
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిరసన ప్రదర్శన
అభిప్రాయం
నేడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో వున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిపత్య, సామ్రాజ్య వాద చర్యలకు గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ ఎంతో స్వేచ్ఛను అనుభవించిన విషయం ఆయన జీవన గాథల్లో వ్యక్తం అవుతుంది. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో విద్యతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసినట్లు మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడ ప్రపంచంలోని ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, సాంకేతిక నిపుణులు తయా రయ్యారు. అనేక దేశాల్లో అత్యున్నతంగా చదువుకున్న మేధావులు పెక్కుమంది ఇక్కడ తమ జ్ఞానానికి పదును పెట్టుకున్నారు.
ట్రంప్ వర్సెస్ హార్వర్డ్
ట్రంప్ ఆదేశాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలెన్ ఎం. గార్బర్ ధిక్కరించడం పట్ల సామాజిక, రాజకీయ మేధావి వర్గం సానుకూలంగా స్పందించింది. ‘‘హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కు లను వదులుకోబోదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే విశ్వవిద్యాల యాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి.
ఏ సిబ్బందిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు జరపాలి అనే విషయా లను ఆదేశించజాలదు’’ అని గార్బర్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యా లయ వ్యవహారాల నిర్వహణలో పాలకుల జోక్యానికి ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఉంటారు? ఈ ధరిత్రిపై తన కంటే శక్తిమంతుడు మరొకరు లేరని విశ్వసిస్తున్న ట్రంప్ ఆదేశాలను గార్బర్ ధిక్కరించారు.
అందుకు ఆగ్రహించిన ట్రంప్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధుల విడుదలను నిలిపివేశారు. అయినప్పటికీ శ్వేత సౌధ ఆదేశాలను పాటించేందుకు హార్వర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
గత నెలలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలంబియాకు కూడా 400 మిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన షరతులకు కొలంబియా సమ్మతించింది. నిజానికి విశ్వవిద్యాలయాల అధిప తులు సామ్రాజ్యాధిపతుల కంటే గొప్పవారు. వారు ఎంతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంటేనే ప్రపంచం నడుస్తుంది. అమెరికా నేడు అనేక విషయాల్లో ప్రపంచంలో ముందు ఉందంటే అందులో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో ఉంది.
నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యాన్ని ప్రవచించిన, స్టాలిన్ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ప్రవచించిన జాన్ డ్యూయీ వంటి ఎందరో మేధావులు ఆవిర్భవించిన కొలంబియా విశ్వవిద్యాలయం నేడు ఆంక్షలను ఎదుర్కోవడం బాధాకరమైన విషయం. ‘‘ప్రజాస్వామికం అనే భావాన్నీ, ప్రజాస్వామికం అర్థాన్నీ మనం ఎప్పటికప్పుడు కొత్తగా తరచి చూసుకుంటూ వుండాలి.
రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంస్థలను కూడా దీనికి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రజాస్వా మికం నిత్యనూతనం అయి, ప్రజల అవసరాలతోపాటు మారుతూ వచ్చినపుడే అది ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేదీ, ప్రజలకు సహాయం చెయ్యగలిగేదీ అవుతుంది. ఈనాటి మార్పులనూ, రాబోయే మార్పులనూ తెలుసుకోటానికి అది ముందుకు నడవాలి. అది కదలకుండా నిలబడటం ఆత్మహత్య చేసుకోవటమే అవుతుంది’’ అని హెచ్చరించారు జాన్ డ్యూయీ. ఆయన విద్యకు ప్రధానమైన పాత్రను ఇచ్చారు. విద్య అంటే జ్ఞాన జ్యోతి, విద్య అంటే విప్లవ సంకేతం, విద్య అంటే మానవాభ్యుదయానికి మార్గం.
భారతదేశ పరిస్థితి
మన దేశంలో కూడా యూనివర్సిటీల మీద పెత్తనం అప్రజాస్వా మికంగా, లౌకిక భావజాలానికి భిన్నంగానే జరుగుతోంది. విశ్వ విద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపాన్నే మార్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. 2023 నాటికి మనకు 1,074 విశ్వవిద్యాల యాలున్నాయి. ఇందులో 128 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామ్యవాద, సామాజిక పరిణామవాద భావజాలం అభివృద్ధి చెందింది. జీవశాస్త్రం, పదార్థ శాస్త్రం, రసాయన శాస్త్రంలో ప్రపంచానికే జ్ఞానసంపత్తిని అందించ గల్గిన పరిశోధనలు వచ్చాయి.
