Thandel Movie Review: 'తండేల్‌' మూవీ రివ్యూ | Naga Chaitanya And Sai Pallavi Starrer Thandel Telugu Movie Review And Rating | Sakshi
Sakshi News home page

Thandel Movie Review Telugu: 'తండేల్‌' దెబ్బ గట్టిగానే ఉంటుంది.. మూవీ రివ్యూ

Published Fri, Feb 7 2025 11:11 AM | Last Updated on Fri, Feb 7 2025 2:58 PM

Thandel Telugu Movie Review And Rating

టైటిల్‌ : తండేల్‌
నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులు
నిర్మాణ సంస్థ:   గీతా ఆర్ట్స్‌
నిర్మాతలు:     బన్నీ వాసు,అల్లు అరవింద్
కథ:     కార్తీక్ తీడ
దర్శకత్వం-స్క్రీన్‌ప్లే:     చందూ మొండేటి
సంగీతం:     దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్
విడుదల: పిబ్రవరి 7, 2025

Thandel Movie Review Telugu And Rating

సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్‌ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్‌' కావడంతో బజ్‌ బాగానే క్రియేట్‌ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్‌ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్‌ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్‌' కథ సెట్‌ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో  ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్‌ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్‌’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్‌ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.

Sai Pallavi In Thandel Movie

కథేంటంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది   మూడు బోట్లలో గుజరాత్‌ వెరావల్‌ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్‌ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్‌ వారిని అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తుంది. తండేల్‌ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్‌ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్‌ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి  వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. 

అప్పటికే తండేల్‌ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్‌ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్‌ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్‌ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ  తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్‌' కథ పూర్తిగా తెలుసుకోవాలి.

Thandel 2025 Movie Rating

ఎలా ఉందంటే
చందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా  ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్‌, సవ్యసాచి చిత్రాలను  తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్‌ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్‌ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్‌ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్‌,  సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు.  శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు.  తండేల్‌ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్‌ అయ్యారు.

ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. 

ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ ప్రతి ప్రేమికులకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.

Thandel Movie Wallpapers

చిత్ర యూనిట్‌ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్‌ అవుతారు.  సినిమా ఫస్ట్‌ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్‌ టీమ్‌ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు.  కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్‌ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్‌ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.

అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్‌ దేశభక్తితో పర్‌ఫెక్ట్‌గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్‌ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్‌ 370 రద్దు వల్ల పాక్‌ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్‌ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది.  పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.

Naga Chaitanya In Thandel Movie

ఎవరెలా చేశారంటే..
నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్‌లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్‌ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్‌ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్ల నుంచి భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్‌ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్,  నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ  ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Thandel Stills

ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్‌ సూపర్‌ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్‌ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్‌ పడిందని చెప్పవచ్చు.

- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement