
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎటు చూసినా గందరగోళం
ఆధునీకరణ నేపథ్యంలో ప్రవేశ ద్వారాల మూసివేత
సూచికలు లేక ఇబ్బందిపడుతున్నామన్న ప్రయాణికులు
సికింద్రాబాద్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Station) ఆధునీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వేలాది మంది బండెడు లగేజీ మోసుకుంటూ.. పిల్లల్ని భుజాన వేసుకుని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించడం, స్టేషన్ నుంచి బయటికి రావడం కోసం నానా అగచాట్లు పడుతున్నారు.
ఆధునీకరణ కోసం రెండు ప్రధాన ద్వారాలను బారికేడ్లతో మూసివేసిన రైల్వే అధికారులు.. అందుబాటులో ఉన్న మార్గాలు ఎక్కడి నుంచి ఉన్నాయో చెప్పే ఏర్పాట్లు చేయలేదు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు తొలగించారు. దీనితో స్టేషన్ లోపలికి వెళ్లడం, బయటికి రావడం కోసం అవస్థల పాలవుతున్నారు. ఇక రైల్వేస్టేషన్ ప్రవేశద్వారాల ముందు బారికేడ్లు ఉండటం, ఉన్న కాస్త స్థలంలో ప్రయాణీకుల కోసం వచ్చే వాహనాలతో ఇబ్బంది ఎదురవుతోంది.
కనీ కనిపించకుండా.. : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 2, 4 నంబర్ ప్రవేశద్వారాలను మూసివేసిన అధికారులు.. ప్రయాణీకుల రాకపోకల కోసం 3, 5 నంబర్ ద్వారాలను అందుబాటులో ఉంచారు. ఇందు లో 3వ నంబర్ ద్వారం ఓ మోస్తరు విశాలంగా ఉండగా, పార్శిల్ కార్యాలయం పక్కన ఉన్న 5వ నంబర్ ద్వారం ఇరుకుగా ఉండి ఇబ్బంది రెట్టింపు అవుతోంది. మరోవైపు ప్లాట్ ఫామ్‌లపై సేదతీరే అవకాశం లేక ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్‌కు ముందు తాత్కాలిక జనరల్ బుకింగ్ కార్యాలయం వద్ద ఇరుకైన ప్రదేశంలో పడిగాపులు కాస్తున్నారు.
ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం వైపే.. : సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే రైళ్లలో రాకపోకలు సాగించే లక్షన్నర మంది ప్రయాణికుల్లో 70శాతం మంది 1వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగానే స్టేషన్‌లోకి, బయటికి వెళ్తుంటారు. పదో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నా.. సరిగా రవాణా సదుపాయాలు లేక వెళ్లడం లేదు.
ఎలా వెళ్లాలో చెప్పేవారు లేరు..
రైలు వచ్చే కొంత సమయం ముందు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. జనరల్ బుకింగ్ కార్యాలయం ముందు ఇరుకైన స్థలంలోనే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్టేషన్ ముందు తాగునీరు, టాయిలెట్ల వసతి లేదు. ఎక్కడి నుంచి స్టేషన్ లోనికి వెళ్లాలో సూచించేవారు లేరు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – సుజన్, ప్రయాణికుడు
Comments
Please login to add a commentAdd a comment