దళిత బహుజన విద్యార్థులకు మెరు గైన స్కాలర్‌షిప్‌లు లభించాయి. దళిత బహుజన మైనారిటీల నుండి కూడా ఎంతో నూత్న జ్ఞానం ఆవిర్భవించింది. జేఎన్ యూ, ఢిల్లీ విశ్వ విద్యాలయం, జామియా మిలియా, ఏఎవ్‌ుయూ, జాదవపూర్, జమ్ము సెంట్రల్ వర్సిటీల్లో (వాటి అధ్యాపకులు, విద్యార్థులు) ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. జేఎన్‌యూలో ఇమ్మానుయేల్ కాంట్, హెగెల్, కారల్ మార్క్స్ గురించిన విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి.
సబాల్ట్రన్ స్టడీస్‌లో భాగంగా హిస్టరీలో అత్యంత విలువైన విషయాలను ముందుకు తెచ్చిన రొమిల్లా థాపర్ జేఎన్‌యూలో చరిత్ర బోధకురాలని మరువరాదు. కానీ నేడు దేశంలో మత గ్రంథాల్లోని పురాణ కథలను పాఠ్య గ్రంథాలుగా తెచ్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. భారతీయ విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువగా వుంది. ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత మేధావులు కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించడం ఆశ్చర్యాన్ని గొలుపుతోంది.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. భారతదేశంలో ఎక్కువ ధనం విద్యకే ఖర్చవుతోంది. అయినా ఉపాధి రంగాలు లేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతు న్నారు. ఇప్పుడు భారత పాలకులకు, రాష్ట్రాలను పాలించే ముఖ్య మంత్రులకు ఈ దేశంలో ఉన్న మానవ వనరులను, మానవ శక్తిని ఎలా సమన్వయించాలో తెలియక ఇతర దేశాలకు ఉపాధి రంగాల కోసం విద్యార్థులను వెళ్ళమని పురమాయిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు కాదు. దేశంలో ఉన్న విద్యను, విద్యా మూలాలను దెబ్బతీసుకోవడం వలన వనరుల మీద ఆసక్తి తగ్గిపోతుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
విద్యకు హద్దులా?
ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పాలకవర్గ సామ్రాజ్య వాద, పెట్టుబడిదారీ, మతోన్మాద భావజాలాల ఒత్తిడిలో వున్నాయి. సరైన గ్రాంట్స్, స్కాలర్‌షిప్‌లు లేక విలవిల్లాడుతున్నాయి. తెలంగాణలో సెంట్రల్ విశ్వవిద్యాలయ భూములను ఆక్రమిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కులాధిపత్య భావాల మధ్య నలుగుతున్నాయి. భారతదేశంలో జీవించలేక, ఉపాధి లేక, స్వేచ్ఛ లేక ఇతర దేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అమె రికా విధిస్తున్న ఆంక్షలు గొడ్డలిపెట్టుగా ఉన్నాయి.
ఆసియా దేశాలు తమ స్వీయ విద్యోత్పత్తి, జ్ఞానోత్పత్తి విషయంలో స్వయంకృషికి పూనుకోవలసిన అవసరం వుంది. విద్య మానవుని వికాసానికి సోపానం. ఉన్నత విద్య ప్రపంచ జీవన వ్యవస్థ లను పునరుజ్జీవింపజేయగల శక్తిని కలిగి వుంటుంది. హార్వర్డ్, కొలంబియా, భారతీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవన ఉద్యమం అత్య వసరం. ప్రపంచంలో విశ్వ మానవులైన వారందరూ విద్య ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే అయ్యారు. సామ్రాజ్యానికి ఎల్లలుంటాయి. పాలనకు హద్దులు వుంటాయి. కానీ విద్యకు హద్దులుండవు.
విద్య గురించి అంబేడ్కర్ మాట్లాడుతూ, ‘‘ఏ విద్య అయితే సమర్థతను సమున్నతంగా పెంచలేదో, సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదో, నీతికి భూమికగా నిలువదో అది విద్యకాదు. విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా, శక్తిమంతంగా, బహుళ ప్రయోజనకారిగా సమతానురాగాల మూలస్థానంగా ఉండాల’’న్నారు. విద్యావంతమైన జాతి దానంతటదే అభివృద్ధిలోకి వస్తుంది. అంబే డ్కర్ ఆలోచనలే ప్రపంచ విశ్వవిద్యాలయాల వికాసానికి మార్గం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695