హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీటు ఇస్తామని కళాశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. వెబ్‌సైట్ నుంచి విత్‌డ్రా అయినవారు, సీట్ క్యాన్సిల్ చేసుకున్నవారు కూడా సీటు కావాలంటే తమ హెల్ప్ డెస్క్ లేదా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) వెబ్‌సైట్‌లోని ఫిర్యాదుల బాక్సులో తమ అభ్యర్ధనను తెలియజేయవచ్చన్నారు. 7660020711 ఫోన్ నంబరులోనూ సంప్రదించవచ్చని, యూనివర్సిటీల్లోనూ సంప్రదించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా హెల్ప్ డెస్క్, ఫోన్‌నెంబర్‌లో సంప్రదించవ్చని వివరించారు. రాష్ట్రంలోని 1,086 డిగ్రీ కాలేజీల్లో 3,79,734 సీట్లు ఉండగా, అందులో ఆన్‌లైన్ ద్వారా 2,02,763 మందికి సీట్లు కేటాయించినట్లు వివరించారు. కోర్టును ఆశ్రయించి మరో 42 కాలేజీలు సొంతంగా 21 వేల మందికి ప్రవేశాలు కల్పించాయని, మొత్తంగా ఈసారి 2.33 లక్షల మంది డిగ్రీలో చేరినట్లు తెలిపారు.
మొబైల్ యాప్‌తో మరింత చేరువగా సేవలు
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరంలో మరింత సరళీకరిస్తామని విజయ్ కుమార్ వివరించారు. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా, సులభరతం చేస్తామన్నారు. ఇంటర్నెట్ కేంద్రాల్లోనే కాకుండా, మొబైల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
వచ్చే ఏడాది నుంచి సీట్లు పొందిన విద్యార్థులు క్యాన్సిల్ చేసుకోవాలంటే రెండు మూడు దశల్లో క్రాస్ చెకింగ్ పెడతామన్నారు. ఒకసారి రద్దు చేసుకుంటే సీటు పోతుంది కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వెబ్‌సైట్‌లో క్యాన్సిల్ ఆప్షన్ నొక్కడమే కాకుండా ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబరు ఇస్తామని, వారికి తెలియజేయాలని, ఆ తరువాత యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఒకరిని నియస్తామని.. వారితో మాట్లాడాకే సీటు రద్దుకు అవకాశం కల్పిస్తామన్నారు.
బయోమెట్రిక్‌లో బోధించే పాఠం..
కాలేజీకి వచ్చే లెక్చరర్ల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడంతోపాటు వారు తరగతి గదికి వెళ్లినపుడు ఏ రోజున, ఏ పాఠం బోధించారన్న వివరాలను బయోమెట్రిక్ పరికరంలో నమోదు చేసేలా చర్యలు చేపట్టినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎంత సిలబస్ పూర్తయిందన్న వివరాలు కూడా తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ విధానాన్ని 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అమల్లోకి తెచ్చామన్నారు. ఇదే విధానం జూనియర్ కాలేజీల్లో అమలుపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
రిజిస్టర్ చేసుకున్న అందరికీ డిగ్రీ సీటు
Published Mon, Sep 26 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement
Advertisement