minimum support price
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు!
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్‌లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.- తలకోల రాహుల్ రెడ్డి మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్ -
కనీస ధరే రైతుకు భరోసా
భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఉన్న ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం – కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాన్ని తేవడమే! చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ఆర్థికవేత్తలు భావిస్తుంటారు. అదే కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం వీళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం వ్యవసాయ రంగం ఎదురుచూస్తున్న పెద్ద సంస్కరణ.ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని పెన్షన్ సంస్కరణ అన్నారు. దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి గర్విస్తున్నామని కూడా అన్నారు.చివరిగా ఉద్యోగి పొందిన వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌కు హామీ ఇచ్చే యూపీఎస్, వాస్తవానికి మునుపటి మార్కెట్ అనుసంధానిత నూతన పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ప్రభుత్వ ఉద్యోగు లకు మేలు చేయలేదని అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్ధారిత ప్రయోజనపు’ హామీ ఇవ్వడం కోసం, వాళ్లు మార్కెట్ల దౌర్జ న్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిమండలి పెన్షన్ పథకాన్ని సవరించింది.ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో దేశంలోని రైతులను ప్రశంసించినప్పటికీ తమ పంటలకు హామీ ధరలు ఉండాలని దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఉద్యోగు లకు భరోసా పెన్షన్ అవసరమైనప్పుడు, రైతులకు కూడా భరోసా ధర అవసరమే.ప్రపంచంలో ఎక్కడా మార్కెట్లు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడం లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సబ్సిడీ ఆదాయ అంత రాన్ని భర్తీ చేస్తుంది. వ్యవసాయ రాయితీలను అందించడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మాత్రం వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసింది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా, భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు.శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం, వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి హామీ ఇచ్చే చట్టం మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తుందని ఎన్డీయే ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచిత్రమేమిటంటే, రైతుల విషయానికి వచ్చేసరికి, విధాన నిర్ణేతలు మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయన్న పల్లవిని ఎత్తు కుంటారు. అదే ఉద్యోగుల విషయంలో అంతా బానేవుంటుంది. మార్కెట్ల అస్తవ్యస్త భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ప్రధాన ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు; వాస్తవంలో, ఇది కార్పొ రేట్ల లాభాలను పిండేస్తుంది కాబట్టే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే స్వేచ్ఛా మార్కెట్ ప్రబోధక ఆర్థికవేత్తలు అమెరికాలోని కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. ఇదీ నిజానికి ధరలను వక్రీకరించడం. అందుకే ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్‌తో సహా 38 రాష్ట్రాలు ఈ ధరల పెరుగుదలను నిషేధించే చట్టాలను తెచ్చాయి. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్ల ధరలను 400 శాతం మేరకు పెంచిన కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చాలామంది మార్కెట్ సమర్థక ఆర్థిక వేత్తలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్కెట్ వక్రీకరణలపై జరిగే ఇటువంటి తనిఖీలను సోవియట్ శైలి ధరల నియంత్రణగా పేర్కొంటున్నారు.రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన సమయంలో మార్కెట్‌కు అనుకూలమైన పక్షపాత దృష్టి పెరుగుతుంది. కానీ కార్పొరేట్లు విని యోగదారుల రక్తమాంసాలను పీల్చివేయడం కోసం ధరలను పెంచి నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరు. మార్కెట్ వక్రీకరణ అనే ఈ ద్వంద్వ ప్రమాణం రైతులకు జీవన ఆదాయాన్ని అందించే మార్గంలో అడ్డుగా నిలుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మార్కెట్లు రైతుల హామీ ధరలకు అనుగుణంగా వాటికవే సర్దుబాటు చేసుకుంటాయి. కేవలం భావజాలమే దీనికి అడ్డు నిలుస్తోంది.మహమ్మారి తర్వాత ఆహారం, కిరాణా వస్తువుల ధరలు 53 శాతం పెరగడానికి కారణమైన కార్పొరేట్ ధరల పెరుగుదలపై నిషేధం విధించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. రిపబ్లికన్లు ఆమె వైఖరిని ‘కమ్యూనిస్ట్’ అన్నారు. మితవాద పక్షం ఏదైనా చెప్పనీ... కొందరు ఆర్థికవేత్తలు అంగీకరించినట్లుగా, ధరల పెరుగుదలపై నిషేధం అనేది మంచి ఆర్థిక శాస్త్రం, మంచి రాజకీయం అనే అభిప్రాయాన్ని ఎవరూ తిరస్కరించడం లేదు. ఈ సందర్భంగానే, ఆహార పదార్థాల ధరలను కృత్రిమంగా ఎక్కువగా ఉంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ హామీ ఇచ్చారు.ఉద్యోగుల పెన్షన్ విషయానికి తిరిగి వస్తే, కేంద్ర వ్యయ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఆసక్తికరం. ఇది ‘ఆర్థికంగా వివేకవంతమైన’ నిర్ణయమనీ, ‘ఇది భవిష్యత్ తరాల పౌరులకు ఆర్థిక కష్టాలను నివారిస్తుం’దనీ పేర్కొంది. ఉద్యోగు లకు ఇస్తున్న హామీ పెన్ష¯Œ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించగలుగుతున్నప్పుడు, రైతులకు ఆర్థిక భద్రత కల్పించలేకపోవడానికి కారణం ఏదీ లేదు. ఎందుకంటే రైతులు కూడా దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్నారు. వారి నిర్విరామ కృషి వల్లే దేశానికి ఆహార భద్రత ఏర్పడింది.మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన కమలేశ్ పాటీదార్ అనే రైతు తన పదెకరాల్లోని సోయాబీన్ పంటను దున్నివేసినప్పుడు, అది ఒక గొలుసుకట్ట చర్యను ప్రేరేపిస్తుందని అతను అనుకోలేదు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే, చాలా మంది రైతులు తమ పంటను దున్నేశారని వార్తలొచ్చాయి.సోయాబీన్ ధరల పతనం... అది కూడా, కోత కాలానికి నెలన్నర ముందు ధరలు పడిపోవడం అనేది, రైతులు మంచి ధరను పొందే వరకు పంటను నిల్వ ఉంచుకోవాలని సూచించే మరొక ఆర్థిక నమ్మ కాన్ని పోగొట్టింది. తర్వాతైనా ఎక్కువ ధర వస్తుందనే ఆశతో కమలేష్ పాటీదార్ గత ఏడాది పండించిన పంటను అలాగే నిల్వ ఉంచు కున్నాడు. అది కూడా ఫలించలేదు.సోయాబీన్ ధరలు పన్నెండేళ్ల క్రితపు స్థాయికి పడిపోవడంతో వ్యవసాయ జీవనోపాధి ధ్వంసమైన లక్షలాది మంది రైతులకు ఇది ఆగ్రహం కలిగించింది. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉన్న ధరలు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవు. భవిష్యత్ తరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రస్తుత రైతులకు కూడా ఆర్థిక కష్టాలను నివారించే భరోసా ధరల విధానం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను.ఆ తర్వాత, టమోటా ధరలు 60 శాతం క్షీణించి, 25 కిలోల పెట్టెకు 300 రూపాయల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వార్తలొచ్చాయి. అనంతరం, బాస్మతి బియ్యం ధర క్వింటాల్‌కు 28 శాతం తగ్గి రూ. 2,500కు చేరుకుందని వార్తలొచ్చాయి. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగిన ప్రత్యేకమైన ఘటనలు కావు. ఇది దేశం ఏమాత్రం ఆందోళన చెందని బాధాకరమైన వార్షిక ధోరణిగా తయారైంది.అమ్ముకోదగినంత మిగులు ఉన్న రైతులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతులను అందించడం అనేవి వ్యవసాయ రంగం ఎదురు చూస్తున్న పెద్ద సంస్కరణలుగా చెప్పాలి.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్‌లో రాహుల్‌ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్‌తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
రైతుకు ‘వినియోగ’ ఆసరా!
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, వినియోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో రైతుకూ, వినియోగదారుకూ మధ్య సంబంధం ఇద్దరికీ లాభదాయకం అవుతుంది. తద్వారా అది ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. 2016లో ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ‘ఎవరు బాస్?’ అనే ఆలోచన వచ్చింది. ఫ్రెంచ్ డెయిరీ రైతులు కష్టాలను అధిగమించడంలో సహాయపడటానికి ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నమే ‘ఎవరు బాస్?’. తర్వాత ఇది తనకుతానుగా ఒక ప్రత్యేకమైన వినియోగదారుల ఉద్యమంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా దాని రెక్కలను విస్తరించింది. స్థిరమైన, పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థలకు దారితీసే ఆరో గ్యకరమైన పరివర్తన దిశగా వ్యవసాయ ఆహార పరిశ్రమ పని చేస్తుందని నిర్ధారిస్తూ, ఫ్రెంచ్ ఆహార సహకార బ్రాండ్‌గా ‘ఎవరు బాస్’ అనే అవగాహనోద్యమం రైతులకు జీవనాధారంగా ఉద్భవించింది. రైతులకు అధిక ధర ఇవ్వడం మార్కెట్లను కుప్పకూలుస్తుంది అని నమ్మే వారందరికీ, ఇక్కడ నేర్చుకోవడానికి గొప్ప అభ్యాసం ఉంది. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, విని యోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మరింతగా క్రమాంకనం చేస్తే, ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగ దారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో, ఈ క్విడ్ ప్రోకో (నీకిది, నాకది) సంబంధం మరింత పెరిగింది. ఇది ఆ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. సగటున 31 శాతం పైగా పెరిగింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ భారతీయ రైతులు నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుందని భయపడే ప్రధాన ఆర్థికవేత్తలు, మీడియా, మధ్యతరగతి వారు ఆగ్రహించిన తరుణంలో ఈ క్విడ్ ప్రో కో భావన ప్రాముఖ్య తను సంతరించుకుంది. ఫ్రాన్స్, ఇతర ప్రాంతాలలో వినియోగ దారులు స్వచ్ఛందంగా ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు భయాందోళనలను సృష్టించే బదులు, భారత ఆర్థికవేత్తలు పంటలకు సరసమైన ధరను నిరాకరించడం వ్యవసాయ జీవనోపాధిని ఎలా చంపుతుందో గ్రహించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఈ ప్రయత్నం ఎంత కీలకమో వినియోగదారులకు అవగాహన కల్పించాలి. మొత్తానికి, వినియోగదారులు రైతుల కష్టాల పట్ల సున్నితంగా ఉంటారు. సరైన అవగాహనతో, వారు వినియోగ ప్రవర్తనను సులభంగా మార్చ గలరు. అది మార్కెట్ శక్తులను సైతం మార్చేలా చేస్తుంది. మిగులు ఉత్పత్తి కారణంగా ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ఆ పరిణామం ఫ్రెంచ్ పాడి పరిశ్రమ పతనానికి దాదాపుగా దారి తీసింది. పాడి రైతులు షట్టర్లు మూసివేయడం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు పెరి గాయి. ఆ కష్ట సమయాల్లో నికోలస్ చబన్నే. ఒక పాడి రైతు అయిన మార్షల్ డార్బన్ ను కలుసుకున్నాడు. చబన్నే స్థానిక పాడి పరిశ్రమ సహకార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారు రైతు సంఘం దుఃస్థితిని, చుట్టుపక్కల ఉన్న రైతుల బాధలను చర్చించినప్పుడు, రైతులను ఆదుకోవడానికి వినియోగదారులను ఒకచోట చేర్చే ఆలో చన రూపుదిద్దుకుంది. ‘‘ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ప్రయత్నించడం విలువైనదే’’ అని నికోలస్ నాతో అన్నారు. ఇలా ‘ఎవరు బాస్?’ అనేది రూపొందింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకోవడమే దీని లక్ష్యం. ‘‘మనకు ఆహారం అందించే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి ఇది అవసరం’’ అని చబన్నే అన్నారు. 2016 అక్టోబర్‌లో, ఆపదలో ఉన్న 80 కుటుంబాలకు సహాయం చేస్తూ 7 మిలియన్ లీటర్ల పాలను విక్రయించే లక్ష్యంతో పాల కోసం బ్లూ కార్టన్ డిజైన్ ప్యాక్ ప్రారంభమైంది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి సోషల్ మీడియాను ఉపయో గించారు. రైతు చేయాల్సిందల్లా ఒక యూరో నమోదు రుసుము చెల్లించి, మంచి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడమే! ఇది ప్రారంభమైన ఏడేళ్లలో, ’హూ ఈజ్ ది బాస్’ సంఘీభావ బ్రాండ్ 424 మిలియన్ లీటర్ల పాలను లీటరుకు 0.54 యూరోల హామీతో కూడిన సరసమైన ధరకు విక్రయించింది. అయితే అది మార్కెట్ ధర కంటే 25 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఇది నేడు ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పాల బ్రాండ్‌గా ఉద్భవించింది. పైగా దాదాపు 300 వ్యవసాయ కుటుంబాలకు (వివిధ ఉత్ప త్తుల కోసం సుమారు 3,000 మందికి) ఇది అండనిస్తోంది. మార్కె ట్లో పనిచేసే ధరల వ్యత్యాసాల లాగా కాకుండా, మార్కెట్ ధోరణు లతో హెచ్చుతగ్గులు లేని స్థిరమైన ధరను రైతులు పొందుతారు. ఫ్రాన్స్‌లో 38 శాతం రైతులు కనీస వేతనం కంటే తక్కువ సంపా దిస్తారనీ, పైగా 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవించి ఉన్నారని లెక్క. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే ప్రకారం 75 శాతం మంది ప్రజలు తమ కొనుగోలుకు మరికొన్ని సెంట్లు జోడించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించడం హర్షించదగినది. ఇది ఉత్పత్తిదారులకు సరస మైన ధరకు హామీ ఇస్తుంది. ఇది పాలతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ సంఘీభావ బ్రాండ్ సేంద్రియ వెన్న, సేంద్రియ కాటేజ్ చీజ్, ఫ్రీ–రేంజ్ గుడ్లు, పెరుగు, ఆపిల్ రసం, ఆపిల్ పురీ, బంగాళాదుంపలు, పిండిచేసిన టమోటాలు, గోధుమ పిండి, చాక్లెట్, తేనె, ఘనీభవించిన గొడ్డు మాంసం(గ్రౌండ్ స్టీక్)తో సహా దాదాపు 18 ఉత్పత్తులకు విస్తరించింది. సహకార సంఘం సాగుదారులకు సరసమైన ధరను అందజేస్తున్నప్పటికీ, వారు ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటంటే వంటకాల్లో లేదా పశువుల దాణాలో పామా యిల్ ఉపయోగించకపోవడం, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలను వాడకపోవటం. సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు జంతు వులను మేపడం వంటివి. ఈ భావన ఇప్పుడు జర్మనీ, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మొరాకో, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలోని 9 దేశాల వినియోగ దారులకు చేరువవుతోంది. ఇక్కడ ఫ్రెంచ్ మాతృ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందంతో వినియోగదారుల వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్రాన్ ్స తన పండ్లు, కూరగాయల అవసరాలలో 71 శాతం దిగుమతి చేసుకుంటుందని, ఇది స్థానిక ఉత్పత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని గ్రహించిన నికోలస్ దేశీయ రైతులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘మేము సుదూర ప్రపంచం నుండి రవాణా చేయకూడదనుకుంటున్నాము. మన స్థానిక ఉత్పత్తిదారులను, వారు ప్రతిరోజూ మన ఇంటి ముంగిట ఉత్పత్తి చేసే ఆహారాన్ని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులకు సహాయం చేయడానికి, సహకార బ్రాండ్ ఇటీవల తన ఆహార బాస్కెట్లో స్ట్రాబెర్రీ, తోటకూర, కివీ పళ్లను పరిచయం చేసింది. మార్కెట్లు పోటీని తట్టుకునేందుకు అట్టడుగు స్థాయికి దూసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఎవరు బాస్’ అనే ఆలోచన వారికి కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, వ్యవసాయ ఆదాయాలను పెంపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైన సాగుదారు లను మార్కెట్లు కలిగి ఉన్నందున, రైతులకు వినియోగదారుల మద్దతుపై చాలావరకు ఈ ‘ఎవరు బాస్’ ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్‌లోని 16 మిలియన్ల మంది ప్రజలు సాపేక్షంగా ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తే, నికోలస్ ప్రారంభించిన సంస్థ కచ్చితంగా చాలా ముందుకు వచ్చినట్లే అవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
పంటలన్నిటికీ ఒకే విధానం సాధ్యమా?
కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని చేస్తున్న రైతుల ఉద్యమం ఇప్పటికీ ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో వారి చర్చలు సఫలం కాలేదు.వారి డిమాండ్లు నెరవేరుతాయా? అన్ని పంటలకూ ఒకే విధానం అమలుచేయడం సాధ్యమేనా అన్నవి తలెత్తే ప్రశ్నలు. ప్రకటించిన 23 పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేసినట్టయితే దాని ప్రభావం ఇతర అంశాలపైన, ముఖ్యంగా ఆర్థిక రంగంపైన ఉంటుందన్నది ఒక వాదన. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’ (ధరల స్థిరీకరణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమంలో ఉధృతి తక్కువే. కానీ ప్రశ్నలు ఎక్కువ. మూడు రైతు సంస్క రణ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఆగడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల (పంజాబ్, హరియాణా) రైతులే ఇందులో ఎందుకు పాల్గొంటు న్నారు? కేంద్రం చర్చలకు పిలిచిన ప్రతిసారీ డిమాండ్లు ఎందుకు మారుతున్నాయి? అసలు చర్చలు సఫలమయ్యే దిశగా డిమాండ్లు ఉన్నాయా? ఎన్నికల ముందు మొదలైన చలో ఢిల్లీ రైతు ఉద్యమం బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకేనన్న విమర్శ మాటేమిటి? ఈ మేరకు ఒక రైతు నేత మాటలతో బయటపడిన వీడియో (మోదీ ప్రతిష్ఠను దించడమే ధ్యేయం అంటూ) మాటేమిటి? నిజానికి రెండేళ్ల నాటి రైతు ఉద్యమమమే చాలా అనుమానాలనే మిగిల్చింది. ఆఖరికి ‘టూల్–కిట్’ సాలెగూడులో కూడా రైతు ఉద్యమం చిక్కుకుంది. రైతు ఉద్యమ మంటే రైతుకు సాయపడాలి. రాజకీయాలకు కాదు. జాతి వ్యతిరేక శక్తులకు అసలే కాదు. ఐదు పంటలకు మద్దతు ధరను ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. మొదట ఒప్పుకున్నట్టే ఒప్పుకున్న రైతు సంఘాలు, పంటల సంఖ్యను పెంచాయి. కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్– ఎంఎస్పీ)కి చట్ట బద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోపాటు ఇతర అంశాలపైన ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ (కొన్ని ప్రాంతాలు)కు చెందిన రైతులు దాదాపు 200 యూనియన్లతో ఢిల్లీపైన దండయాత్రకు సిద్ధ మయిన నేపథ్యంలో, కేంద్రం చర్చలకు సిద్ధమైంది. చండీఘడ్‌లో నాలుగు దఫాలుగా సాగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ఎంఎస్పీ ప్రభుత్వాల వ్యవసాయ ధరల నిర్ణయం విధానంలో భాగం. ఇది పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయటానికి నిర్దేశించే ధర. స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరకు సిఫార్సు చేసింది. మొత్తం పంతొమ్మిది వందల పేజీలతో ఐదు నివేదికలు సమ ర్పించింది. కానీ రైతు నేతలు చెబుతున్నట్టు ఎంఎస్పీకి చట్టబద్ధత, లేదా దాని లెక్కింపు సూత్రాల గురించి ప్రతిపాదించలేదు. ఎంఎస్పీ పంట వ్యయానికి 50 శాతం అధికంగా ఉండాలని సూచించింది. రైతు సంఘాలు కోరే 23 పంటలకు ఎంఎస్పీ అమలు కష్టమని నిపుణులు, విశ్లేషకులు మొదటినుంచీ చెబుతున్నారు. ఆ నిర్ణయం ఆర్థిక రంగంపైన చూపించే ప్రభావం నేపథ్యంలో అన్ని పంటలకు ఒకే విధానం సరికాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. ఎంఎస్పీ భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే, ప్రభుత్వం ఏటా రూ. 12 లక్షల కోట్లు అదనపు వ్యయాన్ని భరించాలి. అది సాధ్యం కాదని కేంద్రం కూడా చెబుతోంది. ప్రభుత్వం గనక ఎంఎస్పీ ప్రకటించిన 23 పంటలను కొనుగోలు చేసినట్టయితే అనేక అంశాలపైన దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఎదుటికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వచ్చాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’(ధరల స్థిరీక రణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఎంఎస్పీ కంటే ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్పత్తిలో కొంత భాగాన్ని ప్రొక్యూర్ చేసి రైతులకు న్యాయబద్ధమైన ధరను అందిస్తుంది. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమం 2020 నాటి ఆందోళనకు కొనసాగింపుగా కాకుండా, ఒక వివాదం పొడిగింపుగానే కనిపిస్తోంది. 2020 నాటి ఆందోళన కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకం. వాటిని కేంద్రం 2021లో రద్దు చేసింది. అప్పట్లో ప్రభుత్వం రైతుల డిమాండ్ల మేరకు ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటానికి అంగీకరించింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ నేటి ఢిల్లీ చలో ఉద్దేశం వేరు. ఆందోళనకు ముందే ఈ అంశం మీద చర్చించటానికి కేంద్రం సిద్ధమైంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనీ, రైతులకు రుణహామీ, పెన్షన్ సదుపాయాలు కల్పించా లనీ, స్వామినాథన్ కమిషన్ ఫార్ములాను అమలు చేయాలనీ రైతు సంఘాలు కోరుతున్నాయి. లఖింపుర్ హింసలో బాధితులకు న్యాయం చేయాలనీ, 2013 భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలనీ, 2020–21 ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం అందించాలనీ కూడా కోరుతున్నారు. 2020లో ఈ నిరసనకు భారతీయ కిసాన్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహించాయి. ఇప్పుడు వివిధ యూని యన్లు నడిపిస్తున్నాయి. 2020 మాదిరిగా కేంద్రం రైతు సంఘాలను ఢిల్లీలోకి అడుగు పెట్టనీయలేదు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసింది. ఆందోళన నాలుగో రోజున, 63 ఏళ్ల జియాన్ సింగ్ మర ణించారు. రైతుల ఆందోళన సాగుతున్నతీరు, దానికి ఖర్చవుతున్న తీరు, ట్రాక్టర్ల స్థానంలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు అక్కడకు రావటం వంటివి చూస్తుంటే, ఈ ఆందోళనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చునన్న విమర్శలు ఉన్నాయి. రైతుల ఆందోళన ముసుగులో కొందరు యువకులు ముసు గులు ధరించి భద్రతా సిబ్బంది పైన రాళ్లు విసురుతున్నట్టు తేలింది. హరియాణా పోలీసులు ఆందోళనకారులపైన టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ‘బలవంతపు చర్యలకు’ పాల్పడటంతో అనేక మంది గాయపడ్డారని రైతు నేతలు ఆరోపించారు. రైతుల, యూట్యూబర్ల సోషల్ మీడియా ఎకౌంట్లను రద్దు చేయటం ద్వారా ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రైతు నేత సరవన్ సింగ్ పాంథర్ ఆరోపించారు. కేంద్రం మీద నిందంతా మోపుతున్నవారు గమనించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. పంజాబ్– హరియాణా సరిహద్దుల్లో రైతు లకు, భద్రతా సిబ్బందికి మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు నిర్వహించింది. రైతు నేతలు కేంద్రమంత్రుల మధ్య (ఫిబ్రవరి 8, 12, 15, 18) చర్చలు జరిగాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, వ్యవ సాయశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు జాతీయ రహదారుల మీద కనిపించకూడదు. దానిని రైతులు ఉల్లంఘించారు. ఇంకా చాలా విషయాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసు కుంటున్నారు. కాగా 23 పంటలకు ఒకే విధమైన విధానం సాధ్యం కాదని ఎవరైనా అంగీకరించాలి. కొత్తగా మళ్లీ, పాడి రైతుల సమస్యలను ఈ ఆందోళన ఎందుకు పట్టించుకోదన్న ప్రశ్న మొదలయింది. ఇంకా చేపల చెరువుల రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర శాశ్వతంగా ఇవ్వాలని రైతులు చెబుతున్న 23 పంటలు మొత్తం వ్యవసాయంలో 30 శాతం లోపే. మరి మిగిలిన వ్యవసాయోత్పత్తుల మాటేమిటి? ఈ ప్రశ్నకు రైతు నేతల నుంచి సమాధానం రావాలి. ఏమైనా రైతుల సమస్యల పేరుతో రాజకీయ లబ్ధిని పొందాలని కొన్ని బీజేపీయేతర పక్షాలు కోరుకుంటున్నాయి. అందుకు అవి ఎంచుకున్న మార్గం రోడ్ల మీద తేల్చుకోవడం. రైతు సమస్యల పరిష్కారం అంటే రైతులకు చెడ్డపేరు తేవడం కాదు. వారి మీద దారుణ ముద్ర పడేలా చేయడం కాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్‌నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్‌మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్‌లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్‌కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్‌ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇక రైతులకు మంచిరోజులేనా?
రైతులను శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుత రాజకీయాలు పోరాడుతున్నాయి. అనేక దశాబ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, పంటల ధరలను తక్కువగా ఉంచడమే! దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం. ఆర్థికవేత్తలతో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించడమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే, గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం పెరుగుతుందని అర్థం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కావాలంటూ పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, వ్యవసాయ పంటలకు అధిక ధరను అందజేస్తామనే హామీతో రైతులను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఏర్పడింది. ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు కొత్త నమూనాను సృష్టిస్తోంది. దేశంలో 14 శాతం మంది రైతులు మాత్రమే ధాన్య సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఒక చట్రాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుతం రాజకీయాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. అనేక దశా బ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడమే! ఇలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం. రైతులు పేదలుగా ఉండ టానికి ఇదే ప్రధాన కారణం. ప్రపంచంలోని అత్యంత సంపన్న వాణిజ్య కూటమి అయిన ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం, భారతీయ రైతులపై 2000వ సంవత్సరం నుండి నిరంతరం పన్ను విధించబడుతోందని నిశ్చయాత్మకంగా చూపింది. ప్రబలంగా ఉన్న వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం స్పష్టంగా మన ముందుంది. 54 దేశాలలో సాగిన ఈ అధ్యయనం ప్రకారం, రైతులు ‘ప్రతికూల జోన్’లో ఉన్న దేశాలు కొన్ని ఉన్నప్పటికీ, బడ్జెట్ మద్దతు ద్వారా నష్టాన్ని పూడ్చడానికి భారతదేశంలో మాత్రమే ఎటువంటి ప్రయత్నం జరగలేదని తేలింది. సరళంగా చెప్పాలంటే – ఇరవై సంవత్సరాలుగా, భారతీయ రైతులు ఏ సహాయమూ అందని కఠిన పరిస్థితుల్లో మిగిలి పోయారు. ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి వ్యవ సాయాన్ని త్యాగం చేయాలని విశ్వసించే ప్రధాన ఆర్థిక ఆలోచనకు ఇది సరిగ్గా సరిపోతుంది. 50 శాతం లాభ మార్జిన్‌తో ‘వెయిటెడ్ ధర’ను లెక్కించడం ద్వారా, రైతులకు కనీస మద్దతు ధరను (సాంకే తికంగా దీనిని ‘సీ2+50 శాతం’ అంటారు) చెల్లించాలనే ‘ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్’ సిఫార్సును తూట్లు పొడవడంలో అదే ఆధిపత్య ఆలోచనా ప్రక్రియ పనిచేసింది. ‘సీ2+50 శాతం’ ఫార్ములా ఆధారంగా రైతులకు ధరను అందించడం సాధ్యం కాదనీ, అది ‘మార్కెట్లను వైకల్యపరుస్తుంద’నీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్, కాలం చెల్లిన అదే ఆర్థిక ఆలోచనల ఫలితమే. అయితే, ప్రధాన ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారనే దానితో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు కష్టాల్లో ఉన్న రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించ డమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. 2020–21లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల విశిష్టమైన నిరసన వారి కళ్ళు తెరిపించింది. అంతే కాకుండా ఆహారాన్ని పండించే రైతులకు ఇకపై జరిమానా విధించడం కుదరదని వారికి అర్థమైంది. ఛత్తీస్‌గఢ్‌లో వరి సేకరణ ధర ఇప్పటికే క్వింటాల్‌కు రూ. 2,640 (2023 మార్కెటింగ్ సీజన్లో కొనుగోలు ధర రూ. 2,183 కాకుండా) ఉన్న చోట, కాంగ్రెస్ మొదటగా దానిని రూ.3,200కి పెంచడం ఆసక్తికరం. ఎకరాకు కనీసం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఎకరాకు 21 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ, క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో గోధుమలకు కాంగ్రెస్ అందించే ధర క్వింటాల్‌కు రూ. 2,600 కాగా, బీజేపీ రూ. 2,700లను ప్రతిపాదించింది. రాజస్థాన్‌లో, ‘సీ2+50 శాతం’ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర చెల్లిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అలాగే, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతుగా రూ. 15,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, 2006లో సమర్పించిన స్వామినాథన్ ప్యానెల్ సిఫార్సులను అమలు చేయడంలో ఇరుపక్షాలూ నిరాసక్తులైనప్పటికీ, ఎన్నికల రాష్ట్రాల్లో వాగ్దానం చేసిన వరి, గోధుమ ధరలు ‘సీ2+50 శాతం’ ఫార్ములా ధరకు సమానంగా లేదా మించి ఉన్నాయి. ఈ ఎన్నికల వాగ్దానాలు నెరవేరుతాయా లేదా అని చాలామంది ఆలోచిస్తుండగా, కనీసం వ్యవసాయ ధరలనైనా ప్రకటించాలనే పోటీ కారణంగా, రాజకీయ నాయకులు రైతు సమాజం బాధలను, వేదనను గ్రహించడం ప్రారంభించినట్లు అర్థమవుతోంది. కాగా, అధిక ధరలను ప్రకటించడం వెనుక ఉన్న ఆర్థిక హేతు బద్ధతను ఇప్పటికే అనేక ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. అదనపు వనరులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నల హోరు మరింత పెరుగుతుంది. విచిత్రమేమిటంటే – అదే ఆర్థిక ఆలోచన గత 10 సంవత్సరాలలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల కార్పొరేట్ మొండి బకాయిలను మాఫీ చేయడంలోని హేతుబద్ధతను ఎన్నడూ ప్రశ్నించలేదు. అలాగే 16,000 మందికి పైగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులను రాజీపడేలా చేసే ఆర్థిక శాస్త్రంలోని తప్పును ఈ ఆర్థిక ఆలోచన కనుగొనలేదు. రూ. 3.45 లక్షల కోట్ల బకాయిలను ఎగవేతదారులు దాటేసి పోవడంలోని తప్పును ఇది గుర్తించలేదు. మార్కెట్లు సమర్థతను, మంచి పనితీరును మెచ్చు కుంటున్నట్లయితే, పనితీరులో విఫలమైన కంపెనీలను బెయిల్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆర్థిక కారణం లేదు. అందువల్ల, పంటలకు అధిక ధరలు అందించే నిబద్ధత దేశ వ్యాప్తంగా ఎందుకు విస్తరించడం లేదని రైతులు అడగడం సరైనదే! 14 శాతం మంది రైతులు మాత్రమే సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధరల కోసం ‘సీ2+50 శాతం’ వద్ద చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా మిగిలిన 86 శాతం వ్యవసాయ జనాభాకు హామీ ధరలు చేరేలా చూసుకోవాలి. దీనితో పాటుగా భూమిలేని రైతుల కోసం ‘పీఎం–కిసాన్’ ఆదాయ మద్దతును పెంచాలి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం ఎక్కువ అవుతుందని అర్థం. పైగా అది జీడీపీని ఉన్నత పథంలో నడిపిస్తుంది. రాజకీయ పార్టీలు దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి వాగ్దానాల నుండి వెనక్కి వెళ్ళడానికి ప్రధాన శ్రేణి శక్తులు చేసే అరిగిపోయిన వాదనలను అనుమతించకూడదు. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విశిష్ట ఆర్థికవేత్త ప్రొఫెసర్ జేమ్స్ కె గాల్‌బ్రైత్ మాట్లాడుతూ, ‘విద్యా, రాజకీయ, మీడియా గుత్తాధిపత్యాన్ని’ అట్టి పెట్టుకోవడానికి ప్రధాన స్రవంతి తరగతి తీవ్రంగా పోరాడుతోందనీ, తాజా ఆర్థిక ఆలోచనలు పెరగడాన్ని అది ఏమాత్రం అనుమతించదనీ చెప్పారు. భారతదేశంలోనూ అలా జరగడం మనం చూస్తున్నాం. 1970లు, 1980ల ప్రారంభంలో శిక్షణ పొందిన నేటి ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు చాలా మంది, ముందే నిర్ధారించుకున్న ఆలోచనలు, సిద్ధాంతాలతో వస్తారు అని కూడా గాల్‌బ్రైత్ అన్నారు. ఆయన ప్రకారం, ‘‘ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు బహుశా వారి ప్రధాన నమ్మ కాలను పునఃపరిశీలించుకోవాలి. లేదా బహుశా మనకు కొత్త ‘ప్రధాన స్రవంతి’ అవసరం కావచ్చు.’’ దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
మద్దతు పెరగాల్సిన రంగం
రబీ పంటల పెంపు ధరలు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే కనీస మద్దతు ధరలో పెంపుదల, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి 14 శాతానికి మాత్రమే పెరిగింది. 86 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవలసి వస్తోంది. పైగా, కనీస మద్దతు ధరలో పెంపుదల ఇంకా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉంటోంది. అందుకే ధరలకు సంబంధించి వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. 2018లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఒక ఎపిసోడ్లో, నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక చిన్న రైతు తన దుఃస్థితి గురించి చెప్పినప్పుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తానే నమ్మలేక పోయారు. వ్యవసాయం ద్వారా ఎంత సంపాదిస్తున్నారని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆ రైతు, ‘‘సంవత్సరానికి రూ. 60,000 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. దానిలో సగం డబ్బు విత్తనాలు కొనడానికే పోతోంది. నేను నా కుటుంబానికి రాత్రి భోజనం మాత్రమే అందించగలుగుతున్నాను’’ అని బదులిచ్చారు. ఆ రైతు సమాధానం విని అమితాబ్ నివ్వెరపోయారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దేశ రైతులను ఆదుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అప్పటి నుండి గ్రామీణ మహారాష్ట్రలో నిరాశ మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 1,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ సగటున రోజుకు ఏడుగురు రైతులు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో యాభై శాతం పత్తి పండించే ప్రాంతంలోనే నమోదయ్యాయి. రైతులకు జాక్‌పాటేనా? శీతాకాలపు పంటల కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ల్లో ఇటీవలి పెంపుపై మీడియాలో వస్తున్న వార్తల్లోని ఉత్సాహం నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేసింది. ఇది రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఇది కష్టాల్లో ఉన్న రైతులకు ఏదైనా సహాయం అందజేస్తుందా అనేది ప్రశ్న. ధరల పెంపుదల పెరుగు తున్న నిరాశను ఆశాజనకంగా మార్చే అవకాశమైతే కనిపించడం లేదు. ముందుగా, ప్రకటించిన కనీస మద్దతు ధర పెరుగుదల పరిమాణాన్ని చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగా 2024 లోక్‌సభ ఎన్నికల సమయా నికి రబీ పంటల కోతలు జరగనున్నాయి. రబీ పంటల ధరల పెంపు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే, కనీస మద్దతు ధరలో పెంపుదల అనేది, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా, రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అంటూ చేస్తున్న వర్ణన వాస్తవానికి క్షేత్ర వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం పైనే ఆధారపడి ఉంది. ప్రతి పంట సీజన్లోనూ, ప్రభుత్వానికి ధరలను సిఫార్సు చేసే ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ (సీఏసీపీ– వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్)... ఉత్పత్తి ధరల సూచిలో వచ్చే మార్పుల శాతాన్ని, గణనలను కూడా అందజేస్తుంది. 2022–23తో పోలిస్తే, ఈ ఏడాది మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.9 శాతం పెరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండగా, కనీస మద్దతు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా లేదు. ఇది రైతులు హర్షించడానికి కారణం కాదు. ఒక సంవత్సరం క్రితం, ఇది మరింత దారుణంగా ఉండేది. మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.5 శాతం పెరుగుదలకు ప్రతిగా, గోధుమ కనీస మద్దతు ధర కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. యాదృచ్ఛికంగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ. 150 పెరగడంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,275కి చేరుకుంది. 2006–07, 2007–08 తర్వాత, దేశీయ ఉత్పత్తిదారులకు ధరలను పెంచడం మినహా యూపీఏ ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిన తర్వాత, ఇది గోధుమ ధరలో అత్యధిక పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల సంవత్సరాల్లోనే! రైతుల నుండి నేరుగా గోధుమలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలనే లోపభూయిష్ట నిర్ణయం జరిగిన తర్వాత, ఇది ప్రభుత్వ నిల్వల్లో భారీ అంతరానికి కారణ మైంది. ఆ కొరతను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రెట్టింపు ధరలకు (స్వదేశీ రైతులకు ఇచ్చే) గోధుమలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుండి వచ్చిన విమర్శల తరువాత, ముఖ్యంగా ధర సమానత్వం తీసుకురావడానికి, గోధుమ లకు కనీస మద్దతు ధరను పెంచారు. ఈ ఏడాది ధరలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లోని ప్రధాన రబీ పంటలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసు కుంటే, ధరల పెరుగుదల ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. గోధుమలు అత్యంత ముఖ్యమైన రబీ పంట. బార్లీ(యవలు), పెసర, రేప్‌సీడ్–ఆవాలు, పప్పు (మసూర్)... ఇతర శీతాకాలపు పంటలు కావడంతో, ధరల పెరుగుదల కచ్చితంగా రాజకీయ కోణాన్ని కలిగి ఉంది. ఆర్థికవేత్తలు సుఖ్‌పాల్ సింగ్, శ్రుతి భోగల్ 2004, 2009, 2014, 2019కి ముందు సంవత్సరాల్లో గోధుమలు, వరి కనీస మద్దతు ధర ఎంత ఎక్కువగా ఉందనే అంశాన్ని 2021 జనవరిలో స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు. 2023–24 రబీ ధరల పెంపు కూడా ఇదే తరహాలో ఉంది. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులకు సాపేక్షంగా అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించారు. దీనివల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాలను పొందివుండొచ్చు. కానీ భవిష్యత్తులో పంటల ధరలను రాజకీయాలు నిర్ణయించకుండా దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది. స్వామినాథన్ ఫార్ములా అమలు కావాలి వ్యవసాయం దానధర్మం కాదు. పంటల ధరలను రాజకీయ నాయకత్వం ఇష్టారాజ్యానికి వదిలేయలేం. వ్యవసాయానికి నిర్మా ణాత్మక సంస్కరణలు అవసరం. ఎన్నికలు జరిగిన సంవత్సరంతో నిమిత్తం లేకుండా, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం, ‘వెయిటెడ్ యావరేజ్’కు 50 శాతం లాభం కలిపి రూపొందించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందేలా ఈ సంస్కరణలు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి దాదాపు 14 శాతానికి మాత్రమే పెరిగింది. దీనివల్ల అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, కనీస మద్దతు ధర పెంపు ఇంకా చాలావరకూ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంది. మార్కెట్లు మిగిలిన 86 శాతం మంది రైతులకు నష్టాలతో కూడిన ధరలు చెల్లించడం వల్ల వ్యవసాయ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. రుణభారం, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. అంతేకాకుండా, రైతులకు సరైన ఆదాయాన్ని శాశ్వతంగా నిరాక రించిన స్థూల ఆర్థిక విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ లేదా మైనస్ 2 శాతం) బ్రాకెట్లో ఉంచడం వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వినియోగదారుల ధరల సూచిక బుట్టలో ఆహారం, పానీయాల వాటా 45.9 శాతం ఉన్న ప్పటికీ, విధాన రూపకర్తలు అతిపెద్ద ద్రవ్యోల్బణ చోదకశక్తిగా ఉన్న గృహనిర్మాణంపై మాత్రం కళ్ళు మూసుకున్నారు. గృహనిర్మాణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తుండగా, కనీస మద్దతు ధరలో ఏదైనా పెంపు దలను మాత్రం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని నిందిస్తుంటారు. ఇది మారాల్సి ఉంది. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
Fact Check: దగాకోరు.. దబాయింపు!
సాక్షి, అమరావతి: ►కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా రైతులకు మార్కెట్లోనే అధిక ధరలు లభిస్తున్నప్పుడు ఎవరైనా ఎమ్మెస్పీకి అమ్ముకుంటారా? లేక అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారా? మరి మన రాష్ట్ర రైతులు బహిరంగ మార్కెట్లో మంచి ధరలకు అమ్ముకుంటే ఇందులో తప్పు ఏమైనా ఉందా? ►కనీస మద్దతు ధర కన్నా అధిక రేట్లకు రైతులు పంట అమ్ముకుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నట్లా లేక బాగోలేనట్లా? ►మన దగ్గర పండే ధాన్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా మిగతాది సొంత అవసరాలు పోనూ బయట మంచి ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ఎక్కడ విక్రయిస్తేనేం? అన్నదాతకు మంది ధర దక్కితే సంతోషించాలి కదా? గతంలో ఏ గ్రేడ్, సాధారణ రకాలుగా విభజించి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం రంగుమారినా, తడిచినా వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటోంది. రైతుల సంఖ్య చూసినా, కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు గమనించినా ఇప్పుడెంతో మెరుగ్గా ఉంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతుల సంఖ్య రెట్టింపైందని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇదంతా దగాకోరులకు రుచించడం లేదు. రైతులంటే గిట్టని చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తే తమకు పుట్టగతులుండవనే భయంతో పక్క రాష్ట్రంతో పోలుస్తూ పొంతన లేని రాతలతో విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా ‘ధాన్యం రైతుకు దగా’ అంటూ వక్రీకరణలతో ఈనాడులో అవాస్తవాలను వడ్డించారు. ఒక్కో రైతు 34.42 టన్నులు విక్రయించారా? టీడీపీ హయాంలో ధాన్యం సేకరణ దళారుల దందాగా సాగింది. 2014–15లో గత ప్రభుత్వం రెండు సీజన్లలో (ఖరీఫ్, రబీ) 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. అంటే సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యమేనా? అంటే రైతుల పేరిట దళారులు గత ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ ఇదే సీన్ రిపీట్.ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పటిష్టంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 2022–23లో ఒక్క ఖరీఫ్ సీజన్లోనే మొత్తం 6.39 లక్షల మంది రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు తెలంగాణలో అత్యధికంగా ఎంటీయూ 1010, 1001 రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. వాటికి బహిరంగ మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత రబీలో తొలిసారిగా ఐదు లక్షల టన్నుల జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఫలితంగా దొడ్డు బియ్యానికి మార్కెట్లో రేటు పెరిగింది. వ్యాపారులు పొలాల్లోనే ఎగబడి కొనడంతో రైతులకు మేలు జరిగింది. రైతుల సంఖ్య రెట్టింపు టీడీపీ హయాంలో ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్లు విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే 32.78 లక్షల మంది రైతుల నుంచి రూ.58,766 కోట్లు విలువైన 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరి ఎవరి హయాంలో రైతులకు అన్యాయం చేశారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు అంటే రైతులకు నరక యాతనే. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో గుర్తించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిందే. సరైన యంత్రాలు లేక నాణ్యత నిర్ధారణలోనూ రైతులు మోసపోయేవారు. ఇప్పుడు ఆర్బీకేల రాకతో రైతు దగ్గరకే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి ధాన్యం శాంపిళ్లు తీసుకుంటున్నారు. రైతు ఎదురుగానే వివరాలు నమోదు చేసి రశీదు ఇస్తున్నారు. గతంలో ఎక్కడో మండల కేంద్రాల్లో అరకొర వసతుల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. ఇప్పుడు రైతు ఊరిలోనే.. ఆర్బీకే పరిధిలో.. పొలం గట్టు వద్దే ధాన్యాన్ని కొని మిల్లుకు తరలిస్తున్నారు. రూ.960 కోట్లు బకాయి పెట్టిన బాబు చంద్రబాబు హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ సర్కారు దిగిపోతూ అన్నదాతలకు రూ.960 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టింది. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత రబీ సీజన్లో రూ.2,884 కోట్లకుగాను రూ.2,595 కోట్లను నిర్ణీత గడువులోగా 90 శాతం చెల్లించేశారు. మిగిలిన చిన్న మొత్తాల చెల్లింపుల్లో జాప్యానికి కారణం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఆలస్యంగా జరగడమే. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తోంది. జీఎల్టీ కింద రైతన్నకు టన్నుకు రూ.2,523 గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లోడు తరలించాలంటే రైతులపై ఆర్ధిక భారం పడేది. ధాన్యం సొమ్ములు నెలల తరబడి అందకపోవడంతో బయట అప్పులు చేయాల్సి వచ్చేది. గోనె సంచుల సేకరణను గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గోనె సంచులను సమకూరుస్తున్నాయి. ధాన్యం లోడును ప్రభుత్వమే ఎగుమతి చేస్తూ మిల్లులకు తరలిస్తోంది. ఒకవేళ రైతుకు సొంత వాహనం ఉండి సంచులు, హమాలీలను సమకూర్చుకుంటే ఆ ఖర్చులను కూడా మద్దతు ధరతో కలిపి నిర్ణీత 21 రోజుల కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా క్వింటాల్‌కు అదనంగా రూ.252 రైతులకు లభిస్తోంది. టన్ను గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలీ రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ కింద టన్నుకు రూ.2,523 ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోలిస్తే అధికంగా ఉండటం విశేషం. -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇది కూడా చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన -
టమాటా రైతుకు దిగుల్లేదిక..
సాక్షి, అమరావతి: టమాటా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 20 టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో నాలుగు యూనిట్లు ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా రాయలసీమ జిల్లాల పరిధిలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి. ఏటా 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు ఆ జిల్లాల నుంచే వస్తోంది. మూడున్నరేళ్లుగా టమాటా రైతుకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని, వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో పాటు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రాజెక్టు కింద రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో 4 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన యూనిట్లను మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్‌ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేయనున్నారు. సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్.. ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించే అవకాశం కలుగనుంది. ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను (ఎఫ్‌పీవో – ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనుసంధానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లీఫ్ అనే కంపెనీతో ఒప్పందం జరిగింది. సాధారణంగా రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మగా వచ్చే ఆదాయంలో రవాణా, కమీషన్ చార్జీల రూపంలో 10–20 శాతం కోల్పోతుంటారు. ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. వీటన్నింటి వల్ల మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా వస్తుంది. దళారుల చేతిలో నష్టపోకుండా అధిక లాభాలను ఆర్జించగలుగుతారు. వీటి నిర్వహణా బాధ్యతలను రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు అప్పగిస్తున్నారు. వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ.. మార్కెటింగ్ బాధ్యతలను లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ నిర్వహించనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం ఒక్కో యూనిట్‌ను ఒక్కో ఎఫ్‌పీవోకు అప్పగించనుండగా, మొత్తంగా 20 వేల మంది టమాటా రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి దశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లితో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనంగుంటలలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 3,300 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇటీవలే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్నమండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వీ.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్‌పేట, చెల్దిగనిపల్లి యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దళారుల నుంచి ఉపశమనం ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దళారుల చేతిలో నష్టపోకుండా టమాటా రైతులు అధిక లాభాలు ఆర్జించే వీలు కలుగుతుంది. రవాణా, కమిషన్ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, తమకు గిట్టుబాటైన ధరకు నచ్చిన వారికి అమ్ముకోగలుగుతారు. పైగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటి నిర్వహణా బాధ్యతను కూడా రైతు సంఘాలకే ఇస్తున్నాం. వచ్చే లాభాలు సంఘాలే పొందనున్నాయి. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈఒ, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ -
టమాటా రైతుకు రానున్నది మంచికాలం
సాక్షి, అమరావతి: దళారుల ప్రమేయం లేకుండా టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూచైన్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సొసైటీ ద్వారా రూ.110 కోట్ల అంచనాతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి కాకాణి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రతినిధులు వచ్చేనెలలో 4 ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభం నాలుగు ప్రాసెసింగ్ కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీవోలకు) అప్పగిస్తామని తెలిపారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులకు ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్ చైన్ అభివృద్ధికి లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సహకరిస్తాయని తెలిపారు. సాధారణంగా డిమాండు, సప్లయ్‌కి అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు టమాటా రైతులు, మరికొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో రేట్లు పెరగడం వలన వినియోగదారులు నష్టపోతున్నారని చెప్పారు. ధర పతనమైనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు రైతుల నుంచి కొనుగోలుచేసి రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో డిమాండుకు మించి దిగుబడుల ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రాలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఎఫ్‌పీవోల పరిధిలోని 20 వేలమంది టమాటా రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ సీఈవో సీఎస్ రెడ్డి, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సీఈవో పి.విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఏటా ఇన్పుట్ సబ్సిడీ అందించడంతోపాటు, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలు కల్పించింది. ఆర్బీకేల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తోంది. మార్కెట్లో రైతు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్ ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతోంది. ధాన్యం కాకుండా ఈ మూడేళ్లలో ప్రభుత్వం 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో మార్కెఫెడ్ ద్వారా 3.76 లక్షల మంది రైతుల నుంచి రూ.5,023 కోట్ల విలువైన 16.34 లక్షల టన్నుల ఉత్పత్తులను సేకరించింది. ప్రధానంగా 2019–20 సీజన్లో 2.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 2,231 కోట్ల విలువైన 8.56 లక్షల టన్నులు, 2020–21 సీజన్లో 1.20 లక్షల మంది రైతుల నుంచి రూ.2,255 కోట్ల విలువైన 6.46 లక్షల టన్నులు సేకరించింది. 2022–23లో ఇప్పటివరకు 32 వేల మంది నుంచి రూ. 537 కోట్ల విలువైన 1.32 లక్షల టన్నుల విలువైన ఉత్పత్తులను సేకరించింది. గత సీజన్లో మాదిరిగానే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొక్కజొన్న, సజ్జలు, వేరుశనగ కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్‌లో వేరుశనగ 13.34 లక్షల ఎకరాల్లో సాగవగా, 4.87 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న 3.21లక్షల ఎకరాల్లో సాగవగా, 6.60 లక్షల టన్నులు, సజ్జలు 52 వేల ఎకరాల్లో సాగవగా, 50 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. మొక్కజొన్నకు టన్నుకు రూ.1,962, సజ్జలకు రూ.2,350, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో వీటి ధరలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. సజ్జలు మినహా మిగిలిన రెండింటి ధరలు ఎమ్మెస్పీకి దీటుగానే ఉన్నాయి. నాణ్యమైన (ఫైన్న్క్వాలిటీ) సజ్జలు, మొక్కజొన్నకు మార్కెట్లో టన్నుకు రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. వేరుశనగ రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు పలుకుతోంది. పంట చేతికొచ్చే సమయానికి ధరలు ఏమాత్రం తగ్గినా వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద జోక్యం చేసుకొని ధరలు పడిపోకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం మార్క్‌ఫెడ్ ద్వారా ఈ మూడు ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. 12వేల టన్నులు సజ్జలు, 66 వేల టన్నుల మొక్కజొన్న, 1.21 లక్షల టన్నుల వేరుశనగ కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టింది. -
Andhra Pradesh: రైతన్నకు ‘మద్దతు’
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇన్పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్‌షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది. సోషల్ ఆడిట్లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
పసుపు రైతుకు ఏపీ సర్కార్ బాసట
సాక్షి, అమరావతి: పసుపు రైతుకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం, పది రోజులుగా మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 60,812 ఎకరాల్లో పసుపు సాగు చేయగా 1,89,628 టన్నులు దిగుబడి వచ్చినట్టు అంచనా. గతేడాది మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,900కు పైగా ధర పలకగా, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ వరకు క్వింటాల్‌కు రూ.7,500 వరకు పైగా పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పంట రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి మన పంటకు డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు క్షీణించడం వంటి కారణాల వల్ల పసుపు ధర పతనమవుతూ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ప్రస్తుతం క్వాలిటీని బట్టి క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కనీసం 30 వేల టన్నుల కొనుగోలు లక్ష్యం ఈ–పంటలో నమోదు ప్రామాణికంగా కనీసం 30వేల టన్నుల పసుపు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఏ మేరకు నిల్వలు ఉన్నాయో అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది ద్వారా సర్వే చేపట్టింది. పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల వరకు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సీఎం యాప్ ద్వారా ఆధార్ ఆధారిత రైతు ఖాతాల్లో పంట సొమ్ము జమ చేస్తారు. సర్వే పూర్తి కాగానే సీఎం యాప్ ద్వారా జూన్ రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. ఆర్బీకేల ద్వారా జూలై 31వ తేదీ వరకు కొనుగోలు చేస్తారు. పంట సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్ వ్యవహరించనుండగా, జిల్లా జాయింట్ కలెక్టర్లు (రైతు భరోసా) నేతృత్వంలో జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగే కొనుగోలు ప్రక్రియలో డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీలు, ఎఫ్‌పీవోలు, స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వీరికి 2.5 శాతం కమిషన్ చెల్లించనున్నారు. తొందరపడి అమ్ముకోవద్దు 2019–20లో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ మంచి ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించేందుకు ఆర్బీకేల ద్వారా చేపట్టిన సర్వే పూర్తి కాగానే కొనుగోళ్లు చేపడతాం. మార్కెట్లో తిరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు తొందరపడి అమ్ముకోవద్దు. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
పత్తి సాగు.. తగ్గేదే లే...!
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామానికి చెందిన రైతు హుస్సేన్ ఎకరం పొలంలో పత్తి సాగు చేయగా 6 క్వింటాళ్ల దిగుబడివచ్చింది. విక్రయించేందుకు శుక్రవారం ఆదోని మార్కెట్ యార్డుకు పత్తి తీసుకొచ్చారు. ఫైన్ క్వాలిటీ కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడి క్వింటాల్ రూ.10,026 చొప్పున కొనుగోలు చేశారు. ఆరు క్వింటాళ్ల పత్తికి రూ.60,156 ఆదాయం వచ్చింది. పెట్టుబడి పోనూ నికరంగా రూ.35 వేలు మిగలడంతో హుస్సేన్ ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని సంతోషంగా చెబుతున్నారు. సాక్షి, అమరావతి: ఎక్కడా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పసిడితో తెల్ల బంగారం పోటీపడుతోంది. గత రెండేళ్లుగా కనీస మద్దతు ధరకు నోచుకోని పత్తి ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న ఆదోని మార్కెట్‌యార్డుకు 688 మంది రైతులు 2,911 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా కనిష్టంగా రూ.7,290, గరిష్టంగా రూ.10,026 పలికి మోడల్ ధర రూ.8,650గా నమోదైంది. ఈ సీజన్లో దక్షిణాదిలో పత్తి మార్కెట్ యార్డుల్లో ఇదే అత్యధిక ధర. ఇదే ఊపు కొనసాగితే సంక్రాంతిలోగా రూ.11 వేల మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే తగ్గిన విస్తీర్ణం.. గత ఖరీఫ్‌లో 13.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 16.55 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6,025, మధ్యస్థ పత్తి రూ.5,726 చొప్పున నిర్ణయించారు. కనీస మద్దతు ధర లభించకపోవడంతో 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా పత్తి కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయగా సీజన్ ప్రారంభం నుంచి పత్తి ధర తారాజువ్వలా దూసుకెళ్తోంది. ప్రారంభంలోనే క్వింటాల్ రూ.6,100 పలికిన పత్తి ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. పత్తి రైతుకు సత్కారం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని పత్తి యార్డుకు వస్తున్న పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదోని మార్కెట్ ద్వారా 4.20 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన పత్తికి మంచి ధర పలుకుతోంది. తాజాగా ఇక్కడ అత్యధిక ధర పొందిన రైతు హుస్సేన్‌ను మార్కెట్ యార్డు కార్యదర్శి బి.శ్రీకాంత్‌రెడ్డి సత్కరించారు. లాట్‌కు 30 మంది పోటీ నాణ్యమైన పత్తి కొనుగోలు కోసం వ్యాపారుల మధ్య పోటీ అనూహ్యంగా పెరిగింది. లాట్‌కు 30 మంది వరకు పోటీపడుతున్నారు. సంక్రాంతి లోగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా -
రైతులకు డీజిల్‌పై రాయితీ పెంచండి
సాక్షి, అమరావతి: సాగు వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్‌పై అధిక రాయితీలు, జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) వంటి వాటితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసేలా రాబోయే బడ్జెట్ (వ్యవసాయ) ఉండాలని, నిధుల కేటాయింపును కనీసం 25 శాతమైనా పెంచాలని పలువురు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి ప్రారంభమైన ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా.. గడచిన 48 గంటల్లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాల్లో తమ సలహాలను, సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులకు ఇచ్చే రుణాలను కనీసం 25 శాతం పెంచాలని కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి. చెంగల్ రెడ్డి సూచించారు.ఇక్రిశాట్, ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. పంట ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘానికి వాస్తవిక ఖర్చుల ఆధారంగా ఎంఎస్పీ నిర్ధారించేందుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చేనేత రంగ నిపుణుడు డాక్టర్ డి.నరసింహారెడ్డి, రైతు నాయకుడు వై.శివాజీ సలహాలిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంఎస్పీ నిర్ణాయక విధానాన్ని సమూలంగా మార్చాలని కోరారు. దేశ ఆహారభద్రతకు భరోసా ఇచ్చిన హరిత విప్లవ రాష్ట్రాలు భారతీయ పౌష్టికాహార భద్రతా రాష్ట్రాలుగా మారేందుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు. రాష్ట్రాలు ఈ ఖర్చును భరించే దశలో లేవని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్‌కు ఒక్కో రైతుకు 5 వేల లీటర్ల వరకు డీజిల్‌ను అనుమతించడంతో పాటు భారీ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. క్రిమిసంహారక మందులపై పన్నులు తగ్గించాలని సలహా ఇచ్చారు. ఎంఎస్పీపై కమిటీలో ఏపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించే కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉండడంతో పాటు సుమారు 28 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, చేపట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఆ కమిటీలో సభ్యత్వానికి తమకు అర్హత ఉందని విజ్ఞప్తి చేశారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