న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది.
ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది.
చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు.
రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే.
చర్చకు విపక్షాల పట్టు
సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు.
సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది.
చర్చ ఎందుకు?: తోమర్
మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు.
ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు.
టీఎంసీ, ఆప్ డుమ్మా
సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి.
రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి
ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు.
దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి.
– సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ
జడిసే... చర్చ పెట్టలేదు
పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు.
బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి.
– కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
Comments
Please login to add a commentAdd a comment