నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య | Naga Chaitanya Talks About Thandel Movie Press Meet | Sakshi
Sakshi News home page

నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య

Published Thu, Feb 6 2025 2:19 AM | Last Updated on Thu, Feb 6 2025 2:19 AM

Naga Chaitanya Talks About Thandel Movie Press Meet

‘‘తండేల్‌’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్‌ ఉంటాయి. నా కెరీర్‌లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్‌ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్‌ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్‌ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్‌’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్‌’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... 

→ ‘ధూత’ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నప్పుడు ‘తండేల్‌’ మూవీ లైన్‌ని విక్రమ్‌ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్‌ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్‌ చేసి, ఫైనల్‌ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్‌ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్‌’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. 

→ ‘తండేల్‌’ అంటే లీడర్‌. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేయడం నటనకి కూడా ప్లస్‌ అవుతుంది. జైలు సెట్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్స్‌ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్‌ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్‌’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్‌ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. 

→ చందు, నా కాంబోలో ‘తండేల్‌’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్‌ లవ్‌’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్‌’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. 

→ ‘తండేల్‌’ షూటింగ్‌ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్‌ గార్డ్స్‌ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్‌’ రిలీజ్‌ తర్వాత నేషనల్‌ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. 
 

సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్‌ సెలక్ట్‌ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్‌ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్‌ చేసి, నాకు సర్‌ప్రైజ్‌ ఇస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement