నూతన వీసీలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టీకరణ
వర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. వాటిపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్య
వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
వర్సిటీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్ చాన్స్‌లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు.
వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..
‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వండి’ అని సీఎం రేవంత్ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment