Spectrum Bids
-
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్‌మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్ స్పందించారు.ఎక్స్‌లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్‌మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్‌లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
86శాతం తగ్గిన ధరావతు సొమ్ము.. స్పెక్ట్రమ్ అంటే..?
నెట్వర్క్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో కంపెనీలు సమర్పించిన ధరావతు సొమ్ము(ఈర్నెస్ట్ మనీ డిపాజిట్లు-ఈఎండీ) 2022 కంటే సుమారు 86శాతం తక్కువగా ఉందని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.తాజా కథనాల ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు సమర్పించిన ఈఎండీ రూ.300-రూ.3,000 కోట్లుగా ఉంది. గత పదేళ్లలో అత్యల్ప ఈఎండీ నమోదవడం ఇదే తొలిసారి. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు సమర్పించిన ఈఎండీల కంటే ఇది దాదాపు 79-86% తక్కువగా ఉంది.స్పెక్ట్రమ్‌లో ఈఎండీలు బిడ్డింగ్ వ్యూహాన్ని, కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఆక్షన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హత పాయింట్లను ఈఎండీల ద్వారా పొందవచ్చు. ఈసారి దాదాపు రూ.97,000 కోట్ల (దాదాపు 12 బిలియన్లు డాలర్లు) విలువైన 5జీ ఎయిర్‌వేవ్‌లలో ప్రభుత్వం 21% స్పెక్ట్రమ్‌ను అమ్మే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందుతుంటారు. తర్వాత ఆక్షన్‌లో పాల్గొని స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంటారు.రిలయన్స్ జియో 2022లో ఈఎండీలు రూ.14000 కోట్లు, ఈసారి రూ.3000 కోట్లు.భారతీఎయిర్‌టెల్ 2022లో ఈఎండీలు రూ.5500 కోట్లు, ఈసారి రూ.1050 కోట్లు.వొడాఫోన్ ఐడియా 2022లో ఈఎండీలు రూ.2200 కోట్లు, ఈసారి రూ.300 కోట్లు.స్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిగతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు
సాంకేతిక విప్లవంలో భారత్ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఇతర సేవలందించేలా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మే 20న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలెందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. మొదట్లో సెల్‌ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్ ఫోన్ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్‌వర్క్‌ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్ అని అర్థం. ఈ నెట్‌వర్క్‌లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ, 5జీ విస్తృత వినియోగంలో ఉన్నాయి. ఏ తరం దేనికి? 1G: 1970ల్లో జపాన్‌లో తొలి తరం మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. 2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్వర్క్ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్, ఎంఎంఎస్ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్ మాత్రమే. 3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. 4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్వర్క్ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలు ఈ నెట్ వర్క్ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్వర్క్ వాడుతున్నారు. 5G: ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే..
కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలాన్ని మే 20న ప్రారంభించనుంది. వీటి ప్రాథమిక ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికాం విభాగం ఇటీవల నోటీసు జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టనున్నారు. అదే సమయంలో కొన్ని టెలికాం కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రానికి ఈ ఏడాది గడువు తీరనుండడంతో ఆ ఫ్రీక్వెన్సీలనూ ఈ వేలంలో జత చేయనున్నారు. దీంతో ప్రస్తుతం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించారు. తుది బిడ్డర్ల జాబితా మే 9న విడుదల చేస్తారు. నమూనా వేలం మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. వాస్తవ వేలాన్ని మే 20 నుంచి చేపడతారు. బిడ్డింగ్‌ను వేలంలో గెలుచుకున్నవారికి 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. 20 సమాన వార్షిక వాయిదాల్లో ఇందుకు చెల్లింపులు చేయాలి. దీనికి వడ్డీ రేటు 8.65 శాతంగా నిర్ణయించారు. కనీసం 10 ఏళ్ల అనంతరం స్పెక్ట్రమ్ సరెండర్ అవకాశం ఇస్తారు. ఈసారి వేలంలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ) లేవు. బ్యాంకు హామీలనూ సమర్పించాల్సిన అవసరం లేదు. స్పెక్ట్రమ్ అంటే? సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార బట్వాడాకు విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
స్పెక్ట్రం కేటాయింపులు.. వ్యతిరేకించిన ఎయిర్టెల్!
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రం కేటాయింపు విషయంలో టెలికం సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వేలం మార్గంలో కేటాయించాలని రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) సూచించగా, భారతీ ఎయిర్టెల్ మాత్రం వ్యతిరేకించింది. స్పెక్ట్రం కేటాయింపులకు వేలం పారదర్శక విధానం కాగలదని జియో అభిప్రాయపడింది. దీనివల్ల ఎటువంటి టెక్నాలజీని వాడాలనేది సర్వీస్ ప్రొవైడర్లు నిర్ణయించుకునేందుకు కూడా వీలవుతుందని పేర్కొంది. 2012 నాటి సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పెక్ట్రంను పారదర్శకంగా వేలం వేయాలని వీఐఎల్ తెలిపింది. అయితే, అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే దేశీ సంస్థలకు ఈ విధానం ప్రతికూలంగా ఉంటుందని ఎయిర్టెల్ పేర్కొంది. శాట్‌కామ్ స్పెక్ట్రం కేటాయింపులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంపై టెల్కోలు, పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. -
సొంత వ్యాపారం కోసమే స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటోందన్న విషయం వెలుగు చూసిన తర్వాత విశ్లేషకుల నుంచి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వ్యాపార అవసరాల కోసమే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్టు ముందు చెప్పినట్టుగానే అదానీ గ్రూపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 5జీ స్పెక్ట్రమ్ కోసం మూడు టెలికం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. కానీ, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) కేవలం రూ.212 కోట్లనే స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు కేటాయించింది. తద్వారా 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల కాలానికి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ వేలంలో అదానీ పెట్టుబడి 0.15 శాతంగానే ఉండడం గమనించాలి. తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌తో ప్రైవేటు నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని, దాన్ని డేటా సెంటర్లు, గ్రూపులోని ఇతర కార్యకలాపాలు, అన్ని వ్యాపారాల కలబోతతో ఉండే సూపర్ యాప్ కోసం వినియోగించుకుంటామని అదానీ గ్రూపు పేర్కొంది. అదానీ గ్రూపు కీలక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, బీటూసీ వ్యాపారాల డిజిటైజేషన్ వేగవంతం చేయడానికి 5జీ స్పెక్ట్రమ్ సాయపడుతుందని అదానీ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. -
ముగిసిన 5G స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల ఆదాయం
-
ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలం, టాప్ బిడ్డర్‌గా జియో!
5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు స్పెక్ట్రంకు సంబంధించిన వేలం కొనసాగింది. మొత్తం రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిడ్డింగ్‌లో 10కోట్లకు పైగా కనెక్షన్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కి స్పెక్ట్రం దక్కించుకునేందుకు సంస్థలు పోటీ పడడంతో వేలం మరో రోజు పొడిగింపు జరిగినట్లు తెలుస్తోంది. 2022సంవత్సరానికి గాను 72గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది కేంద్రం. వీటి విలువ రూ.4.3లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 600మెగా హెడ్జ్ నుంచి అత్యధికంగా 26 గిగా హెడ్జ్‌ల స్పెక్ట్రానికి సంబంధించి వేలం కొనసాగింది. జులై 26 నుంచి జరిగిన ఈ వేలం సోమవారం ముగియగా..గతంలో జరిగిన 3జీ, 4జీ స్ప్రెక్టం వేలం కంటే 5జీ స్పెక్ట్రం వేలం రికార్డ్ స్థాయిలో రూ.1,50,173కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. టాప్ బిడ్డర్‌గా జియో ఈ బిడ్డింగ్‌లో ముఖేష్ అంబానీ నేతృత్వం వహిస్తున్న రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. రెండో స్థానంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్టెల్ రూ.50వేల కోట్లుకు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లకు, తొలిసారి 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొన్న అదానీ గ్రూప్ రూ.500కోట్లనుంచి రూ.1000 కోట్ల మధ్యలో పాల్గొంది. మొత్తం 10బ్యాండ్లలో వేలం మొత్తం 10బ్యాండ్లలో 72 జీహెచ్‌జెడ్ స్పెక్ట్రం వేలం వేయడం జరిగింది. 600mhz (మిలియన్ హెర్ట్జ్) 700 mhz, 800mhz, 900mhz, 1800mhz, 2100mhz, 2300mhz, 2500mhz తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు, మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 3300 మెగా హెర్జ్‌తో పాటు హై ఫ్రీక్వెన్సీ 26 గాగా హెర్జ్ల వేలానికి ఉంచింది. మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4జీ కంటే 10రెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం వినియోగించుకుంటున్నాయి. కేంద్రం నిర్వహించిన వేలంలో తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కానీ 3,300 మెగా హెడ్జెట్, 22 గిగా హెడ్జెట్లకు ఎక్కువ బిడ్డింగ్‌లు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియోకే ఎక్కువ స్పెక్ట్రం వేలంలో ఎక్కువ మొత్తాన్ని జియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో జరిగిన వేలంలో కేంద్రం భారీ ఆదాయాన్ని గడించింది. 3జీ వేలంలో రూ.50,968.37కోట్లకు, 4జీకి రూ.77,815 కోట్ల ఆదాయం రాగా.. ఆల్ట్రా హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు జరిగిన 5జీ వేలంలో మాత్రం అత్యధికంగా రూ.1,50,173కోట్ల ఆదాయం గడించింది. కేంద్రం షరతు.. అంతలోనే గతంలో జరిగిన ఈ 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహాం చూపించలేదు. స్పెక్ట్రం ఎంత వాడుకుంటే అంత మొత్తానికి యూసేజీ ఛార్జీలు చెల్లించాలని టెలింకాం కంపెనీలకు కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్ణయంతో 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు ముందుకు రాలేదు. ఇక తాజాగా జరిగిన 5జీ వేలంలో యూసేజీ ఛార్జీలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు బిడ్డింగ్ దక్కించుకున్న టెలికాం కంపెనీలకు 20 సంవత్సరాల లోపు దాఖలు చేసిన బిడ్డింగ్ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులు బాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తాజా కేంద్రం నిర్ణయంతో ఈసారి జరిగిన 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు పోటీ పడ్డాయి. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. -
5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధం
-
5జీ స్పెక్ట్రం: జియో మరో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: 5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టాప్‌లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు జియో ఏకంగా 14 వేల కోట్లను డిపాజిట్ చేసింది. టెలికం సంస్థలు మొత్తం రూ. 21,800 కోట్లు ఈఎండీగా చెల్లించగా, ఇందులో 14,000 కోట్లతో జియో టాప్‌లో నిలిచింది. భారతి ఎయిర్టెల్ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి. తోటి బిలియనీర్ అదానీకి భిన్నంగా, అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ₹14,000 కోట్లను డిపాజిట్ చేయడం విశేషంగా నిలిచింది. 14,000 కోట్లతో, వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌లో మూడింట ఒక వంతు, 1.4 ట్రిలియన్ విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయవచ్చు. భారత టెలికాం రంగంలోకి ప్రత్యర్థులకు ధీటుగా జియో నిలవనుందని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ అన్నారు. జియో డిపాజిట్ భారీ స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రణాళికను సూచిస్తుందనీ, దీనికితోడు ఇప్పటికే 4G ఫ్రీక్వెన్సీల కోసం మునుపటి వేలంలో 57వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది, ఇక 4జీ లేదా ఇతర బ్యాండ్స్ ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు గౌతమ్ అదానీ టెలికా రంగంలో ప్రవేశాస్తున్నారన్న ఊహాగానాలు ప్రత్యర్థి టెల్కోలను ఆందోళనకు గురి చేశాయి, ఆరేళ్ల క్రితం ముకేశ్ అంబానీ జియో ఎంట్రీ, సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదానీ పోటీకి దూరంగా ఉన్నారనీ, 3.5 GHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని భావించడం లేదని పేరు చెప్పడానికి అంగీకరించని టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. 650-700 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయనుంది, కానీ ప్రస్తుతానికి, వినియోగదారుల సేవల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇది మూడు ప్రధాన టెల్కోలకు భారీ ఉపశమనం కానుందని వ్యాఖ్యానించారు. -
5జీ స్పెక్ట్రం వేలం, బరిలో ముఖేష్ అంబానీ,గౌతమ్ అదానీ!
న్యూఢిల్లీ: త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు అదానీ డేటా నెట్వర్క్స్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా దరఖాస్తు చేసుకున్నాయి. టెలికం శాఖ (డాట్) ఈ మేరకు నాలుగు సంస్థల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 600 మెగాహెట్జ్ మొదలుకుని 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రం కోసం అప్లికేషన్లు వచ్చినట్లు వివరించింది. డాట్ పోర్టల్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం.. బిడ్డింగ్‌కు అర్హత పొందడానికి సంబంధించి ఏడీఎన్ రూ. 248 కోట్ల నికర విలువను చూపించింది. ఈ విషయంలో ఏడీఎన్లో 100 శాతం వాటాదారైన అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నికర విలువను (రూ.4,731 కోట్లు) కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం జియో ఇన్ఫోకామ్ రూ. 1,97,790 కోట్ల నికర విలువ చూపించింది. అటు ఎయిర్టెల్ నికర విలువ రూ. 75,887 కోట్లుగా ఉండగా, వొడాఫోన్ ఐడియాది మైనస్ రూ. 80,918 కోట్లుగా ఉంది. ఐడియాలో బిర్లా గ్రూప్‌నకు 27.38 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 47.61 శాతం వాటాలు ఉన్నాయి. దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి జూలై 19 ఆఖరు తేది. జూలై 26న వేలం ప్రారంభమవుతుంది. సుమారు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72,097.85 మెగాహెట్జ్ పరిమాణంలో స్పెక్ట్రంను కేంద్రం వేలం వేస్తోంది. జియో, ఎయిర్టెల్, టెలికంలోకి ఎంట్రీ ఇస్తున్న అదానీ ఈ వేలంలో పోటాపోటీగా బిడ్లు వేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ ఎంట్రీపై సందేహాలు.. పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తమ ఎయిర్‌పోర్టులు, విద్యుత్, డేటా సెంటర్లు తదితర సొంత వ్యాపార అవసరాల కోసం ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటికి లైసెన్సు ఫీజు లేకుండా, నామమాత్రం రేటుకే నేరుగా స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం వెసులుబాటు ఇస్తున్నప్పటికీ అదానీ గ్రూప్.. స్పెక్ట్రం వేలంలో ఎందుకు పాల్గొంటోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
5జీ కమింగ్ సూన్: దాదాపు 10 రెట్ల వేగంతో
సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది. 5జీ సేవల బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్‌వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు. ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. కొత్త శకానికి నాంది 5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్‌కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు. -
జియో, ఎయిర్టెల్ ఓకే.. వీఐఎల్పైనే సందేహం..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా సర్కిల్స్‌లో 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే సామర్థ్యాలు ఉన్నాయని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ఆర్థిక సమస్యల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కూడా బిడ్డింగ్‌లో పాల్గొనడంపైనే అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇప్పటికే 4జీ బ్యాండ్లన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్పెక్ట్రం తీసుకోకుండా ప్రస్తుత 4జీ బ్యాండ్‌పైనే నిర్దిష్ట సర్కిళ్లలో 5జీ సేవలు అందించడం కష్టసాధ్యంగా ఉంటుందని వివరించింది. ‘స్పెక్ట్రంకు భారీగా ధర నిర్ణయించడంతో కొత్త టెల్కోలు వేలంలో పాల్గొనే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నాయి. 5జీ బిడ్డింగ్ కోసం వీఐఎల్ నిధులను ఎలా సమకూర్చుకోగలుగుతుందనే అంశంపై స్పష్ట,త లేదు‘ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలకమైన కొన్ని సర్కిళ్లపైనే వీఐఎల్ దృష్టి పెట్టవచ్చని, తమకు ప్రధానమైన 3జీ, 4జీ సర్కిల్స్‌లో మాత్రమే బిడ్ చేయొచ్చని తెలిపింది. అయితే, దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రం లేకపోతే వీఐఎల్ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. 1 లక్ష మెగాహెట్జ్ స్పెక్ట్రంను రూ. 7.5 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో (30 ఏళ్లకు కేటాయిస్తే) వేలం వేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ ఏడాది జూన్ ఆఖర్లో లేదా జూలై తొలినాళ్లలో వేలం నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు–సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు రావచ్చని అంచనా. స్పెక్ట్రం వేలం ప్రతిపాదనను కేంద్ర టెలికం శాఖ ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ తుది ఆమోదముద్ర కోసం పంపనుంది. -
ధరల తగ్గింపుపై టెలికాం సంస్థల అసంతృప్తి... ట్రాయ్ వివరణ..!
న్యూఢిల్లీ: స్పెక్ట్రం ధరల తగ్గింపు ఆశించిన స్థాయిలో లేదంటూ టెల్కోలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. తన సిఫార్సులను సమర్థ్ధించుకుంది. శాస్త్రీయంగా లెక్కించి, హేతుబద్ధమైన చార్జీలనే సిఫార్సు చేశామని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా చెప్పారు. 5జీ మార్కెట్లో భారీ అవకాశాలు ఉన్నందున.. స్పెక్ట్రం వేలంలో టెలికం సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సిఫార్సు చేసిన రిజర్వ్ ధరలు .. బిడ్డర్లకు ఆకర్షణీయంగా ఉండగలవని భావిస్తున్నట్లు వాఘేలా తెలిపారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, పరిశ్రమ వర్గాల నుంచి విస్తృతంగా సేకరించిన అభిప్రాయాలు, దేశీయంగా 5జీ విస్తృతికి గణనీయంగా అవకాశాలు ఉండటం తదితర అంశాలే ట్రాయ్ ప్రస్తుత నిర్ణయానికి ప్రాతిపదికలని ఆయన వివరించారు. ‘ఆకర్షణీయమైన ధర, సరళతర చెల్లింపు ఆప్షన్లు, సులభతరంగా సరెండర్ చేసే నిబంధనలు, లీజింగ్ విషయంలో చేసిన సిఫార్సులు మొదలైన వాటితో త్వరలో నిర్వహించబోయే వేలం.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది‘ అని వాఘేలా తెలిపారు. 30 ఏళ్ల వ్యవధికి కేటాయించే స్పెక్ట్రం కనీస ధరలను దాదాపు 39% తగ్గిస్తూ .. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల మెగా వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసింది. -
అదిగో 5జీ..త్వరలో ట్రాయ్ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ ధర, ఇతర పద్ధతులపై 7–10 రోజుల్లో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు వెల్లడి కానున్నాయి. సూచనలు తుది దశలో ఉన్నాయని ట్రాయ్ సెక్రటరీ వి.రఘునందన్ తెలిపారు. ఈ విషయాలను నేడో రేపే ట్రాయ్ వెల్లడించే అవకాశం ఉందని పరిశ్రమ ఎదురు చూస్తోంది. విలువ, రిజర్వ్ ధర, పరిమాణం, వేలంలో పాల్గొనడానికి అర్హతలు, ఇతర షరతులతో సహా వివిధ బ్యాండ్స్‌లో స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన విధానాల గురించి చర్చించడానికి గత ఏడాది నవంబర్ చివరలో వివరణాత్మక సంప్రదింపు పత్రాన్ని ట్రాయ్ విడుదల చేసింది. మార్చి 2021లో జరిగిన చివరి రౌండ్ వేలంలో 855.6 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కోసం రూ.77,800 కోట్లకు పైగా బిడ్స్‌ను గెలుచుకుంది. మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు 63 శాతం అమ్ముడుపోలేదు. -
5జీ టెక్నాలజీతో కేంద్రానికి భారీగా ఆదాయం..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2022-23లో ప్రైవేట్ సంస్థల ద్వారా 5జీ సాంకేతికతను దేశంలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల కేంద్రానికి ఈ ఏడాది భారీగా ఆదాయం రానున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో నిర్వహించిన 4జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల ప్రభుత్వానికి రూ.77,800 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరంలో నిర్వహించే 5జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల కేంద్రానికి ఎంత ఆదాయం రావచ్చు అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 5జీ టెక్నాలజీ మీద డెలాయిట్ ఇండియా భాగస్వామి & టెలికామ్ సెక్టార్ లీడర్ పీయూష్ వైష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 5జీ రోల్ అవుట్ అనేది ఇతర మునుపటి తరం టెక్నాలజీల కంటే చాలా వేగంగా జరుగుతుందని అన్నారు. "ఆర్థిక మంత్రి 2025 నాటికి అన్నీ గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ చేరవేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు. డిజిటల్ విశ్వవిద్యాలయాలతో సహా డిజిటల్ విద్యపై కేంద్రం దృష్టి సారించడం వల్ల దేశవ్యాప్తంగా హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అవసరాన్ని మరింత పెరుగుతుంది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల ఆదాయం రూ.1.25 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని లేదా గతంతో పోలిస్తే(4జీ స్పెక్ట్రమ్ వేలం) 60 శాతానికి పైగా జంప్ కావచ్చని చోక్సీ సెక్యూరిటీస్ ఎండి దేవన్ చోక్సీ చెప్పారు. ఈ స్పెక్ట్రమ్ వేలానికి కేవలం సెల్యులార్ ఆపరేటర్ల నుంచి మాత్రమే కాకుండా ఇతరుల నుంచి కూడా పోటీ ఉండనున్నట్లు దేవన్ చోక్సీ తెలిపారు. ఈ స్పెక్ట్రమ్ వేలం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను 10 ఏళ్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ కాలంలో స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన యజమానికి ఆ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి తగినంత సమయం ఉండవచ్చు అని ఆశిస్తున్నారు. "ప్రస్తుత ఆపరేటర్ దానిని కొనుగోలు చేసి, అవసరమైన వారికి లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సారి 5జీ వేలం గతంతో పోలిస్తే భిన్నంగా ఉండనుంది" అని ఆయన అన్నారు. (చదవండి: ఫిబ్రవరిలో బ్యాంకుల హాలిడేస్ జాబితా ఇదే..!) -
మొబైల్ టారిఫ్‌లు పెరగనున్నాయా?
దాదాపు ఐదేళ్ల తర్వాత నిర్వహించిన 2021 స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ స్పెక్ట్రమ్ వేలంలో జియో అతిపెద్ద బిడ్డర్‌గా అవతరించింది. ఈ వేలంలో విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో మూడింట రెండు వంతుల వాటా కొనుగోలు చేసింది. ఆయా నెట్‌వర్క్‌లు ఎంత మేర స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి? దాని కోసం ఎంత చెల్లించారు? వంటి విషయాలు వినియోగదారుల మొబైల్ టారిప్‌లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. దీని ప్రభావం ప్రీపెయిడ్ కస్టమర్‌కు అందించే ఆఫర్ల మీద కూడా పడనుంది. భారత ప్రభుత్వం మొత్తం రూ.77,800 కోట్ల విలువైన స్పెక్ట్రంను విక్రయించింది. వీటిలో జియో సుమారు రూ.57,100 కోట్లు, ఎయిర్టెల్ రూ.18,700 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,000 కోట్లు విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఈ స్పెక్ట్రమ్ వేలం 4జీ బ్యాండ్ల కోసం నిర్వహించారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ రెండూ సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 800 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ రేంజ్లో స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. అయితే, ఈ స్పెక్ట్రమ్‌ను 5జీ సేవల కోసం కూడా ఉపయోగించుకోనున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు 2జీ, 3జీ నుంచి 4జీకి మారడాన్ని ఈ స్పెక్ట్రం వేలం మరింత వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం జియోలో కేవలం 4జీ చందాదారులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 2జీ, 3జీ యూజర్లు 4జీకి మారడం వల్ల ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు లాభదాయకమే. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న మూడు నెట్‌వర్క్‌లకు బదులుగా ఒక నెట్‌వర్క్‌ను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే, 2జీ, 3జీ ప్లాన్లతో పోలిస్తే 4జీ డేటా ప్లాన్లు నాలుగు రెట్లు ఎక్కువ ఖరీదైనవి. అందువల్ల, 4జీకి మారడం వల్ల వినియోగదారుల ఫోన్ బిల్లుల సగటు వినియోగం పెరుగుతాయి. ఇది నెట్వర్క్ కంపెనీలకు మరింత లాభం చేకూర్చనుంది. ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 50-55 శాతం మంది ఇంకా 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను వాడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జియో, ఎయిర్టెల్ రెండూ కూడా తమ నెట్వర్క్ కవరేజీని మెరుగు పరచడానికి వాటి సామర్థ్యాలను విస్తరించడానికి 2300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. తద్వారా, తమ 4జీ నెట్వర్క్ నాణ్యత, సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. చదవండి: జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
ముగిసిన స్పెక్ట్రమ్ వేలం
దేశంలో 5 ఏళ్ల తర్వాత జరిగిన స్పెక్ట్రమ్ వేలం నేడు(మార్చి 2) ముగిసింది. స్పెక్ట్రమ్ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం ఆరు బిడ్డింగ్ రౌండ్లు ముగిసిన తర్వాత రిలయన్స్ జియో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. ఈ వేలంలో అత్యధికంగా రిలయన్స్ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. ఇక, రిలయన్స్ జియో ప్రధాన పోటీదారైన ఎయిర్టెల్ రూ.18వేల 669 కోట్లకు మాత్రమే బిడ్ వేస్తే వొడాఫోన్-ఐడియా కేవలం రూ.1993 కోట్లకు మాత్రమే బిడ్స్ దాఖలు చేసింది. తాజా స్పెక్ట్రం వేలం ద్వారా 855.60 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంకు ప్రభుత్వం మొత్తం 77,814.80 కోట్లు సంపాదించింది. 2021 స్పెక్ట్రం వేలంలో కేవలం రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మాత్రమే బిడ్డర్లుగా నిలిచాయి. ముగిసిన స్పెక్ట్రం వేలంలో దేశవ్యాప్తంగా 22 సర్కిల్‌లలో స్పెక్ట్రం వాడే హక్కును సొంతం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. కొనుగోలు చేసిన స్పెక్ట్రం 5జీ సేవల కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తాజా స్పెక్ట్రం వేలం ప్రత్యేకంగా 4జీ బ్యాండ్ల కోసం జరిగింది. సబ్ గిగా హెర్జ్ట్ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్ బ్యాండ్, 2300 మెగాహెర్జ్ట్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ సేవల కోసం తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని తెలిపింది. కొత్తగా 9 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ను చేర్చుకున్నట్లు పేర్కొంది. అలాగే ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్వర్క్ అందించే అవకాశం లభించినట్లు తెలిపింది. మరోవైపు, ఐదు సర్కిళ్లలో తాజాగా తాము దక్కించుకున్న స్పెక్ట్రమ్ 4జీ కవరేజ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేయనుందని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) పేర్కొంది. దీంతో మరింత నాణ్యమైన డిజిటల్ సేవల్ని అందించడంతో పాటు బిజినెస్ పెరిగే అవకాశం లభించనుందని పేర్కొంది. ఒకప్పుడు స్పెక్ట్రమ్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు మిగులు దేశంగా అవతరించిందని తెలిపింది. దీని వెనుక ప్రభుత్వ కృషి ఉందని కొనియాడింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని తెలిపింది. ఈ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్వర్క్ సంస్థలు వినియోగించుకోవచ్చు. ధరలు అధికంగా ఉండడం వల్లే 700 మెగా హెర్జ్ట్ బ్యాండ్‌కు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: సామాన్యూడిపై మరో పిడుగు ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! -
మార్చి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు ఎదురుచూస్తున్న స్పెక్ట్రం వేలం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1 నుంచి ఆరో విడత వేలం నిర్వహించనున్నట్లు టెలికం శాఖ ఒక నోటీసులో పేర్కొంది. జనవరి 12న ప్రీ–బిడ్డింగ్ సమావేశం నిర్వహించనుండగా, నోటీసులోని అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జనవరి 28 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5లోగా టెలికం ఆపరేటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,251.25 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేయనుంది. 700 మెగాహెట్జ్, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వీటిలో ఉంటాయి. నాలుగేళ్ల విరామం తర్వాత.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బేస్ ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్ గతేడాది డిసెంబర్ 17న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే వేలంలో 5జీ సేవల కోసం ఉపయోగించే 3,300–3,600 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను చేర్చలేదు. దేశవ్యాప్తంగా ప్రీమియం 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం బిడ్డర్లు కనీసం రూ. 32,905 కోట్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్పెక్ట్రం వేలానికి ఒక మోస్తరుగానే స్పందన ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.30,000–రూ.60,000 కోట్ల శ్రేణిలో బిడ్లు రావొచ్చని పేర్కొన్నాయి. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రూ.30,000 కోట్లకు మాత్రమే బిడ్లు పరిమితం కావొచ్చనేది జేఎం ఫైనాన్షియల్స్ అంచనా. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రూ. 55,000–రూ. 60,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చు. నిబంధనలిలా.. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ బ్యాండ్, 800, 2,300 మెగాహెట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. మిగతా ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. ముందస్తుగా పూర్తి చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడే బిడ్డర్లు .. ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లోగా కట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ విడతలవారీగా చెల్లించే విధానాన్ని ఎంచుకుంటే బ్యాండ్ ఫ్రీక్వెన్సీని బట్టి బిడ్డింగ్ మొత్తంలో నిర్దేశిత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ బ్యాండ్లకు సంబంధించి 50 శాతం కట్టాలి. 700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్ల కోసం 25 శాతం చెల్లించాలి. టెలికం శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసిన పది రోజుల్లోగా చెల్లింపులు జరపాలి. బిడ్డింగ్ మొత్తంతో పాటు సవరించిన స్థూల ఆదాయంపై (వైర్‌లైన్ సేవలు మినహా) మూడు శాతాన్ని స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కట్టాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో వొడాఫోన్ దూరం.. తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. కొన్ని సర్కిళ్లలో వేలం ప్రక్రియలో పాల్గొనపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రం వినియోగ హక్కులను పునరుద్ధరించుకోవడంపై టెలికం కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించి 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 12.4 మెగాహెట్జ్ పరిమాణం, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 47 మెగాహెట్జ్ పరిమాణం, ప్రస్తుతం 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రిలయన్స్ జియో ఉపయోగించుకుంటున్న 44 మెగాహెట్జ్ స్పెక్ట్రం రెన్యువల్‌కు రానున్నాయి. వొడాఫోన్ ఐడియా 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. ఈ రెన్యువల్స్ కోసం భారతీ ఎయిర్టెల్ సుమారు రూ. 15,000 కోట్లు, రిలయన్స్ జియో రూ. 11,500 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చని క్రెడిట్ సూసీ అంచనా వేస్తోంది. -
స్పెక్ట్రమ్ వేలానికి సై!
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన జారీ చేస్తామని, బిడ్డింగ్ మార్చిలో నిర్వహిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. కాగా, 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ్రïఫీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు. బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు’’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రస్తుతానికి 5జీ వేలం లేనట్టే...! 5జీ సేవలకు ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలం ప్రణాళికలకు టెలికం శాఖ (డాట్)కు చెందిన అత్యున్నత సంస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ ఏడాది మే నెలలోనే లైన్ క్లియర్ చేసింది. అయితే, 5జీ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్‌లో 300 మెగాహెట్జ్‌ను నేవీ ఉపయోగించుకుంటోంది, అలాగే భారత అంతరిక్ష విభాగం కూడా ఈ 5జీ స్పెక్ట్రమ్‌లో పెద్దమొత్తాన్ని తమకు కావాలని కోరింది. మరోపక్క, టెలికం పరిశ్రమ కూడా 5జీ స్పెకŠట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. 5జీ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి ఒక్కో టెలికం ఆపరేటర్ దాదాపుగా రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందనేది కంపెనీల వాదన. అయితే, 5జీ స్పెక్ట్రమ్ వేలం పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమివ్వలేదు. రానున్న వేలంలో కూడా చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం 2016లో నిర్ధేశించిన నిబంధనలనే కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. చైనా టెలికం పరికరాలకు చెక్ చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసేవిధంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. టెలికం మౌలిక వసతుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. ‘‘డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన సోర్స్ అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీ’గా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులతో పాటు టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. నెట్‌వర్క్‌లలో ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖజానాకు దండిగా నిధులు... వేలంలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకునే టెలికం ఆపరేటర్లు తమ బిడ్ ధరతో పాటు ఏటా ప్రభుత్వానికి తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. వైర్‌లైన్ సేవల ఆదాయాన్ని మినహాయించి ఏజీఆర్‌ను లెక్కగడతారు. ‘‘స్పెక్ట్రమ్‌లో విజయవంతమైన బిడ్డర్లు తమ బిడ్ మొత్తాన్ని ఒకే విడతలో ముందుగానే చెల్లించవచ్చు లేదా కొంత మొత్తాన్ని (700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బిడ్ ధరలో 25%; 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్లలో అయితే 50%) ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని గరిష్టంగా 16 సమాన వార్షిక వాయిదాల్లో (రెండేళ్ల మారటోరియం తర్వాత నుంచి) చెల్లించేందుకు వీలుంటుంది’’ అని ప్రభుత్వ అధికార ప్రకటన వివరించింది. చక్కెర పరిశ్రమకు 3,500 కోట్లు్.. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత 2020–21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్రంæ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘మిల్లీమీటర్’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా విధి విధానాల గురించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో టెలికం శాఖ (డాట్) త్వరలో చర్చలు జరపనున్నట్లు వివరించాయి. సుమారు రూ. 5.22 లక్షల కోట్ల ధరతో 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం నిర్వహించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) డిసెంబర్ 20నే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2020 మార్చి–ఏప్రిల్ మధ్యలో ఈ వేలం నిర్వహించనున్నారు. దీనికి అదనంగా ‘మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్స్’గా వ్యవహరించే 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ కొంత స్పెక్ట్రంను విక్రయించాలని డాట్ భావిస్తోంది. దీనిపైనే వచ్చే నెలలో ట్రాయ్ అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్పెక్ట్రంతో కలిపి దీన్ని కూడా విక్రయించాలని డాట్ యోచించినప్పటికీ.. ట్రాయ్‌తో సంప్రదింపులకు నిర్దిష్ట కాలావధులు ఉండటం వల్ల అది సాధ్యపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్వాగతించిన సీవోఏఐ.. కొత్త బ్యాండ్ స్పెక్ట్రం వేలంపై ట్రాయ్‌ను సంప్రదించాలన్న డాట్ నిర్ణయాన్ని టెల్కోల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. దీనితో తగినంత స్థాయిలో 5జీ స్పెక్ట్రం లభించగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అయితే, రిజర్వ్ ధర ఎంత నిర్ణయిస్తారన్నది వేచి చూడాల్సిన అంశమని పేర్కొన్నారు. మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించే వేలంలో తగినంత 5జీ స్పెక్ట్రం అందుబాటులో ఉండదని, 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ వేలం వేసే విషయంపై ట్రాయ్ అభిప్రాయాలు తీసుకోవాలంటూ కొంతకాలంగా కేంద్రాన్ని సీవోఏఐ కోరుతూ వస్తోంది. తాజాగా ఆ దిశలోనే డాట్ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు, ఇప్పటికే అధిక రుణభారం, ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న టెల్కోలు .. మార్చి –ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు భారీ రేటు నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఈ ధర నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటోందంటున్నాయి. అయితే, దీన్ని తగ్గించాలని టెలికం సంస్థలు కోరినప్పటికీ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఐవోటీకి 5జీ ఊతం.. వచ్చే ఏడాది నుంచీ ఎడ్జ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మరింత ప్రాచుర్యంలోకి వచ్చేందుకు 5జీ సర్వీసులు గణనీయంగా ఉపయోగపడతాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెలికం, హెల్త్, వాహనాలు, గృహాలు ఇలాంటి వివిధ విభాగాల్లో ఐవోటీ పరిశ్రమ వచ్చే ఏడాది ఏకంగా 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఐవోటీ పరిశ్రమ 2020లో 300 బిలియన్ డాలర్లకు చేరనుందని, వచ్చే అయిదేళ్లలో భారత్ ఈ మార్కెట్లో కనీసం 20 శాతం వాటాను దక్కించుకోగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. -
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వు ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి–ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. మరోవైపు, కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రతిపాదనకు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. సుమారు రూ. 1,072 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో 11 ద్వీపాలకు కనెక్టివిటీ లభిస్తుంది. ముందుగా 25 శాతం కట్టాలి.. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసింది. అయితే, కొన్ని సర్కిళ్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల లైసెన్సులు ముగిసిపోనుండటంతో.. ఆ తర్వాత వాటిని కూడా ప్రణాళికలో కలిపింది. తాజా వేలంలో 1 గిగాహెట్జ్ లోపు స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంస్థలు ముందుగా ధరలో 25 శాతం మొత్తాన్ని, 1 గిగాహెట్జ్‌కు మించి కొనుగోలు చేసిన సంస్థలు 50 శాతం మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా కొంత కట్టిన తర్వాత రెండేళ్ల పాటు మారటోరియం లభిస్తుంది. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి 16 వార్షిక వాయిదాల్లో మిగతా మొత్తాన్ని కట్టాలి. ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన ట్రాయ్.. 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ దాకా వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేయొచ్చని సిఫార్సు చేస్తూ 2018 ఆగస్టు 1న నివేదికనిచ్చింది. -
స్పెక్ట్రం వేలంతో రూ 5.22 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 22 టెలికాం సర్కిళ్ల పరిధిలో రూ 5.22 లక్షల కోట్లకు స్పెక్ట్రం కేటాయింపుల కోసం వేలం చేపట్టాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం నిర్ణయించింది. స్పెక్ర్టం వేలం ప్రక్రియ మార్చి-ఏప్రిల్‌లో జరుగుతుందని భావిస్తున్నారు. టెలికాం శాఖ పరిధిలో అత్యున్నత నిర్ణాయక సంఘం డీసీసీ స్పెక్ర్టం వేలానికి సంబంధించి ట్రాయ్ ప్రతిపాదనకు డీసీసీ ఆమోదం తెలిపిందని మార్చి-ఏప్రిల్‌లో వేలం నిర్వహిస్తారని ఆశిస్తున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 22 టెలికాం సర్కిళ్లలో జరిగే వేలానికి రూ 5,22,850 కోట్లు రిజర్వ్ ధరగా నిర్ధేశించామని చెప్పారు. ఇక కొచ్చి లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీకి కూడా డీసీసీ ఆమోదం తెలిపింది.