విశ్లేషణ
భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఉన్న ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం – కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాన్ని తేవడమే! చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్‌లను దెబ్బతీస్తుందనీ ఆర్థికవేత్తలు భావిస్తుంటారు. అదే కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం వీళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం వ్యవసాయ రంగం ఎదురుచూస్తున్న పెద్ద సంస్కరణ.
ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని పెన్షన్ సంస్కరణ అన్నారు. దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి గర్విస్తున్నామని కూడా అన్నారు.
చివరిగా ఉద్యోగి పొందిన వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌కు హామీ ఇచ్చే యూపీఎస్, వాస్తవానికి మునుపటి మార్కెట్ అనుసంధానిత నూతన పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) ప్రభుత్వ ఉద్యోగు లకు మేలు చేయలేదని అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్ధారిత ప్రయోజనపు’ హామీ ఇవ్వడం కోసం, వాళ్లు మార్కెట్ల దౌర్జ న్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిమండలి పెన్షన్ పథకాన్ని సవరించింది.
ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో దేశంలోని రైతులను ప్రశంసించినప్పటికీ తమ పంటలకు హామీ ధరలు ఉండాలని దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఉద్యోగు లకు భరోసా పెన్షన్ అవసరమైనప్పుడు, రైతులకు కూడా భరోసా ధర అవసరమే.
ప్రపంచంలో ఎక్కడా మార్కెట్లు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడం లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సబ్సిడీ ఆదాయ అంత రాన్ని భర్తీ చేస్తుంది. వ్యవసాయ రాయితీలను అందించడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మాత్రం వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసింది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా, భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు.
శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం, వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి హామీ ఇచ్చే చట్టం మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తుందని ఎన్డీయే ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచిత్రమేమిటంటే, రైతుల విషయానికి వచ్చేసరికి, విధాన నిర్ణేతలు మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయన్న పల్లవిని ఎత్తు కుంటారు. అదే ఉద్యోగుల విషయంలో అంతా బానేవుంటుంది. మార్కెట్ల అస్తవ్యస్త భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.
చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్‌లను దెబ్బతీస్తుందనీ ప్రధాన ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు; వాస్తవంలో, ఇది కార్పొ రేట్ల లాభాలను పిండేస్తుంది కాబట్టే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే స్వేచ్ఛా మార్కెట్ ప్రబోధక ఆర్థికవేత్తలు అమెరికాలోని కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. ఇదీ నిజానికి ధరలను వక్రీకరించడం.
అందుకే ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్‌తో సహా 38 రాష్ట్రాలు ఈ ధరల పెరుగుదలను నిషేధించే చట్టాలను తెచ్చాయి. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్ల ధరలను 400 శాతం మేరకు పెంచిన కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చాలామంది మార్కెట్ సమర్థక ఆర్థిక వేత్తలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్కెట్ వక్రీకరణలపై జరిగే ఇటువంటి తనిఖీలను సోవియట్ శైలి ధరల నియంత్రణగా పేర్కొంటున్నారు.
రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన సమయంలో మార్కెట్‌కు అనుకూలమైన పక్షపాత దృష్టి పెరుగుతుంది. కానీ కార్పొరేట్లు విని యోగదారుల రక్తమాంసాలను పీల్చివేయడం కోసం ధరలను పెంచి నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరు. మార్కెట్ వక్రీకరణ అనే ఈ ద్వంద్వ ప్రమాణం రైతులకు జీవన ఆదాయాన్ని అందించే మార్గంలో అడ్డుగా నిలుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మార్కెట్లు రైతుల హామీ ధరలకు అనుగుణంగా వాటికవే సర్దుబాటు చేసుకుంటాయి. కేవలం భావజాలమే దీనికి అడ్డు నిలుస్తోంది.
మహమ్మారి తర్వాత ఆహారం, కిరాణా వస్తువుల ధరలు 53 శాతం పెరగడానికి కారణమైన కార్పొరేట్ ధరల పెరుగుదలపై నిషేధం విధించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. రిపబ్లికన్లు ఆమె వైఖరిని ‘కమ్యూనిస్ట్’ అన్నారు. మితవాద పక్షం ఏదైనా చెప్పనీ... కొందరు ఆర్థికవేత్తలు అంగీకరించినట్లుగా, ధరల పెరుగుదలపై నిషేధం అనేది మంచి ఆర్థిక శాస్త్రం, మంచి రాజకీయం అనే అభిప్రాయాన్ని ఎవరూ తిరస్కరించడం లేదు. ఈ సందర్భంగానే, ఆహార పదార్థాల ధరలను కృత్రిమంగా ఎక్కువగా ఉంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ హామీ ఇచ్చారు.
ఉద్యోగుల పెన్షన్ విషయానికి తిరిగి వస్తే, కేంద్ర వ్యయ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఆసక్తికరం. ఇది ‘ఆర్థికంగా వివేకవంతమైన’ నిర్ణయమనీ, ‘ఇది భవిష్యత్ తరాల పౌరులకు ఆర్థిక కష్టాలను నివారిస్తుం’దనీ పేర్కొంది. ఉద్యోగు లకు ఇస్తున్న హామీ పెన్ష¯Œ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించగలుగుతున్నప్పుడు, రైతులకు ఆర్థిక భద్రత కల్పించలేకపోవడానికి కారణం ఏదీ లేదు. ఎందుకంటే రైతులు కూడా దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్నారు. వారి నిర్విరామ కృషి వల్లే దేశానికి ఆహార భద్రత ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన కమలేశ్ పాటీదార్ అనే రైతు తన పదెకరాల్లోని సోయాబీన్ పంటను దున్నివేసినప్పుడు, అది ఒక గొలుసుకట్ట చర్యను ప్రేరేపిస్తుందని అతను అనుకోలేదు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే, చాలా మంది రైతులు తమ పంటను దున్నేశారని వార్తలొచ్చాయి.
సోయాబీన్ ధరల పతనం... అది కూడా, కోత కాలానికి నెలన్నర ముందు ధరలు పడిపోవడం అనేది, రైతులు మంచి ధరను పొందే వరకు పంటను నిల్వ ఉంచుకోవాలని సూచించే మరొక ఆర్థిక నమ్మ కాన్ని పోగొట్టింది. తర్వాతైనా ఎక్కువ ధర వస్తుందనే ఆశతో కమలేష్ పాటీదార్ గత ఏడాది పండించిన పంటను అలాగే నిల్వ ఉంచు కున్నాడు. అది కూడా ఫలించలేదు.
సోయాబీన్ ధరలు పన్నెండేళ్ల క్రితపు స్థాయికి పడిపోవడంతో వ్యవసాయ జీవనోపాధి ధ్వంసమైన లక్షలాది మంది రైతులకు ఇది ఆగ్రహం కలిగించింది. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉన్న ధరలు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవు. భవిష్యత్ తరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రస్తుత రైతులకు కూడా ఆర్థిక కష్టాలను నివారించే భరోసా ధరల విధానం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను.
ఆ తర్వాత, టమోటా ధరలు 60 శాతం క్షీణించి, 25 కిలోల పెట్టెకు 300 రూపాయల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వార్తలొచ్చాయి. అనంతరం, బాస్మతి బియ్యం ధర క్వింటాల్‌కు 28 శాతం తగ్గి రూ. 2,500కు చేరుకుందని వార్తలొచ్చాయి. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగిన ప్రత్యేకమైన ఘటనలు కావు. ఇది దేశం ఏమాత్రం ఆందోళన చెందని బాధాకరమైన వార్షిక ధోరణిగా తయారైంది.
అమ్ముకోదగినంత మిగులు ఉన్న రైతులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతులను అందించడం అనేవి వ్యవసాయ రంగం ఎదురు చూస్తున్న పెద్ద సంస్కరణలుగా చెప్పాలి.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment