విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?  | Board of Education Focus on Degree Colleges | Sakshi
Sakshi News home page

విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు? 

Published Sun, Dec 3 2023 4:25 AM | Last Updated on Sun, Dec 3 2023 4:25 AM

Board of Education Focus on Degree Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు.  

1.84 లక్షల సీట్లు ఖాళీ 
ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్‌ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు.

దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్‌ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి.  

ఆదరణలేని స్కిల్‌ కోర్సులు 
డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్‌ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్‌ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్‌ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్‌ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్‌ డిమాండ్‌ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. 

మార్పులు అనివార్యం.. 
రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి  (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌) 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement