వర్సిటీల్లో ‘కమీషన్ల’ సదస్సులు | Jnana Bheri conferences in the Universities | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో ‘కమీషన్ల’ సదస్సులు

Published Thu, Aug 23 2018 3:30 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Jnana Bheri conferences in the Universities - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయాల్లో జ్ఞానభేరి సదస్సుల పేరిట ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఈ సదస్సుల ముసుగులో రూ.100 కోట్లకుపైగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఈ సదస్సుల కోసం ఒక్కో జిల్లాల్లో ఒక్కో యూనివర్సిటీకి రూ.కోటి చొప్పున ఖర్చవుతుందని, ఈ భారాన్ని ఉన్నత విద్యామండలి, ఆయా యూనివర్సిటీలు చెరి సగం భరించాలని ఉన్నత విద్యాశాఖ తొలుత ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సదస్సుకు ఆ జిల్లాలోని 12 వేల మంది విద్యార్థులను తరలించాలని, వారికి వక్తృత్వం, వ్యాస రచన తదితర పోటీలు నిర్వహించాలని సూచించింది. 10 ఈవెంట్లలో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదును అందిస్తారు. ప్రథమ బహుమతి కింద రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇప్పటికే ఒక సదస్సు నిర్వహించారు. సదస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చును వర్సిటీలు విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల నుంచే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 

ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు 
జ్ఞానభేరి సదస్సు కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున ఖర్చు పెట్టాలని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ వ్యయాన్ని 10 రెట్లు పెంచేసింది. సదస్సు నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రతి జిల్లాలో జ్ఞానభేరి సదస్సుకు ఎంత దుబారాగా ఖర్చు చేసినా రూ.3 కోట్లకు మించి కాదని, ఏకంగా రూ.10 కోట్ల చొప్పున కేటాయించడం దోపిడీకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది రకాల ఈవెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు ప్రోత్సాహకంగా ఇచ్చే మొత్తం రూ.17.50 లక్షలే. ఇతర విద్యార్థులకు కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఇస్తారు. పోటీల నిర్వహణ, సదస్సులో పాల్గొనే విద్యార్థులకు, భోజనం, రవాణా, ఇతర సదుపాయలు, వేదిక ఏర్పాటుకు అంతా కలిపి రూ.3 కోట్లకు మించి ఖర్చు కాదని అంచనా. కానీ, ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.130 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.100 కోట్ల వరకు కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లో వేసుకోబోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

వర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు నిధులేవీ? 
రాష్ట్రంలో వర్సిటీల్లో, వాటి పరిధిలోని కళాశాలల్లో మౌలిక సదుపాయాల్లేక విద్యార్ధులు, అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు. గత ఏడాది రూ.380 కోట్లు ఇస్తామని ప్రభుత్వం జీఓ ఇచ్చి నయాపైసా విడుదల చేయలేదు. ఈ బడ్జెట్‌లో నిధులే లేవు. సదుపాయాల కల్పనకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం జ్ఞానభేరి సదస్సుల పేరిట వ్యక్తిగత ప్రచారం కోసం రూ.వందల కోట్లు ధారపోయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు విద్యార్థులను మభ్యపెట్టేందుకే సీఎం సదస్సులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement