ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్కమింగ్ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్ఎస్ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం. తాజాగా కల్పించిన రాయితీలేమిటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్ సర్కిల్ ప్రకారం కాకుండా యావత్ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్ వాపస్ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది. ప్రజలకు ఏం ఉపయోగం? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు. 1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్ నెట్ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్ఎన్ఎల్కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: చాలా కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి ఊరట కలిగించే కీలకమైన ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి టెలికామ్ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నేడు జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుంది అని అన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలపై నేడు హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.(చదవండి: జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!) భవిష్యత్ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. టెలికాంలో 100 శాతం ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాం రంగంలో ఆటగాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. -
రిలయన్స్ జియోకు ఐదేళ్లు.. దిగ్గజాల అభినందనలు
దేశీ టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో.. కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కంపెనీకి పలు దిగ్గజాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 2016 సెప్టెంబర్ 5న దేశీ టెలికం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డేటా వినియోగం 1,300 శాతం ఎగిసింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. జియో చౌకగా డేటాను అందించడంతో వినియోగదారులకు టెక్ సంస్థలు మరింత చేరువయ్యేందుకు వీలయ్యింది. ఈ నేపథ్యంలోనే అవి కంపెనీని అభినందనలతో ముంచెత్తాయి. ‘తలెత్తుకుని జీవించడం మీ నుంచి నేర్చుకోవాలి‘ అని హెచ్డీఎఫ్సీ, ‘స్కోరెంత? అని అడగాల్సిన అవసరం లేకుండా లైవ్‌లోనే చూసే సదుపాయం అందుబాటులోకి తెచి్చంది.. జియోకి చీర్స్‘ అంటూ హాట్‌స్టార్ వ్యాఖ్యానించాయి. ‘బర్త్‌డే కేక్ పంపిస్తున్నాం. దారిలో ఉంది‘ అంటూ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో ట్వీట్ చేసింది. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
ఇక ఎయిర్‌టెల్‌లో గూగుల్ రింగ్!
న్యూఢిల్లీ: బూమింగ్‌లో ఉన్న దేశీ మొబైల్ టెలికం రంగంపై ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కన్నేసింది. గతేడాది రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్ భారతీ ఎయిర్‌టెల్‌పైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎయిర్‌టెల్‌లోనూ భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎయిర్‌టెల్‌తో జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఎయిర్‌టెల్‌లోనూ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ రెండింటిలోనూ గూగుల్ వాటాలు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను గూగుల్ కైవసం చేసుకుంది. ఇందుకు రూ. 33,737 కోట్లు వెచ్చించింది. గూగుల్‌తో డీల్ కుదిరితే ఎయిర్‌టెల్‌కు నిధుల రీత్యా బూస్ట్ లభిస్తుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.