కోరుకున్న కాలేజీ.. కోర్సు | Full demand for commerce and computers | Sakshi
Sakshi News home page

కోరుకున్న కాలేజీ.. కోర్సు

Published Sat, Jun 17 2023 4:23 AM | Last Updated on Sat, Jun 17 2023 4:17 PM

Full demand for commerce and computers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సేవలు, తెలంగాణ (దోస్త్‌) ద్వారా తొలిదశ డిగ్రీ సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. మొత్తం 1,05,935 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 78,212 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 73,226 మందికి సీట్లు కేటాయించారు. 4,992 మంది తక్కువ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారికి సీట్లు కేటాయించలేదు.

ఎక్కువ మందికి కోరుకున్న కోర్సులు, కాలేజీల్లోనే సీట్లు వచ్చాయి. 53,032 (72శాతం) మందికి వా­రు పెట్టుకున్న తొలి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు దక్కాయి. ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలను మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబా­ద్రి, విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్య­దర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా­కు వెల్లడించారు. 

కామర్స్‌కు ఫుల్‌ క్రేజ్‌ 
దోస్త్‌లో మొత్తం 889 కాలేజీలు పాల్గొన్నాయి. 512 కోర్సులకు మొత్తం 3,56,258 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు 3,43,102 ఆప్షన్లు ఇచ్చారు. 63 కాలేజీలకు ఒక్క ఆప్షన్‌ కూడా రాకపోవడం గమనార్హం. కాగా సీట్లు దక్కిన వారిలో బాలురు 29,107 మంది ఉంటే, బాలికలు 44,119 మంది ఉన్నారు. కా­మర్స్‌ కోర్సుకు డిమాండ్‌ పెరుగుతోందని మరో­సారి రుజువైంది. దోస్త్‌లో ఈ కోర్సుకు 1,04,687 ఆప్షన్లు అందాయి. తొలిదశలో 33,251 సీట్లు కేటాయించారు.

ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుకూ పోటీ ఎక్కువే ఉంది. ఈ కోర్సు అందుబాటులో ఉన్న 14 కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటే, అన్నీ తొలి దశలోనే భర్తీ అయ్యాయి. బీఎస్సీ (ఆనర్స్‌) బయో టెక్నాలజీ కోర్సును సిటీ కాలేజీలో ప్రవేశపెట్టారు. ఇక్కడ 60 సీట్లూ తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ఆర్ట్స్‌లో 1771, లైఫ్‌సైన్సెస్‌లో 16,434, ఫిజికల్‌ సైన్స్‌లో 13,468, డేటా సైన్స్‌ (ఏఐఎంఎల్‌)లో 1955, డి ఫార్మసీలో 254, ఇతర కోర్సుల్లో 87 మందికి సీట్లు కేటాయించారు.  

30న రెండోదశ కేటాయింపు: మిత్తల్‌ 
దోస్త్‌ ద్వారా తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాలని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. ఇలా చేయని పక్షాన సీటు మాత్రమే కాకుండా, దోస్త్‌ రిజిస్ట్రేషన్  కూడా రద్దవుతుందన్నారు. రిజిస్ట్రేషన్  కోసం స్వల్పంగా ఫీజు ఉంటుందని తెలిపారు.

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినప్పటికీ విద్యార్థులు తదుపరి దశల్లో మెరుగైన బ్రాంచీలో, కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చన్నారు. అప్పటివరకు కాలేజీల్లో సర్టీఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రెండో దశ సీట్ల కేటాయింపు ఈ నెల 30న ఉంటుందన్నారు. ఈ సారి 83 మంది విద్యార్థులు ఇల్లు కదలకుండానే ఆధార్‌ అనుసంధానంతో ఓటీపీ ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్  చేసుకున్నారని తెలిపారు. జూలై 17 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement