మూడు వందల కాలేజీలకు ముప్పు | Telangana: Three Hundred Degree Colleges Are Under Threat | Sakshi
Sakshi News home page

మూడు వందల కాలేజీలకు ముప్పు

Published Sat, Dec 11 2021 2:39 AM | Last Updated on Sat, Dec 11 2021 9:30 AM

Telangana: Three Hundred Degree Colleges Are Under Threat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడు వందల డిగ్రీ కాలేజీలకు ముప్పు పొంచి ఉంది. విద్యార్థుల్లేక చదువుసాగని వాటి చాప్టర్‌ ఇక ముగిసినట్టే. 50 మంది లోపు విద్యార్థులుండే కాలేజీల ఏరివేతకు, మూసివేతకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. అనుమతి లభించిన సీట్లలో కనీసం పావువంతు కూడా భర్తీకాని కాలేజీలను ముందుగా ఏరివేయాలని భావిస్తున్నారు.

ఆ తర్వాత 50 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలపై దృష్టి పెట్టే వీలుంది. దీనికిగాను గత మూడేళ్లుగా కాలేజీల డేటాను పరిశీలిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు అనివార్యమని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టే దిశగానే ఈ కసరత్తు మొదలైందని అంటున్నారు. 

ఆ కాలేజీలు ఎందుకు? 
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చదివే విద్యార్థుల కన్నా, సీట్లే ఎక్కువ. ఇటీవల ఉన్నత విద్యామండలి నిర్వహించిన దోస్త్‌ వివరాల ప్రకారం... ఈ ఏడాది 4,66,345 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే, ఆ కాలేజీల్లో చేరినవారి సంఖ్య 2,49,266 మాత్రమే. అంటే 2,17,079 సీట్లు మిగిలిపోయాయి. ప్రతిఏటా ఇదే పరిస్థితి. 2018–19లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 1,151 ఉంటే, ఈ ఏడాది ఇవి 1,080కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 138 కాగా, మిగతావన్నీ ప్రైవేటు కాలేజీలే.

చాలావాటిల్లో వసతులు అరకొరగా, విద్యార్థుల చేరిక నామమాత్రంగా ఉంటోంది. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరని డిగ్రీ కాలేజీలు 50 వరకున్నాయి. 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ కాలేజీలను ప్రోత్సహించడం దేనికి? అనే ప్రశ్న ఉన్నతాధికారుల నుంచి ఉత్పన్నమవుతోంది. 

నాణ్యత పెంచాలి
డిగ్రీలో నాణ్యత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో కాలేజీలే కీలకపాత్ర పోషించాలి. విద్యార్థులు చేరని కాలేజీల విషయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష అవసరం. మార్పులు అత్యవసరం.   
– నవీన్‌ మిట్టల్‌ (కాలేజీ విద్య కమిషనర్‌) 

ఆ కాలేజీలపై దృష్టి పెట్టాం
అరకొర ప్రమాణాలు, విద్యార్థుల ప్రవేశం లేని కాలేజీలపై దృష్టి పెట్టాం. అలాంటి కాలేజీల యాజమాన్యాలను ప్రతిసారి మందలిస్తూనే ఉన్నాం. ఈసారి కొంత కఠినంగానే ఉంటాం. విద్యార్థులే చేరనప్పుడు ఆ కాలేజీ దేనికనే ప్రశ్న సాధారణంగానే ఉంటుంది.    
–ప్రొ.ఆర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement