‘మిల్లీమీటర్‌’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు | DoT to seek Trai views on 5G spectrum | Sakshi
Sakshi News home page

‘మిల్లీమీటర్‌’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు

Published Fri, Dec 27 2019 1:44 AM | Last Updated on Fri, Dec 27 2019 1:44 AM

DoT to seek Trai views on 5G spectrum - Sakshi

న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75–27.25 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా విధి విధానాల గురించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో టెలికం శాఖ (డాట్‌) త్వరలో చర్చలు జరపనున్నట్లు వివరించాయి.

సుమారు రూ. 5.22 లక్షల కోట్ల ధరతో 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్‌ నుంచి 3400–3600 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం నిర్వహించేందుకు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) డిసెంబర్‌ 20నే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2020 మార్చి–ఏప్రిల్‌ మధ్యలో ఈ వేలం నిర్వహించనున్నారు. దీనికి అదనంగా ‘మిల్లీమీటర్‌ వేవ్‌ బ్యాండ్స్‌’గా వ్యవహరించే 24.75–27.25 గిగాహెట్జ్‌ బ్యాండ్‌లోనూ కొంత స్పెక్ట్రంను విక్రయించాలని డాట్‌ భావిస్తోంది. దీనిపైనే వచ్చే నెలలో ట్రాయ్‌ అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్పెక్ట్రంతో కలిపి దీన్ని కూడా విక్రయించాలని డాట్‌ యోచించినప్పటికీ.. ట్రాయ్‌తో సంప్రదింపులకు నిర్దిష్ట కాలావధులు ఉండటం వల్ల అది సాధ్యపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

స్వాగతించిన సీవోఏఐ..
కొత్త బ్యాండ్‌ స్పెక్ట్రం వేలంపై ట్రాయ్‌ను సంప్రదించాలన్న డాట్‌ నిర్ణయాన్ని టెల్కోల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. దీనితో తగినంత స్థాయిలో 5జీ స్పెక్ట్రం లభించగలదని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు. అయితే, రిజర్వ్‌ ధర ఎంత నిర్ణయిస్తారన్నది వేచి చూడాల్సిన అంశమని పేర్కొన్నారు. మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించే వేలంలో తగినంత 5జీ స్పెక్ట్రం అందుబాటులో ఉండదని, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌లోనూ వేలం వేసే విషయంపై ట్రాయ్‌ అభిప్రాయాలు తీసుకోవాలంటూ కొంతకాలంగా కేంద్రాన్ని సీవోఏఐ కోరుతూ వస్తోంది. తాజాగా ఆ దిశలోనే డాట్‌ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు, ఇప్పటికే అధిక రుణభారం, ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న టెల్కోలు .. మార్చి –ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు భారీ రేటు నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఈ ధర నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటోందంటున్నాయి. అయితే, దీన్ని తగ్గించాలని టెలికం సంస్థలు కోరినప్పటికీ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.  

ఐవోటీకి 5జీ ఊతం..
వచ్చే ఏడాది నుంచీ ఎడ్జ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) మరింత ప్రాచుర్యంలోకి వచ్చేందుకు 5జీ సర్వీసులు గణనీయంగా ఉపయోగపడతాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెలికం, హెల్త్, వాహనాలు, గృహాలు ఇలాంటి వివిధ విభాగాల్లో ఐవోటీ పరిశ్రమ వచ్చే ఏడాది ఏకంగా 9 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఐవోటీ పరిశ్రమ 2020లో 300 బిలియన్‌ డాలర్లకు చేరనుందని, వచ్చే అయిదేళ్లలో భారత్‌ ఈ మార్కెట్లో కనీసం 20 శాతం వాటాను దక్కించుకోగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ఒక నివేదికలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement