
గ్రామీణ ప్రాంతాల్లో మూసివేత దిశగా అడుగులు
హైదరాబాద్ పరిసరాల్లోనే మనుగడ.. ఏటా సగం కూడా నిండని సీట్లు
పేరుకుపోతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
సిలబస్ మార్పుతో నిర్వహణ కష్టమనే ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో విద్యార్థుల ఎంపికల్లో మార్పుల కారణంగా రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణ డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవటంతో చాలా కాలే జీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కావటంలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కాలేజీల్లోనే 40 శాతం సీట్లు నిండితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో అంతకంటే చాలా తక్కువగా ఉంటున్నాయి.
వందకుపైగా కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో యాజమాన్యాలు కాలేజీల మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. అడ్మిషన్లు తగ్గటం ఒక సమస్య అయితే.. రూ.5 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండటం కాలేజీలను మరింత కుంగదీస్తోంది. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణల వైపు అడుగులేయటం గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీలను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తోంది.
అఫిలియేషన్‌కూ వెనకడుగు
రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 362 ఉండగా, మిగతా జిల్లాల్లో 692 ఉన్నాయి. గత ఏడాది 150 కాలేజీలు కొన్ని కోర్సుల్లో, సెక్షన్లలో అఫిలియేషన్ తీసుకునేందుకు వెనుకాడాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉందని నిర్వాహకు లు అంటున్నారు. అన్ని కాలేజీల్లో కలిపి 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇందులో ఏటా సగటున 2.20 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. దోస్త్ పరిధిలోని కాలేజీల్లో 3,85,573 సీట్లు ఉండగా, గతేడాది 2,12,188 సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులను ఆకర్షించటంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీని గ్రామీణ ప్రాంత కాలేజీలు తట్టుకోలేకపోతున్నాయి. తమ ఇళ్లకు సమీపంలోని కాలేజీల్లోనే చదవాలనుకునే విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సైన్స్ గ్రూపుల్లో చేరికలు నామమాత్రంగా ఉంటున్నాయి. గత మూడేళ్లలో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో చేరికలు 42 శాతం తగ్గిపోయాయి. ముఖ్యంగా సైన్స్ గ్రూపుల్లో ఈ పరిస్థితి ఉంది.
కొత్త కోర్సులతో చిక్కులు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సులు తీసుకొస్తున్నారు. కామర్స్‌లోనూ కంప్యూటర్ కోర్సుల కాంబినేషన్ వస్తోంది. రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఈ కోర్సుల బోధకులు దొరకుతున్నారు. విద్యార్థులు కూడా రాజధానిలో ఉంటే ఇతర కోర్సులు నేర్చుకోవచ్చని, పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయని ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు.
గ్రామీణ కాలేజీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కంప్యూటర్ కోర్సులకు లెక్చరర్‌ను తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.50 వేల వేతనం ఇవ్వాలి. ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఇదంతా చేస్తే ఫీజులు పెంచాలి. ఫీజులు పెంచితే విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. ఈ కారణంగా కొత్త కోర్సుల జోలికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సిలబస్ మార్చాలని నిర్ణయించింది. 20 శాతం కంప్యూటర్ అనుసంధానిత సిలబస్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతా కాలేజీల మనుగడకు ప్రమాదంగా మారే పరిస్థితి కని్పస్తోంది.