న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వు ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి–ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. మరోవైపు, కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రతిపాదనకు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. సుమారు రూ. 1,072 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో 11 ద్వీపాలకు కనెక్టివిటీ లభిస్తుంది.
ముందుగా 25 శాతం కట్టాలి..
స్పెక్ట్రం వేలానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసింది. అయితే, కొన్ని సర్కిళ్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల లైసెన్సులు ముగిసిపోనుండటంతో.. ఆ తర్వాత వాటిని కూడా ప్రణాళికలో కలిపింది. తాజా వేలంలో 1 గిగాహెట్జ్ లోపు స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంస్థలు ముందుగా ధరలో 25 శాతం మొత్తాన్ని, 1 గిగాహెట్జ్‌కు మించి కొనుగోలు చేసిన సంస్థలు 50 శాతం మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా కొంత కట్టిన తర్వాత రెండేళ్ల పాటు మారటోరియం లభిస్తుంది. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి 16 వార్షిక వాయిదాల్లో మిగతా మొత్తాన్ని కట్టాలి. ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన ట్రాయ్.. 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ దాకా వివిధ బ్యాండ్‌లలో స్పెక్ట్రంను వేలం వేయొచ్చని సిఫార్సు చేస్తూ 2018 ఆగస్టు 1న నివేదికనిచ్చింది.
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
Published Sat, Dec 21 2019 5:00 AM | Last Updated on Sat, Dec 21 2019 5:00 AM
Comments
Please login to add a commentAdd a comment