![Hearing of cases against Chandrababu postponed](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/case.jpg.webp?itok=ydeHrKSW)
సుప్రీంకోర్టు ఉత్తర్వులను కోర్టు ముందుంచుతామన్న ఏజీ
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో హైకోర్టు తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన పలు కుంభకోణాలపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతంలేవని.. వీటి తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రకమైన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏవో ఉత్తర్వులు ఇచ్చినట్లు పత్రికల్లో చదివామని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంంకోర్టు అనుమతినిచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ప్రస్తుత కేసులో చేసిన అభ్యర్థనతో సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందన్నారు. ఆ పిటిషన్‌లో ప్రస్తుత పిటిషనర్ బాలగంగాధర్ తిలక్ ఇంప్లీడ్ అయ్యారని, ఈ విషయాన్ని ఆయన చెప్పడంలేదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను రెండునెలలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment