
జనవరి 26నప్రారంభించిన సీఎం
ఆ తర్వాత ఎమ్మెల్సీ కోడ్ పేరుతో తాత్కాలికంగా నిలిపివేత
పూర్తిస్థాయిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి చేరని సొమ్ము
సాక్షి, హైదరాబాద్: భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటివరకు ఈ పథకం కింద 83,887 మంది ఉపాధి కూలీలకు రూ. 50.33 కోట్లు చెల్లించారు. మిగతా 4,13,857 మంది కూలీలకు రూ.298 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి టోకెన్ చెక్కులు జనరేట్ అయ్యాయని అధికారులు చెబుతున్నా, ఉపాధికూలీల ఖాతాల్లోకి మాత్రం ఈ డబ్బు జమ కావడం లేదు.
2023–24లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద 20 రోజులు పనిచేసిన సొంతభూమి లేని ఉపాధికూలీలకు (జాబ్‌కార్డులు కలిగిన వారికి) ఏడాదికి రూ.12 వేలు (ఆరునెలలకు రూ.6వేలు చొప్పున) చెల్లిస్తామంటూ ఆ పథకాన్ని జనవరి 26న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
పైలట్ ప్రాజెక్టుగా...
ఒక్కో జిల్లా..ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 26న పథకాన్ని ప్రారంభించాక...29వ తేదీ నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకొని, అర్హులను ఎంపిక చేసి రూ.6 వేల అందజేత వంటి ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ పథకం కింద గతంలో గుర్తించిన 5.80 లక్షల లబ్దిదారులు, అదనంగా కొత్తగా రెండులక్షల దాకా దరఖాస్తులు అందాయి.
వీటిని కూడా అధికారులు పరిశీలించాక, ఎక్కువ సంఖ్యలో అనర్హులు ఉన్నారని (భూమి ఉన్నవారు, 20 రోజులు పనిచేయని వారు) తేలినట్టు అధికారవర్గాల సమాచారం.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో జనవరి చివరివారంలో దీని అమలును ఆపేశారు. కోడ్ ముగిశాక కూడా ఉపాధికూలీల ఖాతాల్లోకి రూ.6 వేల మొత్తాన్ని పూర్తిస్థాయిలో జమచేయలేదనే విమర్శలున్నాయి.
ఆయా జిల్లాల్లో ఇదీ పరిస్థితి
‘నాకు గుంట భూమి కూడా లేదు. పదిహేను రోజుల కింద మా ఊళ్లో జరిగిన గ్రామసభలో నన్ను ఆత్మీయభరోసా కింద ఎంపిక చేసి నా పేరు చదివి వినిపించారు. ఇప్పటివరకైతే నాకు డబ్బులు రాలేదు’అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లకు చెందిన ఇజ్జగిరి సరోజన వాపోయింది.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాగిలపు విజయకు 2023–24లో 60 రోజుల ఉపాధి పని పూర్తి చేసుకుంది. ఈమెకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. ఈమె ఆత్మీయ భరోసా పథకానికి అర్హురాలు. ఇప్పటికీ ఈమెకు రూ.6 వేలు ఖాతాలో వేయలేదు. ఇవి ఎప్పుడు అందుతాయి? అని ఎదురుచూస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 85 వేల మంది లబ్దిదారులు ఎంపికయ్యారు. అయితే గతంలో ఎంపిక చేసిన వారి మినహా మళ్లీ కొత్తవారిని ఈ పథకం కింద ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
2021–22నుప్రామాణికంగా తీసుకోవాలి
గ్రామసభల్లో కొందరు లబ్దిదారులనుఎంపిక చేసినా ఎమ్మెల్సీ కోడ్ పేరుచెప్పి అప్పుడు డబ్బులు వేయలేదు.ఆ తర్వాత కూడా ఉపాధి కూలీల ఖాతాల్లో పడడం లేదు. 2021–22లో ఉపాధి హామీ కింద అత్యధికంగా ‘పర్సన్‌డేస్’నమోదైనందున.. 2023–24కు బదులు 2021–22ను ప్రామాణికంగా తీసుకోవాలని పీఆర్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశాం.
2022–23లో రాష్ట్రంలో 4.4 లక్షల జాబ్‌కార్డులు,15.8 లక్షల మంది పేర్లను ఉపాధిహామీ డేటాబేస్ నుంచి తొలగించారు. 2023–24లో రాష్ట్రంలోని 156 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలు,కార్పొరేషన్లను విలీనం చేసిన ఉపాధి కూలీలకూ దీనిని వర్తింపచేయాలి. – పి.శంకర్, జాతీయ కార్యదర్శి,దళిత బహుజన ఫ్రంట్