universities
-
తక్షణమే ప్రక్షాళన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాల లేమితో కునారిల్లుతున్నాయని.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ తేల్చినట్టు సమాచారం. బోధన సిబ్బంది కొరత, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకురావడం, అరకొర నిధులు వంటి కారణాలతో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా చేపట్టలేని దైన్య స్థితిలో వర్సిటీలు ఉన్నాయని.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నట్టు సమాచారం.ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, నేరుగా పరిశీలించిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలతో ఈ నివేదికను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.పోటీ ఎక్కడ?మన వర్సిటీలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెండింటికి ‘జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్)’ గ్రేడ్ కూడా రాలేదని.. ‘ఎ’ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్న వర్సిటీలు కేవలం రెండేనని కమిషన్ వర్గాలు తెలిపాయి. వర్సిటీల్లో 2,825 అధ్యాపక పోస్టులుండగా.. ప్రస్తుతమున్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమేనని.. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి చూసినా 74 శాతం పోస్టులు ఖాళీయేనని పేర్కొన్నాయి. అంతా తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారని తెలిపాయి.ప్రాజెక్టులు డొల్ల.. పరిశోధనలు కల్ల.. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020–21లో రూ.52.45 కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. ఇక్కడ 1,267 మంది బోధన సిబ్బందికిగాను 340 మందే రెగ్యులర్ వారున్నారు. మిగతా అంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారే. వారికి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఈ వర్సిటీకి గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులూ అరకొరగానే వస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆయువు పట్టు అయిన జేఎన్టీయూహెచ్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకున్నవారు లేరు. వర్సిటీలో 410 మంది ఫ్యాకల్టీకిగాను ఉన్నది 169 మందే. దీనితో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.⇒ మెరికల్లాంటి గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్రమంగా వైభవాన్ని కోల్పోతోంది. 2008 నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం దారుణం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.⇒ పాలమూరు వర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని కమిషన్ దృష్టికొచ్చింది. పేరుకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినా రూ.7 కోట్లు కూడా అందడం లేదని.. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రుసుములపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోందని అంటున్నారు. ⇒ తెలంగాణ వర్సిటీకి 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైతే... ఉన్నది 61 మందే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీని అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. వర్సిటీకి కనీసం రూ.250 కోట్ల తక్షణ నిధులు అవసమని అంచనా.⇒ కాకతీయ వర్సిటీలోనూ పరిశోధనలు సగం మేర తగ్గిపోయాయి. 405 అధ్యాపక పోస్టులకుగాను 83 మందే రెగ్యులర్ వారు. మిగతా అంతా తాత్కాలిక సిబ్బందే. నిజానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను కలిపితే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని అంచనా.యూనివర్సిటీల స్థాయి పెరగాలివిశ్వవిద్యాలయాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కాదు.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి, ప్రమాణాలు పెరగాలి. బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. లైబ్రరీ, పరిశోధన అవకాశాలు, సరికొత్త టెక్నాలజీలను సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేశాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. – ఆకునూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్ -
వర్సిటీలకు జీతాల్లేవ్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఆయన ఆర్భాటంగా ప్రకటించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వర్సిటీ ఏర్పాటు మాట దేవుడెరుగు ఉన్న వర్సిటీల్లో పని చేస్తున్న ఆచార్యులకే జీతాలు అందని దుస్థితి నెలకొంది. వర్సిటీల్లో ఆచార్యులు, విశ్రాంత ఉద్యోగులకు గత మూడు నెలలకు పైగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో ఒక నెల జీతాన్ని రెండు విడతలుగా తీసుకుంటున్న దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆచార్యులకు జీతాలను మాత్రం చెల్లించలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వర్సిటీలు ఆర్థికంగా పతనమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్ (సీఎఫ్ఎంస్) ద్వారా జీతాలు చెల్లించాలి. అయితే మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో చరిత్రలో తొలిసారిగా వర్సిటీలు తమ అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్ రూపంలో సగం జీతాలు తీసుకోవాల్సి దుస్థితి నెలకొంది. ‘గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలోనూ మా జీతాలు ఆలస్యం కాలేదు. ఇప్పటికే మూడు నెలలుగా నిధుల విడుదల ఆపేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే మురిగిపోతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మా వర్సిటీపై రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని రాయలసీమలోని ఓ వర్సిటీ ఇన్చార్జీ వైస్ చాన్సలర్ ఆవేదన వ్యక్తం చేశారు. » ఏయూలో నవంబర్, డిసెంబర్ జీతాలను వర్సిటీ నిధుల నుంచి అడ్వాన్స్‌గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. » ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని ద్రవిడియన్ వర్సిటీలో గత త్రైమాసికంలో రూ.8 కోట్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ డిసెంబర్ జీతాలు అందలేదు.» ఆచార్య నాగార్జున వర్సిటీలో మూడు నెలలుగా ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు.» వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన వర్సిటీలో గత మూడు నెలలుగా గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో అంతర్గత నిధులను వినియోగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందని దుస్థితి.» తిరుపతి ఎస్వీ వర్సిటీలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రతి నెలా జీతాలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయి. జూన్, జూలై జీతాలు ఆగస్టు 6న అందగా ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు అక్టోబర్ 23న.. అక్టోబర్, నవంబర్ వేతనాలు డిసెంబర్ 5న చెల్లించారు. డిసెంబర్ జీతాలు ఇంకా ఇవ్వలేదు. uశ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోనూ 3 నెలలుగా అంతర్గత నిధులనే జీతాల కోసం వెచ్చిస్తున్నారు. » అనంతపురంలోని జేఎన్టీయూలో నవంబర్ జీతాలను వర్సిటీ అంతర్గత నిధుల నుంచి జనవరి 3న సర్దుబాటు చేశారు. డిసెంబర్ జీతాలింకా ఇవ్వలేదు. » కాకినాడ జేఎన్టీయూలోనూ డిసెంబర్ నెల జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వర్సిటీల్లో వర్గ విభేదాలు..రాజ్యాంగబద్ధంగా నియమితులైన వీసీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఇన్చార్జీ వీసీల పాలనతో చాలా వర్సిటీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వం నియమించిన చిరుద్యోగులను కూటమి సర్కారు పెద్ద ఎత్తున తొలగించింది. శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో 34 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా పంపించేశారు. ఇన్చార్జీ పాలనతో ఏయూ వందేళ్ల ఉత్సవాల్లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ వర్సిటీలో పరీక్షల నిర్వహణ విభాగం పూర్తిగా అదుపు తప్పింది. మార్కుల లిస్టులు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లు, కాన్వకేషన్ల కోసం నిత్యం వర్సిటీ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రణాళికలు తలకిందులుఉన్నత విద్యా మండలి పరిధిలోని వర్సిటీల్లో సుమారు 8 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా పెన్షన్‌పైనే ఆధారపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సకాలంలో అందట్లేదు. అక్టోబర్, నవంబర్ పెన్షన్‌ను ఈ నెల 2న ఇచ్చారు. డిసెంబర్ది పెండింగ్‌లో ఉంది. విశ్రాంత జీవితంలో ఎన్నో ప్రణాళికలను మాకొచ్చే పెన్షన్‌తోనే నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తలకిందులవుతున్నాయి. – శివప్రసాద్, ఏపీ వర్సిటీ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!
సాక్షి, అమరావతి: దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. ఫీజు రిడ్రెసల్ ద్వారా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతటితో వదిలేయకుండా వేగంగా ఆ ఫిర్యాదులను పరిష్కరిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు అదనపు ఫీజులను రీఫండ్ చేయిస్తోంది. గత ఐదు విద్యా సంవత్సరాల్లో 4,257 ఫిర్యాదులు నమోదవ్వగా.. యూజీసీ ఆయా వర్సిటీల నుంచి రూ.25.51 కోట్ల సొమ్మును విద్యార్థులకు వాపస్ చేయించింది. 97% సక్సెస్ రేట్..యూజీసీ ఫీజు రిడ్రెసల్ సెల్.. ఈ–సమాధాన్ ప్లాట్‌ఫాం కింద పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2021–22లో 915, 2022–23లో 927, 2023–24లో 2,251 ఫిర్యాదులు వచ్చాయని యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ యూనివర్సిటీల పైనే విద్యార్థుల నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించాయి.ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, రాజస్థాన్ నిలిచాయని పేర్కొన్నాయి. తమకు వచి్చన ఫిర్యాదుల్లో 97 శాతానికి పైగా పరిష్కరించినట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ చెప్పారు. మొత్తం రూ.26.30 కోట్ల విలువైన ఫిర్యాదులకు గానూ రూ.25.51 కోట్లను విద్యార్థులకు వాపస్ చేయించినట్లు వెల్లడించారు. ఇందులో 1,386 మంది విద్యారి్థనులకు రూ.8.71 కోట్ల ఫీజు రీఫండ్ చేసినట్లు తెలిపారు. -
ఆన్లైన్ విద్యలో నాణ్యతకు పట్టం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ విద్య విస్తరిస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత సంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిజిటల్ విద్యపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఇప్పటి వరకు ఆన్లైన్ విద్య నాణ్యతను కొలవడానికి సరైన ప్రమాణాలు లేవు. కానీ, తొలిసారిగా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. ఇందులో ప్రపంచంలో 11 యూనివర్సిటీలకు గోల్డ్ స్టేటస్ ర్యాంకును ఇచి్చంది. ఇందులో భారతదేశం నుంచి మానవ్ రచన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ‘బంగారు’ హోదా పొందాయి. దేశంలో ఏడు వర్సిటీలకు ర్యాంకులు... ఆన్లైన్ విద్యలో గోల్డ్ కేటగిరీలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో యూఎస్ఏ నుంచి మూడు, యూకే, భారత్ నుంచి రెండు చొప్పున, రష్యా, హంగేరీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ ఉన్నాయి.భారత్ నుంచి శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌కు సిల్వర్ స్టేటస్ సాధించగా, అమిటీ యూనివర్సిటీ (నోయిడా), కేఎల్ యూనివర్సిటీ (ఏపీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (పంజాబ్), మణిపాల్ వర్సిటీ (జైపూర్) బ్రాంజ్ స్టేటస్ పొందాయి. ఈ ర్యాంకింగ్స్‌తో భారత్ యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యను అందించడంలో పురోగతిని కనబరుస్తున్నాయని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే ర్యాంకులు ఆన్లైన్ అభ్యాసానికి అంకితమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంతృప్తి, విద్యార్థుల్లో పురోగతి, కోర్సుల సిఫారసు వంటి అంశాలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. మొత్తం ప్రపంచంలో 14 యూనివర్సిటీలు వెండి, 31 కాంస్య పతకాల కేటగిరీలో నిలిచాయి. మరో 64 సంస్థలు డేటా సమర్పించినప్పటికీ పూర్తి ఎంట్రీ అవసరాలను తీర్చలేదు. కాబట్టి వాటికి రిపోర్టర్ హోదా కల్పిoచింది. అయితే ఆన్లైన్ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అభ్యాసకులు టెక్నాలజీ యాక్సెస్, టైమ్‌జోన్, భాషా ప్రావీణ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్టేటస్ పొందిన యూనివర్సిటీలు... » అమెరికన్ యూనివర్సిటీ(యూఎస్) » అరిజోనా స్టేట్ వర్సిటీ(యూఎస్) » హెచ్ఎస్ఈ వర్సిటీ (రష్యా) » మానవ్ వర్సిటీ (భారత్) » మాస్సే వర్సిటీ (న్యూజిలాండ్) » ఓపీ జిందాల్ (భారత్) » సెంట్రల్ఫ్లోరిడా వర్సిటీ (యూఎస్) » వర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (యూకే) » లివర్‌పూల్ వర్సిటీ (యూకే) » సౌత్ ఆస్ట్రేలియావర్సిటీ (ఆ్రస్టేలియా) » వర్సిటీ ఆఫ్ స్జెడ్ (హంగేరి) -
అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు. జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్‌ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. -
కమిషన్ వచ్చాకే వర్సిటీల్లో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు వర్సిటీల్లో నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని విధివిధానాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. కమిషన్ ఏర్పాటై, విధివిధానాలు ఖరారైన తర్వాతే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేయడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కమిషన్ విషయంలో కొన్ని చట్టపరమైన సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.నియామకాలెప్పుడో..?కాలేజ్ సర్వీస్ కమిషన్ కొత్తదేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లోనే దీన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యారంగ నిపుణులతో ఇది ఏర్పడుతుంది. అయితే 2000 సంవత్సరం వరకు పనిచేసిన కమిషన్ అప్పట్లో ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలకే పరిమితమైంది. తర్వాత దీనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఆయా వర్సిటీల వీసీల నేతృత్వంలో జరుగుతుండగా.. 2014–2022 మధ్య యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు.దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో 2022 సెప్టెంబర్ 12న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నియామకాలు చేపడుతుండటం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని, అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు నియామకాలు అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అప్పట్నుంచీ కూడా బోర్డు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర కలిపి 3 వేలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తేడా ఏంటి?ప్రభుత్వ నిర్ణయంతో కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు, కాలేజ్ సర్వీస్ కమిషన్‌కు తేడా ఏంటనే చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితం కాలం చెల్లిన కమిషన్‌ను ఎందుకు తెస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలంటే..తొలుత వర్సిటీలు ఖాళీలను వెల్లడిస్తాయి. అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. మెరిట్ ఆధారంగా బోధన, బోధనేతర సిబ్బందిని ఎంపిక చేసి వర్సిటీలకు సిఫారసు చేస్తుంది. ఇందులో వీసీల ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇక సర్వీస్ కమిషన్‌కు వచ్చేసరికి ఖాళీలను కమిషనే గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ వీసీ ఇందులో సభ్యులుగా ఉంటారు. నియామకాల ప్యానెల్‌లోనూ వీసీ ఉంటారు. కాబట్టి వీసీల పెత్తనానికి అవకాశం ఉంటుంది. అయితే వీసీలు అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీసీ పెత్తనానికి అవకాశం ఉన్న కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చర్చనీయాంశమవుతోంది. కమిషన్ ఎలా చెల్లుతుంది?కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు చట్టపరమైన సమస్యలను పరిశీలించాలి. వర్సిటీలు యూజీసీ పరిధిలో ఉంటాయి. యూజీసీ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయకుండా కమిషన్ ద్వారా వర్సిటీల అధ్యాపకులను నియమించడం చట్టపరంగా ఎలా చెల్లుతుంది? – ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ (పూర్వ కాలేజ్ కమిషన్ సభ్యుడు)ఏదో ఒక సాకుతో జాప్యం సరికాదుబోర్డును రద్దు చేస్తారో..కాలేజ్ సర్వీస్ కమిషన్‌ను తెస్తారో..ఏదో ఒకటి చేసి తక్షణం యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాలి. ఏ విధానంలోనైనా లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుని వెళ్ళాలి. ఏదో ఒక సాకుతో నియామకాల్లో జాప్యం సరికాదు. – ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ)నియామకాలు చేపట్టకపోతే కష్టంవర్సిటీల్లో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఇది విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోర్డును రద్దు చేసి, కమిషన్ తీసుకొచ్చినా ఇబ్బంది లేదుగానీ, తక్షణమే నియామకాలు చేపట్టకపోతే వర్సిటీల మనుగడకే ప్రమాదం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) -
నిధులు.. నియామకాలు!
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో రెండింటికి ఇప్పటికీ జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్) ఉత్తమ గ్రేడ్ రాలేదు. కేవలం రెండింటికే ‘ఎ’ ప్లస్ దక్కింది. జేఎన్టీయూహెచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘ఎ’ గ్రేడ్ స్థాయికి రాలేకపోతోంది.సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యకు ఊపిరిపోసే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన సిఫారసులు చేస్తూ నివేదికలు ఇవ్వాలని కొత్త వైస్ చాన్స్లర్లను ఆదేశించింది. అవసరమైతే కన్సల్టెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, గాడి తప్పిన పాలన..వర్సిటీల్లో ప్రధాన సమస్యలని వీసీలు పైకి చెబుతున్నా, తగిన మొత్తంలో నిధులు ఇవ్వడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తేనే వర్సిటీల్లో బోధనతో పాటు అన్ని అంశాల్లోనూ నాణ్యత మెరుగవుతుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ న్యాక్ అత్యుత్తమ గ్రేడ్ ఎ ప్లస్ ప్లస్ లేకపోవడాన్ని విద్యారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే నిధులు, బోధనా సిబ్బంది కొరత చెప్పడానికి వీసీలు సాహసించడం లేదని అంటున్నారు. ఆర్థిక అంశాలే కీలకం రాష్ట్రంలోని వర్సిటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఒక్కో వర్సిటీలో ఇప్పటికీ 74 శాతం వరకు ఖాళీలున్నాయి. 2,825 అధ్యాపక పోస్టులు మంజూరైతే, ఉన్న రెగ్యులర్ సిబ్బంది కేవలం 873 మంది మాత్రమే. మిగతా వాళ్ళంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపిస్తోందని, ఫలితంగా విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఇతర అంశాలను పక్కనబెడితే నిధుల కొరతే ప్రధాన సమస్య అని వీసీలు భావిçÜ్తున్నారు. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ నియామకాలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే వీసీల నియామకం చేపట్టింది. వీరి నివేదికల అనంతరం సమస్యల పరిష్కారం దిశగా ఏ మేరకు నిధులు సమకూరుస్తుందో వేచిచూడాల్సిందే. మసక బారుతున్న ఓయూ వైభవం వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ఓయూ వైభవం మసక బారుతోందనే అభిప్రాయం ఉంది. పరిశోధనలు తగ్గాయి. బోధన సిబ్బంది కొరతతో కేంద్ర ప్రభుత్వ శాఖలు పరిశోధన ప్రాజెక్టులు తగ్గించాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే, 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్ళలోనే 53 శాతం పడిపోయింది. ప్రభుత్వం 1,267 అధ్యాపక పోస్టులు మంజూరు చేసినా 340 మందే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఉంది. జేఎన్టీయూహెచ్కు జవసత్వాలెలా?సాంకేతిక విద్యకు కీలకమైన ఈ విశ్వవిద్యాలయం జాతీయ ర్యాంకుల్లో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతోంది. ఇక్కడ 410 అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. దీంతో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలను ఇంజనీరింగ్‌లో విలీనం చేశారు. కానీ సిబ్బంది కొరత వల్ల ప్రమాణాలు పెరగడం లేదు. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్ల మేర నిధులు అవసరమని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు లేని ఆర్జీయూకేటీ బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మెస్ నిర్వహణ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారడంతో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 2008 నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ‘పాలమూరు’వెనుకంజ.. ఈ వర్సిటీకి ఏటా కేటాయించేది రూ.10 కోట్లు. ఇచ్చేది రూ.7 కోట్ల లోపే. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతుంది. ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రొఫెసర్లు కాగా నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాకులు లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. అనుమతి వచ్చినా లా కాలేజీ భవన నిర్మాణం పూర్తవ్వలేదు. నలుగురు ఉండాల్సిన బాలికల హాస్టల్లో 8 మంది ఉండాల్సిన పరిస్థితి. ‘తెలంగాణ’కు రూపాయి విదల్చడం లేదు! ఈ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది కేవలం 61 మంది మాత్రమే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుండగా అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఈ వర్సిటీకి పదేళ్ళుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇతరత్రా నిధులతో నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్ళలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ స్నాతకోత్సవం జరిగింది. కాకతీయలో వేతనాలకే దిక్కులేదుకాకతీయ వర్సిటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. 405 రెగ్యులర్ అధ్యాపకులకు గాను 83 మందే ఉన్నారు. 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని వర్సిటీ వర్గాలంటున్నాయి. నిధుల్లేకుండా మార్పు ఎలా సాధ్యం? జ్ఞానాన్ని సృష్టించి, పంచే యూనివర్సిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. వీటికి వివిధ రూపాల్లో నిధులు సమకూరుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 12 శాతం నిధులిచ్చేవారు. అదిప్పుడు సగానికి పడిపోయింది. యూజీసీ కూడా 60 శాతం నిధులు తగ్గించింది. నిధులే లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? ఢిల్లీలో ఓ సాధారణ కాలేజీకి వెళ్ళా. 250 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర ఆ స్థాయిలో అధ్యాపకులు ఉండటం లేదు. పాలమూరు లాంటి వర్సిటీకి రూ.8 కోట్లు ఇవ్వడమే కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరిశోధన ఎలా చేయగలరు? వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వర్సిటీల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి కార్యాచరణలో కన్పించాలి. వర్సిటీలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తేనే మార్పు సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ (విద్యారంగ నిపుణులు)అధ్యయనం మొదలైంది సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యలో మార్పుల దిశగా అధ్యయనం చేస్తున్నాం. త్వరలో నిపుణులతో భేటీ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి మార్పులు రావాలి? గ్లోబల్ పోటీని తట్టుకునే బోధన ప్రణాళికలేంటి? అనేది అధ్యయనం చేయబోతున్నాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)త్వరలో అందరితో సమావేశం నివేదిక దిశగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్వోడీలను పిలుస్తాం. మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఇతర అంశాలపై చర్చిస్తాం. నెల రోజుల్లో నివేదిక సమరి్పస్తాం. – ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, వీసీ ఓయూ -
నూరు శాతం వర్సిటీల ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్ చాన్స్లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు. వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వండి’ అని సీఎం రేవంత్ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాల యాలకు ఉప కులపతులు నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో వర్సిటీలకు వీసీలను ఖరారు చేసినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి 13 వర్సిటీలు ఉండగా.. మహిళా వర్సిటీకి ముందే వీసీని నియమించారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లకు ఇంకా వీసీలను నియమించాల్సి ఉంది. అంబేడ్కర్ వర్సిటీకి అత్యధిక దరఖాస్తులురాష్ట్రంలోని వర్సిటీలకు చెందిన వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 23 తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్ అధికారులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, మరోవైపు ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ పోస్టుల కోసం 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. చాలామంది అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేశారు. అత్యధికంగా బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి 208 దరఖాస్తులు వస్తే, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి 157 వచ్చాయి. జేఎన్టీయూహెచ్కు 106 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ సెర్చ్ కమిటీ పరిశీలించి మూడు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వీసీలను ఎంపిక చేసిన ప్రభుత్వం దసరా ముందు ఫైల్‌ను గవర్నర్ కార్యాలయానికి పంపింది. తాజాగా గవర్నర్ కార్యాలయం వీసీల పేర్లను ఖరారు చేసింది. వివాదంలో జేఎన్టీయూహెచ్జేఎన్టీయూహెచ్కు వీసీ నియామకం ఆఖరి దశలో ఆగిపోయింది. అంతర్గత వివాదం, వీసీ నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీసీ ఖరారును వాయిదా వేశారని తెలిసింది. ఈ వర్సిటీకి సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను సిఫారసు చేయగా.. ఇందులో ఓ మాజీ వీసీ పేరు ఉండటం వివాదాస్పదమైంది. గతంలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ ఆయన పేరును సెర్చ్ కమిటీ సూచించిందంటూ పలువురు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌కు పంపలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. జేఎన్ఏఎఫ్, ‘అంబేడ్కర్’పై భేటీకాని సెర్చ్ కమిటీలుఅంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఈ పోస్టును దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సైతం జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచే నాలుగు సిఫారసులు వచ్చినట్టు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెర్చ్ కమిటీ ఇంతవరకూ ఈ వర్సిటీ విషయమై భేటీ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే జేఎన్ఏఎఫ్ఏపై కూడా సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఈ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త వీసీలు వీరే.. యూనివర్సిటీ: వీసీపాలమూరు, మహబూబ్‌నగర్: ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్రావుకాకతీయ, వరంగల్: ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డిఉస్మానియా, హైదరాబాద్: ప్రొఫెసర్ కుమార్ మొలుగరంశాతవాహన, కరీంనగర్: ప్రొఫెసర్ ఉమేశ్కుమార్తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్: ప్రొఫెసర్ నిత్యానందరావుమహాత్మాగాంధీ, నల్లగొండ: ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్తెలంగాణ, నిజామాబాద్: ప్రొఫెసర్ యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ: ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన: ప్రొఫెసర్ రాజిరెడ్డిప్రొఫెసర్ అల్దాస్ జానయ్యజయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొ.అల్దాస్ జానయ్య నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్ డీన్‌గా సేవలందిస్తున్నారు. 2002లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.ప్రొ.