స్పెక్ట్రమ్‌ వేలానికి సై! | Union Cabinet approves next round of spectrum auction | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రమ్‌ వేలానికి సై!

Published Thu, Dec 17 2020 1:21 AM | Last Updated on Thu, Dec 17 2020 7:21 AM

Union Cabinet approves next round of spectrum auction - Sakshi

న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్‌ స్పెక్ట్రమ్‌ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్‌ ద్వారా 2,251.25 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్‌ కనీస వేలం ధర (బేస్‌ ప్రైస్‌) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన జారీ చేస్తామని, బిడ్డింగ్‌ మార్చిలో నిర్వహిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కేబినెట్‌ సమావేశం అనంతరం వెల్లడించారు. కాగా, 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ ్రïఫీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.  

‘‘700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలంలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు. బేస్‌/రిజర్వ్‌ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్‌ విలువ రూ.3,92,332.70 కోట్లు’’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది.

ప్రస్తుతానికి 5జీ వేలం లేనట్టే...!
5జీ సేవలకు ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ వేలం ప్రణాళికలకు టెలికం శాఖ (డాట్‌)కు చెందిన అత్యున్నత సంస్థ అయిన డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఈ ఏడాది మే నెలలోనే లైన్‌ క్లియర్‌ చేసింది. అయితే, 5జీ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్‌లో 300 మెగాహెట్జ్‌ను నేవీ ఉపయోగించుకుంటోంది, అలాగే భారత అంతరిక్ష విభాగం కూడా ఈ 5జీ స్పెక్ట్రమ్‌లో పెద్దమొత్తాన్ని తమకు కావాలని కోరింది. మరోపక్క, టెలికం పరిశ్రమ కూడా 5జీ స్పెకŠట్రమ్‌ బేస్‌ ధరను ప్రభుత్వం తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. 5జీ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి ఒక్కో టెలికం ఆపరేటర్‌ దాదాపుగా రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందనేది కంపెనీల వాదన. అయితే, 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమివ్వలేదు. రానున్న వేలంలో కూడా చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం 2016లో నిర్ధేశించిన నిబంధనలనే కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.

చైనా టెలికం పరికరాలకు చెక్‌
చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసేవిధంగా కేంద్ర కేబినెట్‌ తాజా నిర్ణయం తీసుకుంది. టెలికం మౌలిక వసతుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్‌)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

ఈ నిబంధనల ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్‌ ప్రకటిస్తుంది. ‘‘డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన సోర్స్‌ అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీ’గా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులతో పాటు టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు. నెట్‌వర్క్‌లలో ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఖజానాకు దండిగా నిధులు...
వేలంలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకునే టెలికం ఆపరేటర్లు తమ బిడ్‌ ధరతో పాటు ఏటా ప్రభుత్వానికి తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. వైర్‌లైన్‌ సేవల ఆదాయాన్ని మినహాయించి ఏజీఆర్‌ను లెక్కగడతారు. ‘‘స్పెక్ట్రమ్‌లో విజయవంతమైన బిడ్డర్లు తమ బిడ్‌ మొత్తాన్ని ఒకే విడతలో ముందుగానే చెల్లించవచ్చు లేదా కొంత మొత్తాన్ని (700, 800, 900 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బిడ్‌ ధరలో 25%; 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లలో అయితే 50%) ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని గరిష్టంగా 16 సమాన వార్షిక వాయిదాల్లో (రెండేళ్ల మారటోరియం తర్వాత నుంచి) చెల్లించేందుకు వీలుంటుంది’’ అని ప్రభుత్వ అధికార ప్రకటన వివరించింది.

చక్కెర పరిశ్రమకు 3,500 కోట్లు్..
చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత 2020–21 మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్రంæ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేబినెట్‌ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా వార్షిక డిమాండ్‌ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement