టెలికాం సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 22 సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూ.17,940 కోట్ల విలువైన కొత్త 5జీ స్పెక్ట్రమ్(spectrum) వేలానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు టెలికాం శాఖ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వేలంలోని కీలక అంశాలు
మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం ఆపరేటర్లకు మరింత నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ కీలకం కానుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ఇది అనువైందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక్కో సర్కిల్‌కు మొత్తం 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లను అనుసరించి మారుతూ ఉంటుంది. ఢిల్లీ సర్కిల్‌లో అత్యధికంగా మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు, ముంబైలో మెగాహెర్ట్జ్‌కు రూ.67 లక్షలు, మహారాష్ట్రలో రూ.54 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.49 లక్షలుగా ఉంది.
మారటోరియం తిరస్కరణ
భవిష్యత్తులో జరగబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై 5-6 సంవత్సరాల వడ్డీ లేని చెల్లింపు వ్యవధి లేదా మారటోరియం కోసం టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది. ముందస్తు చెల్లింపు, 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపు నిబంధనల్లో మార్పులుండవని తేల్చి చెప్పింది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల వ్యాలిడిటీ కాలానికి అందిస్తారు.
ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్
ఈ వేలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, 5జీ సేవల ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి టెలికాం ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను అందించనున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ముఖ్యంగా హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమైన పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేలంలో యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లను వేలంలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాయ్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment