
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధి హామీ మార్కెటింగ్ మిషన్
గ్రామీణ యువత కోసం డీడీయూజీకేవై కింద పథకం అమలు
కేంద్ర వాటా 60 శాతం.. రాష్ట్ర వాటా 40 శాతం
కొంత కాలంగా రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో ఇబ్బందులు
డీడీయూజీకేవై 2.0 అమలుపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి హామీ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పథకం అమలు గత కొంతకాలంగా దాదాపు నిలిచిపోయింది. వివిధ రంగాలు, విభాగాల్లో నైపుణ్యాల శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈజీఎంఎం కింద గ్రామీణ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది.
ఆరోగ్యం, రిటైల్, ఆతిథ్య, సాఫ్ట్‌వేర్, యానిమేషన్, ఫార్మసీ, ఫ్యాషన్, తదితర రంగాల్లో ఏజెన్సీల ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆయా రంగాల్లో నైపుణ్యాలున్న సంస్థలు డిజైన్ చేసిన కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. కాగా ప్రస్తుతం ఈ లక్ష్యాల సాధన తూతూ మంత్రంగానే మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. నిధుల లేమి కారణంగా ఈ పథకం మొక్కుబడిగా సాగుతోంది.
కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకం కావడంతో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా సరిగ్గా విడుదల కాకపోవడంతో పథకం కుంటి నడక నడుస్తోంది.
2019 నుంచి సమస్యే..
ఈ స్కీమ్ కోసం రాష్ట్ర వాటా నిధులు 2019 నుంచే సక్రమంగా విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం ఓసారి రాష్ట్ర వాటా విడుదల కాకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. ఈ కారణంగా కేంద్రం నుంచి ఆ తర్వాత రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తులు పంపించడంతో నిధులు విడుదల పునరుద్ధరించారు. అయితే రాష్ట్రవాటా కింద ఏటా రూ.144 కోట్లు సక్రమంగా చెల్లించకపోవడంతో సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల్లోనూ ఈ స్కీమ్ కింద నిధులు విడుదల కాలేదని అంటున్నారు.
డీడీయూజీకేవై 2.0కు కేంద్రం సన్నాహాలు
రాష్ట్రంలో ప్రస్తుతం డీడీయూజీకేవై 1.0 స్కీమ్ అమలవుతుండగా (2015 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ దాకా)...దానిని ఈ ఏప్రిల్ దాకా పొడిగించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా వచ్చే జూలై, ఆగస్టు తర్వాత డీడీయూజీకేవై 2.0 స్కీమ్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లక్ష్యాలు, ఇతర వివరాలను రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం అందజేసింది.
రాష్ట్ర వాటా విడుదల కాని పక్షంలో..తెలంగాణలో డీడీయూజీకేవై 2.0 పథకం అమలు, తద్వారా ఈజీఎంఎం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవచ్చునని అంటున్నారు.