Degree seats
-
50 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాశాలల్లో డిగ్రీ సీట్లు ఈ ఏడాది దాదాపు 50 వేలు తగ్గే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌లో సీట్లను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్ళుగా సీట్ల భర్తీ లేకపోవడమే దీనికి కారణంగా ఉన్నత విద్యా మండలి చెబుతోంది. గత విద్యా సంవత్సరంలో కూడా దాదాపు లక్ష సీట్లను కుదించారు.వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 1050 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ ప్రతీ సంవత్సరం గరిష్టంగా 2.25 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులోనూ బీకాం కోర్సులోనే ఎక్కువగా చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఉంటోంది. బీఏ కోర్సులో ప్రవేశాలు 40 శాతం మించడం లేదు. దాదాపు వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు నమోదు అవుతున్నాయి.మరో 150 కాలేజీల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరడం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఉన్నత విద్యా మండలి ఈ పరిస్థితిని సమీక్షించింది.డిమాండ్ లేని కోర్సులకు సంబంధించిన బ్రాంచీలకు అనుమతించకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 15 శాతం కన్నా విద్యార్థులున్న కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతించే అవకాశం కన్పించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పలు కాలేజీలు ఈ ఏడాది మూతపడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త కోర్సులకే ప్రాధాన్యం.. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సుల్లో కొన్నేళ్ళుగా మార్పులు తెస్తున్నారు. కొన్ని కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 19 రకాల స్కిల్ కోర్సులను సిఫార్సు చేసింది. రిటైల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టార్లో అవసరమైన సేవలు అందించే టెక్నికల్ కోర్సులు, స్టార్టప్స్ పెట్టుకోగల కోర్సులను అందించాలని సూచించింది. కామర్స్‌లో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, బీఎస్సీలో బయో మెడికల్ వంటి కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రూరల్‌లో కొత్త కోర్సులు తెచ్చినా..? హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలు కొత్త కోర్సులపై ఆసక్తి చూపుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీలు మాత్రం ముందుకు రావడం లేదు. దీనివల్ల మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల కొరతతో పాటు ఫీజులు పెంచితే విద్యార్థులు చేరేందుకు అవకాశం లేదని ఆ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఫీజు రీ ఎంబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం అందించడం లేదని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులకు వెళ్ళలేమని గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల నిర్వాహకులు అంటున్నారు. లైప్సైన్స్ కోర్సులను గత కొన్నేళ్ళుగా అందుబాటులోకి తెచ్చినా కూడా గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. మార్పులు అనివార్యండిగ్రీ కోర్సుల్లో మార్పు లు అనివార్యం. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం. కాలేజీల్లో అన్ని విధాల మౌలిక వసతులు ఉంటేనే అనుమతులు ఇస్తాం. డిమాండ్ లేని కాలేజీల్లో సీట్లు తగ్గించే ఆలోచన చేస్తున్నాం. ఏపీఈసెట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్ ఇస్తాం.కొత్త కోర్సులను కూడా ఇందులో చేర్చే ఆలోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
కోరుకున్న కాలేజీ.. కోర్సు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సేవలు, తెలంగాణ (దోస్త్) ద్వారా తొలిదశ డిగ్రీ సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. మొత్తం 1,05,935 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 78,212 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 73,226 మందికి సీట్లు కేటాయించారు. 4,992 మంది తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారికి సీట్లు కేటాయించలేదు. ఎక్కువ మందికి కోరుకున్న కోర్సులు, కాలేజీల్లోనే సీట్లు వచ్చాయి. 53,032 (72శాతం) మందికి వారు పెట్టుకున్న తొలి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు దక్కాయి. ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. కామర్స్‌కు ఫుల్ క్రేజ్ దోస్త్‌లో మొత్తం 889 కాలేజీలు పాల్గొన్నాయి. 512 కోర్సులకు మొత్తం 3,56,258 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు 3,43,102 ఆప్షన్లు ఇచ్చారు. 63 కాలేజీలకు ఒక్క ఆప్షన్ కూడా రాకపోవడం గమనార్హం. కాగా సీట్లు దక్కిన వారిలో బాలురు 29,107 మంది ఉంటే, బాలికలు 44,119 మంది ఉన్నారు. కామర్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని మరోసారి రుజువైంది. దోస్త్‌లో ఈ కోర్సుకు 1,04,687 ఆప్షన్లు అందాయి. తొలిదశలో 33,251 సీట్లు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ కోర్సుకూ పోటీ ఎక్కువే ఉంది. ఈ కోర్సు అందుబాటులో ఉన్న 14 కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటే, అన్నీ తొలి దశలోనే భర్తీ అయ్యాయి. బీఎస్సీ (ఆనర్స్) బయో టెక్నాలజీ కోర్సును సిటీ కాలేజీలో ప్రవేశపెట్టారు. ఇక్కడ 60 సీట్లూ తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ఆర్ట్స్‌లో 1771, లైఫ్సైన్సెస్లో 16,434, ఫిజికల్ సైన్స్‌లో 13,468, డేటా సైన్స్ (ఏఐఎంఎల్)లో 1955, డి ఫార్మసీలో 254, ఇతర కోర్సుల్లో 87 మందికి సీట్లు కేటాయించారు. 30న రెండోదశ కేటాయింపు: మిత్తల్ దోస్త్ ద్వారా తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ఇలా చేయని పక్షాన సీటు మాత్రమే కాకుండా, దోస్త్ రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్వల్పంగా ఫీజు ఉంటుందని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ విద్యార్థులు తదుపరి దశల్లో మెరుగైన బ్రాంచీలో, కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చన్నారు. అప్పటివరకు కాలేజీల్లో సర్టీఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రెండో దశ సీట్ల కేటాయింపు ఈ నెల 30న ఉంటుందన్నారు. ఈ సారి 83 మంది విద్యార్థులు ఇల్లు కదలకుండానే ఆధార్ అనుసంధానంతో ఓటీపీ ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జూలై 17 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. -
సీట్లు కొండంత.. భర్తీ సగమంత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఏటా 3.2 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే డిగ్రీ సీట్లు మాత్రం 4.5 లక్షలకు పైనే ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇతర కోర్సులు పోనూ డిగ్రీలో చేరికలయ్యాక ప్రతి ఏటా దాదాపు 2 లక్షలకు పైనే సీట్లు మిగులుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇదే నడుస్తోంది. దీంతో ఉన్నత విద్యా మండలి పునః సమీక్షకు సిద్ధమైంది. డిమాండ్ ఉన్న కోర్సులు, విద్యార్థులు ఎక్కువగా చేరే కాలేజీలకే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అలాగే నాణ్యత, అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులనూ ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు రాష్ట్రంలో 1,080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీలే. ఈ ఏడాది ఈ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్లు ముగిసే సమయానికి 2,49,266 సీట్లే భర్తీ అయ్యాయి. దాదాపు 40 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. 30 కాలేజీల్లో కొన్ని గ్రూపుల్లో విద్యార్థులు నామమాత్రం కన్నా తక్కువే చేరారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏటా ఇంటర్ పాసయ్యే వారి సంఖ్య 3.2 లక్షలకు మించట్లేదు. ఇందులో 70 వేల మంది ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సులను ఎంచుకుంటున్నారు. మిగతా వాళ్లు డిగ్రీలో చేరుతున్నారు. ఈ లెక్కన 2.5 లక్షల డిగ్రీ సీట్లున్నా సరిపోతుంది. కానీ ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు ఇష్టానుసారం అనుమతి ఇస్తున్నారు. పాఠ్య ప్రణాళిక ప్రక్షాళన! విద్యార్థుల చేరికను పరిశీలిస్తే కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంటోంది. బీకాంలో 40 శాతం మంది చేరితే ఫిజికల్ సైన్స్ 35 శాతం మంది చేరుతున్నారు. బీఏలో 20 శాతానికి మించట్లేదు. డిగ్రీ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది. దీన్ని దూరం చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు అందిపుచ్చుకుని బీఏ (హానర్స్), బీకాం కోర్సులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. తరగతి బోధన కన్నా ప్రాజెక్టు వర్క్ ఎక్కువ ఉండాలని భావిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలున్న కాలేజీలను గుర్తించి వాటికే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే నాణ్యత లేని కాలేజీలు తగ్గుతాయని, సీట్ల మిగులు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. సీట్లు కాదు.. నాణ్యతే ముఖ్యం విద్యార్థుల సంఖ్యకు మించి డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నది నిజమే. అయితే నాణ్యత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. మూస విద్యావిధానానికి బదులు సరికొత్త బోధన ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో గ్రాడ్యుయేషన్‌లో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు. మన దగ్గర బీఏ చేస్తే ఎంకాం చేయడానికి వీల్లేదు. డిగ్రీలో ప్రమాణాలు పెంచితే పోటీని తట్టుకునే కాలేజీల సంఖ్య తగ్గి పరిమిత సీట్లే ఉండే వీలుంది. – ప్రొఫెసర్ రవీందర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి) ఇక ఈసారి నో చాన్స్ చేరే వాళ్లే లేనప్పుడు డిగ్రీలో ఇన్ని కాలేజీలు, ఇన్ని సీట్లు అవసరమా? అని ప్రశ్న వినిపిస్తోంది. నిజమే.. దాదాపు 30, 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల కోర్సుల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. వాస్తవానికి వీటిని మూసేయాలి. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు ఏటా నెట్టుకొస్తున్నాయి. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నాం. – ప్రొఫెసర్ లింబాద్రి, (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
మొదట విడత డిగ్రీ సీట్ల కేటాయింపు: కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్(దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించినట్లు ‘దోస్త్’ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం వెల్లడించారు. కాగా మొత్తం1,71,275 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,53,323 మంది విద్యార్థులు ఆప్షన్స్‌ను ఎంచుకున్నారు. వీరిలో 1,41,340 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్లు లింబాద్రి పేర్కొన్నారు. కేటాయింపులు పూర్తయిన అనంతరం 2,66,050 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆ తర్వాత రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. మరోవైపు రెండో విడత రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం(నేటి) నుంచి మొదలైందని లింబాద్రి పేర్కొన్నారు. -
రిజిస్టర్ చేసుకున్న అందరికీ డిగ్రీ సీటు
హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీటు ఇస్తామని కళాశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. వెబ్సైట్ నుంచి విత్‌డ్రా అయినవారు, సీట్ క్యాన్సిల్ చేసుకున్నవారు కూడా సీటు కావాలంటే తమ హెల్ప్ డెస్క్ లేదా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) వెబ్‌సైట్‌లోని ఫిర్యాదుల బాక్సులో తమ అభ్యర్ధనను తెలియజేయవచ్చన్నారు. 7660020711 ఫోన్ నంబరులోనూ సంప్రదించవచ్చని, యూనివర్సిటీల్లోనూ సంప్రదించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా హెల్ప్ డెస్క్, ఫోన్నెంబర్లో సంప్రదించవ్చని వివరించారు. రాష్ట్రంలోని 1,086 డిగ్రీ కాలేజీల్లో 3,79,734 సీట్లు ఉండగా, అందులో ఆన్లైన్ ద్వారా 2,02,763 మందికి సీట్లు కేటాయించినట్లు వివరించారు. కోర్టును ఆశ్రయించి మరో 42 కాలేజీలు సొంతంగా 21 వేల మందికి ప్రవేశాలు కల్పించాయని, మొత్తంగా ఈసారి 2.33 లక్షల మంది డిగ్రీలో చేరినట్లు తెలిపారు. మొబైల్ యాప్‌తో మరింత చేరువగా సేవలు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరంలో మరింత సరళీకరిస్తామని విజయ్ కుమార్ వివరించారు. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా, సులభరతం చేస్తామన్నారు. ఇంటర్నెట్ కేంద్రాల్లోనే కాకుండా, మొబైల్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి సీట్లు పొందిన విద్యార్థులు క్యాన్సిల్ చేసుకోవాలంటే రెండు మూడు దశల్లో క్రాస్ చెకింగ్ పెడతామన్నారు. ఒకసారి రద్దు చేసుకుంటే సీటు పోతుంది కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వెబ్సైట్లో క్యాన్సిల్ ఆప్షన్ నొక్కడమే కాకుండా ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబరు ఇస్తామని, వారికి తెలియజేయాలని, ఆ తరువాత యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఒకరిని నియస్తామని.. వారితో మాట్లాడాకే సీటు రద్దుకు అవకాశం కల్పిస్తామన్నారు. బయోమెట్రిక్‌లో బోధించే పాఠం.. కాలేజీకి వచ్చే లెక్చరర్ల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడంతోపాటు వారు తరగతి గదికి వెళ్లినపుడు ఏ రోజున, ఏ పాఠం బోధించారన్న వివరాలను బయోమెట్రిక్ పరికరంలో నమోదు చేసేలా చర్యలు చేపట్టినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎంత సిలబస్ పూర్తయిందన్న వివరాలు కూడా తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ విధానాన్ని 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అమల్లోకి తెచ్చామన్నారు. ఇదే విధానం జూనియర్ కాలేజీల్లో అమలుపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.