వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను.
ఐసీఆర్‌ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్‌పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్‌పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్‌పీ పరిధిలోకి రావు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్‌పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్‌నే తలకిందులు చేసేది.
అయితే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్‌పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది!
ఎంఎస్‌పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు.
మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్‌పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్‌పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు.
ఎంఎస్‌పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు.
అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్‌పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి.
హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది.
ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్‌లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు.
ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు.
చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్‌పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment