
ఆపద్బంధుకు ఆపద
మూడేళ్లుగా జిల్లాలో ఆపద్బంధు పథకం కింద 287 కేసులు ఆమోదం పొందాయి.
♦ మూడేళ్లుగా పైసా విదల్చని సర్కారు
♦ పెండింగ్‌లో 287 కేసులు
మూడేళ్లుగా జిల్లాలో ఆపద్బంధు పథకం కింద 287 కేసులు ఆమోదం పొందాయి. వీటికి సంబంధించి రూ.1.43 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆయా కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థికసాయం అందించలేదు .ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు తలపెట్టిన ఆపద్బంధు పథకానికి నిధుల గండం పట్టుకుంది. మూడేళ్లుగా ఈ పథకం కింద పలు కుటుంబాలు అర్హత సాధించినా. ప్రభుత్వం మాత్రం పైసా విదల్చడంలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
జిల్లాలో ప్రమాదాల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. అందులో యంత్రాంగానికి అందిన సమాచారం మేరకు కేసులను పరిశీలించి ఆపద్బంధు కింద అర్హతను నిర్ధారిస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. వాస్తవానికి ఈ ప్రక్రియలో గరిష్టంగా మూడు నెలల్లోపు సదరు కుటుంబానికి లబ్ధి చేకూర్చాలి. కానీ జిల్లాలో మూడేళ్లుగా ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ..
ప్రత్యామ్నాయ పద్ధతిలోనైనా జిల్లా యంత్రాంగం సర్దుబాటు చేస్తే ఆయా కుటుంబాలకు ఆర్థిక చేయూత దక్కేది. కానీ నిధులను సాకుగా చూపుతూ సాయంపై యంత్రాంగం మౌనం వహించడం ఆందోళన కలిగించే విషయమే.
వడదెబ్బ మృతులకూ అందనిసాయం
ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి సామాన్యుడి పరిస్థితి దారుణంగా మారింది. ఎండల తీవ్రతతో కొందరు వడదెబ్బ బారిన పడుతున్నారు. 2015-16 వార్షికం మార్చినెలలో జిల్లాలో ఏకంగా 10 మంది వడదెబ్బతో మరణించారు. వారికి ఆపద్బంధు పథకం కింద సాయం అందించేలా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేసింది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వారికి ఆర్థిక సాయం అందించలేదు. ఇదిలావుండగా.. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆపద్బంధు పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ కలెక్టర్ రఘునందన్‌రావు సీఎంకు విన్నవించారు.