రాజిరెడ్డి దండకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన దండ రాజిరెడ్డి మహారాష్ట్రలోని పంజాబ్రావు కృషి విద్యాపీఠ్‌లో అగ్రికల్చర్లో బీఎస్సీ, ఎంఎస్సీ చేశారు. గుజరాత్ అగ్రికల్చర్ వర్సిటీలో అగ్రో మెటియోరాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్ అగ్రోమెట్ సర్వీసెస్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలాకాలం పాటు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.ప్రొ.వెలుదండ నిత్యానందరావు తెలుగు వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామం. పాలెం ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అదే శాఖ హెచ్వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు. ఆయన రచించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని వర్సిటీల తెలుగు విభాగాల్లో ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ బోధిస్తున్నారు.ప్రొ.టి.యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.యాదగిరిరావు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పీజీ, పీహెచ్డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీవోఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కేయూలో యూజీసీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ప్రొ.జీఎన్ శ్రీనివాస్ పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.జీఎన్ శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస్.. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. ప్రొ.కుమార్ మొలుగరం ఉస్మానియా వీసీగా నియమితులైన కుమార్ మొలుగరం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామంలో జన్మించారు. ఓయూలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన అపార అనుభవశాలి. ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2018లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి పురస్కారం, ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఓయూ 107 సంవత్సరాల చరిత్రలో వీసీగా నియమితులైన తొలి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఘనత సాధించారు.ప్రొ.అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఖాజా అల్తాఫ్ హుస్సేన్.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జన్మించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్ సీకేఎం కాలేజీలో ఇంటర్, డిగ్రీ.. కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. కేయూ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా సేవలందించారు. 2016–19 మధ్యకాలంలో కూడా మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఎంజీయూ వీసీగా నియమితులైన అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రొ.ప్రతాప్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.ప్రతాప్‌రెడ్డిది రంగారెడ్డి జిల్లా యాచారం. ఓయూలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రతాప్‌రెడ్డి.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ప్రొ.ఉమేష్కుమార్శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఉమేష్‌కుమార్.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట గ్రామంలో జన్మించారు. కెమిస్ట్రీ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎంజీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు, బోధనా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారు. -
కొత్త వీసీల నియామకం
-
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్‌కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
ఇంటర్ నుంచి వర్సిటీ దాకా...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీ ఇలా ఉన్నత విద్యావ్యవస్థలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కాలేజీ సర్వీస్ కమిషన్‌ను తెర మీదకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాలేజీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు?..: రాష్ట్రంలో 11 యూనివర్సిటీలున్నాయి. వాటి పరిధిలో నియామకాలన్నీ ఆయా యూనివర్సిటీలే కామన్‌గా నోటిఫికేషన్ ఇచ్చి.. చేపడుతున్నాయి. ఈ విధానంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ని యూనివర్సిటీలకు కలిపి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా, పలువురు విద్యావేత్తలను బోర్డులో చేర్చింది. అయితే, ఈ బోర్డు ఇప్పటి వరకూ ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీనిపై యూనివర్సిటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల నియామకాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్స్, ఇతర పరీక్షలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్నాయి. అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టడం వల్ల జాప్యం కూడా జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి. కమిషన్ పాతదే...కాలేజీ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది. కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి, కమిషన్‌కు తెలియజేస్తారు. కమిషన్ నేతృత్వంలోని కమిటీ పరీక్షలు చేపడుతుంది. అయితే 1985లో ఈ కమిషన్‌ను రద్దు చేశారు. నియామకాలన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తెచ్చారు. మళ్లీ కాలేజీ సర్వీస్ కమిషన్‌కు ఊపిరి పోయడంతోపాటు విశిష్టమైన అధికారాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను ఈ కమిషన్ పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. ఐటీఐలను కూడా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్య కాలేజీల్లో నియామకాలనూ ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గాడి తప్పిన వర్సిటీలు..
-
గాడి తప్పిన వర్సిటీలు..! పడిపోతున్న విద్యా ప్రమాణాలు
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్‌కే వాస్తేగా మారిపోతున్నాయి. పరిశోధనల మాటేమోగానీ.. సాధారణ విద్యా ప్రమాణాలే నానాటికీ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నిధులు లేక.. పట్టించుకోక.. వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిదా్యలయం కూడా ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. కొత్త వీసీలు వస్తేగానీ.. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు. చదువు చేప్పేవాళ్లెక్కడ? రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..! కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు. – కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. – మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు. – ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే. – నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. – నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. సదుపాయాలూ సరిగా లేక.. చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే.. విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పరి్మనెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత) -
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం....గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు....గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి....వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. -
ఏటా రెండుసార్లు ప్రవేశాలు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా తీసుకురానున్న ఏటా రెండు సార్లు ప్రవేశాల విధానంపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు తర్జన భర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోయినా, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలనే యూజీసీ ఆదేశాలు ఎలా సాధ్యమనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో భారీగా బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. ఏడాదికి రెండు బ్యాచ్‌లకు ఒకే అధ్యాపకుడు బోధించడం ఎలా సాధ్యమనే వాదన ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు చేపట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయించింది. ఇప్పుడు జూలై–ఆగస్టు మధ్య మాత్రమే ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్ కాకుండా జనవరి–ఫిబ్రవరి మధ్య మరో దఫా అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలోనే దీన్ని అమలు చేయాలని భావించడంపై వర్సిటీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికానే ఆదర్శం... అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ద్వైవార్షిక ప్రవేశాల విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశ విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చారు. మార్కులు కాకుండా క్రెడిట్లు ఇవ్వాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. విదేశాల్లోనూ ఇదే విధానం ఉండటం వల్ల డిగ్రీ గుర్తింపు తేలికగా ఉంటుందని భావిస్తున్నారు. అడ్మిషన్లు కూడా ఏడాదికి రెండుసార్లు ఉంటే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని యూజీసీ చెబుతోంది. వివిధ కారణాలతో తొలి దశలో ప్రవేశం పొందలేని వారికి జనవరి– ఫివ్రబరిలో తేలికగా అడ్మిషన్ పొందే వీలుంది. ఏడాదిపాటు ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండబోదని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామిక వర్గాలు కూడా ఏడాదికి రెండు దఫాలు క్యాంపస్ సెలెక్షన్ చేసే వీలుందని చెబుతున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు. సన్నద్ధత ఎలా? ద్వైవార్షిక ప్రవేశాలపై సన్నద్ధతను కోరుతూ దేశంలోని అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు యూజీసీ లేఖలు రాస్తోంది. దీనిపై ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండుసార్లు అడ్మిషన్ల వల్ల ఒకే కోర్సును రెండు సెషన్లుగా నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సెషన్ సెపె్టంబర్లో మొదలైతే, రెండో సెషన్ మార్చిలో మొదలవుతుంది. అప్పటికే మొదటి సెషన్ విద్యార్థులు ఒక సెమిస్టర్ పూర్తి చేసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు సెషన్ల నిర్వహణకు అవసరమైన ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, తరగతి గది రూపంలో అవసరమైన వనరులు వర్సిటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వర్సిటీలతో మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా అదనపు క్లాసుల నిర్వహణ తేలికగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు విదేశీ వర్సిటీలు తోడ్పాటును అందిస్తాయి. అయితే, ఇందుకు తగ్గ వనరులు, ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఏర్పాటుపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీ కారణంగా నిర్వహణ ఏమేర సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్రోల్మెంట్ పెంచడం, స్వయంగా ఆర్థికంగా బలపడే కొన్ని కోర్సులు తెచ్చే ఆలోచన కూడా యూజీసీ చేసే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. మార్గదర్శకాలు రావాల్సి ఉంది: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ద్వైవార్షిక ప్రవేశాలపై యూజీసీ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది ఎలా నిర్వహించాలనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అవి వచ్చిన తర్వాతే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అన్ని స్థాయిల్లో చర్చించాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెరుగుతుంది: ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, నిట్ డైరెక్టర్, రాయపూర్ ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఇది నడుస్తోంది. ఇది విద్యార్థులకు ఉపయుక్తంగానే ఉంటుంది. కాకపోతే వనరుల సమీకరణ సవాల్‌గా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనమే: ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి అమెరికా వంటి దేశాలు అమలు చేస్తున్న తరహాలో భారత్‌లోనూ ద్వైవార్షిక ప్రవేశాలు ఉంటే విద్యార్థులకు ఉపయోగమే. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడొచ్చు. ఒకసారి ప్రవేశ పరీక్ష పాసైతే రెండోసారి అడ్మిషన్లకూ ఇది అర్హతగానే ఉంటుంది. కాబట్టి సాంకేతికపరమైన సమస్యలు ఉండొకపోవచ్చు. -
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్‌లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్‌లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
విశ్వవిద్యాలయాలపై టీడీపీ దాడులు
తిరుపతి (తిరుపతి జిల్లా): చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడులకు దిగుతున్నాయి. రెండు రోజుల క్రితం వైద్య విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గాలు శుక్రవారం రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) పై దాడులకు తెగబడ్డాయి. సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎస్వీయూలోకి కర్రలు, రాడ్లతో చొరబడ్డారు. నేరుగా పరిపాలన భవనంలోకి ప్రవేశించి, వైస్ చాన్సలర్ (వీసీ) శ్రీకాంత్‌రెడ్డి చాంబర్లోకి దూసుకెళ్లారు. ఆయనపైకి నీళ్ల సీసాలు, కర్రలు విసురుతూ దాడి చేశారు. అక్కడ ఉన్న ఫైళ్లను విసిరేశారు. ‘వెంటనే రాజీనామా చేయరా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోయినా ఇంకా సీటులో కూర్చున్నావా’ అని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వీసీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఉద్యోగులు సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. ఓ పక్క టీడీపీ మూకల వీరంగం, మరోపక్క పోలీసులు పట్టించుకోకపోవడంతో వర్సిటీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.వారి సీట్ల నుంచి లేచి పరుగులు పెట్టారు. మహిళా ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీసీపై దాడులు, ఉద్యోగులు పరుగులు తీస్తున్న దృశ్యాలను కొన్ని మీడియా సంస్థలు ఉత్సాహంగా వీడియోలు తీయడం కనిపించింది. టీడీపీ దాడులు, ఆ మీడియా అత్యుత్సాహాన్ని వర్సిటీ సిబ్బంది, ప్రజలు తప్పుపడుతున్నారు. వర్సిటీకి సంబంధం లేని బయట వ్యక్తులు వర్సిటీలోని ప్రవేశించడం దారుణమని, ఆ మీడియా సంస్థల తీరూ గర్హనీయమని విమర్శిస్తున్నారు.వీఎస్‌యూలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులువెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) లో పలు శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. వీఎస్‌యూలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీని వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి ఇటీవల ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో వర్సిటీలోకి ప్రవేశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. వీఎస్‌యూలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో భవనాన్ని ఎలా నిర్మిస్తారని, ఆయన విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు. దేవాలయం వంటి విశ్వవిద్యాలయంలో టీడీపీ నాయకులు దాడులు చేయడంపై అధ్యాపకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత
పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్రత్ హాల్, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, యేల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్ బేనర్లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్ విద్యార్థిని శ్రుతీ కుమార్. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: ‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్‌లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్– నీకు వినిపిస్తోందా?గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్‌లో శిక్షలకు గురయ్యాయి. ఈ సెమిస్టర్లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. ‘హార్వర్డ్ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్ నుంచి -
ఐఏఎస్‌లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్‌లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్‌కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్‌కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్‌లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్‌తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
‘అటానమస్’లోనూ ఏపీ అదుర్స్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. యూజీసీ కంటే ముందుచూపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు. ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్‌లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు. వీసీలతో యూజీసీ చర్చలు.. 2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి)