approval
-
ఐటీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ 60 ఏళ్లనాటి ఐటీ చట్టం స్థానంలో ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని (ఎస్ఐపీ) కొనసాగించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. దానికి రూ. 8,800 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీఎం కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీఓ 4.0), పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (పీఎం–ఎన్ఏపీఎస్), జన్ శిక్షణ్ సంస్థాన్‌లను ఎస్ఐపీ కింద ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. -
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
‘జమిలి’కి కేబినెట్ ఆమోదం..ప్రధాని కీలక ట్వీట్
న్యూఢిల్లీ: భారత దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేదిశగా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం ఒక ముందడుగు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జమిలి ఎన్నికలకు బుధవారం(సెప్టెంబర్18) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం మోదీ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా రాంనాథ్కోవింద్కు అభినందనలు తెలియజేస్తున్నా. విస్తృత సంప్రదింపులు జరిపి జమిలి ఎన్నికలపై సిఫారసులు చేశారు’అని కోవింద్‌ను ప్రధాని కొనియాడారు. ఇదీ చదవండి.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ -
కొత్త ఉత్పత్తులకు అనుమతుల్లో జాప్యం: సింజెంటా సీఈవో
న్యూఢిల్లీ: బ్యూరోక్రసీ విధానాల కారణంగా భారత సాగురంగంలో వినూత్న ఉత్పత్తులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అగ్రోకెమికల్స్ దిగ్గజం సింజెంటా గ్రూప్ సీఈవో జెఫ్ రోవ్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు.దేశీయంగా సులభతరంగా వ్యాపారాల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ‘భారత్‌లో ప్రోడక్టుల అనుమతులకు సంబంధించి పాలసీ అంతా బ్యూరోక్రసీమయంగా ఉంటుంది. దీంతో అనుమతులకు చాలా సమయం పట్టేస్తుంది. ఆ ప్రభావం రైతులపై పడుతుంది‘ అని జెఫ్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం రైతులు ఎంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తే అంత ఎక్కువగా రిస్కులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు.వినియోగదారుల వ్యవస్థను డిజిటలీకరించడంలో భారత ప్రభుత్వ కృషిని ప్రశంసించిన జెఫ్.. వ్యవసాయ రంగంలోనూ అదే తరహాలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలని కోరారు. వాతావరణ మార్పులతో రిస్కులే కాకుండా అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 40 ఉత్పత్తులు..రాబోయే 2–3 సంవత్సరాల్లో కొత్తగా 40 పంట సంరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెఫ్ చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై తమ సంస్థ అంతర్జాతీయంగా ఏటా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తమ వ్యాపారం ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త మెరుగుపడగలదని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలు పెరుగుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు తక్కువని జెఫ్ తెలిపారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయ సామరŠాధ్యలు 20–30 శాతం మేర తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రత్యేకమైన భారత వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని జెఫ్ వివరించారు. -
టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
రిలయన్స్, డిస్నీ డీల్‌కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్ఐఎల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇప్పటికే ఈ డీల్‌కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్సీఎల్టీ పేర్కొంది. అను జగ్మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్ఐఎల్కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్‌ఫ్లిక్స్‌తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాసేందుకు ఆ 11 మందికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాయడానికి ఏపీకి చెందిన 11 మందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ఏపీకి చెందిన విందేల గీతాభార్గవి, సయ్యద్ సూఫియా, గంటా లావణ్య, రావూరి నాగలలిత శ్రీరమ్య ప్రభ, గుడిపల్లి దినేష్, పులి నాగవర్ధన్‌బాబు, షేక్ ఖమర్ సుల్తానా, మీనిగ హేమలత, మధునిక విశ్వనాథం, టి.రవికుమార్, బి.ప్రశాంత్‌బాబు తెలంగాణ సివిల్ జడ్జీల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి ఎన్రోల్మెంట్ సరి్టఫికెట్లు లేకపోవడంతో ప్రధాన పరీక్షకు సంబంధించి ఆ పత్రాలు సమర్పించలేకపోయారు.తెలంగాణ బార్ అసోసియేషన్ నమోదు తప్పనిసరి అని నోటిఫికేషన్లో నిబంధన పేర్కొనడం వల్ల వీరంతా ప్రధాన పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో, ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర న్యాయ(సరీ్వస్, కేడర్)రూల్స్, 2023కు విరుద్ధంగా ఉందంటూ వారంతా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1)లకు నోటీసులు జారీ చేసింది.బుధవారం ఆదేశాలు వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉందని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితు భరద్వాజ్, అమోల్ చిత్రవంశి, రజత్‌గౌర్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఏప్రిల్ 10, 2024న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రారంభమైన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి పిటిషనర్లకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ పిటిషనర్ల ఫలితాలు ప్రకటించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది. -
క్రీడాకారులకు సర్కారీ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభా వంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా తెలంగాణ(పబ్లిక్ సర్వీస్ నియామ కాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ) చట్ట సవరణ బిల్లును శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజీ సర్వీస్ కమిషన్, ఏదైనా కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ, పత్రికల్లో బహిరంగ ప్రకటనల ద్వారా మినహా ఇతర పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీపై ఈ చట్టం ద్వారా నిషేధం విధించారు.కారుణ్య నియామకాలతో పాటు పోలీసు కాల్పులు/ బాంబు పేలుళ్లు/ తీవ్రవాదుల హింస బాధితులు, అత్యాచారాలకు గురైన ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై క్రీడాకారులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. మరో రెండు బిల్లులకు ఆమోదం..: జూనియర్ సివిల్ జడ్జీల ద్రవ్య అధికార పరిధిని రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలకు కుదించడానికి ప్రతిపాదించిన తెలంగాణ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సంక్షిప్తనామాన్ని ‘టీఎస్’నుంచి ‘టీజీ’కి మార్చుతూ ప్రతిపాదించిన కొత్త చట్టం బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ‘మహిళలను అవమానపరిచిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి.. నహీ చలేగా నహీ చలేగా..తానాషాహి నహీ చలేగా..’అన్న బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు 2024–25కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలో గందరగోళం నేపథ్యంలో కీలకమైన ఈ బిల్లుపై బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదం తెలిపారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్లు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. దద్దరిల్లిన సభ ‘వెనకాల ఉండే అక్కలు..ఇక్కడ ముంచి అక్కడ తేలిన్రు. ఆ అక్కల మాటలు విన్నారనుకో.. జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల అరుపులు, కేకలు, నినాదాలతో సభ అట్టుడుకింది. ఈ నేపథ్యంలో మధ్యా హ్నం 1.20 గంటలప్పుడు వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి 3.30 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడాల్సిందిగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సీటు నుంచి లేచి నిలుచున్నా రు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా ఆమెకు మద్దతుగా లేచి నిలుచున్నారు. స్పీకర్ అంగీకరించకుండా ఏలేటిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మల్లారెడ్డి, మా గంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్ తదితరు లు ఆందోళనకు దిగారు.అయినా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడడం ప్రారంభించడంతో.. సబిత, సునీత, లక్ష్మి పోడియం వద్దకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరారు. కేటీఆర్, ఇతర సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిలబడి సబితకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా, బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. సబితకు అవకాశం ఇవ్వాలి: అక్బర్ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కల్పించుకుని సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకుని సీఎం మాట్లాడారు కాబట్టి, సమాధానం చెప్పే హక్కు ఆమెకు ఉంటుందని అన్నారు. సబితకు స్పీకర్ అవకాశం ఇవ్వడమే సబబని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవరి పేరును ప్రస్తావించలేదని అన్నారు. సీఎం సభలో ఎవరి పేరూ ఎత్తకుండా చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారని, దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారని, ఆ అంశం ముగిసిందని స్పష్టం చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడకపోతే కాంగ్రెస్ సభ్యుడు గడ్డం వివేక్ (చెన్నూరు)కు మైక్ ఇవ్వాలని సూచించడంతో వివేక్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలువివేక్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన తీవ్రమైంది. కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ‘ముఖ్యమంత్రి అహంకార వైఖరి నశించాలి’, ‘సీఎం డౌన్‌డౌన్’, తదితర నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయినా వివేక్ తన ప్రసంగాన్ని కొసాగించారు. కేటీఆర్, సబిత తదితరులు వివేక్‌ను ప్రసంగం ఆపమని కోరినా ఆయన పట్టించుకోలేదు. దీంతో సబిత, సునీత, కోవా లక్ష్మి ఎమ్మెల్యేల సీట్ల దగ్గర కింద కూర్చొని నిరసన తెలిపారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ దగ్గర ఆందోళన కొనసాగించారు.ఈ పరిస్థితుల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్.. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్.. ‘మీరు చాలా జంటిల్‌మ్యాన్, ఇలా వ్యవహరించడం తగదు. ద్రవ్య వినిమయ బిల్లు ఇంపార్టెంట్ అని మీరే చెప్పారు. ఈ బిజినెస్ మంచిది కాదు..’అని వ్యాఖ్యానించారు. అయినా బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు ఆగలేదు. చప్పట్లు కొడుతూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో మంత్రి సీతక్క మైక్ తీసుకొని ‘సీఎం ఎవరినీ ఏమీ అనలేదు. మీరు గతంలో మహిళ అని చూడకుండా గవర్నర్‌ను కూడా అవమానించారు.నన్ను అసెంబ్లీలో నాలెడ్జ్ లేదని అవమానించారు. చప్పట్లు కొడుతూ రోడ్ల మీద ఆడుతున్నారా? అసెంబ్లీలోనా? ’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ జరుగుతుండగానే ఆర్థిక మంత్రికి.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం కోరాల్సిందిగా స్పీకర్ సూచించడం, భట్టి బిల్లును ప్రవేశపెట్టడం, బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి. అనంతరం స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించగా.. సభ వాయిదా పడడానికి ముందు సీఎం సభలోకి ప్రవేశించారు. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
సరిహద్దు దేశాల నుంచి ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భూ సంబంధ సరిహద్దు దేశాల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ రూ. లక్ష కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర లభించింది. మిగిలిన సగం ప్రతిపాదనల్లో పెండింగ్ లేదా ఉపసంహరణ లేదా తిరస్కరణకు గురై ఉండవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా భూ సరిహద్దు దేశాల నుంచి లభించే ఎఫ్‌డీఐలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2020 ఏప్రిల్‌లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. తద్వారా దేశీ కంపెనీల టేకోవర్ అవకాశాలకు చెక్ పెట్టింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లతో దేశానికి భూ సంబంధ సరిహద్దులున్న సంగతి తెలిసిందే. వెరసి ఈ దేశాల నుంచి తరలివచ్చే ఎఫ్‌డీఐల ద్వారా దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఈ నిబంధనల తదుపరి రూ. లక్ష కోట్ల ప్రతిపాదనలురాగా.. 50 శాతం పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భారీ మెషీనరీ తయారీ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ట్రేడింగ్, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలలో అత్యధిక ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు నమోదయ్యాయి. సమీక్షా కాలంలో చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐ ఈక్విటీ ప్రతిపాదనలురాగా.. నేపాల్ నుంచి 4.5 మిలియన్ డాలర్లు, మయన్మార్ నుంచి 9 మిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
చికున్ గున్యాకు తొలి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: చికున్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. ఇక్స్చిక్ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చికున్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్గకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణావసరాన్ని ఈ వ్యాక్సిన్ తీరుస్తుందని నమ్ముతున్నాం’’ అని వివరించింది. ‘‘ఇక్స్చిక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచి్చంది’’ అని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ చెప్పారు. బయోటెక్ కంపెనీ ‘వాల్వెవా ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. -
బిహార్‌లో 65 శాతానికి రిజర్వేషన్లు
పాట్నా: బిహార్‌లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75శాతానికి చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తమ్మీద 75 శాతానికి చేరుకున్నాయి’అని అన్నారు . అంతకుముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీల)కు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. -
అమరవీరుల స్తూపం నుంచి బీజేపీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల యం వరకు ర్యాలీ జరిపారు. మొదటగా అమరవీరులకు నివాళులర్పించి, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జయసుధ, ఆకుల విజయ, బండా కార్తీకరెడ్డి, రాణీరుద్రమ ఇతర నాయకులు, కార్యకర్తలు వెంటనడిచారు. ఈ సందర్భంగా ఎటు చూసినా కాషాయ జెండా పట్టుకుని జయహో మోదీ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక సందర్భమని కిషన్‌రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. ‘సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్‌కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్‌తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్‌కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్‌వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఒరిస్సా, గుజరాత్, కేరళ హైకోర్టులకూ నూతన సీజేలను నియమించారు. ఈ వివరాలను న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బుధవారం ట్వీట్‌చేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా , ఒరిస్సా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుభాíÙశ్ తాళపత్రను అదే హైకోర్టుకు సీజేగా ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒరిస్సా హైకోర్టులో ప్రస్తుత సీజే ఆగస్టు ఏడున రిటైర్ అయ్యాక జస్టిస్ సుభాషిశ్ సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా నియమించారు. గుజరాత్ హైకోర్టులో జడ్జి అయిన జస్టిస్ ఆశిశ్ జె.దేశాయ్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నెల మొదట్లో ఈ హైకోర్టులతోపాటు ఆంధ్రప్రదేశ్, మణిపూర్ హైకోర్టులకూ సీజేలుగా జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయగా ఏపీ, మణిపూర్ హైకోర్టుల్లో నియామకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పి.సామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీచేశారు. -
ఎగిరే కారుకు అమెరికా అనుమతి
కాలిఫోర్నియా: తాము తయారు చేసిన ఎగిరే కారు(ఫ్లయింగ్ కారు)కు అమెరికా ప్రభుత్వం నుంచి చట్టబద్ధ అనుమతి లభించిందని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వర్టీకల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(ఈవీటీఓఎల్) వెహికల్ అని పిలిచే ఈ కారు పూర్తిగా విద్యుత్‌తో పనిచేస్తుంది. ఫ్లయింగ్ కారును తొలిసారిగా 2022 అక్టోబర్‌లో అలెఫ్ కంపెనీ ఆవిష్కరించింది. రోడ్లపైనే పరుగులు తీయడమే కాదు, గాల్లోనూ ప్రయాణించడం ఈ కారు ప్రత్యేకత. హెలికాప్టర్ తరహాలో గాల్లోకి నిలువుగా ఎగరగలదు. నిలువుగా భూమిపై దిగగలదు. మోడల్–ఎ ఫ్లయింగ్ కారు ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే రోడ్డుపై 200 మైళ్లు(322 కిలోమీటర్లు), గాలిలో 110 మైళ్లు(177 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర 3 లక్షల అమెరికన్ డాలర్లు(రూ.2.46 కోట్లు). 150 డాలర్లు (రూ.12,308) చెల్లించి అలెఫ్ వెబ్సైట్ ద్వారా ఫ్లయింగ్ కారును బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచే కాకుండా కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్లడించింది. మోడల్–ఎ కార్ల ఉత్పత్తిని 2025 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని ప్రకటించింది. తమ ఎగిరే కారుకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుంచి స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టీఫికెట్ లభించిందని అలెఫ్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి వాహనానికి అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఇదే మొదటిసారి అని తెలియజేసింది. మోడల్–ఎ మాత్రమే కాకుండా మోడల్–జెడ్ తయారీపైనా అలెఫ్ సంస్థ దృష్టి పెట్టింది. మోడల్–జెడ్‌ను 2035 నుంచి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్ డ్రైవింగ్ రేంజ్, ఫ్లయింగ్ రేంజ్ మరింత అధికంగా ఉంటుంది. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. -
క్వాంటమ్ మిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి ఉద్దేశించిన నేషనల్ క్వాంటమ్ మిషన్(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ విభాగాల్లో నాలుగు థీమాటిక్ హబ్స్(టీ–హబ్స్) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠినౖ నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు. -
స్పేస్ పాలసీకి ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ పాలసీ–2023కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తోపాటు ఈ రంగంలోని ప్రైవేట్ సంస్థల పోషించాల్సిన పాత్ర, నెరవేర్చాల్సిన బాధ్యతలను ఈ పాలసీ కింద రూపొందించారు. సహజ వాయువు, సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలపై నియంత్రణకు నూతన ప్రైసింగ్ ఫార్ములానూ కేబినెట్ ఆమోదించింది. దీనిప్రకారం దేశంలో పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజ వాయువు (ఏపీఎం గ్యాస్) ధరలే ఇకపై ముడి చమురు ధరలకు సూచికగా ఉంటాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా చమురు ధరల ఆధారంగా మన దేశంలో ధరలను నిర్ణయిస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్‌లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
నానో డీఏపీతో సాగు మరింత సులువు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నానో లిక్విడ్ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌కు ప్రధాని ఈ మేరకు స్పందించారు. ఎరువులపై స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగుగా ప్రధాని పేర్కొన్నారు. ఎరువుల సహకార సంఘం ఇఫ్కో 2021లో నానో లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టింది. -
మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ
ముంబై: మహారాష్ట్రలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సుమారు 75 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు గురువారం ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నికలు జరిగే గుజరాత్‌కు తరలిపోతున్నాయంటూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రమైన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
వర్క్ ఫ్రమ్ హోమ్: ఉద్యోగులకు టీసీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి గుడ్ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టీసీఎస్ కూడా తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం అని తాజాగా వెల్లడించింది. ఆయా ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా కొంతమంది ఉద్యోగులకు ఇంటినుండి పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు టీసీఎస్ తెలిపింది. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) కాగా ఇటీవల ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించిన టీసీఎస్. ఇపుడిక ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. కంపెనీ సూపర్వైజర్లు రూపొందించిన రోస్టర్ ప్రకారం, కార్పొరేషన్ తన సిబ్బందిని సెప్టెంబర్ 22న తమ కార్యాలయాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఇప్పటికే ఆఫీసులకు వస్తున్నారని టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని సోమవారం కంపెనీ త్రైమాసిక ఆదాయ ప్రకటన సందర్భంగా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబరు నుంచి రోస్టర్ ఆధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) -
గంగవరం పోర్ట్.. అదానీ పరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో (జీపీఎల్) మిగిలిన 58.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్, ఎన్సీఎల్టీ హైదరాబాద్ నుండి అనుమతులు పొందినట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్‌ఈజడ్) సోమవారం వెల్లడించింది. షేర్–స్వాప్ విధానం ద్వారా డీవీఎస్ రాజు, కుటుంబం నుండి 58.1 శాతం వాటాను ఏపీఎస్‌ఈజడ్ కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా పూర్వపు జీపీఎల్ ప్రమోటర్లకు దాదాపు 4.77 కోట్ల ఏపీఎస్‌ఈజడ్ షేర్లు జారీ చేస్తారు. కొనుగోలు పూర్తి అయితే జీపీఎల్లో ఏపీఎస్‌ఈజడ్‌కు 100 శాతం వాటా ఉంటుంది. జీపీఎల్‌ను రూ.6,204 కోట్లకు (ఒక్కొక్కటి రూ.120 చొప్పున 51.7 కోట్ల షేర్లు) కొనుగోలు చేసినట్టు ఏపీఎస్‌ఈజడ్ ప్రకటించింది. గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో వార్బర్గ్ పింకస్ నుంచి 31.5 శాతం వాటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 శాతం వాటాను 2021–22లో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దక్కించుకుంది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
‘పాలమూరు–2’ అనుమతులకు నో
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు కేంద్ర పర్యవరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నిరాకరించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్–2006 నిబంధనలను ప్రాజెక్టు ఉల్లంఘించిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ఆధారంగా పర్యావరణ ఉల్లంఘనలతో జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ ఉల్లంఘనల కమిటీ మాజీ సభ్యుడు కె.గౌరప్పన్కు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించే బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: వైద్య నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి.. పర్యావరణ అనుమతుల జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. నష్ట నివారణ ప్రణాళిక, ప్రకృతి, ప్రాంతీయ వనరుల వృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎంత మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలో తామే సిఫారసు చేస్తామని, రెగ్యూలేటరీ ఆథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రణాళికలను అమలు చేశాకే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాల్సి ఉంటుందని సూచించింది. గాలి, నీరు, భూమి, ఇతర పర్యావరణ అంశాలకు ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ చట్టం కింద నోటిఫై చేసిన పర్యావరణ ల్యాబ్/సీఎస్ఐఆర్ గుర్తింపుగల ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగాలని సూచించింది. అంతర్రాష్ట వివాదాల విషయంలో సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొంది. ఫ్లోరైడ్ జోన్లో ప్రాజెక్టును నిర్మిస్తునందున జలాశయాల్లోని నీటితో భూగర్భ జలాల రిచార్జికి సదుపాయం ఉండాలని, దీనివల్ల ఫ్లోరైడ్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీ తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆస్తుల విక్రయ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ సప్లై చైన్స్ లిమిటెడ్(ఎఫ్ఎస్సీఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించింది. అయితే వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణకున్న ఇతర అవకాశాల అన్వేషణ, పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల పరిష్కారాలను వెదకనున్నట్లు వివరించింది. ఈ అంశాలలో తుది నిర్ణయాలకు వచ్చినప్పుడు వివరాలను అందించనున్నట్లు తెలియజేసింది. ఎఫ్ఎస్సీఎల్ దేశీయంగా ఆర్గనైజ్డ్ విభాగంలో అతిపెద్ద థర్డ్‌పార్టీ సప్లై చైన్, లాజిస్టిక్స్ సేవలు సమకూర్చే కంపెనీగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్ తదితర పలు రంగాల కస్టమర్లకు వేర్‌హౌసింగ్, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్ సొల్యూషన్లు అందిస్తోంది. 2022 జులై 26న కంపెనీ బోర్డు అవసరమైన అనుమతులు పొందాక వేర్‌హౌస్ ఆస్తులతోపాటు కొన్ని విభాగాలను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరిగి ఈ నెల 13న నిర్వహించిన అత్యవసర వాటాదారుల సమావేశం(ఈజీఎం)లో ఆస్తుల విక్రయానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తాజాగా ఈ ప్రణాళికలను వొదిలిపెడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం! -
3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సోమవారం మూడు బిల్లులను ఆమోదించింది. కార్పొరేట్, ఇతర పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ఫ్రాంచైజీలు, డీలర్లకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన భారత (ఏపీ) స్టాంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఏకరూపత ఉండేలా సంబంధిత కమిటీల్లో ఉన్నత విద్య, ఆర్థిక శాఖాధికారులను నియమించేందుకు ఉద్దేశించిన ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును, క్యాంపస్‌ల వారీగా ఉన్న నియామక ప్రక్రియ, రోస్టర్ నిర్ణయాన్ని యూనివర్సిటీ ప్రాతిపదికగా చేసే అధికారాన్ని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి దఖలుపరిచే సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, మరో ఐదు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఏపీ సర్వే, సరిహద్దుల చట్ట సవరణ బిల్లు, ఏపీ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లు, ఏపీ కౌలుదారీ (ఆంధ్ర ప్రాంత) రద్దు చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులను శాసన మండలిలో సభ్యులు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ సివిల్ సరీ్వసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్) (రద్దు) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్లు (సవరణ) బిల్లు–2022లను మండలి ఆమోదించింది. ఇదీ చదవండి: ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక -
క్షమాపణలు కోరిన బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్
న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్ ఇలా అన్నారు. " మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్ అనంతరం యూకే వీసాలకు డిమాండ్ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్ మరింత ఎక్కువైందని చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు. యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. A lot of you have been in touch about visa delays; many apologies, as I know this is causing a lot of problems. Here’s what we’re doing, and what you can do. pic.twitter.com/QJm7HceDq6 — Alex Ellis (@AlexWEllis) August 12, 2022 (చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్!) -
ప్రత్యక్ష ప్రసారాలకు సీజే ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసార నిబంధనలకు ప్రధాన న్యాయమూర్తి ఆమో దం తెలిపారు. ఈ నిబంధనలను, కోర్టు కార్య కలాపాల రికార్డింగ్‌ను అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. 2022, మే 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రత్యక్ష ప్రసారాల నిబంధన లను రూపొందించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ అడ్వొకేట్ శ్రీలేఖ పూజారి గత సంవత్సరం అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వా లని హైకోర్టు పాలన విభాగాన్ని సుప్రీంకోర్టు ఈ ఫిబ్రవరిలో ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. ముఖ్యమైన కేసుల ప్రత్యక్ష ప్రసారాలకు 2018లో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా చాలా హైకోర్టుల్లో అమలుకావడం లేదు. గుజరాత్ హైకోర్టు తొలిసారి లైవ్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, పట్నా హైకోర్టుల్లో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారమవుతోంది. వీటిని యూట్యూబ్‌లోనూ అప్లోడ్ చేస్తున్నారు. -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ వివరాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ పద్మావతి హృదయాలయంకు అవసరమైన వైద్య పరికరాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని పాలకమండలి ఏర్పాటు చేసిందన్నారు. పద్మావతి హృదయాలయం ప్రారంభించి 100 రోజులలో 100 అపరేషన్లు నిర్వహించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్‌కు కంప్యూటర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంను బాలాజి జిల్లా కలెక్టరెట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి నిబంధనల మేరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో స్టీమ్ ద్వారా అన్నప్రసాదాల తయారు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ గ్యాస్, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ తయారీకి 4 రూపాయల 71 పైసలు ఖర్చు చేస్తోంది. ఎన్‌ఈడీసీఏపీ వారు సోలార్ సిస్టమ్ ఆర్ఈఎస్సీవో మోడల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయల 54 పైసలతో 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా టీటీడీకి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమలలో రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేసింది పాలకమండలి. ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు మంజూరు చేయాలని టీటీడీ అధికారులకు ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని ,ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేస్తారని చైర్మన్ తెలిపారు. తిరుమల నాదనీరాజన మండపం షెడ్డు స్థానంలో శాశ్వత మండపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించింది పాలకమండలి. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని చైర్మన్ పేర్కొన్నారు. రూ.3.60 కోట్లతో టీటీడీ ఆయుర్వేద ఫార్మశీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. శ్రీవారి ఆలయ మహద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. గోపురాల బంగారు తాపడం విషయంపై ఆగమ పండితులతో చర్చించి క్రేన్ సహయంతో తాపడం పనులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం జారీచేసారు చైర్మన్. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు మీడియాలో జరిగిన ప్రచారం ఆవాస్తవమని, ధర పెంచే ఆలోచన మా పాలకమండలికు లేదని స్పష్టం చేశారు. -
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్) సైతం బిల్లును తప్పుబట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ -
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్ ఠాకూర్ సమాధానమివ్వలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 80 కోట్ల మందికి లబ్ధి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద ఇచ్చే రేషన్ సరుకులకు ఇవి అదనం. ‘ఓ–స్మార్ట్’కు రూ.2,177 కోట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్), సముద్ర పరిశీలక నెట్వర్క్ (ఓఓఎస్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)–చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్)–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీవోఆర్)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి. ఏసీఆర్‌ఓఎస్‌ఎస్ కొనసాగింపు 14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్ క్లైమేట్ రీసెర్చ్–మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్ కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్లకు స్టైపెండ్ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ(డీఎన్‌హెచ్), డయ్యూ డామన్(డీడీ)లో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్ ఆశిస్తోంది. -
టెలికం పీఎల్ఐ.. రూ.3,345 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పెట్టుబడి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద టెలికం ఉత్పత్తుల తయారీకి సంబంధించి 31 ప్రతిపాదనలకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. దీనికింద రూ.3,345 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంతర్జాతీయ కంపెనీలైన నోకియా, జబిల్ సర్క్యూట్స్, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, సన్మీనా–ఎస్సీఐ, రైజింగ్ స్టార్తోపాటు.. దేశీయ కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్, టాటా గ్రూపులో భాగమైన అక్షస్త టెక్నాలజీస్, తేజాస్ నెట్వర్క్స్, హెచ్ఎఫ్సీఎల్, సిర్మా టెక్నాలజీ, ఐటీఐ లిమిటెడ్, నియోలింక్ టెలీ కమ్యూనికేషన్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్ పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలకు ఎంపికయ్యాయి. రానున్న నాలుగేళ్లలో ఈ సంస్థలు రూ.3,345 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రతిపాదనలు సమర్పించాయి. తద్వారా 40,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ పథకం అమలయ్యే కాలంలో ఈ సంస్థల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ఉత్పత్తులు తయారీ కానున్నాయి. అందుబాటు ధరల్లో ఉండాలి.. ‘‘మీరు తయారు చేసే ఉత్పత్తులు అందుబాటు ధరల్లో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రూ.3,345 కోట్ల ప్రోత్సాహకాలన్నవి పెద్దవేమీ కావు. మీకు మరింత మొత్తం ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాకపోతే మీరు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నదే షరతు. పరిశ్రమకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ తెలిపారు. ఈ పథకం దేశీయంగా పరిశోధన, నూతన టెలికం ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘పీఎల్ఐ ద్వారా భారత్‌ను టెలికం తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటోంది. దేశీయంగా విలువను జోడించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాం’’అంటూ టెలికం శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా ప్రవీణ్ పేర్కొన్నారు. చిన్న సంస్థలు సైతం.. టెలికం శాఖ ఆమోదించిన 31 దరఖాస్తుల్లో 16 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలవి (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. ఇందులో కోరల్ టెలికం, ఇహూమ్ ఐవోటీ, ఎల్‌కామ్ ఇన్నోవేషన్స్, ఫ్రాగ్ సెల్‌శాట్, జీడీఎన్ ఎంటర్ప్రైజెస్, జీఎక్స్ ఇండియా, లేఖ వైర్లెస్, సురభి శాట్‌కామ్, సిస్ట్రోమ్ టెక్నాలజీస్, టిన్నిఇన్ వరల్డ్‌టెక్ తదితర కంపెనీలున్నాయి. పీఎల్ఐ పథకం టెలికం రంగంలో స్వావలంబనకు (ఆత్మనిర్భర్ భారత్) దారితీస్తుందని టెలికం తయారీదారుల సంఘం టెమా పేర్కొంది. టెలికం ఆపరేటర్ల సంఘం సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పందిస్తూ.. పీఎల్ఐ పథకం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ‘‘భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికం మార్కెట్‌గా ఉంది. టెలికం ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను మార్చడానికి ఈ పథకం సాయపడుతుంది’’ అని కొచర్ ప్రకటించారు. -
దివాలా సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) దివాలా ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (సవరణ) బిల్లు, 2021ను లోక్‌సభ ఎటువంటి చర్చా లేకుండా బుధవారం ఆమోదించింది. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. పెగాసస్‌పై సభ్యుల తీవ్ర ఆందోళనల నడుమ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ దివాలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టారు. మహమ్మారి ప్రేరిత సవాళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఊరట కలిగిస్తూ, ఏప్రిల్ 4న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రూ.కోటి లోపు రుణ వైఫల్యం జరిగిన ఎంఎస్ఎంఈ దివాలా పక్రియను తాజా బిల్లు సులభతరం చేస్తుంది. తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయనను నియమించింది. సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
భవన నిర్మాణ అనుమతులు చిటికెలో..
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఔట్ల అనుమతుల్లో విప్లవాత్మక సంస్క రణలు ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్–బీపాస్) సత్ఫలితాలి స్తోంది. అత్యంత పారదర్శకంగా, తక్షణ అనుమతులు/ నిర్దేశిత గడువు లోగా అనుమతుల కోసం గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్– బీపాస్ చట్టం తీసుకొచ్చింది. నవంబర్ నుంచి టీఎస్–బీపాస్ పోర్టల్ (https://tsbpass.telangana.gov.in) ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. 85 శాతానికి పైగా దరఖాస్తులకు ఈ విధానం ద్వారా నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు లభించాయి. ఇప్పటివరకు మొత్తం 8,498 దరఖాస్తులు రాగా, అందులో 4,903 (58 శాతం) దరఖాస్తుల పరి శీలన పూర్తయింది. ఫీజుల రూపంలో రూ.44.08 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల్లో లోపాలు, ఫీజు బకాయిల కారణాలతో 354 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన దశలో 3,241 (38 శాతం) దరఖాస్తులుండగా, వీటిలో 1,956 దరఖాస్తుల గడువు ఇంకా ముగియలేదు. మిగిలిన 1,285 (15 శాతం) దరఖాస్తుల గడువు ముగిసిపోయింది. సింగిల్ విండో కేటగిరీలో పరిశీలనలో ఉన్న 54 దరఖాస్తుల్లో రెండు దరఖాస్తుల గడువు తీరింది. తక్షణ అనుమతుల కేటగిరీలో 2,457 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 1,000 దరఖాస్తుల గడువు ముగిసింది. తక్షణ రిజిస్ట్రేషన్ కేటగిరీలో 730 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, 283 దరఖాస్తుల గడువు మీరింది. గణనీయంగా పెరిగిన దరఖాస్తులు.. టీఎస్–బీపాస్ విధానంపై దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నవంబర్‌లో 1,131 దరఖాస్తులు రాగా, డిసెంబర్లో 1,978కు, జనవరిలో 3,671కు పెరిగాయి. అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తుండటం, లంచాల కోసం వేధింపులు తగ్గడంతో అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టే వారి సంఖ్య పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 70 శాతం ‘ఇన్స్టంట్’ టీఎస్–బీపాస్ దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ఈ విధానం అమల్లోకి రావడంతో 75 చదరపు గజాల స్థలంలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్న ఇళ్లకు బిల్డింగ్ ప్లాన్ అనుమతి అవసరం లేదు. ఆస్తి పన్నులు మదించేందుకు రూ.1 చెల్లించి టీఎస్–బీపాస్ పోర్టల్‌లో ‘తక్షణ రిజిస్ట్రేషన్’చేసుకుంటే సరిపోతుంది. 76 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల లోపు ఎత్తులో నిర్మించనున్న నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో ‘తక్షణ అనుమతులు’ఇవ్వనున్నారు. 500 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో, 10 మీటర్లకుపైగా ఎత్తులో నిర్మించనున్న నివాస, నివాసేతర భవనాలకు ‘సింగిల్ విండో’విధానంలో 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ కావాలి. లేదంటే అనుమతి లభించినట్లేనని భావించి నిర్మాణం ప్రారంభించొచ్చు. అయితే రూ.1 చెల్లించి తక్షణ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అధిక దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. దీనికి విరుద్ధంగా భవన నిర్మాణ ఫీజులు పూర్తిగా చెల్లించి ‘తక్షణ అనుమతుల’కోసం వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉండటం టీఎస్–బీపాస్‌కు లభిస్తున్న విశేష స్పందనను తెలియజేస్తోంది. టాప్‌లో జీహెచ్ఎంసీ టీఎస్–బీపాస్ దరఖాస్తుల పరిశీలనలో జీహెచ్ఎంసీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్ఎంసీ 69 శాతం, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ (డీటీసీపీ) 60 శాతం, హెచ్ఎండీఏ 53 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. వివిధ కేటగిరీల దరఖాస్తుల పరిశీలనలో ఆయా శాఖలు/విభాగాలు సాధించిన పురోగతిని ఈ కింది పట్టికలో చూడవచ్చు. అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే.. అత్యధిక సంఖ్యలో టీఎస్–బీపాస్ దరఖాస్తులొచ్చిన టాప్–5 జిల్లాలుగా మేడ్చల్(1803), రంగారెడ్డి(1332), మహబూబ్‌నగర్(582), సంగారెడ్డి(497), కామారెడ్డి(434) నిలిచాయి. జీహెచ్ఎంసీ, మహబూబ్‌నగర్, బడంగ్‌పేట, దుండిగల్, కామారెడ్డి దరఖాస్తుల సంఖ్యలో టాప్–5 పురపాలికలుగా ఉన్నాయి. ఎల్టీపీ రూ.9 వేలు తీసుకున్నడు: వెంకటనర్సయ్య, మహబూబ్‌నగర్ 150 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా, 15 రోజుల్లోగా అనుమతి ఇచ్చారు. ఆన్లైన్లో నిర్దేశించిన మేరకు రూ.63 వేల ఫీజు చెల్లించాం. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి లైసెన్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ) రూ.9 వేలు అడిగితే ఇచ్చేశాం. అధికారులెవరూ లంచాలు అడగలేదు. 21 రోజులు ఆగమన్నారు: అడప కృష్ణ, మధురానగర్ కాలనీ, ఖమ్మం 113 చదరపు గజాల స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణం కోసం జనవరి 1న దరఖాస్తు చేసుకుని, అప్పుడే నిర్దేశించిన మేరకు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ ఫీజుల కింద రూ.56 వేలు చెల్లించాను. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ప్రాథమిక అనుమతులు ఇచ్చారు. అయితే వెంటనే పనులు ప్రారంభించొద్దని, 21 రోజులు ఆగాలని చెప్పారు. 21 రోజుల్లోగా తుది అనుమతుల సర్టిఫికెట్ ఇచ్చి మరో రూ.15 వేలు ఫీజు చెల్లించాలని అడిగి తీసుకున్నారు. తక్షణ అనుమతుల విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు సరైన అవగాహన లేదు. -
బైడెన్‌కు కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్‌ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటమి ఒప్పుకున్న ట్రంప్ బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్‌పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్ చేస్తుండటంతో ట్రంప్ అకౌంట్లను ఫేస్బుక్ 24 గంటల పాటు, ట్విటర్ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్‌ను బ్లాక్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ట్రంప్ ఫేస్‌బుక్‌ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అన్నారు. ట్రంప్ అకౌంట్‌ను 2వారాలు బ్లాక్ చేస్తున్నామని స్పష్టం చేశారు. -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
క్రిస్మస్కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విషయంపై భారీ ఆసక్తి నెలకొంది. ఎపుడెపుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో సీరంకు యూకే డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కీలకంగా మారనుంది. యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇండియాలో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్కు ముందే దేశీయంగా కూడా అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. (కోవిడ్-19 వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్‌జెట్) తాజా నివేదికల ప్రకారం మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ)ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తోంది. దీంతో క్రిస్మస్కు ముందే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వెంటనే దేశీయంగా కూడా అనుమతి లభించనుందని రెగ్యులేటరీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు. యూకే బ్రెజిల్లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా ప్రతిపాదన ఉంటుందనీ, అంతేకాకుండా, టీకా ఇంకా ఏ దేశంలోనూ ఆమోదించబడలేదు. ఇది సున్నితమైన విషయమన్నారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి పేర్కొన్నారు. మరోవైపు కరోనావైరస్ వ్యాక్సిన్లను పరిశీలించే ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇమ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది. భారతదేశంలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదానికి సంబంధించిన వివరాలను సీరం సంస్థ తప్పనిసరిగా అందించాలని ప్యానెల్ స్పష్టం చేసింది. -
మరో15 ఏళ్లు జిన్‌పింగే అధ్యక్షుడు!
బీజింగ్: చైనాలో అధ్యక్షు డు జిన్‌పింగ్ రూపొందిం చిన 14వ పంచవర్ష ప్రణా ళిక విజన్ 2035కి అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ఆమోద ముద్ర వేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సు గురువారం ముగిసింది. చివరి రోజు విజన్ 2035కి పార్టీ ఆమోదముద్ర వేయడంతో జిన్‌పింగ్ పదవికి మరో పదిహేనేళ్లు ఢోకా లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిని ఆమోదించడం ద్వారా మరో 15 ఏళ్ల పాటు జిన్‌పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని సీపీసీ సంకేతాలు పంపినట్టయిందని భావిస్తున్నారు. సీపీసీ సెంట్రల్ కమిటీకి చెందిన 198 మంది సభ్యులు, మరో 166 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2021–2035 సంవత్సరాల్లో దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ 2035పై విస్తృతంగా చర్చలు జరిపాక దానిని ఆమోదించారు. చైనా పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించడానికి, దిగుమతుల్ని పూర్తిగా నిషేధించి, స్వదేశీ మార్కెట్‌ని ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత 67 ఏళ్ల వయసున్న జిన్‌పింగ్ పార్టీలో అత్యంత శక్తి్తమంతమైన నాయకుడిగా ఎదిగారు. దేశాధ్యక్షుడిగా రెండు సార్లు మించి పదవి చేపట్టకూడదన్న నిబంధనల్ని రాజ్యాంగ సవరణ ద్వారా 2018లో సవరించి తానే జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం 2022తో ముగియనుంది. ఇప్పుడిక తాను రూపొందించిన విజన్ 2035కి ఆమోద ముద్ర పడడంతో మరో పదిహేనేళ్ల పాటు ఆయన పదవికి ఢోకా ఉండదు. -
విద్యాశాఖ బలోపేతానికి ‘స్టార్స్’
న్యూఢిల్లీ: పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ‘‘చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దాం’’ అని జవదేకర్ చెప్పారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నట్టు చెప్పారు. రూ.520 కోట్ల ప్యాకేజీ.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని జవదేకర్ చెప్పారు. -
కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బిల్లులను పరిశీలిస్తే.. - తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు - తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు - తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు - తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు - తెలంగాణ వస్తు, సేవల పన్ను సవరణ బిల్లు - తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధృవీకరణ విధానం బిల్లు - తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు - తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు. -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
జూన్‌లో టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత కోసం ‘టీఎస్–బీపాస్’ వి ధానాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని 87 పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, జూన్ మొద టి వారంలో అన్ని పురపాలికల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్–బీపాస్ అమలుపై గురువారం ఆయనిక్కడ సమీక్ష నిర్వహిం చారు. ప్రస్తుతం 87 పురపాలికల్లో టీఎస్–బీపాస్ కింద 1,100 దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పలు అనుమతులను జారీ చేశామని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. సాఫ్ట్వేర్, సపోర్ట్ సిస్టం పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చిందని, లోపాలుంటే సరిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రా ష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారం భించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరి ధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ మొదటివారంలో టీఎస్–బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీసేవ, పౌరసేవా కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్నెట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మరింత సరళీకృతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. టీఎస్–బీపాస్ అమలుపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్ -
‘వన్ ట్రిబ్యునల్’ వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం తెస్తున్న ‘వన్ నేషన్–వన్ ట్రిబ్యునల్’పై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. అంతర్రాష్ట్ర నదీజల వివాదాలను విచారించడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి, ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఎప్పటిలోగా ఆమోదం దక్కుతుందనే సందిగ్ధత వీడటం లేదు. ప్రస్తుతం మొదలుకానున్న బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడేళ్లలో తీర్పులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరి, వంశధార, మహదాయి, రావి నదీ వివాదాలు సహా మొత్తంగా 8 ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ఏదైనా రాష్ట్రం వివాదాలపై చేసిన వినతిపై సంతృప్తి చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ వస్తోంది. అలాగే ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణలు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయినా వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. దీన్ని దృష్ట్యా రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఈ బిల్లును 2017లోనే లోక్‌సభ ముందుకు తెచ్చినా, 2019 ఆగస్టులో సభ ఆమోదం పొందింది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ గట్టిగా సమ్మతించింది. రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో వన్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అని వేచి చూడాలి. ఆర్నెల్లుగా జరగని బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ.. ప్రస్తుతం కృష్ణానదీ జలాలను విచారిస్తున్న జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఆర్నెల్లుగా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే కృష్ణా వివాదాలపై పదేళ్లుగా విచారిస్తున్నా ఇంతవరకూ తుది తీర్పును ఇవ్వని ట్రిబ్యునల్.. ఆర్నెల్లుగా అయితే ఒక్క భేటీ నిర్వహించలేదు. ట్రిబ్యునల్‌లోని ఒక సభ్యుడు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కేంద్రం ఇంతవరకు భర్తీ చేయకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న మళ్లీ భేటీ నిర్వహించాల్సి ఉన్నా అది జరిగేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెస్తున్న వన్ ట్రిబ్యునల్ బిల్లుతోనే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో తెలంగాణ ఉంది. -
అమల్లోకి వచ్చిన సీఏఏ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టంలో ముస్లింల పట్ల వివక్ష ఉందని పేర్కొంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. -
అలహాబాద్ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. -
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వు ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి–ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. మరోవైపు, కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రతిపాదనకు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. సుమారు రూ. 1,072 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో 11 ద్వీపాలకు కనెక్టివిటీ లభిస్తుంది. ముందుగా 25 శాతం కట్టాలి.. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసింది. అయితే, కొన్ని సర్కిళ్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల లైసెన్సులు ముగిసిపోనుండటంతో.. ఆ తర్వాత వాటిని కూడా ప్రణాళికలో కలిపింది. తాజా వేలంలో 1 గిగాహెట్జ్ లోపు స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంస్థలు ముందుగా ధరలో 25 శాతం మొత్తాన్ని, 1 గిగాహెట్జ్‌కు మించి కొనుగోలు చేసిన సంస్థలు 50 శాతం మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా కొంత కట్టిన తర్వాత రెండేళ్ల పాటు మారటోరియం లభిస్తుంది. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి 16 వార్షిక వాయిదాల్లో మిగతా మొత్తాన్ని కట్టాలి. ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన ట్రాయ్.. 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ దాకా వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేయొచ్చని సిఫార్సు చేస్తూ 2018 ఆగస్టు 1న నివేదికనిచ్చింది. -
ఎన్ఆర్సీ అంటే ఏమిటి.. నష్టం ఎవరికి?
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కాస్తా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైంది మొదలు.. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయగా, ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ఆర్సీ అంటే..? జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులదరితో కూడిన జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్.. క్లుప్తంగా ఎన్ఆర్సీ అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేశారు కూడా. ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్ఆర్సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు అంచనా. దేశవ్యాప్త ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముం టుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి. నష్టం ఎవరికి? ప్రస్తుతానికి ఎన్ఆర్సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు. ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. ఎన్ఆర్సీపై ప్రశాంత్ కిషోర్ భగ్గు! అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామన్న అధికార బీజేపీ ప్రకటనలపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ భగ్గుమంటున్నారు. ఈ చర్య పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని ఆయన ట్వీట్ చేశారు. -
సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పౌరసత్వ బిల్లు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్లో ఐయూఎంఎల్ ఆరోపించింది. మత ప్రాతిపదికన ఒక వర్గానికి చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం రాత్రి ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్ తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే బిల్లుకు సంబంధించిన కార్యాచరణపై స్టే విధించాలని కోర్టును కోరారు. ఏ చట్టమైనా అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించాలంటే.. మతం, కులం, జాతీయత ఆధారంగా కాకుండా.. మొత్తం అక్రమ వలసదారులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదే కాదు, అమానవీయమైనది కూడా అని అన్నారు. కాగా, ఈ బిల్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం తథ్యమని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రభస పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ హింసను రాజేస్తోందని అధికార పక్షం వ్యాఖ్యానించడంతో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజ్వరిల్లుతున్న హింస అంశాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లేవనెత్తారు. ఈ బిల్లు వల్ల మొత్తం ఈశాన్య ప్రాంతమంతా అట్టుడుకుతోందన్నారు. ‘ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈశాన్యం మరో కశ్మీర్‌లా మారింది’ అన్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే హింసను రాజేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు డీఎంకే సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. -
ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఇతర విపక్షాల నిరసనల మధ్య స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీ కాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు. సోమవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెడితే బుధవారం ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బ్లాక్ క్యాట్ కమాండోలు ఉదాసీనంగా వ్యవహరించకుండా, వారి సమర్థత పెంచడం కోసమే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశామని చెప్పారు. తొలిరోజుల్లో ఏ ఉద్దేశంతో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారో దానినే పునరుద్ధరించామని వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కేవలం దేశాధిపతులకు మాత్రమే ఉంటుందని షా గుర్తు చేశారు. గాంధీ కుటుంబం భద్రతను మార్చాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు భద్రతను తొలగించలేదని, జెడ్ ప్లస్ కేటగిరీకి భద్రతను మార్చామని అమిత్ షా చెప్పారు. వాస్తవానికి ఇప్పుడే గాంధీ కుటుంబానికి భద్రత మరింత పెరిగిందని అన్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ, అంబులెన్స్‌తో గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌లకు ఎస్పీజీ భద్రత తొలగించినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో చేసినట్టుగా ప్రతీకారంతో తాము ఈ బిల్లు తీసుకురాలేదని షా అన్నారు. వీఐపీలందరికీ వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగానే భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్థాయిలో అందరికీ కల్పించలేమని చెప్పారు. షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇతర విపక్షాలు కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. వాటిని తిరస్కరించిన సభ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదించింది. గాడ్సే దేశభక్తుడు: ప్రజ్ఞా గాంధీజీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను ‘దేశభక్తుడు’గా పేర్కొంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో వివక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను డీఎంకే సభ్యుడు రాజా ప్రస్తావిస్తుండగా.. ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగిలారు. ఒక దేశభక్తుడిని మీరు ఉదాహరణగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. రాజా మాటలకు ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగలడంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గాడ్సేపై ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మరో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సమ్మెపై 14 రోజులు ముందే చెప్పాలి సమ్మెకు వెళ్లే కార్మికులు 14 రోజుల ముందే నోటీసు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టంలో ఇది భాగమని, దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని గంగ్వార్ అన్నారు. కార్మిక చట్టాలలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని పేర్కొన్న మంత్రి, అందులో భాగంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మిళితం చేస్తున్నామని వెల్లడించారు. 2016లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, ఇది శ్రామిక శక్తిలో 20 శాతం ఉందని తెలిపారు. -
చిట్‌ఫండ్’కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5% నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే, చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. ‘ది చిట్‌ఫండ్స్ (అమెండ్మెంట్)బిల్, 2019’పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్‌ను అనధికార, అనియంత్రిత డిపాజిట్ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు. ఒకరు లేదా నలుగురి లోపు వ్యక్తులు నిర్వహించే చిట్స్ గరిష్ట మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచేలా.. నలుగురు లేదా ఆపై సంఖ్యలో నిర్వాహకులున్న చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షలకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చిట్‌ఫండ్ నిర్వాహకుడి కమిషన్‌ను 5% నుంచి పెంచి 7% చేశారు. ‘చిట్ అమౌంట్’ను ఇకపై ‘గ్రాస్ చిట్ అమౌంట్’ అని, డివిడెండ్‌ను ‘షేర్ ఆఫ్ డిస్కౌంట్’ అని, ‘ప్రైజ్ అమౌంట్’ను ‘నెట్ చిట్‌ఫండ్’ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు. కనీస మొత్తం (బేస్ అమౌంట్) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. అవసరమనుకుంటే, చిట్‌ఫండ్ వినియోగదారులు చిట్ మొత్తానికి బీమా చేయించుకోవచ్చు కానీ వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందనే ఆలోచనతో.. బీమాను కచ్చితం చేయాలనుకోవడం లేదని బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినేట్ ఆమోదం
-
ఆర్బీఐ బొనాంజా!
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) రూ.1,76,051 కోట్ల నిధుల బదలాయింపు జరగనుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోకి కమిటీ సిఫారసులకు సోమవారం సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తాజా నిధుల బదలాయింపు జరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ప్రకటన సారాంశమిది... ‘‘కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది)’’ అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్యలోటుకు మందు! ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడి విషయంలో జలాన్ కమిటీ సిఫారసులు కేంద్రానికి ఎంతో సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019–2020 మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.4 శాతం (రూ.7.03 లక్షల కోట్లు) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి (ఏప్రిల్,మే,జూన్) రూ.4.32 లక్షల కోట్లకు చేరింది. అంటే తాజా గణాంకాలు చూస్తే, ద్రవ్యలోటు నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యంలో జూన్ నాటికే 61.4 శాతానికి చేరిందన్నమాట. ద్రవ్య లోటును కేంద్రం ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు గతంలో చర్చనీయాంశం అయ్యాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న ఆర్బీఐ బోర్డ్ నిర్ణయించింది. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ ఆరుగురు కమిటీ కూడా ఏర్పాటయ్యింది. నిజానికి ఈ కమిటీ జూన్‌నెల చివరికల్లా నివేదిక సమర్పిస్తుందని భావించినా, కొన్ని భేదాభిప్రాయాల వల్ల నివేదిక సమర్పణ వాయిదా పడుతూ వచ్చింది. జలాన్ కమిటీ నాల్గవది... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. -
దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్‌లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్‌ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్‌ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
‘ట్రిపుల్ తలాక్’కు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు–2019ను తీసుకొచ్చింది. కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును పరిశీలించేందుకు వీలుగా స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్రం అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇటు బీజేపీ, అటు విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్న ప్రతిపక్షాల డివిజన్‌ను 302–82 తేడాతో లోక్‌సభ తిరస్కరించింది. అలాగే ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్లవరకూ జైలుశిక్ష విధించే సవరణకు లోక్‌సభ 302–78 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందించేందుకు మహిళా ఎంపీలైన పూనమ్ మహాజన్, అపరజితా సేన్, మీనాక్షి లేఖీలను మోహరించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. 16వ లోక్‌సభ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో కేంద్రం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది. మొహమ్మద్ ప్రవక్తే వ్యతిరేకించారు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2017, జనవరి నుంచి ఇప్పటివరకూ 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాగా, ఆర్డినెన్స్ జారీచేశాక 101 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల నిరోధక చట్టం లేదా గృహహింస చట్టం కింద హిందువులు, ముస్లింలు జైలుకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ట్రిపుల్ తలాక్ విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు? ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించేందుకే ఇందులో మూడేళ్ల జైలుశిక్షను చేర్చాం. ఈ ఆచారాన్ని మొహమ్మద్ ప్రవక్త కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ఆపేయాలన్న దురుద్దేశంతోనే స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ట్రిపుల్ తలాక్‌పై 20 ఇస్లామిక్ దేశాల్లో నియంత్రణ ఉంది. భారత్‌లాంటి లౌకికవాద దేశంలో ఎందుకుండకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లును మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం పురుషులే లక్ష్యం: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్‌కు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. ముస్లిం మహిళలతో పాటు భర్తలు వదిలేసిన హిందూ, పార్సీ మహిళలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింలతో పోల్చుకుంటే హిందువుల్లో విడాకుల కేసులు ఎక్కువని మరో కాంగ్రెస్ నేత మొహమ్మద్ జాఫ్రి చెప్పారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అన్నది అనాగరికమేననీ, అయితే కేంద్రం తెచ్చిన బిల్లుపై తాము సుముఖంగా లేమని సీపీఎం నేత ఏ.ఎం.షరీఫ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్‌పై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఆజంఖాన్ గురువారం నోరు జారారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆజంఖాన్ మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన ఆజంఖాన్ నఖ్వీవైపు చూస్తూ..‘మీరు అటూఇటూ కాని మాటలు మాట్లాడవద్దు’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రమాదేవి స్పందిస్తూ..‘మీరు కూడా అటూఇటూ చూడకుండా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి’ అని కోరారు. వెంటనే ఆజంఖాన్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా, ఆజంఖాన్ తిరస్కరించారు. రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలను డెప్యూటీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. మరోవైపు ఆజంఖాన్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. వివాహవ్యవస్థ నాశనమవుతుంది: ఒవైసీ కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇస్లామ్‌లో 9 రకాల తలాక్ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ముస్లిం భర్త జైలుకు వెళితే ఆయన భార్య పోషణను ఎవరు చూసుకోవాలి? మీరు(కేంద్ర ప్రభుత్వం) వివాహ వ్యవస్థనే నాశనం చేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళలను రోడ్డుపై పడేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళల హక్కులపై అంత ప్రేమున్న బీజేపీ ప్రభుత్వం 2013 ముజఫర్‌పూర్ అల్లర్లలో అత్యాచారాలకు గురైన ముస్లిం మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు. ఈ అకృత్యాలకు సంబంధించి ఇప్పటివరకూ దోషులకు శిక్షపడలేదు. జల్లికట్టును నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చిన మీరు ముస్లింల మూకహత్యలను నిరోధిస్తూ చట్టం తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. మహిళల హక్కులపై నిజంగా బీజేపీకి అంత ప్రేముంటే ప్రత్యేక విమానంలో తమ మహిళా ఎంపీలను శబరిమలకు తీసుకెళ్లాలి’ అని ఒవైసీ చురకలు అంటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్థానం ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలా ల, బహుభార్యత్వాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో కక్షిదారులకు సహకరించాల్సిందిగా సుప్రీం కోర్టు అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని కోరింది. ► మార్చి 28: మహిళలకు సంబంధించి పెళ్లి, విడాకులు తదితర అంశాలపై అతున్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ► అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. లైంగిక సమానత్వం, లౌకికవాదం ఆధారం గా ఈ ట్రిపుల్ తలాక్‌పై పరిశీలన జరపాలని కోరింది. ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ► మార్చి 27: ట్రిపుల్ తలాక్ విషయం న్యాయస్థానం పరిధిలోకి రాదని, ఆ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. ► మే 18: ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై చట్టం చేయాలని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ► డిసెంబర్: ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ‘ముస్లిం మహిళల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ► 2018, ఆగస్టు 9: కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేసింది. నిందితులకు బెయిలు పొందే అవకాశం కల్పిస్తూ ఈ సవరణలు చేశారు. ► ఆగస్టు 10: ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే, బిల్లు సభ ఆమోదం పొందలేదు. ► సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్‌పై రూపొందిం చిన ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ ఆర్డినెన్సును రూపొందించారు. ► డిసెంబర్ 31: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ ప్రతిపక్షం అడ్డుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండు చేసింది. -
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు. ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా? బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఇతర సమాచారం.. ► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. ► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది. బిల్లుపై కేంద్రం మాట.. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది. -
ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెన్షన్ పొందేందుకు ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది. ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు. అద్దాల భవంతులపై ఆధారాల్లేవు.. అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు. -
నేవీకి మరింత శక్తి
వాషింగ్టన్: సముద్రంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకించిన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో భారత నావికాదళానికి ఈ హెలికాప్టర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శత్రు దేశాల సబ్మెరైన్లు, నౌకలను వెంటాడి వాటిని ధ్వంసం చేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధనౌకల నుంచి, విధ్వంసక నౌకల నుంచి, క్రూజర్ల నుంచి, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ప్రయోగించగలిగే హెలికాప్లర్లలో ఇవే అత్యాధునికమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు... ♦ అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు. ♦ లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. ♦ ఈ హెలికాప్టర్లలో సబ్మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేసింది. ♦ సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది. ♦ 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది. ♦ జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది. ♦ ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ♦ దీనికి సెన్సర్లను అమర్చారు. దీనివల్ల హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చే వాటిని గుర్తిస్తుంది. ♦ చిన్న ఆయుధాలు, మంటలు అంటుకున్నా కూడా ఎలాంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేశారు. ♦ 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు. -
‘తలాక్’ బిల్లుకు లోక్ సభ ఓకే
న్యూఢిల్లీ: తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్‌సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషుల్ని శిక్షించడమేనని మరో కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఎద్దేవా చేశారు. రాజకీయంతో చూడొద్దు: రవిశంకర్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆక్షేపించారు. ‘రాజకీయ కొలమానంలో ఈ బిల్లును చూడొద్దు. ఇది మానవత్వం, సమన్యాయానికి సంబంధించింది’ అని పేర్కొన్నారు. మరింత అధ్యయనం కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌పై స్పందిస్తూ..సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని ప్రభుత్వం ఇది వరకే పరిశీలించి అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసిందని వెల్లడించారు.2017 జనవరి నుంచి 477 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఓ ప్రొఫెసర్ వాట్సప్‌లో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ర్యాలీకి హాజరైన భార్యకు వ్యక్తి ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చిన దృష్టాంతాలూ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రసాద్ వివరణ ముగిసిన వెంటనే కాంగ్రెస్, తృణమూల్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇది తలాక్ 2.0 బిల్లు తొలి తలాక్ బిల్లు గతేడాది డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. విపక్షాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో కొన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ సవరణలు చేరుస్తూ తాజాగా తెచ్చిన బిల్లు ప్రకారం..నిందితులకు బెయిల్ ఇచ్చే వెసులుబాటును కల్పించారు. తలాక్‌ను కాంపౌం డబుల్ నేరంగా ప్రకటించారు. అంటే.. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసును వెనక్కి తీసుకోవచ్చు. బాధితురాలు, ఆమె దగ్గరి సంబంధీకులు ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు చేస్తారు. ఎప్పుడేం జరిగింది? ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వంల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్ల విచారణలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహకారం కోరిన సుప్రీంకోర్టు. విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారా? అని సందేహించిన కోర్టు ► 2016, జూన్ 29: రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం ► 2016, అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు ► 2017, ఏప్రిల్ 16: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తొలిసారి లేవనెత్తిన ప్రధాని మోదీ..ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని హామీ ► 2017, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ► 2017, డిసెంబర్ 28: ట్రిపుల్ తలాక్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ ► 2018, ఆగస్టు 10: రాజ్యసభలో తలాక్ బిల్లు. ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల వ్యతిరేకతతో లభించని ఆమోదం. ► 2018, సెప్టెంబర్ 19: విపక్షాల సూచనల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డినెన్స్ జారీ ► 2018, డిసెంబర్ 27: సవరించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం. కీ పాయింట్స్ ► మూడు సార్లు వరుసగా తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హ నేరమని సంబంధిత బిల్లులో ప్రతిపాదించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరానికిగానూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించవచ్చు. బాధిత మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ► తాజా ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నాలుగు గంటల పాటు కొనసాగింది. ► ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనివల్ల మహిళలకే నష్టం కలుగుతుందని వాదించాయి. తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించకూడదన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసే అధికారం స్థానిక పోలీసు అధికారికి కాకుండా, మేజిస్ట్రేట్ స్థాయి అధికారికే ఉండాలన్న విజ్ఞప్తినీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ► ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్న విపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఈ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించింది. అవి 1. బాధిత మహిళ కానీ, ఆ మహిళ దగ్గరి బంధువు కానీ తక్షణ తలాక్ చెప్పిన భర్తపై పోలీసు కేసు పెట్టాలి. 2. దంపతులిద్దరూ రాజీకి వస్తే ఆ మహిళ కేసును ఉపసంహరించుకోవచ్చు. 3. బాధిత మహిళ వాదన విన్నాకే ఆ భర్తకు బెయిల్ ఇవ్వాలో, వద్దో మేజిస్ట్రేట్ నిర్ణయించాలి. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ ఈ సెప్టెంబర్‌లో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిరంకుశ విధానమని, అది ఇస్లామిక్ సంప్రదాయం కాదని, ఇస్లాం మత విధానాల్లో ట్రిపుల్ తలాక్ భాగం కాదని 3–2 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ బిల్లు ప్రమాదకరం విపక్షాలు, హక్కుల కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై ముస్లిం సంస్థలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది ఈ బిల్లును వ్యతిరేకించగా కొందరు మాత్రమే స్వాగతించారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం చేయాలి: ఒవైసీ స్వలింగ సంపర్కం నేరం కాదంటున్న ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ నేరం అని వాదించడం వెనుక గల ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ట్రిపుల్తలాక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘అక్రమసంబంధాలు నేరం కాదన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకోకుండా పురుషులను ఆపే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ మాత్రం నేరమని అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కానపుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది? ఈ బిల్లును ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగానే తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని సెక్షన్–377 ప్రకారం లింగపరమైన మైనారిటీలకు హక్కులున్నప్పడు, మతపరమైన మైనారిటీలకు ఎందుకు ఉండవు? మీ విశ్వాసం మీకున్నప్పుడు. మా విశ్వాసం కూడా మాదే అవుతుంది. మీ (ప్రభుత్వం) ఉద్దేశం సరిగా లేదు’ అని అన్నారు. ఎన్నికల దృష్టితో తెచ్చిన బిల్లు: కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తలాక్ బిల్లు తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో మాదిరి కఠిన నిబంధనలు మరే చట్టంలోనూ లేవు. ఈ బిల్లును ఆమోదించటానికి ముందుగా పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి అభిప్రాయం తీసుకోవాలి’ అని కోరారు. నేర పూరితం అనడం తగదు: కారత్ వ్యక్తిగత అంశాన్ని కూడా నేరం అనడం తగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ‘ఏ మతం కూడా ఇలాంటి కారణంపై అరెస్టు చేయాలని చెప్పలేదు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటానికి బదులుగా మైనారిటీల్లో విభేదాలను సృష్టించడమే ఈ బిల్లు వెనుక ప్రభుత్వ వాస్తవ ఉద్దేశం. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మరిన్ని కష్టాలు తప్పవు’ అని ఆమె పేర్కొన్నారు. ఒక్కోమతానికి ఒక్కో చట్టమా? మతాన్ని బట్టి చట్టాలు ఎలా మారుతాయని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. ‘భార్యను వదిలివేయడం వంటి చర్యలకు ముస్లిమేతరులు పాల్పడితే నేరం కానప్పుడు, ముస్లింలైతే నేరం ఎందుకు అవుతుంది’ అని అన్నారు. న్యాయ మంత్రి బదులివ్వలేకపోయారు ‘ఈ బిల్లులోని అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానాలు చెప్పలేకపోయారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆస్మా జెహ్రా ఆరోపించారు. తలాక్‌ను ప్రభుత్వం లేకుండా చేసినప్పుడు ఇంకా చర్చ ఎందుకని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి మౌలానా మహ్మూద్ దర్యాబా దీ ప్రశ్నించారు. తలాక్ చెప్పిన కారణంగా భర్త జైలుకు వెళితే, ఎలాంటి ఆర్థిక ఆసరాలేని అతని భార్య, సంతానం సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ సంస్థ సభ్యురాలు స్వాగతించారు. బహుభార్యత్వం, చిన్నారుల సంరక్షణ వంటి అంశాల్లో స్పష్టత తెచ్చేందుకు హిందూ వివాహ చట్టం మాదిరిగా ముస్లిం వివాహ చట్టాన్నీ తేవాలన్నారు. సుప్రీం ఏం చెప్పింది? ముస్లింలు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ (తలాక్ ఏ బిద్దత్) సంప్రదాయం చెల్లదనీ, అది రాజ్యాంగవిరుద్ధమని 2017, ఆగస్టు 22న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3–2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసేందుకు అనుకూలంగా జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ తీర్పు ఇవ్వగా, అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నేల్లు నిషేధం విధించాలనీ, ఆలోగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరికి ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఖేహర్ 395 పేజీల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ మెజారిటీ తీర్పును వెలువరిస్తూ..‘ట్రిపుల్ తలాక్ ఆచారంలో భాగమైనప్పటికీ అది లోపభూయిష్టమైనది. పునరాలోచనకు ఆస్కారం లేకుండా వెనువెంటనే చెప్పేసే ట్రిపుల్ తలాక్ కారణంగా వివాహబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను ఇది ఉల్లంఘించడమే’ అని ముగ్గురు జడ్జీలు మెజారిటీ తీర్పు ఇచ్చారు. ‘తమకు న్యాయం చేయాలంటూ ముస్లిం మహిళలు న్యాయస్థానం మెట్లు ఎక్కితే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులకు సాధ్యం కాదు. తలాక్ ఎ బిద్దత్ సహా మూడు రకాల విడాకులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం–1937లో చేర్చడంతో పాటు గుర్తింపునిచ్చారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(1) చెబుతోంది. ముస్లిం పురుషుడు ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు తలాక్ ఆస్కారం కల్పిస్తోంది’ అని తన తీర్పులో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ పేర్కొన్నారు. తలాక్ బిల్లుకు సంబంధించి లోక్‌సభ డిస్ప్లే బోర్డుపై కనిపిస్తున్న ఓట్లు లోక్‌సభలో బిల్లుపై మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్, మల్లికార్జున్ ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ -
తెలంగాణలో ఓటుకు ఏపీ ఉద్యోగులకు అనుమతి
సాక్షి, అమరావతి: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7వ తేదీన జరగనున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆ రోజును ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సచివాలయంలోనూ, శాఖాధిపతుల కార్యాలయాల్లో 15 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నాయి. అక్కడ వారికి ఓటు ఉన్నందున ఏపీ ప్రభుత్వం 7వ తేదీన తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది. అయితే తెలంగాణలో ఓటు హక్కు ఉన్నట్లు ఓటర్ గుర్తింపు కార్డు చూపించాలని షరతు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. -
తదుపరి సీఈసీ సునీల్ అరోరా!
న్యూఢిల్లీ: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులు కానున్నారు. ఆయన నియామకాన్ని కేంద్రం నిర్ధారించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి. ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సీఈసీగా ఆయనే పర్యవేక్షిస్తారన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియా ణా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగు తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. -
బినామీ కేసులకు అప్పిలేట్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల కేసుల సత్వర విచారణకు అపిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థలు విధులు నిర్వర్తించనున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ప్రాధికార సంస్థకు అనుబంధ బెంచ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ సంస్థ చైర్మన్‌ను సంప్రదించిన తరువాత బెంచ్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో బినామీ కేసులు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద తీసుకున్న చర్యలకు న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థ తొలి సమీక్ష వేదికగా పనిచేస్తుంది. ప్రాధికార సంస్థ ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. ఆశా సమన్వయకర్తల భత్యాల పెంపు: ఆశా సమన్వయకర్తల పర్యవేక్షణ భత్యాలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. అక్టోబర్ నుంచి ఒక్కో క్షేత్రస్థాయి పర్యవేక్షణ పర్యటనకు రూ.250కి బదులు రూ.300 చెల్లిస్తారు. ఫలితంగా ఆశా సమన్వయకర్తలు నెలకు పొందే మొత్తం వేతనం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగనుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 41 వేల ఆశా సమన్వకర్తలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం పట్ల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆశా కార్యకర్తల నుంచే సమన్వయకర్తలను ఎంపికచేస్తారు. ∙ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ఎస్) ఏర్పాటుకు ఆమోదం. -
తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం
-
దృష్టిలోపం ఉన్నవారు డాక్టర్లు కావచ్చా?
న్యూఢిల్లీ: నయం కాని దృష్టిలోపంతో బాధపడుతున్నవారిని ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు, రోగులకు చికిత్స చేయడానికి అనుమతించవచ్చా? అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్‌కు నోటీసులు జారీ చేసింది. దృష్టిలోపంతో బాధపడుతున్న తనకు వైకల్య ధృవీకరణ పత్రం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ విద్యార్థి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. తాను నీట్ రాశానని, సర్టిఫికెట్ మంజూరు చేస్తే వికలాంగ కోటాలో ఎంబీబీఎస్‌లో చేరుతానని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. ‘టీచింగ్, న్యాయ తదితర రంగాల్లో దృష్టిలోపం ఉన్న వారు రాణించవచ్చంటే అర్థం చేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌కు ఇది ఎంతవరకు సమంజసమో పరిశీలించాల్సి ఉంది’ అని పేర్కొంది. -
మా పాలనకు ప్రజామోదం
కటక్, భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని, ప్రజలు తమకు ఆమోద ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శమని ఆయన చెప్పారు. దేశం దుష్పరిపాలన నుంచి సుపరిపాలనకు, నల్లధనం నుంచి ప్రజాధనం వైపుగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలన అనంతరం.. దేశం మారగలదన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం అనేకమంది వెన్నులో వణుకు పుట్టించిందని, దాంతో విపక్షాలు ఒకే వేదికపైకి చేరాయని విమర్శించారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడాన్ని అందరూ గమనించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే ప్రభుత్వం మాది కాదు. సర్జికల్ దాడులు నిర్వహించగల సత్తా ఎన్డీఏ సర్కారుకు ఉంది అలాగే అక్రమ ఆదాయం, ఆస్తులపై వివిధ దర్యాప్తు సంస్థలు మూడు వేల దాడులు నిర్వహించాయి. రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం బయటపడింది. బినామీ చట్టం కింద రూ. 3500 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. అవినీతి కేసుల్లో నలుగురు మాజీ సీఎంలు జైళ్లలో ఉన్నారు. 2.26 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెన్నులో వణుకు పుట్టిన అనేకమంది.. ఒకే వేదికపైకి చేరారు’ అని ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్షాల ఐక్యతను పరోక్షంగా విమర్శించారు. ప్రజానుకూల పథకాలు చేపట్టాం.. కాలం చెల్లిన చట్టాల్ని పక్కనపెట్టామని, గత నాలుగేళ్లుగా ప్రపంచం ఒక కొత్త భారతదేశాన్ని చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో 7.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఎన్డీఏ హయాంలో ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు అందాయి. 25 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్ని ఇచ్చాం. 10 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు అందచేశాం. మా హయాంలో పారిశుద్ధ్య సౌకర్యాల్ని రెండింతలు మెరుగుపర్చాం. గత నాలుగేళ్లలో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే మా విధానాలు కూడా ప్రజానుకూలంగా ఉన్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధికార యావ అని మోదీ విమర్శించారు. శనివారం కటక్‌లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ ప్రజా ఉద్యమంగా ఎన్డీఏ అభివృద్ధి పనులు గత నాలుగేళ్లలో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి ఉత్సాహపూరిత ప్రజా ఉద్యమంగా మారిందని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. ‘2014లో ఇదే రోజున దేశ పరివర్తన కోసం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. దేశం వృద్ధి పథంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యాడు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. ‘సాఫ్ నియత్, సహీ వికాస్’(మంచి ఉద్దేశం, సరైన అభివృద్ధి) హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రభుత్వ విజయాల్ని ప్రస్తావిస్తూ పలు చార్ట్‌లు, గ్రాఫిక్స్, వీడియోల్ని పోస్టు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల దృఢమైన నమ్మకానికి నేను నమస్కరిస్తున్నా. మీ మద్దతు, వాత్సల్యం ప్రభుత్వానికి ప్రేరణ, బలం’ అని ట్వీట్ చేశారు. ఉత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవచేయడాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. ముందుచూపుతో ప్రజలకు సాయం చేసే నిర్ణయాలు తీసుకున్నామని సరికొత్త భారతావనికి అవి పునాదులు వేశాయని చెప్పారు. -
పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ రెండోసారి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ గత వారం సమావేశమై.. జస్టిస్ సీకే ప్రసాద్ నియామకానికి ఆమోదం తెలిపింది. చట్టబద్ధ సంస్థ అయిన పీసీఐ.. ప్రింట్ మీడియా నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం.. కౌన్సిల్లో చైర్మన్‌తోపాటు మరో 28 మంది సభ్యులు ఉండాలి. గత మార్చిలో 8 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయగా.. మిగతా 20 మంది సభ్యుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. మిగతా సభ్యుల జాబితాను కూడా అందజేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని జస్టిస్ ప్రసాద్ తెలిపారు. బిహార్‌లోని పట్నా నగరంలో జన్మించిన జస్టిస్ ప్రసాద్.. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. 2008లో కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2009 మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2014 జూలై 14 వరకు సుప్రీంకోర్టు జడ్జీగా సేవలందించారు.