ఇంటి పరిసరాల్లో మాటు వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు
న్యాయాధికారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా
న్యాయమూర్తులను బెదిరించే రీతిలో చంద్రబాబు సర్కారు బరి తెగింపు
తనపై నిఘా పెట్టారని వ్యాఖ్యానించిన జడ్జి
అసైన్డ్ భూముల కేసులో చార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్న
చంద్రబాబుపై కేసులను నీరుగార్చేలా పోలీస్ ఉన్నతాధికారులతో లూథ్రా వరుస భేటీలు
పోలీసు వ్యవస్థను తన కంట్రోల్‌లోకి తీసుకుని దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..?
ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..?
తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి.
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...
ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?
– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి
చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు.
న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు.
చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు?
– సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి
చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం.
అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్‌గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు.
లూథ్రా కంట్రోల్‌లో పోలీస్ వ్యవస్థ!
చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు.
మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్‌లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్‌లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment