Board of Education
-
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కని్పస్తోంది. వచ్చే నెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి గుర్తింపు రాలేదు. అసలు ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. అయితే దీనికన్నా ముందు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ 2024–25 విద్యా సంవత్సరానికి క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాలి. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభిస్తుంది. జూన్ 10కల్లా అనుమతి రాని కాలేజీలు.. సౌకర్యాలు కల్పించుకుని మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పింస్తారు. ఈ ప్రక్రియను జూన్ 30 నాటికి ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూన్ 10 నాటికి అనుమతి లభించడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోర్సుల చేరిక వల్లే ఆలస్యం జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. టెన్త్ వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్ కోర్సులకు ఇలా.. క్రెడిట్స్ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కని్పస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు గుర్తింపు ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నాయి. జోసా కౌన్సెలింగ్ నాటికి జరిగేనా? ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయింది. త్వరలో జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈలోగానే అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించింది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కాలేజీలను ఏఐసీటీఈ పరిధిలోకి కొత్తగా తేవడం వల్ల కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) -
TS 10th ఫలితాలు విడుదల
-
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల సమర్పణకు అపరాధ రుసుం లేకుండా చివరి గడువైన ఏప్రిల్ 15వ తేదీ నాటికే గత ఏడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు మించి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. ఆ తరువాత కూడా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటికి దరఖాస్తుల సంఖ్య 3,37,500కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే.. 12 శాతం మేర అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌తో పాటు అగ్రికల్చర్ స్ట్రీమ్‌లోనూ దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా దాఖలయ్యాయి. గత ఏడాది రూ.10 వేల అపరాధ రుసుంతో చివరి గడువు నాటికి మొత్తం దరఖాస్తులు 2.90 లక్షల వరకు మాత్రమే రాగా.. ఈసారి ఎక్కువగా దాఖలు అయ్యాయి. అపరాధ రుసుంతో 14 వరకు గడువు అపరాధ రుసుం రూ.వెయ్యితో ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా.. రూ.5 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు గడువు విధించారు. మే 15వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు పెద్దఎత్తున దరఖాస్తులు అందడంతో పరీక్ష కేంద్రాల సంఖ్య, సీటింగ్ పరిస్థితిని అనుసరించి పరీక్షల షెడ్యూల్‌ను ఒకరోజు అదనంగా ఇంతకు ముందే పొడిగించారు. వాస్తవానికి 15 నుంచి 18 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 8 సెషన్లలో పరీక్షలను ముగించాలని ముందు భావించారు. అయితే, దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పరీక్ష రాసేందుకు ఏర్పాటైన కంప్యూటర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థులను సర్దుబాటు చేసినా ఇంకా అదనంగా వేలాది మంది అభ్యర్థులు మిగిలి ఉంటున్నారు. ఈ తరుణంలో పరీక్షలను మరో రోజుకు కూడా పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో గతంలో 80వేల వరకు దరఖాస్తులు అందగా.. ఈసారి వాటి సంఖ్య 96 వేలకు చేరుకుంది. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలను మే 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా, ఈఏపీ సెట్లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కలి్పంచి ర్యాంకులను ఇవ్వనున్నారు. బీఎస్సీ నర్సింగ్ సీట్లూ ఈఏపీ సెట్ ద్వారానే భర్తీ ఇప్పటివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్న బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా 2023–24 విద్యాసంవత్సరం నుంచి ఈఏపీ సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. దీంతో ఈ సీట్ల కోసం పోటీపడే విద్యార్థులు కూడా ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరుకానున్నారు. -
కొత్త విధానం.. ఇక పరీక్షల్లో చూసి రాయడమే.. ఎలాంటి అనుమానలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిపాటు పుస్తకాలు తిరగేయడం... ముఖ్యమైనవి బట్టీపట్టడం... ఆఖరులో పునశ్చరణతో హడావుడి చేయడం.. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన పరీక్ష విధానం. ఇందులో పరీక్ష హాల్లోకి చిన్న చిట్టీని కూడా అనుమతించరు. కానీ, ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షలు నిర్వహించింది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతించింది. గత నవంబర్‌లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్లో అకడమిక్ పుస్తకాన్ని చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పుస్తకాలు చూడకుండా 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సబ్జెక్టు పరీక్షలో కేవలం 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. ఇక నుంచీ ఇదే తరహా పరీక్ష విధానాన్ని మరికొన్ని సబ్జెక్టులకు విస్తరించాలనే యోచనలో అధికారులున్నారు. కాపీ కొట్టడం కాదు.. క్రియేటివిటీ పెంచడం చూచి రాస్తే మార్కులు రావా? రిజల్ట్ పెరిగితే గొప్పా? ఇలాంటి అనుమానులొస్తే పొరపాటే అంటున్నారు అధికారులు. ఇంతకాలం బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి, విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంచడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. పరీక్షకు మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలో ప్రశ్నలు అడగడంలోనే అసలు కిటుకు ఉంటుంది. ప్రశ్నలను నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో అడుగుతారు. క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్నట్టు సమాధానాలు ఈ అకడమిక్ పుస్తకాల్లో నేరుగా దొరకవు. ఉదాహరణకు త్రికోణమితిని పాఠ్యాంశంలో పొందుపరిస్తే.. పరీక్షలో వచ్చే ప్రశ్న ఇదే మూస పద్ధతిలో ఉండదు. ఆ లెక్కను పూర్తిగా సాధన చేస్తే... సూత్రాల ప్రకారం అనుసరిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఒక రకంగా ఇది విద్యార్థి మరింత ఆలోచించి సమాధానం ఇవ్వగలిగేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు అంటున్నారు. చాప్టర్ మొత్తం చదవడమే కాకుండా, ఏ కోణంలోనైనా సమాధానం రాయగల నేర్పును ముందు నుంచే విద్యార్థి అలవర్చుకోవాలి. అప్పుడే ఓపెన్ బుక్ విధానంలో సమాధానం రాసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో బట్టీ విధానంలో ట్విస్ట్ చేసి ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఆలోచన దిశగా విద్యార్థి వెళ్లలేదని ఫలితాలను బట్టి తెలుస్తోందని అధికారులు అంటున్నారు. ఓపెన్ బుక్ విధానంపై ముందే అవగాహన కల్పించడం వల్ల వివిధ కోణాల్లో ఆలోచనాశక్తిని పెంచుకున్నారని చెబుతున్నారు. పరీక్షల నాణ్యత పెరుగుతుంది విద్యార్థి పట్టాతో బయటకు రావడం కన్నా... మంచి నైపుణ్యం, ఆలోచనాశక్తితో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరం మార్కెట్లో మంచి కేరీర్‌కు ఇదే దోహదపడుతుంది. ఓపెన్ బుక్ విధానంతో విద్యార్థి నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ సి.శ్రీనాథ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆలోచనకు పదును క్లోజ్డ్ బుక్ విధానానికి, ఓపెన్ బుక్ విధానానికి చాలా తేడా ఉంది. పుస్తకం దగ్గరున్నా, ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడానికి చాప్టర్ మొత్తం చదవాల్సి వచ్చింది. దీనిపై ముందే అవగాహన కల్పించడంతో సబ్జెక్ట్‌పై కమాండ్ తెచ్చుకున్నాం. బట్టీ పద్ధతి కాకుండా, మరింత ఆలోచించి సమాధానాలు రాశాం. మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సులువుగా జవాబులు రాయొచ్చనే విశ్వాసం పెరిగింది. – ఎన్.ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ విద్యార్థి, హైదరాబాద్ -
కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్‌లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించిన టీఎస్సీహెచ్ఈ... ఆ కోర్సు పాఠ్యాంశం, విధానాలు తదితరాల ఖరారు కోసం డీజీపీ కార్యాలయం, ఉస్మా ని యా, జేఎన్టీయూ, నల్సార్ యూనివర్సిటీల తో పాటు ఐఐటీ హైదరాబాద్‌లను ప్రతి పాది స్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం టీఎస్సీ హెచ్ఈ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ కోర్సు విధివిధానాలపై చర్చించారు. -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్‌లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్‌కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్‌ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్‌కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్‌లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్‌ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్‌ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించడం... ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్ పరీక్షలు రాసేందుకు అర్హులే. ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
విద్యార్థులకేం కావాలి..?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారనే అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడింది. విద్యార్థులకేం కావాలి.? వాళ్లు ఏం కోరుకుంటున్నారు.. అనే ప్రాతిపదికన పరీక్షల విధానం, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మూల్యాంకన విధానం రూపొందించే దిశగా ముందుకెళుతోంది. ఉన్నత విద్యామండలి, కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఉన్నత విద్య పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తోడ్పాటు తీసుకోనున్నాయి. ఇందుకోసం ఐఎస్బీతో ప్రత్యేక అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ కీలక భేటీ జరిగింది. సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ఏడు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగం కోరుకునే అర్హతలపై ఐఎస్బీ విశ్లేషణకు ఈ డేటాను వాడుకోనుంది. మార్పు అనివార్యం: నవీన్ మిత్తల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని, దీనికి ప్రత్యేక అధ్యయనం చేయాలని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఐఎస్బీతో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్, సాధికారతకు మూల్యాంకన, విద్యా బోధనలో మార్పులు చేసేందుకు ఐఎస్బీ అధ్యయనం కీలకం కానుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. ఐఎస్బీ అధ్యయనం తర్వాత ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పు వచ్చే వీలుందన్నారు. తాము చేపట్టబోయే అధ్యయనం గురించి ఐఎస్బీ ప్రతినిధి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో మండలి వైస్–చైర్మన్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
లక్షన్నర డిగ్రీ సీట్లు కుదింపు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల నుంచి డిమాండ్ లేని కోర్సులను భారీగా కుదించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కనీసం 15 శాతం విద్యార్థులు చేరని కాలేజీలకూ అనుమతి నిరాకరించాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని మండలి వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారులు సమావేశమై దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంజనీరింగ్ విద్యలో ఈ స్థాయి మార్పును ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. విద్యార్థులు చేరని సివిల్, మెకానికల్ కోర్సుల్లో దాదాపు 10 వేల వరకూ సీట్లు తగ్గించారు. వాటి స్థానంలో కంప్యూటర్ కోర్సులకు అనుమతించారు. ఈ సీట్లు ఈ సంవత్సరం 9 వేలకుపైగా పెరిగాయి. ఇదే విధానాన్ని డిగ్రీ కోర్సుల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కోర్సులు తగ్గబోతున్నాయి. 1.50లక్షల సీట్లు కుదింపు సీట్ల తగ్గింపు ప్రక్రియకు ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలను కొలమానంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. వీటిలో ఈ ఏడాది దోస్త్‌లో 2,10,970 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. నాన్–దోస్త్ కాలేజీలు కలుపుకుంటే 2.20 లక్షల సీట్లు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ లెక్కన దాదాపు 2.40 లక్షల సీట్లు మిగిలిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 1.50లక్షల సీట్లు వచ్చే దోస్త్‌లో లేకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొన్నేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది బీకాంలో 87,480 మంది చేరితే బీఎస్సీ లైఫ్‌సైన్స్, ఫిజికల్ సైన్స్‌లో కలిపి 75896 మంది చేరారు. సగానికిపైగా ఆక్రమించిన ఈ కోర్సులకు రాబోయే కాలంలోనూ మంచి డిమాండ్ ఉండొచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇక బీఏలో కేవలం 31838 మంది చేరారు. ఈ కోర్సులో 75 వేలకుపైగా సీట్లున్నాయి. ఇలాంటి కోర్సులను తగ్గించే యోచనలో ఉన్నారు. బీబీఎం, ఒకేషనల్, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. కాలేజీల్లో అవగాహన గత నాలుగేళ్ల డేటాను సేకరించిన ఉన్నత విద్యా మండలి జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలను 50 వరకూ గుర్తించారు. 15 శాతం లోపు విద్యార్థులు చేరిన సెక్షన్లు వంద వరకూ ఉంటాయని అంచనా. ఇలాంటి కాలేజీల యాజమాన్యాల్లో ముందుగా అవగాహన కల్గించే యోచనలో ఉన్నారు. విద్యార్థులు ఎక్కువగా డిగ్రీ కోర్సులకు కూడా హైదరాబాద్ వరకూ వస్తున్నారు. డిగ్రీతో పాటు ఇతర కోర్సులు నేర్చుకునే అవకాశం ఉండటంతో ఈ తరహా ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే కాలేజీల్లో చేరికలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధానమైన కోర్సులు ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా ఇతర కోర్సుల్లోకి సీట్లు మార్చుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీనికి ముందుకు రాకపోతే కాలేజీల్లో సీట్లు తగ్గించడం, విద్యార్థులు లేని కాలేజీలకు అనుమతులు రద్దు చేసే వీలుంది. సీట్ల మార్పిడికి అవకాశం విద్యార్థులు చేరని కోర్సులను ఇంకా కొనసాగించడం సరికాదు. డిమాండ్ ఉన్న కోర్సుల్లో, అదనపు సెక్షన్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. డిమాండ్‌కు తగ్గట్టుగానే డిగ్రీ సీట్లకు అనుమతించాలనే ఆలోచనకు కార్యరూపం తీసుకొస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
ఇంజనీరింగ్‌లో పెరిగిన ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ప్రవేశం పెరిగింది. అన్ని దశల ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ ఏడాది కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక రూపొందించింది. దాని ప్రకారం.. 177 కాలేజీల్లో 1.10 లక్షల సీట్లకు సాంకేతిక విద్యా విభాగం కౌన్సెలింగ్ నిర్వహించింది. 2021–22లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేల మంది ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచ్‌ల్లో చేరగా.. ఈ ఏడాది (2022–23) ప్రవేశాల సంఖ్య 80 వేలు దాటింది. అయినప్పటికీ 30 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది 61,972 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ అయ్యాయి. కంప్యూటర్ కోర్సుల్లోనే పెరుగుదల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సులు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దాదాపు వంద కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 10 వేల సీట్లు తగ్గించుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. ఇప్పుడివన్నీ భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన 61,972 సీట్లలో 45 వేలకుపైగా సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సులవే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ)లో 