
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ.
తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది.
ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది.
వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం.
ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు.
నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది.
ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్‌ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది.
గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్‌ఈపీ లక్ష్యాలకే విరుద్ధం.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment