ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం | Sakshi Guest Column On farmers food security agriculture sector | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం

Published Wed, Jan 29 2025 12:25 AM | Last Updated on Wed, Jan 29 2025 12:25 AM

Sakshi Guest Column On farmers food security agriculture sector

విశ్లేషణ

ప్రస్తుత వేగంతో 2050 నాటికి ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించడమనే పెను సవాలును ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్గరగానూ, స్పష్టంగానూ వ్యవసాయ శాస్త్ర వేత్తలు, పరిశోధకులు తమ లేఖ ద్వారా  చేసిన హెచ్చరిక సకాలంలో వినిపించిన మేల్కొలుపులా కనపడుతోంది. ‘‘భవిష్యత్‌ ఆహార అవసరాలను తీర్చడానికి మనం సరైన మార్గంలో లేకపోగా, కనీసం దానికి సమీపంలో కూడా లేము’’ అని వారి లేఖ అప్రమత్తం చేసింది.

14వ దలైలామా, జోసెఫ్‌ స్టిగ్లిడ్జ్, కైలాస్‌ సత్యార్థి, రాబర్ట్‌ హుబెర్, డరోన్‌ అసెమోగ్లు, సర్‌ జాన్‌ ఇ వాకర్‌ వంటి నోబెల్‌ గ్రహీ తలు, డాక్టర్‌ గురుదేవ్‌ ఎస్‌ ఖుష్, పెర్‌ పిన్‌ స్ట్రప్‌ ఆండర్సన్, రట్టన్‌ లాల్, హాన్స్ ఆర్‌ హెర్రెన్‌ వంటి వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ గ్రహీతలు ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల నాయకులుగా మేము ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు హామీ నివ్వడానికి, ప్రపంచాన్ని మేల్కొలపటంలో, సామూహిక ఆకాంక్షలను పెంచడంలో మాతో చేరాలని, పరిశోధనాపరమైన పెద్ద ముందంజ వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆ లేఖ ముగుస్తుంది.

2050 నాటికి ప్రపంచం 980 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి పూనుకుంటున్న వేళ, దాదాపు 80 కోట్లమందిని ఆకలితో అలమటింపజేస్తున్న ఆహార కొరత అనేది ఉత్పత్తి పడిపోవడం వల్లనే ఏర్పడలేదు. ఆహార కొరత కేవలం తప్పుడు విధానాల ఫలితమేనని అందరూ గ్రహించాలి. 

‘హంగర్స్‌ టిప్పింగ్‌ పాయింట్‌’ అనే శీర్షికతో కూడిన ఆ లేఖ... ‘వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న సాధారణమైన తీవ్ర వాతావరణ ఘటనల’ గురించి ఈ శతాబ్ది మధ్యనాటికి ఆహార, పోషకాహార సంక్షోభం మరింత తీవ్రమవడం గురించి మాట్లాడుతుంది. ఇక ఆ లేఖలోనే సరిగ్గానే వేర్కొన్నట్లుగా.. నేలకోత, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, సంఘర్షణలు వంటి అదనపు అంశాలు ఆహార ఉత్పాదకతను తగ్గిస్తాయి.

ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఆఫ్రికాకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న గురించి ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో ఆహార దిగుబడి తగ్గుతుందనే అంచనాల వల్ల ఆ పంటకు నిజంగానే ముప్పు పొంచి ఉంది. అయితే చేతులు కలిపి సహకరించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం గ్రహించేవరకు, ఆహార, పోషకాహార భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఆఫ్రికా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 44 శాతం ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. 

అలాగే, న్యూ సైంటిస్టు జర్నల్‌ (2022 మార్చి 14) లోని ఒక నివేదిక ప్రకారం, 9 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఇథనాల్‌ కోసం మళ్లించారు. ఇక యూరో పియన్‌ యూనియన్‌ గోధుమలు, మొక్కజొన్నతో సహా కోటి 20 లక్షల టన్నులను ఆటోమొబైల్స్‌ కోసం ఆహారంగా ఉపయోగిస్తోంది. ఇంకా, 35 లక్షల టన్నుల పామాయిల్‌ను ఈయూ డీజిల్‌ ఉత్పత్తి కోసం మళ్లించింది.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార సరఫరాలు దెబ్బతిన్నప్పుడు ఇదంతా జరిగింది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లలో జీవ ఇంధన ఉత్పత్తిలో కేవలం 50 శాతం తగ్గించినట్లయితే, అలా ఆదా చేసిన ధాన్యం... యుద్ధం వల్ల ఏర్పడిన మొత్తం ఆహార కొరతను తీర్చగలదు. 

గోధుమ, వరి వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడం, ప్రధాన తృణ ధాన్యాలలో జీవసంబంధమైన నత్రజనిని స్థిరీకరించడం, వార్షిక పంటలను శాశ్వత పంటలుగా మార్చడం, పంటల వ్యవస్థను వైవిధ్యీకరించడం, సూక్ష్మజీవులు – శిలీంధ్రాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సృష్టించటం వంటి అవసరమైన పరివర్తనా ప్రయత్నాలను చేపట్టాలని ఈ లేఖ కోరుతోంది. ‘‘బిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఉత్పాదక, సురక్షితమైన జీవితాలను కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తృతంంగా రాబడిని ప్రవహింపజేస్తుంది’’ అని అంగీకరించాలని ఆ లేఖ పేర్కొంది.

వ్యవసాయ పరిశోధనలో పెట్టే పెట్టుబడి బహుళ రాబడిని కలిగిస్తుందని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ‘‘భవి ష్యత్తులో విజయవంతమైన ఆహార వ్యవస్థను నడిపించే ఆవిష్క రణకు పునాదిగా సమాజం స్పాన్సర్‌ చేసిన పరిశోధన ఉండాలని’’ కూడా నివేదిక పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ప్రాయోజిత పరిశోధనకు ప్రాధాన్యం ఉందా, లేక ప్రైవేట్‌ పరిశోధనల ఆధిపత్యంపై ప్రాధాన్యం ఉందా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. 

ప్రజలకు ఆరోగ్యకరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్థిరమైన ఆహారాన్ని అందించడంలో బహుళ మార్కెట్‌ వైఫల్యాల గురించి ఈ లేఖ మాట్లాడుతుంది. అయితే ఇంకా అతి పెద్ద ఉపద్రవం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిచోటా వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో మార్కెట్ల వైఫల్యం!

నా అవగాహన ప్రకారం, స్థిరమైన వ్యవసాయ జీవనోపాధికి హామీ ఇచ్చేందుకు కఠినమైన ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రతకు సంబంధించి సవాళ్లను ఎదుర్కో వడం కష్టం కావచ్చు. ఉదాహరణకు, 2024 సెప్టెంబర్‌లో ముగిసిన చివరి ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌ కోసం అమెరికా వ్యవసాయ బిల్లు రైతులకు, వ్యవసాయానికి 1.8 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది. 

అయినప్పటికీ ఈ సంవత్సరం ఐదుగురు రైతుల్లో ఒకరు వ్యవసాయం మానేస్తారని అమెరికా అంచనా వేస్తోంది. నిజానికి, సరకుల ధరలు తక్కువగా ఉండడం, అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని పూడ్చడానికి 10 బిలియన్‌ డాలర్ల తక్షణ సాయం వాగ్దానం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామం జరగబోతోంది. కొత్త వ్యవసాయ బిల్లు–2024 ఆమోదం కోసం వేచి ఉంది.

గత సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 24 దేశాల్లో రైతుల నిరసన తర్వాత యూరోపియన్‌ యూనియన్‌లో హామీ ఇచ్చిన వ్యవసాయ ఆదాయం ఒక సాధారణ సూత్రంగా ముందుకొచ్చింది. పక్షం రోజుల క్రితం ఫ్రాన్స్‌లోని చిన్న రైతుల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్‌ పేజన్, వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆహార సరఫరా గొలుసుకు చెందిన సర్దుబాటు అస్థిరతగా వదిలివేయ కూడ దని పిలుపునిచ్చింది. రైతులకు హాని కలిగించే విధంగా దిగువ స్థాయి అదనపు మార్జిన్లను సమాఖ్య ఖండించింది. దీని అర్థం ఏమిటంటే ఆహార గొలుసులోని అన్ని ఇతర వాటాదారులు భారీ లాభాలతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ, రైతు మాత్రం దాని అంచుల వద్దే మనుగడ సాగించాల్సి వస్తుంది.

భారత్‌లో, పంజాబ్‌–హరియాణా సరిహద్దులో 11 నెలలకు పైగా జరుగుతున్న రైతుల నిరసన నేపథ్యంలో గమనిస్తే, 14 ఖరీఫ్‌ పంటలలో ఏడింటి మార్కెట్‌ ధరలు కనీస మద్దతు ధర కంటే 12 నుండి 26 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరాలుగా, వ్యవసాయ ఆదాయాలు స్తబ్ధుగా ఉంటున్నాయి లేదా కిందికి పడిపోతున్నాయి. నిజం చెప్పాలంటే, 2050లో 150 కోట్ల మంది అదనపు ప్రజలకు ఆహారమివ్వడం కచ్చితంగా సాధ్యమే. కానీ వ్యవసాయాన్ని ఆచరణీ యమైనదిగా, లాభదాయకమైనదిగా మార్చే కార్యాచరణ విధానం కీలకం. అప్పుడే అది సాధ్యం. 

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement