భారతీయ విద్యార్థులకు వర్సిటీల సూచన
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి.
వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం.
2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు.
జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్‌ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment