బాధితులపైనా అవే సెక్షన్లు
ఇంట్లో సామగ్రి బయటపడేసి నడి వీధిలోకి గెంటేసిన వారివైపే పోలీస్ మొగ్గు
అధికార పార్టీ నేతలు చెబితేనే కేసులు
లేకపోతే ఎఫ్‌ఐఆర్ కూడా కట్టని పోలీసులు
3 నెలల క్రితం మాజీ మంత్రి విడదల రజిని ఫిర్యాదు
ఈ నెలలో ఐదు ఫిర్యాదులు చేసిన మాజీ మంత్రి అంబటి
కేసులు నమోదు చేయని పట్టాభిపురం పోలీసులు
ప్రశ్నించిన నేతలపై ఎదురు కేసులు
టీడీపీ నేతల చేతుల్లో పోలీసుల బందీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. నేరం చేసిన వారిపైన, బాధితులపైన ఒకే తరహా కేసులు నమోదు చేయడం పట్టాభిపురం పోలీసులకే చెల్లింది. పట్టపగలు 50 మంది ఓ ఇంటిపై దాడిచేసి ఇంట్లోని సామగ్రి బయటపడేసి ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసి ఆ ఇంటిని ఆక్రమించుకుంటే.. పోలీసులు మొక్కుబడిగా ఇంట్లోకి అక్రమ ప్రవేశం, గాయపరచడం, నేరపూరిత బెదిరింపు వంటి బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
బాధితులపై కూడా ఇదే సెక్షన్లు పెట్టి “సమ’న్యాయం చూపించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్¯ పరిధిలోని సాయిబాబా రోడ్డు శాంతినగర్ 2వ లైన్‌లో నగర డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ తాడికొండ ఇన్‌చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్ బాబు) సోదరి వజ్రకుమారి ఇంట్లోకి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్‌కిరణ్ ఆదివారం మధ్యాహ్నం సుమారు 50 మంది అనుచరులతో దౌర్జన్యంగా ప్రవేశించిన విషయం విదితమే. వజ్రకుమారి ఇంట్లోని సామగ్రిని బయటపడేయడంతో పాటు ఆ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళతోపాటు, పసిపిల్లలను కూడా బయటకు తోసేశారు.
ఆ తరువాత టీడీపీ నేతలు, వారివెంట వచ్చిన అనుచరులు ఆ ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ స్థలం విషయంలో 1978 నుంచి ఇరువురి మద్య వివాదం నడుస్తోంది. స్వా«దీనం అగ్రిమెంట్‌పై అమ్మిన వ్యక్తి, తర్వాత రేటు పెరిగిందని రిజి్రస్టేషన్ చేయకపోవడంతో కొన్నేళ్లుగా కోర్టులలో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డైమండ్‌బాబు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రం 4 నుంచి 6గంటల వరకూ ఉన్నా కిందిస్థాయి సిబ్బందిని పంపిన సీఐ మాత్రం ఘటనా స్థలానికి రాలేదు.
డైమండ్‌బాబు ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత అక్కడికి చేరుకున్న సీఐ వీరేంద్రబాబు టీడీపీ నాయకులకు వత్తాసు పలికారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి డైమండ్‌బాబును బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే, విజయ్‌కిరణ్ స్టేషన్‌లో తమ అదుపులో ఉన్నాడని, ఇంట్లో ఉన్నవారిని రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు పిలిపిస్తామని సీఐ మీడియాతో చెప్పారు. అయితే.. విజయ్‌కిరణ్ అ సమయంలో ఘటనా స్థలంలోనే ఉండటం గమనార్హం. ముందుగా పోలీసులతో మాట్లాడుకున్న తర్వాతే విజయ్‌కిరణ్ ఈ దౌర్జన్యానికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియా కేసుల్లోనూ ఇదే తీరు
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా పట్టాభిపురం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌సీపీ నేతలైతే ఒక లెక్క.. అధికార పార్టీ నేతలైతే మరో లెక్క అన్నట్టుగా పోలీసుల వ్యవహారశైలి ఉంది. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసారని 2018లో పోస్ట్ చేసిన వారిని ఒకే కేసులో ఒకే విషయంపై పలుచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు.
ఐ–టీడీపీ పోస్టులపై స్పందించని పోలీసులు
మాజీ మంత్రులు విడదల రజిని, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సతీమణి, కుమార్తెలపై ఐ–టీడీపీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు బుట్టదాఖలా చేస్తున్నారు. విడదల రజిని జిల్లా ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసి 55 రోజులైనా ఇప్పటివరకూ కేసు కూడా నమోదు చేయలేదు.
మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు నవంబర్ 19న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, తన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో ఐ–టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆధారాలతో సహా ఐదు అంశాలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌తో పాటు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదులు ఇచ్చారు.
ఈ ఫిర్యాదుల గురించి ఆయనే స్వయంగా పట్టాభిపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన ఫిర్యాదు ఎక్కడివరకు వచి్చందని అడిగినా పోలీసుల నుంచి సమాధానం రాని పరిస్థితి ఉంది. దీంతో గడచిన మంగళవారం అయన పట్టాభిపురం స్టేషన్‌కు వెళ్లి అక్కడ సరైన సమాధానం రాకపోవడంతో స్టేషన్ ఎదుట భైఠాయించాల్సి వచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయని పోలీసులు స్టేషన్ ముందు నిరసన తెలిపిన నేతలపై మళ్లీ ఎదురు కేసు నమోదు చేశారు.
తాజాగా డైమండ్‌బాబు విషయంలో కూడా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడి ప్రమేయంతో స్థానిక సీఐ వారికి అండగా నిలబడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐ వ్యవహార శైలిపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సన్నద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment