Digital Communication
-
డిజిటల్ కమ్యూనికేషన్లో కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రెగ్యులేటరీ శాండ్బాక్స్ ద్వారా వినూత్న టెక్నాలజీలు, సర్వీసులు, వ్యాపార మోడల్స్‌ను ప్రోత్సహించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. లక్ష్యాలు, పరిధి, పాల్గొనే వారి అర్హతా ప్రమాణాలు, దరఖాస్తులను మదింపు చేసే ప్రక్రియ మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. నియంత్రిత వాతావరణంలో కంపెనీలు, ఆవిష్కర్తలు తమ కాన్సెప్టులు, సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే వాటి సామరŠాధ్యలను పరీక్షించేందుకు అవసరమైన రియల్ టైమ్ నెట్వర్క్ వాతావరణం, ఇతర డేటాను పొందేందుకు శాండ్బాక్స్ ఉపకరిస్తుందని ట్రాయ్ పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 17లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. కౌంటర్ కామెంట్లను దాఖలు చేసేందుకు ఆగస్టు 1 ఆఖరు తేదీగా ఉంటుంది. -
‘మిల్లీమీటర్’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా విధి విధానాల గురించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో టెలికం శాఖ (డాట్) త్వరలో చర్చలు జరపనున్నట్లు వివరించాయి. సుమారు రూ. 5.22 లక్షల కోట్ల ధరతో 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం నిర్వహించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) డిసెంబర్ 20నే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2020 మార్చి–ఏప్రిల్ మధ్యలో ఈ వేలం నిర్వహించనున్నారు. దీనికి అదనంగా ‘మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్స్’గా వ్యవహరించే 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ కొంత స్పెక్ట్రంను విక్రయించాలని డాట్ భావిస్తోంది. దీనిపైనే వచ్చే నెలలో ట్రాయ్ అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్పెక్ట్రంతో కలిపి దీన్ని కూడా విక్రయించాలని డాట్ యోచించినప్పటికీ.. ట్రాయ్‌తో సంప్రదింపులకు నిర్దిష్ట కాలావధులు ఉండటం వల్ల అది సాధ్యపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్వాగతించిన సీవోఏఐ.. కొత్త బ్యాండ్ స్పెక్ట్రం వేలంపై ట్రాయ్‌ను సంప్రదించాలన్న డాట్ నిర్ణయాన్ని టెల్కోల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. దీనితో తగినంత స్థాయిలో 5జీ స్పెక్ట్రం లభించగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అయితే, రిజర్వ్ ధర ఎంత నిర్ణయిస్తారన్నది వేచి చూడాల్సిన అంశమని పేర్కొన్నారు. మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించే వేలంలో తగినంత 5జీ స్పెక్ట్రం అందుబాటులో ఉండదని, 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ వేలం వేసే విషయంపై ట్రాయ్ అభిప్రాయాలు తీసుకోవాలంటూ కొంతకాలంగా కేంద్రాన్ని సీవోఏఐ కోరుతూ వస్తోంది. తాజాగా ఆ దిశలోనే డాట్ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు, ఇప్పటికే అధిక రుణభారం, ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న టెల్కోలు .. మార్చి –ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు భారీ రేటు నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఈ ధర నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటోందంటున్నాయి. అయితే, దీన్ని తగ్గించాలని టెలికం సంస్థలు కోరినప్పటికీ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఐవోటీకి 5జీ ఊతం.. వచ్చే ఏడాది నుంచీ ఎడ్జ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మరింత ప్రాచుర్యంలోకి వచ్చేందుకు 5జీ సర్వీసులు గణనీయంగా ఉపయోగపడతాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెలికం, హెల్త్, వాహనాలు, గృహాలు ఇలాంటి వివిధ విభాగాల్లో ఐవోటీ పరిశ్రమ వచ్చే ఏడాది ఏకంగా 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఐవోటీ పరిశ్రమ 2020లో 300 బిలియన్ డాలర్లకు చేరనుందని, వచ్చే అయిదేళ్లలో భారత్ ఈ మార్కెట్లో కనీసం 20 శాతం వాటాను దక్కించుకోగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. -
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వు ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి–ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. మరోవైపు, కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రతిపాదనకు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. సుమారు రూ. 1,072 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో 11 ద్వీపాలకు కనెక్టివిటీ లభిస్తుంది. ముందుగా 25 శాతం కట్టాలి.. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసింది. అయితే, కొన్ని సర్కిళ్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల లైసెన్సులు ముగిసిపోనుండటంతో.. ఆ తర్వాత వాటిని కూడా ప్రణాళికలో కలిపింది. తాజా వేలంలో 1 గిగాహెట్జ్ లోపు స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంస్థలు ముందుగా ధరలో 25 శాతం మొత్తాన్ని, 1 గిగాహెట్జ్‌కు మించి కొనుగోలు చేసిన సంస్థలు 50 శాతం మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా కొంత కట్టిన తర్వాత రెండేళ్ల పాటు మారటోరియం లభిస్తుంది. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి 16 వార్షిక వాయిదాల్లో మిగతా మొత్తాన్ని కట్టాలి. ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన ట్రాయ్.. 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ దాకా వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేయొచ్చని సిఫార్సు చేస్తూ 2018 ఆగస్టు 1న నివేదికనిచ్చింది. -
కొత్త టెలికాం పాలసీ : 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కొత్త టెలికాం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. జాతీయ టెలి కమ్యూనికేషన్ పాలసీ 2018ని బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ(ఎన్డీసీపీ) 2018 త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. 40 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. సెకనుకు 50 మెగా బిట్స్(ఎంబీపీఎస్) వేగం, అందరికీ సె బ్రాడ్ బాండ్ సేవలను అందించేలా ఈ కొత్త విధానాన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వవ్యాప్తి, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని కేంద్ర సమాచార మంత్రి తెలిపారు. అంతేకాదు టెలికాంరంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో సేవలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. 2020నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక మెగా బిట్స్(ఎంబీపీఎస్)వేగంతో, 2022నాటికి 10మెగా బిట్స్ వేగంతో బ్రాడ్‌బాండ్ సేవలను విస్తరించనున్నామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్టు సిన్హా వెల్లడించారు. తద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్‌ను టాప్ 50దేశాల్లో ఒకటిగా నిలపాలని యోచిస్తున్నట్లు సిన్హా పేర్కొన్నారు. 2017లో 134 దేశాలతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ఆవిర్భవించింది. -
నెట్ న్యూట్రాలిటీకి ఓకే..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్ చైర్మన్ అరుణ సుందరరాజన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సులను టెలికం కమిషన్ (టీసీ) ఆమోదించింది. కొన్ని క్రిటికల్ సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం టెలికం శాఖ (డాట్) ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడర్స్, టెలికం ఆపరేటర్లు, పౌర సమాజ సభ్యులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు సభ్యులుగా ఉంటారు. కీలకమైన సర్వీసులకు సంబంధించిన డేటా ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన విధానాల గురించి టెలికం శాఖ .. ట్రాయ్ సిఫార్సులు కోరనుంది. సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్లు, సర్వీసులకే ప్రాధాన్యమిస్తూ మిగతా వాటిని బ్లాక్ చేయడం లేదా నెట్ వేగాన్ని తగ్గించేయడం వంటి పక్షపాత ధోరణులతో వ్యవహరించకుండా తటస్థంగా ఉండేలా చూడటం .. నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించడంలో వివక్ష ధోరణులకు దారి తీసేలా.. ఏ సంస్థలతోనూ సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. అలాగే నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్‌ను బట్టి ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించడం వంటి పక్షపాత దోరణులకు పాల్పడకుండా నిర్దిష్ట ఆంక్షలు ఉండేలా లైసెన్సింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేయాలని కూడా సూచించింది. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్’కు ఆమోదం కొత్త టెలికం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకునే దిశగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ) 2018కి కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సుందరరాజన్ తెలిపారు. ‘భౌతిక మౌలిక సదుపాయాల కన్నా డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రస్తుతం దేశానికి చాలా కీలకమని సమావేశంలో సభ్యులంతా అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. సంస్కరణల ఊతంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్తగా 40 లక్షల ఉద్యోగాల కల్పన, సెకనుకు 50 మెగాబిట్ వేగంతో ప్రజలందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవడం మొదలైన లక్ష్యాలను ఎన్‌డీసీపీలో నిర్దేశించుకున్నారు. పంచాయతీల్లో 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్ సుమారు రూ. 6,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో 2018 డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా కమిషన్ ఓకే చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు, పాఠశాలలను వై–ఫై సర్వీసులతో అనుసంధానించనున్నారు. రోజంతా ప్రజల వినియోగానికి 1–2 వైఫై హాట్‌స్పాట్స్ అదనంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, టెలికం ఆపరేటర్ల నుంచి టాక్‌టైమ్, డేటా మొదలైనవి కొనుగోలు చేసి తమ బ్రాండ్ కింద రిటైల్‌గా విక్రయించే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ (వీఎన్‌వో)పై విధిస్తున్న ద్వంద్వ పన్నులను నివారించే ప్రతిపాదనను కూడా టెలికం కమిషన్ ఆమోదించింది. -
డిజిటల్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన కొత్త టెలికాం పాలసీ ‘నేషనల్ డిజిటర్ కమ్యునికేషన్ పాలసీ 2018’ డ్రాఫ్ట్ ద్వారా 2022 కల్లా డిజిటల్ కమ్యునికేషన్ రంగంలో దాదాపు 40 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పాడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వినియోగాదారుడికి దాదాపు 50 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో డిజిటల్ కమ్యునికేషన్ వాటా 6 శాతంగా ఉంది. ఈ పాలసీ ద్వారా అది 8 శాతానికి పెరగనుంది. -
సమాచార యుగంలో రేపటి మాట..!
‘డిజిటల్ కమ్యూనికేషన్’ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. రోజుకు ఎన్నిగంటల సేపు ఫేస్‌బుక్‌ను ఆపరేట్ చేస్తున్నాం, రోజుకు ఎన్ని టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతున్నాం, ఎన్ని రిసీవ్ చేసుకొంటున్నాం... వాటి ద్వారా మనం ప్రపంచంతో, మన వాళ్లతో ఎంత మేరకు కమ్యూనికేట్ అవుతున్నాం... అనేవి కేవలం మన వ్యక్తిగత మనస్తత్వానికి దర్పణం మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన డిజిటల్ కమ్యూనికేషన్ ఫలితంగా జీవితాల్లోకి చొచ్చుకొస్తున్న మార్పులు ఇవి. వీటిని మనం కూడా జీవితాలను ప్రభావితం చేసేంత స్థాయిలో స్వాగతిస్తున్నాం, స్వీకరిస్తున్నాం... మరి ఇలా స్వాగతించాల్సిన అంశాలు ఇంకా ఎన్నో అందుబాటులోకి వ స్తాయని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇవి ప్రతి వ్యక్తి జీవితాన్నీ ప్రభావితం చేస్తాయని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్న అలాంటి డిజిటల్ మాయల్లో కొన్ని... నెట్వర్క్ బేస్డ్ టెలిపతి... ఫిక్షనల్ సాహిత్యంలోనూ, సై ఫై సినిమాల్లోనూ ‘టెలిపతి’తో ఒక ఆట ఆడేసుకొన్నారు. దశాబ్దాలుగా టెలిపతి ప్రధానంశంగా, అది ఒక అతీత శక్తిగా చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వెలువడింది. అయితే రానున్న రోజుల్లో నెట్వర్క్ ఆధారంగా టెలిపతి సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అలా అంటున్నది ఎవరో దారితప్పిన మేధావులు కాదు. ‘సిస్కో’ చీఫ్ ఫ్యూచరిస్ట్ డేవ్ ఇవన్స్- మనిషి మెదడు చేత కంప్యూటర్ను నియంత్రించడం, మనసులోని ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే టెక్ట్స్ మెసేజ్లుగా టైప్ కావడం సాధ్యమేనని అంటున్నారు. అంటే మేసేజ్ పంపడానికి చేతులు, కీబోర్డ్ అవసరం లేకుండా ఆలోచిస్తుంటే చాలు.. డివైజ్ ఆ ఆలోచనలను అందుకొంటూ కంపోజ్ చేస్తూ ఉంటుందనమాట! ఇక యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పరిశోధకులు డా.రాజేశ్ రావు ఆధ్వర్యంలో టెలిపతిక్ సిస్టమ్ మీద ప్రత్యేక పరిశోధనలే జరుగుతున్నాయి. హాలోగ్రఫీ... ఇప్పటికే ఎన్నికల ప్రచార సభలను నరేంద్రమోడీ టెక్నాలజీ సహాయంతో హోరెత్తించారు. త్రీడీ హాలోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ఒకచోట ప్రసంగిస్తూ ఆ ఫీల్‌ను పలు చోట్లకు తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రత్యేకించి ఆఫీస్ అట్మాస్ఫియర్‌లోకి త్రీడీ హాలోగ్రఫీ టెక్నాలజీ ప్రవేశిస్తుందంటున్నారు. టీమ్ వర్క్ విషయంలో ఇది ఆహ్వానించదగ్గర పరిణామం అని అంటున్నారు. ప్రపంచంలోని విభిన్నమైన మూలల్లో ఉన్న వాళ్లు కూడా ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్న భావనను తీసుకురావడానికి, ఒకరితోఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. హాలోగ్రఫీ టెక్నాలజీ రానున్న 20 సంవత్సరాల్లో గణనీయమైన మార్పులను తీసుకు వస్తుందని అంచనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... విభిన్నరంగాలను ప్రభావితం చేయగలగుతుందన్న అంచనాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... కమ్యూనికేషన్ రంగంపై కూడా తన ప్రభావాన్ని చూపి, సమాచార వ్యవస్థలో గొప్ప మార్పును తీసుకువస్తుందంటున్నారు. మీరు జీమెయిల్లో ఫిల్టర్‌ను వాడుతున్నారా? స్పామ్ మెయిల్లను నిషేధిత జాబితాలోకి పంపుతున్నారా? అయితే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యక్తిగతంగా మీరు కూడా వాడుతున్నట్టే! వందలాదిగా వచ్చి పడే మెయిల్స్‌ను ఫిల్టర్ చేసి అవసరమైనవి ఏవో నిర్ణయించి వాటిని మాత్రమే మీ దరికి చేర్చే టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలను ఇంకా ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందనేది చాలా విస్తృతమైన అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఆ రంగ పరిశోధకులు నిర్ణయించిన గడువు ఐదు సంవత్సరాలు. ఇన్స్టన్టేనియస్ ట్రాన్స్లేషన్.. గూగుల్ వాళ్లు ట్రాన్స్‌లేషన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. చాలా భాషల నుంచి చాలా భాషల్లోకి అనువాదం చేసుకోవడానికి అనుగుణంగా ఈ సేవను అందుబాటులో ఉంచారు. అయితే కొంత ఉపయోగం ఉన్నప్పటికీ.. ఇది అంత సక్సెస్ఫుల్ ఫీచర్కాదు. పేరాల్లో టెక్ట్స్‌ను ఇచ్చి అనువదించమని కోరితే గూగుల్ ట్రాన్స్లేషన్ చేతులెత్తేస్తుంది. తప్పుల తడకగా అనువదిస్తుంది. అయితే గూగుల్ ఇప్పటికి విజయవంతం కాలేకపోయినా ఈ అనువాదం విషయంలో అతి త్వరలోనే పెనుమార్పులు వస్తాయంటున్నారు. ‘భాష అడ్డంకి’అనేది కొన్ని రోజుల పాటు మాత్రమే వినిపించే మాటేనని, ఆ తర్వాత ఇన్స్టన్టేనియస్ ట్రాన్స్‌లేటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అక్షరాల రూపంలోని సమాచారాన్ని అయినా, మాటను అయినా తక్షణం అనువదించగల సాధానాలను ఆవిష్కరించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని వారు నమ్మకంగా చెబుతున్నారు.