12,503 సీట్లుంటే, 10,789 సీట్లు భర్తీ అయ్యాయి. మెకానికల్‌లో 4,653 సీట్లకు గాను 1,249 మంది చేరగా, సివిల్‌లో 5,060 సీట్లు ఉంటే, ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 1,683 మంది మాత్రమే కావడం గమనార్హం. యాజమాన్య కోటాలోనూ కంప్యూటర్ కిక్ రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్య కోటాలో 30 వేలకు పైగా సీట్లు ఉండగా.. ఇందులోనూ 18 వేల సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. ఈ కోటా కింద ఒక్కో సీటు కనిష్టంగా రూ.8 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకూ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాల వెల్లడి తర్వాత యాజమాన్య కోటా కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎగబడ్డారు. స్పాట్ అడ్మిషన్ల దశలో టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు ఒక్కటీ మిగల్లేదు. ఆఖరి దశలో సీటు పొందాలనుకునే వారు రెండవ ఆప్షన్‌గా ఎలక్ట్రానిక్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ముందు వరుసలో సీట్లు రిజర్వు చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఇక సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలు తంటాలు పడాల్సి వచ్చింది. ఆఖరి దశలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చాయి. -
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డిగ్రీలో చేరేందుకు సంబంధించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ 15తో ముగిసింది. ఇప్పటివరకూ వివిధ కోర్సుల్లో దాదాపు 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు. అయితే ఇప్పటివరకూ బీఫార్మసీ, న్యాయవాద వృత్తి కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించిన విద్యార్థులు, అక్కడా సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, దోస్త్ అడ్మిషన్ల తేదీ ముగియడంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దోస్త్ ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల తేదీని నిర్ణయించారు. దీంతో అనేకమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనివల్ల మరో 15 వేల వరకూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు. -
ఎంటెక్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఈనెల 15న సీట్ల కేటాయింపు ఉంటుందని, 19లోగా సీట్లు వచ్చిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించింది. కాగా, డిగ్రీలో ప్రవేశానికి (సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు) 9, 10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. -
జూలై 20న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ–2022) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సోమవారం విడుదల చేశారు. జూలై 20న ఈ పరీక్ష ఉస్మానియా వర్సిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకూ దరఖాస్తు చేసు కోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వీలుంది. పరీక్ష ఫీజును ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.450 చెల్లించాలి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లింబాద్రితో పాటు ఓయూ ఇన్చార్జి వీసీ సీతారామారావు, రిజి స్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి సెట్ వివరాలు వెల్లడించారు. డిగ్రీ ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు.. ►రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు. ►ఈసారి పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో గుణాత్మక మార్పులు తెచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే. ►నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్లైన్, డిస్టెన్స్మోడ్లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ►పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్లైన్లో పొందుపర్చాలి. మిగిలిపోతున్న సీట్లు.. ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మరీ తక్కువ ప్రవేశాలుంటున్నాయి. గతేడాది గజ్వేల్ కాలేజీలో పీజీ కెమిస్ట్రీలో ఐదుగురే చేరారు. వాళ్లను వేరే కాలేజీలకు పంపాల్సి వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా మండలి సరైన విధానం అనుసరించాలి. ఈ ఏడాది కూడా 44 వేల సీట్లున్నాయి. కొత్త కోర్సులకు అనుమతిస్తే మరో వెయ్యి సీట్లు పెరిగే వీలుంది. – ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి (సీపీజీఈటీ–2022 కన్వీనర్) -
‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానమైన ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’గుర్తింపును అన్ని కాలేజీలకు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేస్తోంది. న్యాక్ గుర్తింపు లేని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల జాబితా పెంచాలని ఉన్నత విద్యామండలి ప్రయ త్నం చేస్తున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు. సదస్సుకు కూడా రాకుండా.. న్యాక్ బెంగళూరు కేంద్రం ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్య మండలి భావించింది. దీనిపై ఈ నెల 20న సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు న్యాక్ గుర్తింపు ఏమోగానీ, కనీసం సదస్సులో పాల్గొనేందుకు కూడా విముఖత చూపినట్టు తెలిసింది. అనుకున్న మేర కాలేజీలు పాల్గొనేందుకు సుముఖత చూపకపోవడంతో న్యాక్ ప్రధాన కార్యాలయం ఆధికారులు సదస్సును వాయిదా వేశారు. నజరానా ఇస్తామన్నా.. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు రూ.లక్షల్లో నజరానా ఇస్తామని కూడా ఉన్నత విద్యా మండలి గతంలో ప్రకటించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటే ప్రమాణాలు పెంచుకోక తప్పదు. అంతగా ఆదాయం లేని తాము ప్రమాణాల కోసం ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచనతో అవి వెనుకడుగు వేస్తున్నాయి. ‘న్యాక్’ గ్రేడ్ ఉంటే విలువ దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)ను అమల్లోకి తెచ్చారు. వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఏర్పడే న్యాక్ కమిటీల ఆధ్వర్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. న్యాక్ ప్రధానంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమమైన ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి.. సదరు కాలేజీలు, యూనివర్సిటీలకు మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఈ గ్రేడ్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది. గుర్తింపు తప్పనిసరి అవ్వొచ్చు ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు న్యాక్ గుర్తింపు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాయి. కాకపోతే ఇది అమలు చేయడానికి కొంత సమయం ఇచ్చాయి. రాష్ట్రంలోనూ న్యాక్ గుర్తింపు కోసం ఉన్నత విద్యా మండలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలేజీలను ప్రోత్సహించి, చేయూతనివ్వాలని చూస్తోంది. ఈ ప్రక్రియను భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్తాం. న్యాక్ గుర్తింపు పొందడం తప్పనిసరి కావొచ్చు కూడా.. – వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -
డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌కు సరికొత్త విధానం ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఏ సబ్జెక్టు తీసుకుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనూ అదే కోర్సు చేయాల్సి ఉండేది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. అందుకే ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష నిబంధనలు సడలించారు. ఇక సోషల్ సైన్స్ గ్రూపులైన ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి కోర్సులు ఇంగ్లిష్, తెలుగులో చేయాలంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా సరిపోతుంది. ఉన్నత విద్యలో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌పై కూడా సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉస్మానియా వర్సిటీ వీసీకి ఉన్నత విద్యా మండలి సూచించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా దాదాపు 50 కాలేజీల్లో పలు కోర్సుల్లో జీరో ప్రవేశాలు ఉంటున్నాయి. వీటిని రద్దు చేయడమే మంచిదని మండలి భావిస్తోంది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులను కాలేజీలు నిర్వహించుకునేందుకు అనుమతించడంపై కసరత్తు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లేని గ్రూపుల స్థానంలో విద్యార్థులు కోరుకునే గ్రూపులకు కాలేజీలు ముందుకొస్తే పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 20 శాతం పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 20 శాతం పెంచాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఈ కోటా 5 శాతమే ఉంది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి విదేశీ భాషల కోర్సులను కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యా మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధన విధానంపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌కు అప్పగించింది. సమావేశంలో రాష్ట్ర కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా మండలి వైఎస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
వర్సిటీల్లో గ్రూప్స్‌కు ఫ్రీ కోచింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కోచింగ్ కోసం విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘కొలువు కొట్టాల్సిందే’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించగా స్పందించిన ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. వర్సిటీల పరిధిలోని వేలాది మంది విద్యార్థులు కోచింగ్ కోసం అప్పులు చేయడం సరికాదని, వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి చెప్పారు. దీంతో రాష్ట్రంలోని 6 వర్సిటీల ఉప కులపతులతో ఆయన సంప్రదింపులు జరిపారు. అనంతరం ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి శిక్షణ కార్యక్రమాన్ని సబితారెడ్డి ప్రారంభించి అన్ని వర్సిటీల వీసీలతో చర్చిస్తారని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. నిపుణులైన అధ్యాపకులను గుర్తించండి కోచింగ్ కోసం వర్సిటీల్లోని నిపుణులైన అధ్యాపకులను గుర్తించి వారి వివరాలు పంపాలని వీసీలకు లింబాద్రి సూచించారు. అవసరమైతే బయటి నుంచి కూడా ఫ్యాకల్టీని తీసుకోవాలన్నారు. గ్రూప్స్ అభ్యర్థులకు వర్సిటీ హాస్టళ్లల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని మంత్రి సూచించినట్టు అధికారులు తెలిపారు. ‘సాక్షి’ కథనం కదిలించింది సామర్థ్యం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అభ్యర్థుల దయనీయ కథనం కదిలించేలా ఉంది. వర్సిటీల్లో వేలాది మంది పేద, మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లున్నారు. వారి సమర్థతకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదన్న ఉద్దేశంతో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడా రాజీ పడకుండా మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. వర్సిటీ విద్యార్థులు అనవసరంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దు. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్‌కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. సరికొత్త అన్వేషణలు: ఏరోనాటికల్ విభాగంలో భారత్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్‌లో ఈ సెక్టార్లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి పరిణామమే ఫార్మా, ఏరోనాటికల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
సాంకేతిక విద్యకు చికిత్స అవసరం
సాక్షి, హైదరాబాద్: సాంకేతికవిద్యలో గుణాత్మక మార్పు అవసరమని అఖిల భారత ఉప కులప తుల సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మార్కె ట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలను వెతుక్కునేవాళ్లు కాదని, వ్యవస్థను మార్చేవాళ్లు కావాలని ఆకాంక్షిం చారు. శుక్రవారం ఇక్కడ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ‘ఆఫరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్’అనే అంశంపై అఖిల భారత విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సియంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గరీతిలో నిపుణులు కన్పించడం లేదని, ఏటా 21 లక్షలమంది ఇంజ నీర్లు పట్టాలతో వర్సిటీల నుంచి బయటకొస్తున్నా, వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరా లకు తగ్గ నైపుణ్యం ఉంటోందని అన్నారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ, ఈ స్థాయిలో నిపుణులు లభించడం కష్టమనే అభిప్రా యం వ్యక్తం చేశారు. స్వయంసమృద్ధిని కోరుకుం టున్న భారత్‌లో ఇంజనీరింగ్ విద్యస్థాయి నుంచే స్టార్టప్స్‌ను, ఇంక్యుబేటర్స్‌ను తయారు చేయాలని, ఈ గురుతర బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసు కోవాలని సూచించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి కూడా చిన్నపాటి గ్రామస్థాయి ఉపాధి కోసం వెంపర్లాడటం దురదృష్టకరమన్నారు. గత కొన్నాళ్ళుగా ఉన్నతవిద్యలో, మహిళల భాగస్వా మ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సిం హారెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సాంకేతికవిద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదు స్టార్టప్స్ ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదుగురు స్టార్టప్స్‌ను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వలమార్పు కన్పిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్లల్లో అనేక మంది గ్రాడ్యుయేట్ స్థాయి వాళ్లే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీంద్ర, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
సార్లు లేరు.. చదువుల్లేవు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ/నాంపల్లి: ఉత్తమ విద్యకు, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయంగా.. విద్యార్థుల వికాసానికి తోడ్పడే కేంద్రంగా ఉండాల్సిన అత్యున్నత విద్యా సంస్థలే.. యూనివర్సిటీలు. కానీ రాష్ట్రంలో యూనివర్సిటీలకే ‘వికా సం’ లేని దుస్థితి. రెగ్యులర్ అధ్యాపకులు లేక నామ మాత్రపు బోధన ఒకవైపు.. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేక అవస్థలు మరోవైపు.. విద్యార్థుల భవిష్యత్తుకు గండి కొడుతున్నాయి. కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలేమోగానీ కనీస ‘చదువు’కే దిక్కు లేకుండా పోతోందని.. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు వంటివి వర్సిటీలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా నియామకాలేవి? రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టు లు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తిం చారు. అప్పట్లోనే 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓ సారి రిజర్వే షన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదా లు అంటూ, మరోసారి నియామకాల తీరుపై కసరత్తు చేస్తున్నామంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో గత ఏడాది జనవరి 31 నాటికి ఖాళీల సంఖ్య 1,869కి పెరిగింది. కేటగిరీల వారీగా చూస్తే 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబం ధించి కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన నిర్వహిస్తూ మమ అనిపిస్తున్న పరిస్థితి నెల కొంది. దీనివల్ల పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని, రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందేళ్ల ఉస్మానియాకూ తప్పని సమస్య 105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమి తో సతమతం అవుతోంది. దాదాపు అన్ని విభాగా ల్లోనూ కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. సీనియర్ ఫ్యాకల్టీ లేక పరి శోధనలనే మాటే లేకుండా పోయిందని.. పీజీ స్థాయిలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ల్యాబ్‌లలో రసాయ నాలు, పరి కరాలు సరిగా లేవని.. ఇతర మౌలిక వసతులూ లేక ఇబ్బంది పడుతున్నామని అంటు న్నారు. జేఎన్టీయూ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మ కంగా నిజాం కాలేజీలో, కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సుకు ఫ్యాకల్టీ సమస్య వేధిస్తోంది. ఓయూలో పేరుకే ఫ్యాన్లు.. కానీ తిరగవు.. తెలుగు వర్సిటీలో ముగ్గురే.. దేశంలోనే మొట్టమొదటి భాషా విశ్వవిద్యాలయ మైన పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పరిస్థితి మరీ చిత్రం. ఇందులో మొత్తంగా ముగ్గురే రెగ్యులర్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిజిస్ట్రార్‌గా, మరొకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గా పనిచేస్తుండటం గమనార్హం. జ్యోతిషం, తెలు గు, ఇంగ్లిష్, కంప్యూటర్, భాషా అను బంధ శాఖ, విజ్ఞాన సరస్వత శాఖ. తులనాత్మక అధ్యయన శాఖ, జర్నలిజం, భాషాభివృద్ధి శాఖ, లింగ్విస్టిక్, భాషా నిఘంటు నిర్మాణ శాఖ జానపదం, సంగీ తం శాఖల్లో పోస్టులన్నీ ఖాళీయే. అన్నింటా తాత్కా లిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. నీళ్లు కూడా సరిగా రావట్లేదు మా హాస్టల్లో సరిగా వస తులు లేవు. మామూలు నీళ్లకే కాదు తాగునీటికీ ఇబ్బంది వస్తోంది. డైనింగ్ హాల్లో, ఇతర చోట్ల ఏర్పాట్లేమీ లేవు. – పరశురామ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థి ‘తెలుగు’ ప్రొఫెసరే లేరు తెలుగు విశ్వవిద్యాలయం ఏ భాషాభివృద్ధి కోసం ఏర్ప డిందో ఆ భాషకే సరైన దిక్కు లేకుండా పోయింది. తెలుగు శాఖలో కూడా రెగ్యు లర్ ఫ్యాకల్టీ లేకపోవడం శోచనీయం. వర్సిటీ పాలక మండలి నిద్రావస్థలో ఉంది. – శివకృష్ణ, రీసెర్చ్ స్కాలర్, తెలుగు వర్సిటీ ఏ వర్సిటీ అయినా అంతే.. ► కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు. ► మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలను ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారు. ► వరంగల్ కాకతీయ వర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. కీలకమైన ఇంజనీరింగ్‌లో 48 పోస్టులు ఖాళీయే. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. ► నిజామాబాద్ తెలంగాణ వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫార్మాస్యూ టికల్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. మొత్తం 152 పోస్టులకుగాను రెగ్యులర్ సిబ్బంది 69 మందే. హాస్టళ్లలో పరిస్థితీ ఇంతే.. ► యూనివర్సిటీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు హాస్టళ్ల లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాలమూరు యూనివర్సిటీ హాస్ట ళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగి పోయాయి. కిచెన్ లేక ఆరుబయటే వం టలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. శాతవాహన వర్సి టీలో ఫార్మసీ కళాశాల, హాస్టళ్లు పాత భవనాలు, రేకులషెడ్లలో కొనసాగుతు న్నాయి. మహత్మాగాంధీ వర్సిటీ బాలికల హస్టల్లో తాగు నీటి సరఫరా సరిగా లేదని విద్యార్థినులు వాపోతున్నారు. -
Telangana: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఆ నిబంధన సడలింపు
TS EAMCET 2022 Eligibility Criteria: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్‌కు అర్హత లభిస్తుంది. వాస్తవానికి ఇంటర్లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ నిబంధనను సడలించారు. టెన్త్ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్ ఫస్టియర్‌కు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. వీరికి గత మార్చిలో కూడా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, ఆ తర్వాత అక్టోబర్‌లో వీళ్లందరికీ పరీక్షలు పెట్టారు. కానీ, కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్‌లో సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీ లుంది. ఇదే క్రమంలో జూన్ ఆఖరులోగా ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోంది. -
జూన్ మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2022పై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలైంది. ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చ అనంతరం పరీక్ష తేదీలపై ప్రాథమిక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. అనంతరం విషయం ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలతో ముగుస్తాయి. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మే మొదటి వారంలో పూర్తవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జూన్ మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే యోచనలో అధికారులున్నారు. నెల రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతలో ఎంసెట్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందుతారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కేటాయించిన సీట్లలో ఖాళీలు ఏర్పడతాయి. వీటన్నింటినీ జేఈఈ తుది రౌండ్ కౌన్సెలింగ్ తర్వాతే భర్తీ చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థులు పెరిగే అవకాశం ఈసారి ఎంసెట్ రాసే అభ్యర్థుల సంఖ్యపై అధికారులు దృష్టి పెడుతున్నారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్ చేశారు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కేవలం 49% విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీళ్లంతా ఇంటర్ సెకండియర్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంసెట్ రాసే వీలుంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసే అంశంపైనా చర్చించనున్నారు. -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
‘నకిలీ’ని పట్టేస్తుంది!
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓ ఉద్యోగి తెలంగాణలో పేరున్న యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసినట్టు సర్టిఫికెట్ సమర్పించాడు. దీనిపై థర్డ్‌పార్టీ విచారణ చేయించిన ఆ కంపెనీ అది నకిలీదని తెలుసుకుంది. సదరు వర్సిటీ దీన్ని పరిశీ లించి, కంపెనీకి రిపోర్టు ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది. అప్పటికే ఆ ఉద్యోగి అక్కడ పనిచేసిన అనుభవంతో వేరే కంపె నీలో చేరాడు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌లోని పాతబస్తీలో అది తయారైనట్టు తేల్చారు. అప్పటికే ఆ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యక్తి మకాం మార్చాడు. దీంతో కేసు పెండింగ్‌లో పడింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అన్ని యూనివర్సిటీల నుంచి 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను గుర్తిస్తున్నారు. ఇవి కేవలం దర్యాప్తు సంస్థల దృష్టికొచ్చినవే. అంతకన్నా ఎన్నో రెట్లు నకిలీలు పుట్టుకొస్తున్నాయని పోలీసు వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. ఫిర్యాదులు లేకపోవడంతో ఇవి వెలుగులోకి రావడంలేదు. కేవలం ఒక కంప్యూటర్, కొద్ది పాటి టెక్నాలజీతోనే అన్ని వర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు చేస్తున్నట్టు ఇటీవల ఉన్నత విద్యామండలి దృష్టికొచ్చింది. పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణ లున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడం పెను సమస్యగా మారింది. కళ్లు తెరిచిన అధికారులు నకిలీ ధ్రువపత్రాలను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. అన్ని వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపు తోంది. సర్టిఫికెట్ అసలుదా? నకిలీదా? తేల్చడా నికి ఇప్పటివరకూ వర్సిటీ సిబ్బంది మాత్రమే పరిశీలించాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అంతంత మాత్రంగా ఉన్న సిబ్బంది కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈలోగా నకిలీల ముఠా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్లు, రాష్ట్రంలో సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే వాళ్లు నకిలీ సర్టిఫికెట్లనే ఆశ్రయిస్తున్నారని అధికారులు అంటు న్నారు. దీన్ని అడ్డుకోవడానికి కంపెనీలు నేరుగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కట్టడి ఇలా... ♦అన్ని విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఇందుకు సంబం« దించిన సర్వర్ రాష్ట్ర అధికారుల పర్యవే క్షణలో ఉంటుంది. దీనిద్వారా ప్రతీ కంపెనీ అభ్యర్థి సర్టిఫికెట్లు అసలువో, నకిలీవో తెలుసుకోవచ్చు. ♦అన్ని భద్రతా చర్యలు తీసుకుని సాఫ్ట్వేర్ ను రూపొందించాలని భావిస్తున్నారు. సంబంధిత కంపెనీలు ఆ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి దాని సరిఫ్టికెట్ స్థితిగతులు తెలుసుకోవచ్చు. ♦కొన్ని సందర్భాల్లో విధిగా సంబంధిత వర్సిటీలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆయా కంపెనీలు వర్సిటీ అధికారులను సంప్రదించాలి. ♦పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండే ఈ సాఫ్ట్వేర్ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మంచి ప్రయోగం నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి కృషి చేస్తోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎలా రూపొందించాలి? ఎలాంటి మెళకువలు అవసరమనే దానిపై డీజీపీతో జరిగిన సమావేశంలో చర్చించాం. త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నందున కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)