ఆరేళ్లయినా అంతంతే! | No Focus on engineering seat hikes from last six years | Sakshi
Sakshi News home page

ఆరేళ్లయినా అంతంతే!

Published Sun, Jun 23 2019 2:18 AM | Last Updated on Sun, Jun 23 2019 2:18 AM

No Focus on engineering seat hikes from last six years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపుపై ఏళ్ల తరబడి నిరాసక్తత కొనసాగుతోంది. అటు యూనివర్సిటీలు, ఇటు ఉన్నత విద్యామండలి కూడా సీట్ల పెంపుపై ఆలోచనలు చేయడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనే పూర్తి కావడం లేదని, అందుకే డిమాండ్‌ ఉన్నా, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంపై దృష్టి పెట్టడం లేదని అధికారులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ వంటి అనేక కోర్సులకు యూనివర్సిటీ కాలేజీల్లో భారీగా డిమాండ్‌ ఉంది. అయినా వాటిల్లో సీట్ల పెంపును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నా తెలంగాణ వచ్చాక కూడా ఆ దిశగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనలు చేయడం లేదు. కనీసం ఈ ఆరేళ్లలో ఒక్కసారి అయినా సీట్ల పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన దాఖలు లేవు. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపును ఇటీవల నిలిపివేశారు తప్ప గతంలో ఆమోదించారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం సీట్ల పెంపు దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పదేళ్లుగా 420 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. 

కొన్ని మిగిలినా.. చేరే అవకాశంలేదు 
ప్రస్తుతం రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలోని 14 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌సహా దాదాపు ఆ సీట్లు అన్నీ వంద శాతం భర్తీ అవుతున్నాయి. చివరకు ఎన్‌ఐటీ, ఐఐటీలకు ఎవరైనా వెళ్లిపోతే మాత్రమే వందలోపు వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. వాటిల్లో చేరేందుకు స్లైడింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆ సీట్లలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు కొత్త సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్‌ సీట్లను పెంచవద్దని విధానపరమైన నిర్ణయం తీసుకుందని, అందుకే తాము ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. కానీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లకు ఉండే డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేయకపోవడంతో విద్యార్థులకు ఏటా నిరాశ తప్పడం లేదు. ఇవే కాదు బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఫార్మసీ కాలేజీలు 3 మాత్రమే ఉండగా, వాటిల్లో కేవలం 180 సీట్లే ఉన్నాయి. ఫార్మసీ కోర్సులకు డిమాండ్‌ ఉన్నా సీట్ల పెంపును పట్టించుకోవడం లేదు. ఎంబీఏ కాలేజీలు 19 ఉండగా వాటిల్లో 1,290 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 13 ఉండగా, వాటిల్లో 670 సీట్లు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement