మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం | Sakshi Guest Column On Europe Farmers Protest | Sakshi
Sakshi News home page

మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం

Published Tue, Feb 6 2024 12:28 AM | Last Updated on Tue, Feb 6 2024 12:28 AM

Sakshi Guest Column On Europe Farmers Protest

యూరప్‌లో రైతుల నిరసన ప్రదర్శన

యూరప్‌లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్‌ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. 

ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్‌లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్‌ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్‌ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్‌ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు.

యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ పార్లమెంట్‌లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు.

కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్‌ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్‌ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు.

వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్‌ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్‌ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్‌ రైతు వ్యాఖ్యానించాడు.

ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్‌ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్‌ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది.

ఈ పరిస్థితి యూరప్‌కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది.

భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్‌ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది.

‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్‌ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్‌ ప్రధాని గాబ్రియేల్‌ అటల్‌ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్‌ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్‌ను యూరోపియన్‌ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం.

వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్‌ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి.

వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన.

రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్‌ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్‌ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్‌ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది.

భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్‌ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం.

హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో  రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది.

దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement