వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం  | UGC suggested that Experienced Professional Services In Universities | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం 

Published Thu, Nov 24 2022 3:35 AM | Last Updated on Thu, Nov 24 2022 3:35 AM

UGC suggested that Experienced Professional Services In Universities - Sakshi

సాక్షి, అమరావతి:  యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది.

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ఎమ్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు
ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా  ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎమ్‌ఐటీ), హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్‌ఓఏఎస్‌), యూనివర్సిటీ ఆఫ్‌ లండన్, కార్నెల్‌ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు.

పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు..
► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే  ఉంటుంది. 
► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు
► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్‌ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు
► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి
► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి
► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు
► ఇప్పటికే టీచింగ్‌ పొజిషన్‌లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement