engineering colleges
-
ఇంజనీరింగ్ సీట్లు నిండేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఏపీ విద్యార్థులకు నాన్‌లోకల్ కోటా కింద 15 శాతం సీట్లు లభించేవి. ఆ కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కోటాను తీసివేయాలని ప్రభుత్వం భావి స్తోంది. ఏటా ఏపీ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ పడతారు. ఇందులో 16 వేల సీట్ల వరకు నాన్–లోకల్ కోటా కింద, మిగతావి జనరల్ పోటీలో ఏపీ విద్యార్థులు దక్కించుకుంటారు. ఇప్పుడు ఏపీ స్థానికతను అనుమతించకపోతే రెండు కేటగిరీల్లోనూ ఆ రాష్ట్ర విద్యార్థులకు సీట్లివ్వరు. యాజమాన్య కోటా సీట్లు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి. అయితే, ఏపీ నాన్‌లోకల్ కోటా ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది ఎప్‌సెట్‌లో ఇంజనీరింగ్ విభాగానికే 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.80 లక్షల మంది సెట్లో అర్హత పొందారు. సీట్లకు డిమాండ్ తగ్గుతుందా? రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో మొత్తం 1,12,069 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేస్తారు. 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. గత ఏడాది మరో 3 వేల సీట్ల పెంపునకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతిచ్చినా, ప్రభుత్వం అనుమతివ్వకపోవటంతో కాలేజీలు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఆ 3 వేల సీట్లను ఈసారి ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో అనుమతించాల్సి ఉంటుంది. ఏపీ విద్యార్థులు తగ్గడం, కొత్తగా సీట్లు పెరగడంతో ఈసారి ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు సీఎస్ఈ, కంప్యూటర్ అనుసంధాన డేటాసైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లోనే ఉన్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సీట్లను తెలంగాణ విద్యార్థులు కొంత తేలికగానే పొందే వీలుంది. వెంటాడుతున్న న్యాయ సమస్యలు రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లపాటు నాన్–లోకల్ కోటా అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది ఎప్‌సెట్ నోటిఫికేషన్ సమయానికి పదేళ్లు పూర్తి కాలేదు కాబట్టి నాన్–లోకల్ కోటా అమలు చేశారు. అయితే, నాన్–లోకల్ కోటా ఎత్తివేసే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌కు అధికారికంగా తెలియజేయలేదు. రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కోటా ఎత్తివేత జీవో ఇవ్వాలి. లేని పక్షంలో ఎవరైనా కోర్టుకెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి తెలిపాం నాన్–లోకల్ కోటా ఎత్తివేత జీవో వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం. విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్. -
ఆ 7 వేల సీట్ల పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశంతో పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన 7 వేల సీట్లపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. నిబంధనల మేరకే ఉన్నందున పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని హై కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం అందుకోసం జీవో ఇవ్వకపోవటంతో విద్యార్థులు, సీట్లు పెంచుకొన్న కాలేజీల యాజమాన్యాలు డోలాయమాన స్థితిలో పడ్డాయి. ప్రభుత్వం జీవో ఇస్తేనే పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇస్తామని జేఎన్టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యా సంవత్సరం దాదాపు సగం పూర్తి కావటంతో పెరిగిన సీట్ల భర్తీ ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొన్నది. ఈ సీట్లలో ఇప్పటికే 450 మంది వరకు విద్యార్థులు చేరిపోయారు. ఇప్పుడు ఈ సీట్లకు అనుమతి ఇవ్వకపోతే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎడతెగని పంచాయితీ..: రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బాగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకోగా.. జేఎన్టీయూహెచ్ అధికారులు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్ల పెంపునకు ససేమిరా అనటంతో ఆ కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఆ 7 వేల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయింది. దీంతో కాలేజీలే ఈ సీట్ల భర్తీ చేపట్టి 450 సీట్లు భర్తీ చేశాయి. ఈ సీట్లను ఉన్నత విద్యా మండలి ర్యాటిఫై చేయాలి. దీనికన్నా ముందు పెరిగిన సీట్లకు జేఎన్టీయూహెచ్ అనుమతివ్వాలి. ఈ ప్రక్రియ ఇంత వరకూ పూర్తవ్వలేదు. ప్రభుత్వం జీవో ఇస్తే తప్ప తాము అనుమతివ్వలేమని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పటికే చేరిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి.వచ్చే ఏడాది అయినా పెరిగిన 7 వేల సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అనే సందిగ్ధత నెలకొంది. వీటిలో 4,900 సీట్లు కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థులకు పెరిగిన సీట్లు మేలు చేస్తాయి. యాజమాన్య కోటా సీట్లు కూడా ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెబుతోంది. కాబట్టి పెరిగిన సీట్లపై ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే వచ్చే ఏడాది కౌన్సిలింగ్‌కు సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. -
అనుమతిచ్చే ముందు అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా ఇచ్చేప్పుడు తమను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను కోరింది. ఇష్టానుసారం అనుమతులిస్తే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కాలేజీలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా, ఇతరత్రా సమస్యలు వచ్చినా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా అనుమతులు పొందుతుంటే, రాష్ట్రంలోని ఇతర కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. మల్లారెడ్డి సంస్థలకు ఇటీవల కేంద్రం డీమ్డ్ హోదా ఇచ్చింది. మహేంద్ర యూనివర్సిటీకి కూడా ఇచ్చే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో యూజీసీతో పాటు ఏఐసీటీఈకి రాష్ట్ర విద్యాశాఖ లేఖ రాసింది. చిన్న కాలేజీలు విలవిల డీమ్డ్, అటానమ్ కాలేజీలు పెద్దఎత్తున ప్రచారం చే సుకుంటున్న నేపథ్యంలో చిన్న ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా తయారైందని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. 2016 నాటికి రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నా యి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 ఉంటే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కని్పస్తోంది. చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ వర్సిటీలు వస్తే మరికొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, దీనివల్ల పేద వర్గాలకు ఇంజనీరింగ్ విద్య మరింత ఖరీదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సుల వైపే విద్యార్థులు వెళ్తున్నారు. కొత్తగా వచ్చే కాలేజీలు ఈ కోర్సులనే ఆఫర్ చేయడం, భారీగా సీట్లు అమ్ముకునేందుకు డీమ్డ్ హోదా తెచ్చుకోవడం సరైన విధానం కాదని మండలి పేర్కొంటోంది. విదేశీ వర్సిటీలొస్తే మరింత ముప్పు! దేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇటలీలోని వర్సిటీలు ముందుకొస్తున్నాయి. వాటి బ్రాంచీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతున్నాయి. విదేశాల్లో విద్యపై ఆసక్తి చూపించే విద్యార్థులను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువని, కొన్ని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత పెంచాలని ఏఐసీటీఈ.. రాష్ట్రానికి సూచించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యలో మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. ముందే తెలియజేస్తే బాగుంటుంది డీమ్డ్, అటానమస్ హోదా ఇచ్చేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ముందే తెలియజేయాలని కోరుతూ యూజీసీకి లేఖ రాశాం. మా విజ్ఞప్తిని యూజీసీ పరిగణనలోనికి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రమేయం లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డబ్బు కట్టాం.. సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల మధ్య సీట్ల పంచాయితీ ముదురుతోంది. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకున్న కాలేజీలు వాటి స్థానంలో కొత్త సీట్లు వస్తాయని భావించి యాజమాన్య కోటా కింద విద్యార్థుల నుంచి ముందే డబ్బు దండుకున్నాయి. కానీ కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దీనిపై హైకోర్టుకెక్కినా కాలేజీలకు ఊరట లభించకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. వివిధ కాలేజీల్లో దాదాపు 5 వేల మందికి ఈ తరహాలో సీట్లు ఇస్తామని యాజమాన్యాలు ఆశలు రేపాయి. అందులో టాప్ కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయినందున ఇప్పుడు సీట్లు లేవని చెబుతున్న కాలేజీలు.. కావాలంటే కట్టిన సొమ్మును తిరిగిచ్చేస్తామని అంటున్నాయి. కానీ దీనికి విద్యార్థులు ఒప్పుకోవట్లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలు దాదాపు పూర్తికావడంతో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. ఏదో ఒక బ్రాంచీలో తమకు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మండలి వద్ద గందరగోళంఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద మంగళవారం గందరగోళ పరిస్థితి కనిపించింది. ప్రైవేటు కాలేజీలు మోసం చేశాయని విద్యార్థులు అధికారులకు మొర పెట్టుకున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. కొందరు ఆవేశంతో మాట్లాడుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో అధికారులు అవాక్కయ్యారు. యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశారు. సీట్లు లేనప్పుడు ఎలా ఇవ్వగలమని కాలేజీల నుంచి సమాధానం రావడంతో నిస్సహాయత వ్యక్తం చేశారు. స్పాట్ షురూ స్లైడింగ్ తర్వాత 11 వేల పైచిలుకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. వాటికి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా సాంకేతిక విద్యామండలి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కాలేజీకి వచి్చన వారిలో ర్యాంకు ప్రకారం సీట్లు ఇవ్వాలని సూచించింది. బుధవారం నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. బుధ, గురువారాల్లో కాలేజీలవారీగా ఖాళీగా ఉన్న సీట్లను పత్రికల ద్వారా వెల్లడించాలని, ఈ నెల 30 నుంచి సెపె్టంబర్ 2 వరకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. వచ్చే నెల 3న స్పాట్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను కాలేజీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లను సాంకేతిక విద్య విభాగానికి వచ్చే నెల 4లోగా కాలేజీలు అందజేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే యాజమాన్య కోటా కింద భర్తీ చేసిన సీట్లకు సెపె్టంబర్ 5 నుంచి ర్యాటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. సీట్ల కేటాయింపును అన్ని డాక్యుమెంట్లతో వచ్చే నెల 10లోగా అప్లోడ్ చేయాలని సూచించింది. -
సత్తా చాటేలా సిలబస్!
ఇంజనీరింగ్ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకొనేలా ఉండాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌లో ఈ మార్పు అనివార్యమని అంటోంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఏఐసీటీఈ నిపుణుల కమిటీ గతేడాది సరికొత్త సీఎస్సీ బోధనాంశాలను ప్రతిపాదించింది. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ... సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి బోధనాంశాలను కోర్సుల్లో చేర్చాలని సూచించింది. ప్రస్తుతం మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నప్పటికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్విద్యార్థికి గణిత శాస్త్రంపై పట్టు ఉండాలి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దీన్ని నాలుగు రెట్లు పెంచేలా బోధనాంశాలుండాలి. కానీ ఇప్పుడున్నసిలబస్లో ఈ నాణ్యతకనిపించట్లేదు. ఇంటర్‌లోని సాధారణ గణితశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలే కోర్సులో ఉంటున్నాయి. » రాష్ట్రవ్యాప్తంగా ఏటా 75 వేల మంది కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో చేరుతున్నారు. క్లిష్టమైన గణిత సంబంధ కోడింగ్‌లో 20 వేల మందే ప్రతిభ చూపుతున్నారు. సీఎస్ఈ పూర్తి చేసినా కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్‌ను అందుకోవడం వారికి కష్టంగా ఉంటోంది.» మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆల్జీబ్రా, అల్గోరిథమ్స్‌పై పట్టు ఉంటే తప్ప ఈ కోర్సుల్లో రాణించడం కష్టం. ఈ తరహా ప్రయత్నాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన.» ఇంజనీరింగ్‌లో కనీసం వివిధ రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పరిణతి చెందరు. ఈ మార్పును ఇంజనీరింగ్ కాలేజీలు అర్థం చేసుకోవట్లేదు. దీంతో డీప్ లెరి్నంగ్, అడ్వాన్స్డ్ లెరి్నంగ్ వంటి వాటిలో వెనకబడుతున్నారు. ఏఐసీటీఈ సూచించిన మార్పులేంటి? » ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో గణిత విభాగాన్నివిస్తృతం చేయాలి. పలు రకాల కంప్యూటర్ కోడింగ్‌కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను కొత్తగా జోడించాలి. » కంప్యూటర్స్ రంగంలో వస్తున్న నూతన అంశాలగురించి విద్యార్థులు తెలుసుకొనేలా ప్రాక్టికల్ బోధనాంశాలను తీసుకురావాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ నిర్వహించాలి. » ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్ అండ్‌అండర్‌స్టాండింగ్, హ్యూమన్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను కోర్సుల్లో చేర్చాలి.దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కూడా అలవడుతుంది. నాణ్యత పెంచాల్సిందే ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా మారుతోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అనివార్యం. భవిష్యత్ తరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో బోధన ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీల కోసం ఈ మార్పును ఆపడం ఎలా సాధ్యం? ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శిప్రత్యేక క్లాసులు తీసుకోవాలి కొత్త సిలబస్‌ను స్వాగతించాలి. స్థాయిని అందుకోలేని విద్యార్థులకు అదనపు అవగాహనకు తరగతులు నిర్వహించాలి. కాలేజీలే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన బోధనాంశాలు ఉండాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రొఫెసర్ డి.రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీసమస్యేంటి?రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 78 కాలేజీలు అటానమస్ హోదా పొందాయి. గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ అందించే సిలబస్‌లో 80 శాతాన్ని ఈ కాలేజీల్లో అమలు చేయాలి. మిగతా 20 శాతం సిలబస్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. మారుతున్న సిలబస్‌ను ఈ కాలేజీలు స్వాగతిస్తున్నాయి. కానీ మిగతా కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కాలేజీల్లో లక్షపైన ర్యాంకు పొందిన విద్యార్థులు చేరుతున్నారని.. వాళ్లు అత్యున్నత బోధనా ప్రణాళిక స్థాయిని ఎలా అందుకుంటారని ప్రశి్నస్తున్నాయి. అయితే నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందని యూనివర్సిటీలు అంటున్నాయి. -
కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీలు, జాతీయఇంజనీరింగ్ కాలేజీల్లో క్లాసుల నిర్వహణకుసన్నాహాలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులను ముందుగా మానసికంగా బలోపేతం చేయాలని కేంద్ర విద్యాశాఖ అన్ని విద్యాసంస్థలను ఆదేశించింది. బోధన ప్రారంభించేముందే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. కాలేజీ పరిస్థితులు, తోటి విద్యార్థులతో సమన్వయం, అధ్యాపకులతో సాన్నిహిత్యం ఇందులో కీలకాంశాలుగా తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ విద్యారి్థని సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరగా పరిశీలించాలని, వారిలో భయం పోగొట్టాల్సిన అవసరముందని చెప్పింది. విద్యార్థి పూర్వచరిత్ర, అతనిలో ఉన్న భయం, ఆందోళనను గుర్తించి అవసరమైన ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరింది. ప్రతీ కాలేజీలోనూ కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటును గత ఏడాది కూడా సూచించింది. విశ్వాసమే బలం అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన వారికే ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇలా ప్రతిభ ఉన్న విద్యార్థులు చిన్న సమస్యలకే బెంబేలెత్తుతున్నారు. భయంకరమైన డిప్రెషన్లోకి వెళుతున్నారు. ఇవి బలవన్మరణాలకు కారణమవుతున్నాయనేది కేంద్ర ఆరోగ్యశాఖతోపాటు ఐఐటీలు జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని ఐఐటీల్లో 2005– 2024 సంవత్సరాల మధ్య 115 మంది విద్యార్థులు తనువు చాలించారు. ఒక్క మద్రాస్ ఐఐటీలోనే 26 మంది విద్యార్థులు చనిపోయారు. ఐఐటీ కాన్పూర్‌లో 18 మంది, ఖరగ్‌పూర్ ఐఐటీలో 10 మంది, ఐఐటీ బాంబేలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ఐఐటీ క్యాంపస్‌లోనే 98 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 17 మంది క్యాంపస్ వెలుపల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారి మానసిక పరిస్థితులే కారణమని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. వారిలో విశ్వాసం సన్నగిల్లడమే కారణమని గుర్తించారు. ఇలాంటి వారిని ముందే తెలుసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ముందుగా విశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలని సూచించింది. తొలి ఏడాదే కీలకం ఇప్పటి వరకూ జరిగిన బలవన్మరణాల్లో ఎక్కువమంది తొలి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్‌విద్యలో బట్టీ పట్టే విధానం ఉంది. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఈ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు జేఈఈలో మంచి ర్యాంకులు పొందుతున్నారు. అయితే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో విద్యాబోధన, ప్రాక్టికల్ వర్క్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. విద్యార్థులు తమ స్వీయ ప్రావీణ్యాన్ని వెలికితీయాలి. సొంతంగా ఆలోచించడం, కొత్తదాన్ని అన్వేíÙంచేలా సిలబస్ ఉంటుంది. ఇదంతా కొంతమంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. మొదటి సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మద్రాస్ ఐఐటీ అధ్యయన నివేదికలో పేర్కొంది. వీటిని పరిగణనలోనికి తీసుకొని, తొలి ఏడాది సిలబస్‌లో మార్పు చేయాలని అన్ని ఐఐటీలు భావించాయి. ఏదేమైనా కాలేజీలో చేరిన విద్యారి్థకి ముందుగా పూర్తిస్థాయి కౌన్సెలింగ్ చేసి, మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని జాతీయ విద్యా సంస్థలు నిర్ణయించాయి. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే విధంగా చేయాలని, ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. -
ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఇప్పటికే ఈ అంశంపై అన్ని స్థాయిల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగు తున్నాయి. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇవి వెలుగు చూశాయి. వీటి వెనుక మాదకద్రవ్యాల మాఫియా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో విద్యార్థుల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వ నివేదికలు పే ర్కొంటున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు బయటపడకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. ధనిక విద్యార్థులు చదివే కాలేజీల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడు తున్న చర్యలు ఆశించినంతగా లేవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చెప్పాయి. మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇవ్వడాని కి గల ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కౌన్సెలింగ్ తర్వాత కూడా ఈ దిశగా అడుగులేసే విద్యార్థులపై చట్టప రమైన చర్యలకు ఉపక్రమించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చట్టాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేసేందుకు కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలువిద్యాసంస్థల్లో ర్యాగింగ్ తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్ని విద్యాసంస్థల్లో కుల వివక్షతో కూడిన ర్యాగింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలపై కొరడా ఝుళిపించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల రాష్ట్రాలకు ఆదేశాలు పంపింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇందులో ఫ్యాకల్టీతోపాటు, సీనియర్ విద్యార్థులు, ఉన్నత అధికారులను భాగస్వాము లను చేయాలని పేర్కొంది. అయితే, ఏఐసీటీఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలవ్వడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.17న ఉన్నతస్థాయి సదస్సువిద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధం, ర్యాగింగ్ అంశాలపై ఈ నెల 17న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ కమిషనర్ దేవసేన, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరవుతున్నారు. యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.ఉపేక్షించేది లేదుమాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఈ విషయంలో ఎంతటివారున్నా కఠినంగా చర్యలు తప్పవు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే విద్యార్థులు స్వేచ్ఛగా మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాగింగ్ భూతాన్ని పారదోలాలి కాలేజీల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచించాం. ఇక నుంచి దీన్ని మరింత విస్తృతం చేస్తాం. కొత్తగా కాలేజీలకు వచ్చే వారిలో మనోనిబ్బరం కల్పించడం, ర్యాగింగ్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడానికి కృషి చేస్తాం. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి -
కారణాల్లేకుండా ఎలా తిరస్కరిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కోర్సుల విలీనం దరఖాస్తులను ఎలాంటి కారణాలు చూపకుండా ఎలా తిరస్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ దరఖాస్తులను పరిశీలించి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండకూడదని స్పష్టం చేసింది. కాలేజీ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడం జాప్యమైతే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లోనూ మార్పులు చేయొచ్చని వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్న సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టివేసింది. అలాగే దరఖాస్తులను తిరస్కరిస్తూ జూలై 26న ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కచ్చితమైన కారణాలను వెల్లడించాలని చెప్పింది. బీటెక్/బీఈలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం సర్కార్‌దేనని తీర్పునిచ్చారు. రీయింబర్స్మెంట్ సాకు సరికాదు..సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పలు కాలేజీలు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, ఎస్.శ్రీరామ్, శ్రీరఘురామ్, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తిరస్కరించడం సరికాదు.అధ్యాపకులు, ఇతర వసతులు లాంటి అన్ని అంశాలను ఏఐసీటీఈ నిపుణుల తనిఖీ కమిటీ పరిశీలించింది. పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకు అనుమతి కోరుతున్నాం. దీంతో ఒక్క సీటు కూడా అదనంగా పెరగడం లేదు. ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్మెంట్ భారం అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎలాంటి కారణం చెప్పకుండానే అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరాకరించారు’ అని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. కాలేజీలు కోరిన విధంగా సీట్లు పెంచుకుంటూపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. సీట్ల పెంపు, విలీనంపై నిర్ణయం తీసుకునే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని కోర్సుల్లో ఇప్పటికీ చాలా ఖాళీ సీట్లు ఉన్నాయి. ఇంకా పెంచాలని కోరడం సరికాదు. అప్పీళ్లను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం పేర్కొన్న కీలక అంశాలు‘అప్పీల్ చేసిన కాలేజీలకు తిరస్కరించి, మరికొన్ని కాలేజీలకు అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం. విద్యా చట్టంలోని సెక్షన్ 20ను పరిశీలించిన సింగిల్ జడ్జి.. దరఖాస్తుల తిరస్కరణ అధికారం ప్రభుత్వానికి ఉందని అభిప్రా యపడ్డారు. కొన్ని విద్యాసంస్థలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చినట్లయితే.. అదే తప్పును పునరావృతం చేయడానికి దాన్ని కారణంగా పేర్కొనవద్దు. అధికారుల నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఇచ్చిన ఆమోదాన్ని ఎందుకు రద్దు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. చట్టప్రకారం ప్రతి కాలేజీ దరఖాస్తును పరిశీలించాలి. కానీ, అధికారులు అలా వ్యవహరించలేదు. జూలై 26న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటులో సింగిల్ జడ్జి పొరపడ్డారు. అందువల్ల కాలేజీల దరఖాస్తులను తిరస్కరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేస్తున్నాం’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. -
సీట్లపెంపుపై సర్కార్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేయకుండా కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం తమదేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ మేరకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచీల సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో 28 పిటిషన్లు వేశాయి. నూతన కోర్సులకు జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదని పిటిషన్లలో పేర్కొన్నాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎవరి వాదన ఏమిటంటే.. ‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వట్లేదు. రీయింబర్స్మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమున్న పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకొనేందుకు కూడా నిరాకరిస్తోంది. జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ నివేదికలతో సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై దరఖాస్తు చేసుకున్నా కారణమేదీ చెప్పకుండానే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి నిరాకరించారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వాదనతో ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి విభేదించారు. ‘పిటిషన్లు వేసిన కాలేజీలకు జేఎన్టీయూహెచ్ షరతులతో ఎన్ఓసీ జారీ చేసింది.ఇది ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవడానికే వీలు కలి్పస్తుంది. అధ్యాపకులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వం ఆమోదం విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు ఉంటుంది. సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. విద్యార్థుల పెంపు వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థులకు భారంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లోని కోర్సుల్లో 120 మంది విద్యార్థులున్నారు. ఇంకా పెంచాలని కోరడం సరికాదు.ఆ పిటిషన్లను కొట్టివేయాలి’అని రాహుల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి విద్యాచట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వానికే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. కాలేజీల మధ్య అనారోగ్య పోటీని రూపుమాపడానికి తగిన నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఉందని.. అందువల్ల ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పారు. -
బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏడాదికి కనీస ఫీజును రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 35 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గరిష్ట ఫీజు రూ.30 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి బీబీఏ, బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఏఐసీటీఈ బీబీఏ, బీసీఏ కోర్సులు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కళాశాలలు అనుమతివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తొలిసారిగా ఫీజులు నిర్ణయించడంలో డిగ్రీ అడ్మిషన్లు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. గురువారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటున్నారు. 5వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించగా.. 6వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. 10వ తేదీన డిగ్రీ సీట్లు కేటాయింపు చేపట్టి 12వ తేదీ తరగతులు ప్రారంభించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 1.63 లక్షల దరఖాస్తులు ఏపీలోని డిగ్రీ కోర్సుల్లో మొత్తం 3.50 లక్షల సీట్లుండగా.. ఏటా 50 శాతం లోపు సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 1.63 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ పెరగడంతోనే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం ఈ కోర్సులను ప్రవేశపెట్టడం గమనార్హం. వీటితో పాటు మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
సీఎస్ఈ సీట్లు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి. సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గత ఏడాది తగ్గిన చేరికలుగత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్‌లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్‌లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.రీయింబర్స్మెంట్ వద్దు..రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు. అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఒత్తిడి తగ్గాలి..నైపుణ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు దీన్ని పాటించాలంది. మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది. బ్యాక్లాగ్స్తోపెరుగుతున్నఒత్తిడి... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు. కంప్యూటర్ సైన్స్‌లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్‌లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ బేసిక్ ఇంటర్ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది. నైపుణ్య కొరత కూడా కారణమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. -
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్ద కాలంగా ఏటా కళాశాలలు మూతపడు తున్నాయి. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో డిమాండ్ బాగా తగ్గింది. ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో మెకానికల్, సివిల్ బ్రాంచీల జోలికే వెళ్లడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్‌లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలుంటున్నాయి. సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యకు ఎక్కువ మంది హైదరా బాద్‌ను ఎంపిక చేసుకుంటుండగా, ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యనూ ఇక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలను నడిపే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీల వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల అవి క్రమంగా మూతపడుతున్నాయి. ప్రైవేటు వర్సిటీలొస్తే మరీ ప్రమాదం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. పోటీ పెరిగితే మనుగడ ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగు తున్నాయి. కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్య మిస్తున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు. ఇందుకు తగ్గట్టుగా ముందుకెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
సాఫ్ట్వేర్ నిపుణులకు ‘పార్ట్‌టైమ్’ ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్‌టైమ్‌గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు. వాళ్లెవరో చెప్పాల్సిందే... రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌తో బోధన చేయించాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది. ఆన్లైన్ క్లాసులు... ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్‌టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. -
టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఎక్కువ మంది మొగ్గు చూపింది ఈ కోర్సుకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆప్షన్లు ఇచ్చే గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 16న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తొలి దశలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సీట్లు పెరగడం, సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తాయని భావించడంతో ఎక్కువ మంది ఈ కోర్సును ఎంచుకున్నారు. విద్యార్థులు మొత్తం 49,42,005 ఆప్షన్లు ఇవ్వగా, వీటిలో 38 లక్షల వరకూ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 3,777 సీట్లు ఉంటే, విద్యార్థుల నుంచి 10 లక్షలకు మించి ఆప్షన్లు రాలేదు. గడువు ముగిసే నాటికి మొత్తం 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఒకే విద్యార్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఇచ్చారు. వాస్తవానికి 12వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పొడిగించారు. ర్యాంకర్ల నుంచి కన్పించని స్పందన తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ ర్యాంకులు పొందిన వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు అతి కొద్ది ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల క్యాంపస్ పరిధిలో ఉండే సీట్లకు పోటీ పడ్డారు. 500 ర్యాంకు దాటిన వారు మాత్రం టాప్ టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. ఎంసెట్‌లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులు తొలి కౌన్సెలింగ్‌లో 500లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా ర్యాంకర్ల చేతే దరఖాస్తు చేయించి, సీటు వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ సమయంలో రద్దు చేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం దీనిపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో వారు పొందిన సీట్ల వివరాలు తెప్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. దీంతో సీట్లను బ్లాక్ చేసే యాజమా న్యాలకు సహరించేందుకు విద్యార్థులు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఉండే సీట్ల కోసమే ర్యాంకర్లు పోటీప డ్డారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 2,580, కాకతీయ పరిధిలోని 1,080 సీట్లతో కలుపుకొని రాష్ట్రంలోని 9 వర్సిటీల పరిధిలో మొత్తం 4,773 సీట్లున్నాయి. వీటికే టాపర్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో 76,359 సీట్లు ఈ ఏడాది సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. 7 వేల వరకూ సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌లో తగ్గించుకున్న కాలేజీలు, ఆ మేర కంప్యూటర్ బ్రాంచీల్లో పెంచుకున్నాయి. దీంతోపాటు అదనంగా మరో 7 వేల వరకూ సీఎస్సీలో సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 42,087 సీట్లు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీల్లో ఉన్నాయి. -
కంప్యూటర్ సైన్స్‌లో పెరిగాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం. మొత్తంగా డిమాండ్ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్‌లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి. మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి. ఎంసెట్ షెడ్యూల్లో మార్పు ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. పెంపు మంచి నిర్ణయం.. ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి. – వి.బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎంసెట్ కౌన్సెలింగ్.. గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. ఎంసెట్ అర్హులు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు అవసరమైన ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి అందలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో దాదాపు 145 కాలేజీలు పాల్గొంటాయి. వాటికి సంబంధించిన జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు పంపాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏయే బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి? అనే వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్ చేపడతారు. సకాలంలో అప్షన్లు ఇస్తే తప్ప వచ్చే నెల మొదటి వారంలో తొలిదశ సీట్లు వెల్లడించడం సాధ్యం కాదు. ఆప్షన్లు ఇవ్వడానికి అన్ని కాలేజీలు, సీట్ల వివరాలు పొందుపర్చకపోతే ఎలా సాధ్యమని అధికారులే అంటున్నారు. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఎంసెట్‌కు 1,95,275 మంది హాజరైతే 1,56,879 మంది అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఉంటాయో? అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చాలా కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకొనేందుకు అనుమతి కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకొని, సీఎస్సీ, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. గతేడాది 95 శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అయితే ఒకేసారి సంప్రదాయ కోర్సులను ఎత్తేస్తే ఇబ్బంది ఉంటుందని విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కాలేజీలు బ్రాంచీల మార్పు కోసం ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంబంధిత కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మౌలికవసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపుతోపాటు సీట్ల మారి్పడిని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏయే కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలను చేర్చరు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో కాలేజీల జాబితా అందలేదని అధికారులు చెబుతున్నారు. వాటిని రెండో విడతలో చేర్చడం వల్ల కొందరు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా తొలి విడతలో కొంతమంది ఆప్షన్లు ఇవ్వరు. దీనివల్ల తక్కువ ర్యాంకు ఉన్న వాళ్లకు కూడా మంచి కాలేజీ, మంచి బ్రాంచీల్లో సీట్లు వచ్చే వీలుంది. ఇప్పుడు అన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులో లేకపోతే అలాంటి వాళ్లకు ఇబ్బంది కలిగే వీలుంది. ఆప్షన్లు ఇచ్చే సమయానికైనా అన్ని సీట్లు, కాలేజీల వివరాలు పంపాలని ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. లేనిపక్షంలో ఆప్షన్లు ఇచ్చే గడువు పొడిగింపుపై ఆలోచించక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. -
జేఎన్టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్ కోర్సుల్లో బీఈ, బీటెక్ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు. నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూప్‌లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రామ్‌ను సైతం తాజాగా కోర్ గ్రూప్‌గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. యూసీఎస్ బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్ సర్విసెస్ (యూసీఎస్) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్వోసీ) జారీచేస్తామని జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు. వర్సిటీ ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) ఎన్వోసీ జారీకి యూసీఎస్ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పోర్టల్‌లో వివరాలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది. అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో హైరింగ్‌ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్ నుంచి మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్‌ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్ చానల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్–ఎండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన. మారుతీ కూడా.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్ హైరింగ్‌ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీతో జట్టు కట్టింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ భారత్‌లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్‌ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) క్యాంపస్‌లలోనూ ఆసక్తి.. ఆటోమొబైల్ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్‌లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్ ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితరుల కోసం డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్ చేసుకునే ఆటోమొబైల్ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్‌లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్‌కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్‌లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్‌ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 67.00, ఈడబ్ల్యూఎస్‌కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్‌లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్ కాలేజీల తీరిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది. పదేళ్ల నాటి కంప్యూటర్లు... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది. అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్‌తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది. ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు. అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు.. ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ 78 కాలేజీల డొల్లతనం.. ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్‌లో 40 శాతం, మెకానికల్‌లో 35 శాతం, ఎలక్ట్రికల్‌లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్‌పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది. -
అటు మూత.. ఇటు కోత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది. 2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి. ► సిలబస్‌లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. ► ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. స్కిల్ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. ► మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ. ► నాస్కామ్, ఏపీఎస్ఎస్డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు. ► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు నిదర్శనం. నాడు 65 కాలేజీల మూసివేత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి. ► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారింది. అదనపు నైపుణ్యాలు, సర్టిఫికేషన్ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు. ► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపాయాలు లేవు. వరుసగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది. ► ఇండియా స్కిల్ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కనీ్వనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. చదవండి: అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి -
కొత్త కొలువుకు ఇరకాటం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్‌రెడ్డి (పేరు మార్చాం) ఇటీవల ఆ కాలేజీలో కొలువుకు రాజీనామా చేశారు. అదే ప్రాంతంలో మరో కాలేజీలో మంచి వేతనానికి ఉద్యోగంలో చేరారు. అయితే ఇదివరకు పనిచేసిన కాలేజీ ఆన్లైన్ రికార్డులో వెంకట్‌రెడ్డి పేరు తొలగించలేదు. ఈ ప్రొఫైల్ తొలగింపు అధికారం కాలేజీ యాజమాన్యానికి మాత్రమే ఉండటంతో పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆ కాలేజీ రికార్డులో ఆయన పేరు తొలగించలేదు. పూర్వపు కాలేజీలో పేరు తొలగిస్తే తప్ప కొత్త కాలేజీలో కొలువులో చేరే అవకాశం లేదు. దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆయన ప్రొఫైల్ డిలీట్ కాకపోవటంతో కొత్త కాలేజీ యాజమాన్యం అతనికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వెంకట్‌రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేకమంది బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న సంకటస్థితి. ఈ సమస్యతో మెరు గైన అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి సంబంధించిన నియామక నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి బోధకుడి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతోపాటు రోజువారీ హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్సహా బోధకుడి పూర్తి సమాచారాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాలు కంప్యూటరీకరించి.. వివరాలను వర్సిటీ లేదా సంబంధిత బోర్డు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ విధానంతో ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాలేజీ మారితే అతని వివరాలను పాత యాజమాన్యం వెబ్సైట్నుంచి తొలగిస్తేనే మరో కాలేజీలో చేరేందుకు వీలుంటుంది. కొత్త కాలేజీలో కూడా ఆన్లైన్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశాక కొలువులో చేరాల్సి ఉంటుంది. కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి న ఈ అధికారం తమకు కొత్త అవకాశాలు రాకుండా చేస్తోందని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో ఇబ్బందులు.. రాష్ట్రంలో మూడు వందలకుపైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 80 వేల మంది బోధన సిబ్బంది అవసరం. కానీ చాలాచోట్ల సిబ్బందిని రికార్డుల్లో మాత్రమే కాలేజీ యాజమాన్యాలు చూపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 30 వేల నుంచి 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెపు తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, కొందరికి మంచి అవకాశాలు రావడంతో ఇతర సంస్థల్లో చేరడం వంటి ఘటనలు సహజంగా జరిగిపోతుంటాయి. కాలేజీ మారాలనుకున్న వారి వేతనాన్ని పూర్తిగా చెల్లించి, వారి వివరాలను తమ వెబ్సైట్ నుంచి తొలగించాలి. కానీ, పలు కాలేజీలు ఉద్యోగుల వివరాలను తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకోని వర్సిటీ అధికారులు.. కొలువు మారాలనుకున్న కొందరు ఉద్యోగులు రాజీనామాలు సమర్పించినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించడం లేదంటూ ఇటీవల పెద్ద సంఖ్యలో జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదులు వచ్చాయి. కొందరైతే నేరుగా వర్సిటీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కాలేజీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సమయంలో వర్సిటీ అధికారుల తనిఖీలో కాలేజీ వెబ్సైట్లో పేర్కొన్న ఉద్యోగులంతా ప్రత్యక్షంగా హాజరు కావాలి. జాబితా ప్రకారం ఉద్యోగులు పనిచేయకుంటే గుర్తింపును నిలిపివేయాలి. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు తాయిలాలిస్తూ మొక్కుబడి తనిఖీ చేయించి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాము ఆ కాలేజీలో పనిచేయడం లేదని ఉద్యోగులు వర్సిటీకి ఫిర్యాదు చేస్తే.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తనిఖీలతోనే నిజాలు వెల్లడి ఉద్యోగుల సంఖ్య, హాజరు, పనితీరుపైన ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో జేఎన్టీయూ, సంబంధిత అధికారులు తనిఖీ లు నిర్వహించాలి. వీటిల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లోనైనా తనిఖీలు చేపడితే బాగుంటుంది. ఉద్యోగుల ప్రొఫైల్ యాడింగ్ ఆప్షన్ యాజమాన్యానికి ఇచ్చి, డిలీషన్ ఆప్షన్ ఉద్యోగికే ఇవ్వాలి. దీంతో యాజమాన్యాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రొఫైల్ డిలీట్ చేయడం లేదనే అంశంపై వర్సిటీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయం. – డాక్టర్ శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘ఐటీ’ టెన్షన్.. రహస్య ప్రాంతాలకు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం. శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం. మెజార్టీ కాలేజీలు వారివే.. రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు.. ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఇక మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. ‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. -
తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల మోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ఇంజనీరింగ్‌తోపాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులు ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. ‘రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)’ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2019 నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో సగటున 20 శాతం వరకూ ఫీజులు పెరిగాయి. పెద్ద కాలేజీల్లో 10 నుంచి 15 శాతం పెంచగా.. రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. రాష్ట్రంలో గరిష్టంగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి గరిష్టంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఎంసీఏ కోర్సుల వార్షిక ఫీజులను కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు.. ఎంటెక్ ఫీజులను కనిష్టంగా రూ.57 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచారు. మొత్తం 153 కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉండటంతో ఫీజుల నిర్థారణ చేయలేదని తెలిపారు. 40 కాలేజీల్లో లక్షపైనే.. తాజా ఫీజుల పెంపును పరిశీలిస్తే.. రూ.లక్ష, ఆపైన ఫీజు ఉండే జాబితాలో ఇంతకుముందు 18 కాలేజీలుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 40కి పెరిగింది. రూ.75వేలపైన వార్షిక ఫీజున్న కాలేజీలు 24 నుంచి 38కి చేరాయి. తొమ్మిది కాలేజీల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ. 45వేలకు పెరిగింది. మరో 66 కాలేజీల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేల మధ్య ఫీజులు ఉండబోతున్నాయి. -
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను గత నెల 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో ఎఫ్ఆర్సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 11 నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖరులోగా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 1 నుంచి బోధన చేపట్టాలని భావిçÜ్తున్నారు. జాతీయ స్థాయిలోనూ... ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా ఈ నెల 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతర కోర్సులూ నవంబర్లోనే ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్ ముగిసినప్పటికీ నేషనల్ బార్ కౌన్సిల్ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో షెడ్యూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నాం. – ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
ఇంజనీరింగ్ ఫీజు పెంపు ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజు పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. తమ జమా ఖర్చులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రవే శాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు వాదన వినిపిస్తున్నాయి. హైకోర్టు సూచన మేరకు ఫీజుల నిర్ధారణపై ప్రైవేటు కాలేజీల మూడేళ్ల ఖర్చును సోమవారం నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టింది. దాదాపు 19 కాలేజీలు ఫీజుల పెంపును కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాయి. తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, వారి జమా ఖర్చులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని ఎఫ్ఆర్సీకి సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి ప్రతీ మూడేళ్లకోసారి ఎఫ్ ఆర్సీ ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా ఖర్చులు పెరిగాయా? 2023లో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు కోసం కాలేజీలు ఆరునెలల క్రితమే ఆడిట్ నివేదికలు సమర్పించాయి. గత మూడేళ్లుగా కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా కారణంగా కాలేజీలు సరిగా నడవకపోయినా, కొన్ని కాలేజీలు భారీగానే వ్యయం చేసినట్టు లెక్కలు చూపించాయి. సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రత్యేక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించామనే వాదనను తెరమీదకు తెచ్చాయి. కొన్ని కాలేజీలు న్యాయ సంబంధమైన లావాదేవీలకు అయిన ఖర్చును కూడా లెక్కల్లో చూపించాయి. వీటన్నింటిపైనా ఎఫ్ఆర్సీ కొన్నినెలల క్రితమే అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించి వాస్తవ ఖర్చుతో పెంపును నిర్ధారించింది. అయితే, ఇదే సమయంలో విద్యార్థులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని ప్రభుత్వానికి ఎఫ్ఆర్సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజునే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కావాలంటే కాస్త్త తగ్గిస్తాం... ఎఫ్ఆర్సీ దగ్గర జరిగిన సంప్రదింపుల్లో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కొంత తగ్గినట్టు తెలిసింది. రూ. 1.73 లక్షలు డిమాండ్ చేస్తున్న కాలేజీ రూ.10 వేలు తగ్గించుకునేందుకు, రూ.1.50 పైన ఫీజులు డిమాండ్ చేసే కాలేజీలు రూ. 5 వేలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీన్నిబట్టి కనిష్ట ఫీజు రూ 45 వేలు, గరిష్ట ఫీజు రూ.1.63 లక్షల వరకూ ఉండొచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. అయితే ఈ వాదనను మాత్రం ఎఫ్ఆర్సీ వర్గాలు అంగీకరించడం లేదు. కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని, ఏమేర ఫీజులను నిర్ధారించాలనే దిశగా అడుగులు వేస్తున్నామని ఎఫ్ఆర్సీకి చెందిన ఓ అధికారి తెలిపారు. -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? కన్వీనర్ కోటా కటాఫ్ ఎంత? వర్సిటీ క్యాంపస్‌లో సీటొచ్చే పరిస్థితి ఉందా? ఇలా ప్రతి విద్యార్థినీ ఎన్నో సందేహాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఈ సందేహాలతోనే చాలామంది మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి గత ఏడాది ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఏ బ్రాంచిలో సీటు వచ్చింది తదితరాలు క్షుణ్ణంగా తెలుసుకుని, కౌన్సెలింగ్‌పై కాస్త అవగాహన పెంచుకుంటే కచ్చితమైన అంచనా తేలికే అంటున్నారు నిపుణులు. విద్యార్థుల డిమాండ్, కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఈసారి కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొద్దిగా సీట్లు పెరిగే వీలుంది. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ వివరాలను యూనివర్సిటీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సీఎస్సీకి పెరిగిన డిమాండ్ గత కొన్నేళ్ళ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రాజధాని పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సుల్లో సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే 3 వేల లోపు ర్యాంకు మాత్రమే రావాలి. కానీ జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాలేజీలున్న మంథనిలో 10 వేలు దాటినా, సుల్తాన్పూర్ క్యాంపస్‌లో 5 వేలు దాటినా సీఎస్సీ సీటు పక్కాగా వస్తోంది. ఇక టాప్‌టెన్ ప్రైవేటు కాలేజీల్లో 10 వేల ర్యాంకు వరకు కూడా సీఎస్సీ సీటు వచ్చే చాన్స్ ఉంది. ఒక కాలేజీలో మాత్రం గత ఏడాది 25 వేలు దాటిన ర్యాంకుకు కూడా ఆఖరి కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చింది. రిజర్వేషన్ కేటగిరీల్లో 20 వేలు దాటినా సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. కసరత్తు తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి ఎంసెట్ ర్యాంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రధానంగా కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలి. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందనేది గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించి అంచనాకు రావాలి. ఈ కసరత్తు చేసిన తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి. – ఎంఎన్ రావ్ (గణిత శాస్త్ర విశ్లేషకులు) -
Telangana: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు నో! ఈ ఏడాది కూడా పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు సర్కార్ నో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఫీజులనే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం ఎఫ్ఆర్సీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎఫ్ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపును సమీక్షిస్తుంది. ఈ విధంగా 2019లో పెరిగిన ఫీజులు 2022 వరకు అమల్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఎఫ్ఆర్సీ పెంపు ప్రతిపాదించినా.. కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన జమాఖర్చులు మదింపు చేసింది. వారితో చర్చలూ జరిపింది. చివరకు కని ష్ట వార్షిక ఫీజును రూ. 45 వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.73 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏ కాలేజీకి ఎంత ఫీజు పెంచాలనే ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. వ్యతిరేకతే కారణమా? కరోనా వల్ల గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఈ సమయంలో ఫీజుల పెంపు సరికాదంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీల ఫీజులు కూడా ఈ ఏడాది పెంచలేదన్న విషయం చర్చకు వచ్చింది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఫీజుల పెంపుతో ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది. -
తెలంగాణలో భారీగా పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజులు.. ఎఫ్ఆర్సీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన మదింపు ప్రక్రియ పూర్తయింది. ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) నిర్ధారించింది. ఈ వ్యవహారంపై కమిటీ ఇటీవల భేటీ అయి, పెంపునకు ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో పెంపు నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 5వ తేదీలోగా ఫీజుల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. దీంతో 2022–23 విద్యాసంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలుకానున్నాయి. ఎఫ్ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో ప్రకటించిన ఫీజులు 2022 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి. కనీసం రూ.10 వేలు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు కనిష్టంగా రూ.35 వేలు, గరిష్టంగా 1.40 లక్షల వరకూ ఉన్నాయి. ఇప్పుడీ ఫీజు కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు ఉండే అవకాశముంది. దీన్ని బట్టి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.32 వేలు పెంచే వీలుంది. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 21 కాలేజీల్లో ఫీజు రూ.లక్షకుపైగానే ఉంది. పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈ ఏడాది వీటిసంఖ్య 40పైనే ఉండే అవకాశముంది. 25 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.లక్ష వరకూ ఫీజులన్నాయి. ఈసారి ఈ కాలేజీల్లో ఎక్కువశాతం రూ.25 వేల వరకూ వార్షికఫీజు పెంపునకు ఎఫ్ఆర్సీ ఒప్పుకుంది. మూడేళ్ల క్రితం ఫీజులు పెంచినా రూ.లక్ష దాటిన కాలేజీలు నాలుగు ఉంటే, ఇప్పుడు 40కిపైగానే ఉండే అవకాశముంది. పెంచే ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉంటాయి. -
విద్యార్థులకు ‘మెయిన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్షల వాయిదాతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తిచేసి తరగతులు చేపడతామని ఆయనన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో విడుదల చేసిన షెడ్యూళ్ల ప్రకారం జేఈఈ మెయిన్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలోని సెట్లన్నీ పూర్తయి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనావేశారు. కానీ, జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ ఎన్టీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. మెయిన్ తొలిసెషన్ జూన్ 20 నుంచి 29 వరకు.. రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్సు కూడా వాయిదాపడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం ఆరు విడతల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లోకి జరిగే అడ్మిషన్లను పూర్తిచేయడానికి నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలంటే అక్టోబర్ వరకు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్టీఏ తీరుతో ఈసారీ నష్టమే జేఈఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తీరు కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు నష్టపోవలసి వస్తోందని అధ్యాపకులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఒకపక్క జాతీయస్థాయి అడ్మిషన్లు లేటు కావడంతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం కావడంవల్ల దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరిపోతున్నారని వివిధ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా అడ్మిషన్లు చేపడితే వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే చేరుతారని వారు తొలినుంచి కోరుతున్నారు. కానీ, జేఈఈ అడ్మిషన్ల ఆలస్యంతో గత ఏడాది రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశాలనూ ఆలస్యంగా చేపట్టారు. ఇక జేఈఈలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. జేఈఈ అడ్మిషన్ల కన్నా ముందే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందే ఆ విద్యార్థులు ఆ తరువాత జేఈఈ అడ్మిషన్లలో అవకాశం వస్తే ఇక్కడి సీట్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా 15వేల మంది వరకు జేఈఈ సీట్లలో చేరుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెరిట్లో ఉన్న ఇతర విద్యార్థులకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేఈఈ అడ్మిషన్ల తరువాత రాష్ట్ర ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతూ వస్తున్నారు. జేఈఈ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నందున అప్పటివరకు రాష్ట్రంలోని కాలేజీల్లో చేరుదామని చూసే విద్యార్థులు కౌన్సెలింగ్ జాప్యం అయితే ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లోకి వెళ్లిపోతున్నారు. -
ఏప్రిల్ 16 నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి,హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. మొదటిదఫా పరీక్ష ఏప్రిల్ 16 నుంచి 21 వరకూ, రెండో దఫా పరీక్ష మే 24 నుంచి 29 వరకూ ఉంటుంది. పరీక్ష నెగెటివ్ మార్కులతో ఆన్లైన్ ద్వారానే చేపడతారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. పేపర్–1 (బీఈ, బీటెక్ విద్యార్థులకు) మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ పేపర్లతో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మొదటి షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ రెండో షిఫ్ట్ ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పేపర్–2 (బీఆర్క్ విద్యార్థులకు) మేథ్స్, ఆప్టిట్యూట్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటుందని తెలిపింది. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుందని పేర్కొంది. పేపర్–2 బి (బీ ప్లానింగ్ విద్యార్థులకు) ఆప్టిట్యూట్ టెస్ట్, ప్లానింగ్‌పై మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పూర్తి వివరాలు, బ్రోచర్ ్జ్ఛ్ఛఝ్చజీn.n్ట్చ.nజీఛి.జీn వెబ్సైట్లో లభిస్తాయని ఎన్టీఏ తెలిపింది. -
కంప్యూటర్ సైన్స్‌కే.. సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో భర్తీకి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కే జై కొట్టారు. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి. తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్‌తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్ఆర్ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు. మొత్తం 1,12,699 సీట్లు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్‌లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
తెలంగాణ ఎంసెట్: కంప్యూటర్ సైన్స్‌పైనే అందరి గురి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు. చదవండి: తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కే ప్రాధాన్యత ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో హైకోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్లు పెరిగాయి. ఇవి కన్వీనర్ కోటా కింద 4,404 వరకూ ఉన్నాయి. ఇందులో సింహభాగం కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. వీటిపైనే విద్యార్థులు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. పెరిగిన సీట్లలో ఎక్కడో అక్కడ కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వచి్చన ఆప్షన్స్‌లో 89 శాతం కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి దశలో సీటొచ్చిన అభ్యర్థులు పెరిగిన సీట్లను అంచనా వేసుకుని రెండో దశలో కంప్యూటర్ కోర్సుల కోసం పోటీ పడ్డారు. ఇందులోనూ మొదటి ప్రాధాన్యత ఆరి్టఫీషిÙయల్ ఇంటిలిజెన్స్‌కే ఇవ్వడం విశేషం. ఎట్టకేలకు జేఎన్టీయూహెచ్ అనుమతి పెరిగిన సీట్లపై తొలుత పేచీ పెట్టిన జేఎన్టీయూహెచ్ ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంటే తప్ప కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఒకదశలో ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా పెరిగే సీట్లను భర్తీ చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వర్సిటీ కూడా మొత్తం సీట్లకు ఆమోదం తెలపకతప్పలేదు. అయితే, పెరిగిన సీట్లకు అనుకూలంగా వసతులు, ఫ్యాకల్టీని మెరుగుపరచాలని వర్సిటీ ప్రైవేటు కాలేజీలకు షరతు విధించింది. పెరిగిన సీట్లు ఇవీ... బ్రాంచ్ సీట్లు సీఎస్ఈ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 1,533 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాసైన్స్ 840 సీఎస్సీ (డేటాసైన్స్) 672 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 546 సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ) 231 సీఎస్ఈ 168 కంప్యూటర్ సైన్స్ డిజైన్ 168 ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ 126 సీఎస్ఈ (ఐవోటీ) 42 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21 ఈఈఈ 21 సివిల్ ఇంజనీరింగ్ 21 మైనింగ్ ఇంజనీరింగ్ 15 -
కోర్ బ్రాంచ్‌ల డోర్ క్లోజ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ అనుబంధ కోర్సులు పూర్తిగా పైచేయి సాధిస్తు న్నాయి. ఫలితంగా కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు అనివార్యంగా తగ్గించాల్సి వస్తోంది. భవిష్యత్‌లో అవి పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఉందని సాంకే తిక విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సామాజిక పరిస్థితుల నేపథ్యమే దీనికి ప్రధాన కారణమనే వాదన విన్పిస్తోంది. తాజా పరిస్థితిపై ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఓ అధ్యయనం కూడా చేసింది. ఇంజనీరింగ్ విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, సంప్ర దాయ డిగ్రీ కోర్సుల ప్రాధాన్యత తగ్గింది. అలాగే అన్నింటా సాంకేతికత అవసరంతో సరికొత్త కోర్సుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమే అయినా, మిగతా కోర్సులను రక్షించుకోకపోతే అర్థవంతమైన ఇంజనీరింగ్ విద్య సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి?: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. సాంకే తికత లేకుండా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మెకానికల్‌కు సీఎస్ఈకి సంబంధం లేకున్నా.. ఏదైనా వాహనాన్ని డిజైన్ చేయాలంటే ముందుగా సాంకేతిక టెక్నాలజీతోనే చేస్తారు. కంప్యూటర్ టెక్నాలజీతోనే దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే హార్డ్‌వేర్‌తో అవసరం. అలాగే ఎలక్ట్రానిక్స్‌తో రూపొందించే టీవీల తయారీలోనూ అత్యాధునిక ఐవోటీ టెక్నాలజీ కీలకం. సివిల్‌లోనూ ఇదే ధోరణి. నిర్మాణాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందుగా వినియో గించాలి. మానవ జీవితంలో అంతర్భాగమైన ఇంటర్నెట్ను గుప్పిట్లో పెట్టుకునేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. డేటాసైన్స్ ఉపయోగమూ అంతాఇంతా కాదు. దీంతో కంప్యూటర్ అనుబంధ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 74,071 సీట్లు తొలి విడత భర్తీ చేస్తే అందులో 38,796 కంప్యూటర్, దాని అనుబంధ కొత్త బ్రాంచీల సీట్లే ఉన్నాయి. ప్రైవేటు పంట... కంప్యూటర్ అనుబంధ బ్రాంచ్‌ల్లో సీట్లకు ఉన్న డిమాండ్‌ను ప్రైవేట్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ కోర్సులకు ఇష్టానుసారంగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసే 30 శాతం సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలుకాక ముందు నుంచే అమ్మేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్కో సీటుకు రూ.10 లక్షలకు పైనే వసూలు చేశాయి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తే తప్ప డిమాండ్ తగ్గుతున్న కోర్సుల విషయంలో తామేమీ చేయలేమని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ కోర్సులే కాకుండా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సుల్లో కూడా కంప్యూటర్ టెక్నాలజీతో పాఠ్యప్రణాళిక రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినా.. తాము అంతిమంగా సాఫ్ట్వేర్ వైపే వెళ్లాలి కదా అనే అభిప్రాయం వాళ్లలో ఉందని చెబుతున్నారు. ఇదే ప్రైవేటు కాలేజీలకు కలిసి వస్తోందని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో 2018–19లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు 17,361 ఉంటే 2021 నాటికి అవి 18,614కు చేరాయి. అంటే ఈ రెండేళ్లలోనే 1,253 పెరిగాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 3,500 పెరగబోతున్నాయి. ఎలక్ట్రికల్ కోర్సు (ఈఈఈ)లో సీట్లు 8,667 నుంచి 7,019 (1,648 తక్కువ)కు తగ్గాయి. సివిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండేళ్ల క్రితం సివిల్ బ్రాంచ్ సీట్లు 8,293 ఉంటే ఇప్పుడు 6,221 (2072)కు తగ్గాయి. మెకానికల్ పరిస్థితి చెప్పుకోలేని స్థాయికి దిగజారింది. ఈ బ్రాంచ్‌లో 2018–19లో 10,104 ఉంటే, ఇప్పుడు 5,881 (4,223) సీట్లున్నాయి. సీఎస్ఈ తర్వాత పాత్ర పోషించే ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ)లోనూ 15,415 నుంచి 13,935 (2,210 తక్కువ) సీట్లకు చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే కంప్యూటర్ అనుబంధ కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఇంటర్ ఆఫ్ థింగ్స్ బ్రాంచ్‌ల్లో 14,920 మంది కొత్తగా చేరడం విశేషం. కంప్యూటర్ కోర్సులే కాదు.. కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉంది. జేఎన్టీయూహెచ్తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై అధ్యయనం జరుగుతోంది. వ్యవస్థకు కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అవసరం. యంత్రాలున్నంత కాలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ కోర్సుల ప్రాధాన్యత ఉంటుంది. అయితే, వీటిని నేటి తరానికి, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకుని తీర్చిదిద్దాలి. ఈ ప్రయత్నంలో అఖిలభారత సాంకేతిక విద్యా మండలి కూడా దృష్టి పెట్టింది. – లింబాద్రి, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ -
ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ‘ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై ఉదాసీనత వద్దు. కొంత సమయమివ్వండి. అప్పటికీ ప్రమాణాలు పాటించకపోతే అనుమతులు ఇవ్వవద్దు’.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా శాఖాధికారులకు పలు సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పలుమార్లు గడువిచ్చినా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తోంది. జీరో అడ్మిషన్లు, 25 శాతం లోపు చేరికలు ఉన్న కాలేజీలకు అనుమతులు నిలిపివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే విద్యారంగంపై, ముఖ్యంగా ఉన్నత విద్యలో ప్రమాణాలపై దృష్టి సారించారు. కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేయించారు. నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సుల ఏర్పాటు, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్, కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందేలా చర్యలు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు.. ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు ఫీజులను పూర్తిస్థాయిలో రీయింబర్స్ చేయడమే కాకుండా వారికి వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా చెల్లిస్తున్నారు. ఇన్ని చేస్తున్నందున లక్ష్యాలకు అనుగుణంగా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలకు ఉన్నత విద్యా మండలి చేపట్టింది. 337 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 91 ఇంజనీరింగ్, 21 ఫార్మా కాలేజీలు కాకినాడ జేఎన్టీయూకు కోట్ల రూపాయల రుసుములు బకాయి ఉన్నాయి. ఈ కాలేజీలకు ఈ ఏడాది పూర్తిగా అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వీటికి కొన్ని షరతలతో అడ్మిషన్లు నిర్వహంచారు. ఈసారి మాత్రం నవంబరు 1వ తేదీ లోపు బకాయిలు చెల్లిస్తేనే అనుమతిస్తామని స్పష్టంచేసింది. కొన్నేళ్లుగా చేరికలు తగ్గుతూ ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు అనంతపురం జేఎన్టీయూ పరిధిలో 28, కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 22 ఉన్నాయి. వీటికి కూడా ప్రవేశాలు నిలిపివేయనున్నారు. ఇక యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేసింది. 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా అడ్మిషన్లు నిలిపివేస్తున్నారు. డిగ్రీ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నింటినీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా అందించే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్థానిక మాతృభాషల్లోనే బోధిస్తున్నారు. -
నచ్చిన కాలేజీ.. మెచ్చిన బ్రాంచ్
గత వారం రోజులుగా ఇదే తంతు. ఎంసెట్ ర్యాంకు తక్కువొచ్చిన, కాస్త అటూ ఇటూగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. ‘టాప్ టెన్ కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు కావాలా? మేమిప్పిస్తాం..’ అని కన్సల్టెన్సీలకు చెందినవారు, దళారీలు ఊదరగొడుతున్నారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే ఏకంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను (పీఆర్వోలు) పెట్టుకుని మరీ సీట్ల సేల్ కోసం విద్యార్థుల వెంటపడుతున్నాయి. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి ర్యాంకు ప్రకారమే సీటివ్వాలని ఉన్నత విద్యా మండలి పదేపదే చెబుతున్నా అడ్డదారిలో సీట్లన్నీ బేరం పెట్టేస్తున్నాయి. మరోవైపు తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కూడా కొన్ని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి. వారికి తెలిసిన ఎంసెట్ అర్హత పొందిన విద్యార్థుల ఇళ్లకు పంపి సీటు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు పేరు మోసిన కాలేజీలు, ఆ తర్వాత స్థాయి కళాశాలలు కొన్ని.. తమకున్న డిమాండ్‌ను, తమ కాలేజీల్లో వివిధ బ్రాంచ్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాస్త ర్యాంకులు అటూ ఇటూగా వచ్చి, కన్వీనర్ కోటాలో సీటు రాదని భావించే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా తీసుకుని అలాంటి వారికి కన్సల్టెన్సీల ద్వారా ఎరవేస్తున్నాయి. సాధారణ యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటాయింపులో దోపిడీకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటా కింద ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల ఇంజనీరింగ్ సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో సుమారు 13 వేలు సాధారణ యాజమాన్య కోటా సీట్లు కాగా సుమారు 14 వేల సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసే వారికి ఈ సీట్లు ఇస్తారు. ఫీజు కూడా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం చూస్తే ఏడాదికి దాదాపు రూ. 3.75 లక్షల వరకు వ్యయం అవుతుంది. కానీ డిమాండ్‌ను బట్టి దాదాపు రూ.15 లక్షల వరకు కాలేజీలు వసూలు చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు కొన్ని కాలేజీల్లో కొంతమంది సాయంతో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దళారుల పాత్రేంటి?: మేనేజ్మెంట్ సీటు ఆశించే తల్లిదండ్రులతో కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు నేరుగా బేరసారాలు చేస్తున్నాయి. పీఆర్వోలను పెట్టుకుని కథ నడిపిస్తున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల సెల్ఫోన్లు బయట సిబ్బంది వద్ద ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కన్సల్టెన్సీలు, దళారులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు నిజానికి కొన్ని కాలేజీల యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా ఆ కాలేజీలో సీటు ధర ఎంతో తెలుసుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ రేటు తల్లిదండ్రులకు చెబుతున్నారు. నేరుగా యాజమాన్యాన్ని కలిసి రమ్మని, వాళ్లతో మాట్లాడామని, సీటు రేటు తగ్గిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బేరసారాలు చేసుకుని వస్తున్నారు. దళారులు, కన్సల్టెన్సీల వల్లే ధర తగ్గిందని భావిస్తున్న తల్లిదండ్రులు వారికి కమీషన్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీలు మాత్రం దళారుల ద్వారా సీట్లు భర్తీ అయ్యేలా నేరుగా బేరాలు కుదుర్చుకుంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ వరంగల్‌కు చెందిన అరుణ్‌కు 16 వేల ఎంసెట్ ర్యాంకు వచ్చింది. టాప్‌టెన్ కాలేజీలో సీఎస్సీ చేయాలన్నది అతని కోరిక. కానీ సీటు వస్తుందా? అని అనుమానం. ఇంతలోనే మీకు సీటిప్పిస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు అవుతుందని చెప్పారు. దీంతో అతను ఆ వ్యక్తి చెప్పే మాట నిజమో? అబద్ధమో? తెలియని అయోమయంలో ఉన్నాడు. నిజామాబాద్‌కు చెందిన కార్తీక్ హైదరాబాద్‌లో టాప్‌టెన్‌లో ఉన్న ఒక కాలేజీలో డేటా సైన్స్ సీటు కోసం వెళ్లాడు. మేనేజ్మెంట్ కోటాలోనూ కష్టమని చెప్పారు. వేరే బ్రాంచ్ తీసుకోమంటే వద్దని బయటకొచ్చాడు. కాలేజీ బయట ఓ వ్యక్తి సీటిప్పిస్తానంటూ చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే రెండురోజుల తర్వాత సీటు వచ్చింది. కృత్రిమ డిమాండ్ ఈసారి ఇంజనీరింగ్‌లో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులు కూడా ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ‘ఆ సీట్లు అయిపోయాయి. వేరే బ్రాంచ్ తీసుకుంటారా?’ అని సీటు కోసం వెళ్లిన తల్లిదండ్రులను అడుగుతున్నాయి. వాళ్ల ఆసక్తిని ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి ఎక్కువ మొత్తానికి సీట్లు అమ్మేస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన సత్యప్రకాశ్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ‘యాజమాన్యం సీఎస్సీ సీటు కష్టమంది. గేటు దాటి బయటకు రాగానే దళారీ వచ్చాడు. అతని ద్వారా సీటు వచ్చింది..’ అని చెప్పాడు. -
రండి బాబూ రండి.. అంతా ఉచితం.. అన్నీ చూసుకుంటాం
జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యాడు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చదివించాలన్న ఉద్దేశంతో వెబ్ ఆప్షన్ ఇచ్చేశారు. ఈవిషయం తెలుసుకున్న ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి తమ కళాశాలలో చేరాలని కోరింది. ఫీజు చెల్లించకున్నా పర్వాలేదని, కావాలంటే తామే రూ.10వేల వరకు ఇస్తామని చెప్పినా వారు కాదన్నారు. మరో విద్యార్థినికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె బంధువులు వరంగల్‌లో ఉండడంతో అక్కడే చేరాలని వెబ్ ఆప్షన్ ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఓ కళాశాల ఉద్యోగులు వెళ్లి తమ వద్ద చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అకడమిక్ ఫీజు చెల్లించక్కర్లేదని, కేవలం బస్సు ఫీజు చెల్లిస్తే చాలని చెప్పా రు. దీంతో వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు గురువారం వరకు అవకాశమున్నందున ఆలోచిస్తామని వారు బదులిచ్చారు. సాక్షి, ఖమ్మం : జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు బోసిపోతున్నాయి. కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నా.. విద్యార్థులు జిల్లాలోని కళాశాలలను ఎంపిక చేసుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఎలాగైనా సీట్లు నింపాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం షాపింగ్ మాల్స్ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక మరికొన్ని కళాశాలల్లోనైతే అంతా ఉచితం.. అన్నీ మేమే చూసుకుంటాం.. తమ కళాశాలలో చేరితే సరిపోతుందని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థుల చిరునామాలు సేకరించి ఇళ్లకు వెళ్లి తమ ఆఫర్లను వివరిస్తూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మారిన పరిస్థితులతో.. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వినియోగించి కొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోసేదే ఇంజనీరింగ్ విద్య. కోర్సులో చేరాక ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందే వ్యక్తులు సదరు సంస్థ పురోభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తేనే సహజ ప్రతిభ కలిగి ఉన్నట్లు లెక్క. అయితే కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా కళాశాలలు ఏర్పడడం, పెరగడం.. తదనుగుణంగా విద్యార్థులు లేకపోవడంతో సీటు లభించడం సులభమైంది. మంచి పేరున్న కళాశాలల్లో మినహా మిగిలిన కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం కష్టంగా మారింది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కళాశాలల యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకునేందుకు నానాపాట్లు పడక తప్పడం లేదు. 3,500 సీట్లు భర్తీ అయ్యేనా ? జిల్లాలో ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి ఉంది. వీటిలో అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి 3,500 వ రకు సీట్లు ఉన్నాయి. ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఇటీవల పూర్తికాగా, కళాశాలల ఎంపికకు ఈనెల 11 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. ఇది గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు తమ కళాశాలలను ఎంచుకునేలా యజమానులు రంగంలోకి దిగారు. సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టిన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల వద్దకే తమ సిబ్బందిని పంపించి విద్యార్థులను మచ్చిక చేసుకునేందుకు య త్నించారు. కానీ ఎక్కువ మంది హైదరాబాద్, వరంగల్‌లోని కళాశాలలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా తమ కళాశాలల్లో సీట్లు నిండేలా చూసేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు. చేరితే చాలు బాబోయ్ జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. ఈక్రమంలో విద్యార్థులు కళాశాలలో చేరితే చాలు అనే పరిస్థితికి యాజమాన్యాలు వచ్చేశాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం సౌకర్యాలకు అనుగుణంగా ఫీజు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో కొన్ని కళాశాలల్లో రూ.35వేల నుంచి రూ.85వేల వరకు ఫీజు ఉండగా అదనంగా మరి కొంత ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఫీజు రీయింబర్స్మెంట్ పోగా విద్యార్థులు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు చెల్లించా ల్సి వచ్చేది. దీంతో పాటు బిల్డింగ్, బస్ తదితర ఫీజులు కలిపితే రూ.30వేల నుంచి రూ.60వేల వర కు ఏటా ఖర్చవుతుంది. అయితే విద్యార్థులు ఇతర ప్రాంతాల వైపు దృష్టి సారిస్తుండడంతో జిల్లాలోని కళాశాల యజమానులు ఫీజులు తగ్గిస్తుస్తున్నారు. మరికొందరైతే విద్యార్థులకు ఉచిత విద్య ఆఫర్ ఇవ్వడమే కాకుండా మెరుగైన ర్యాంకు సాధించిన వారికి ఎదురు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. వెబ్ ఆప్షన్ల ప్రక్రి య గురువారం ముగియనుండడంతో యజమానులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
ఇదీ సంగతి: అర్హతలేని అధ్యాపకులు... అనుభవం లేని ప్రిన్సిపాళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 90 శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని గుర్తించినట్లు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ–హెచ్) వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కాలేజీలకు ఈసారి గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనల అమలు కచ్చితంగా పాటించడం సాధ్యం కాదని, ఈసారికి మినహాయింపు ఇవ్వాలంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ–హెచ్ అఫిలియేషన్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయితేనే ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. కమిటీ తేల్చిందేంటి? రాష్ట్రవ్యాప్తంగా 148 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 955 కోర్సులను నిర్వహిస్తున్నారు. 2021–22 లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో 89,400 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వాటన్నింటికీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ–హెచ్ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్థితిగతులు తెలుసుకొనేందుకు ఎంసెట్ నిర్వహణకు ముందే జేఎన్టీయూ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలను సేకరించింది. జేఎన్టీయూ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయాలు ఇవీ... ►రాష్ట్రంలోని 90 శాతం కాలేజీల్లో మౌలిక వసతుల లేమి కనిపించింది. సీఎస్ఈ కోర్సులకు కీలకమైన ఆధునిక కంప్యూటర్లు లేవు. అవసరమైన సాఫ్ట్వేర్ సైతం అందుబాటులో లేదు. కొన్ని కాలేజీల్లో ఇంకా కాలం చెల్లిన కంప్యూటర్లే కనిపించాయి. ►అనుభవం లేని అధ్యాపకులు, అర్హతల్లేని ప్రిన్సిపాళ్లతో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ►చాలా కాలేజీలు అధికారికంగా చూపించే ఫ్యాకల్టీ అధ్యాపకులు కనిపించలేదు. ►దాదాపు ఐదేళ్లుగా పేరున్న ఒక్క కంపెనీ కూడా ఆయా కాలేజీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిన దాఖలాల్లేవు. ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి... ►కాలేజీ ప్రిన్సిపాల్ పీహెచ్డీ చేసి ఉండాలి. కనీసం 15 ఏళ్ల అధ్యాపక అనుభవం కలిగి ఉండాలి. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శిగా పనిచేసి ఉండాలి. ►సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు తప్పనిసరిగా పీహెచ్డీ చేసి ఉండాలి. ఇది లేనప్పుడు నెట్, స్లెట్.. ఏదో ఒకటి చేసుండాలి. ►కాలేజీలు ఎంపిక చేసే అధ్యాపకులను అఫిలియేషన్ ఇచ్చే యూనివర్సిటీ పరిశీలించి, ఆమోదించాలి. బోధించే అర్హతలున్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే గుర్తింపు ఇవ్వాలి. -
మెరిట్ విద్యార్థులకే...‘బీ’ కేటగిరీ సీట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజనీరింగ్, తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లోని ‘బీ’ కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్లు కూడా ఇక మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాయి. ఈ సీట్లను ప్రభుత్వమే కన్వీనర్ ద్వారా భర్తీ చేయించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి మాత్రమే సీట్లను కట్టబెట్టేవి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లేది. గత టీడీపీ ప్రభుత్వం ఈ సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ‘బీ’ కేటగిరీ సీట్లను మెరిట్ ప్రాతిపదికన.. పారదర్శకంగా కన్వీనర్ ద్వారా భర్తీ చేయించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గతేడాది జూలై 25న జీవో 25ను జారీ చేసింది. అయితే కరోనాతో అడ్మిషన్లు ఆలస్యం కావడం, ఇతర కారణాలతో కాలేజీ యాజమాన్యాల వినతి మేరకు వారే భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం కన్వీనర్ ద్వారానే భర్తీ చేసేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర కొన్ని సవరణలతో తాజాగా జీవో 48 విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ యాజమాన్య కోటా సీట్లను కూడా కన్వీనర్ నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా (‘ఏ’ కేటగిరీ) సీట్లు కాగా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు. ‘బీ’ కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్ల భర్తీ ఇలా.. ► యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, 15 శాతం నాన్ ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. ► ఎన్ఆర్ఐ కోటా సీట్లకు యాజమాన్యాలే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ఆర్ఐ విద్యార్థులతో భర్తీ చేసుకోవచ్చు. ► ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే అవి వాటిని భర్తీ చేయాలి. ఈ సీట్లను నిర్ణీత అర్హత పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధించిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది. ► ఎన్ఆర్ఐ విద్యార్థుల నుంచి కాలేజీలు 5 వేల అమెరికన్ డాలర్లను ఫీజుగా వసూలు చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ కాని సీట్లను ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్లుగా పరిగణిస్తారు. ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ సీట్ల భర్తీ ఇలా.. ► ఆయా కాలేజీలు ‘బీ’ కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్ల వివరాలను కన్వీనర్‌కు తెలియజేయాలి. వీటిని ఏపీ ఈఏపీసెట్ ప్రవేశాల కన్వీనర్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ► రాష్ట్ర విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు.. ఆయా కాలేజీల్లోని కోర్సుల వారీగా.. ‘ఏ’ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు గరిష్టంగా మూడు రెట్ల వరకు ఆయా యాజమాన్యాలు వసూలు చేసుకోవచ్చు. ► ఈ సీట్లు లభించిన విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు అర్హులు కారు. ► విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో ‘ఏ’ కేటగిరీ, ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ సీట్లకు వేర్వేరుగా ఆప్షన్లు ఇవ్వాలి. ► ‘ఏ’ కేటగిరీతోపాటు ‘బీ’ కేటగిరీ సీట్లను కూడా కన్వీనర్ ఒకే సమయంలో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ► ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ సీట్లకు ఎంపికైనవారు ఏపీ ఈఏపీసెట్‌లో మెరిట్ సాధించి ఉంటే ‘ఏ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ సీట్లకు ముందుగా జేఈఈ, తర్వాత ఏపీ ఈఏపీసెట్ మెరిట్‌ను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ► కన్వీనర్ ద్వారా మిగిలిపోయే సీట్లను ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల కింద నిర్ణీత అర్హతలున్న వారితో భర్తీ చేసుకోవచ్చు. దీనికి సంబంధిత అధికారుల ఆమోదం తప్పనిసరి. -
అక్టోబర్‌లో బీటెక్ ప్రత్యక్ష తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలను వీలైనంత త్వరగా తెరిచే వీలుంది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల తరగతులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇది వీలుకాకపోతే అక్టోబర్ నుంచైనా ప్రత్యక్ష బోధన చేపట్టే వీలుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరగా ముగించి, అక్టోబర్ మొదటి వారంలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీఎం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఏఐసీటీఈ డెడ్‌లైన్.. అక్టోబర్ 15లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి సెక్షన్‌లోనూ గరిష్టంగా 60 మంది విద్యార్థులు ఉంటారు. చాలా కాలేజీల్లో బెంచ్‌కు ఇద్దరు చొప్పున కూర్చుంటున్నారు. ఇకపై ఒక్కరినే కూర్చోబెట్టడం సాధ్యమేనా అనే దిశగా పరిశీలన చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా చేయాల్సి వస్తే సెక్షన్లు పెంచాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయగల సామర్థ్యం ఎన్ని కాలేజీలకు ఉందనే వివరాలను ప్రభుత్వం ముందుంచారు. అక్టోబర్ 15లోపే ఫస్టియర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టే వారికి అక్టోబర్ 15లోగా ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 25న వెల్లడిస్తారు. 30 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియభహ మొదలుపెడుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 11 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఇదే నెల 4 నుంచి 13 తేదీల మధ్య వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 15న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జీఈఈ ఫలితాల తర్వాత తదుపరి కౌన్సెలింగ్ చేపడతారు. మొత్తమ్మీద సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 4 నాటికి సీట్ల కేటాయింపు జరపాలని, అక్టోబర్ మొదటి వారంలో కాలేజీల్లో విద్యా బోధన నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఒకేసారి ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆదేశించింది. రుసుముల విషయంలో ఏఐసీటీఈ నిబంధనలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రిన్స్‌స్టన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని లావణ్య ఆత్మహత్యపై టీఏఎఫ్ఆర్సీకి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పద్ధతుల్లో ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఏఐసీటీఈ ఆదేశాలున్నప్పటికీ, ఒకే విడతలో ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీలు బలవంతం చేస్తున్నాయంది. దీనిపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కోరింది. -
ఇంజనీరింగ్ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త నిబంధన
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు అనుమతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు 2021–22 విద్యా సంవత్సరానికి కాలేజీలు, కొత్త కోర్సులకు సంబంధించిన నిబంధనల హ్యాండ్‌బుక్‌లో పలు అంశాలు పొందుపరిచింది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ఏఐసీటీఈ అనుమతించిన ఇన్‌టేక్ (మొత్తం) సీట్లలో 50 శాతానికి మించి విద్యార్థుల చేరికలు ఉంటేనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి కోర్సులను ఆయా సంస్థల్లో తగిన సదుపాయాలు, ఇతర వనరులు ఉంటేనే అనుమతిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలంటే ఈ సదుపాయాలతోపాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాలని ఏఐసీటీఈ నిబంధన విధించింది. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆషామాషీగా కోర్సులకు అనుమతులు తీసుకొని అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీల వల్ల ప్రమాణాలు దిగజారిపోతుండడంతో ఈసారి అనుమతుల విషయంలో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం.. ► ఆర్కిటెక్చర్ కోర్సుల నిర్వహణకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఫార్మసీ కోర్సులకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. ► ప్రైవేటు కాలేజీల తనిఖీ కోసం వసూలు చేసే టీఈఆర్ చార్జీల నుంచి ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలకు మినహాయింపు ఉంటుంది. ఇతర సంస్థలు ఒక దఫాకు రూ.లక్ష చెల్లించాలి. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది. ► డిప్లొమా స్థాయి కోర్సులను డిగ్రీ స్థాయి కోర్సులుగా మార్చుకునేందుకు అవకాశం. ► ప్రస్తుత ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీల్లో కొత్త ప్రోగ్రాములకు మల్టీ డిసిప్లినరీ విభాగాల్లో మాత్రమే అనుమతిస్తారు. ► విద్యార్థులు, బోధన సిబ్బంది అంతర్గత బదలాయింపులను అనుమతించరు. ఒకే మాతృ సంస్థ పరిధిలోని సంస్థల విలీనమైతే మాత్రం అక్కడి మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బదలాయింపును అనుమతిస్తారు. ► విదేశీ విద్యార్థులు, ప్రవాస భారతీయులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లల కోసం సూపర్ న్యూమరరీ సీట్లను అనుమతిస్తారు. ► ప్రాంతీయ భాషల్లో నిర్వహించే సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల ఇన్‌టేక్‌ను పెంచుకునేందుకు అవకాశం. ► సంబంధిత విద్యాసంస్థలో మొత్తం ఇన్‌టేక్ సీట్ల (2019–20)లో 50 శాతానికి పైగా భర్తీ అయితే కొత్త కోర్సులకు అనుమతి. ► విదేశీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో కలిసి ట్విన్నింగ్ తదితర ప్రోగ్రామ్స్ నిర్వహించాలంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆ సంస్థలు టాప్ 500ల్లో ఉండాలి. దేశంలోని సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఉండాలి. అంతేకాకుండా ఎన్బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ముందు నుంచే ఉన్నత విద్య ప్రవేశాల్లో సంస్కరణలు కాగా.. రాష్ట్రంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా తొలి నుంచి అనేక చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యామండలిని మరింత పటిష్టపరిచారు. ప్రమాణాలు లేని, పూర్తి చేరికలు లేక తూతూమంత్రంగా నిర్వహించే కాలేజీలను గుర్తించి.. వారికి లోపాలను సవరించుకునేందుకు ఉన్నత విద్యామండలి కొంత సమయం ఇచ్చింది. లోపాలు సరిదిద్దుకోని వాటిలో ప్రవేశాలను నిలిపేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, డీఫార్మా కోర్సుల్లో జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలకు, నిర్ణీత రుసుములు చెల్లించని 82 కాలేజీలకు 2020–21 విద్యాసంవత్సరం అడ్మిషన్లను ఆపేసింది. అలాగే నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ప్రమాణాలు పాటించని కాలేజీలపైనా చర్యలు తీసుకుంది. జీరో నుంచి 25 శాతంలోపు అడ్మిషన్లున్న 48 కాలేజీల అనుమతులను ఉపసంహరించారు. కొన్నిటిలో కోర్సుల అనుమతులను రద్దు చేశారు. చదవండి: మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్ ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్లాగ్ ఖాళీలు -
జేఎన్టీయూకే.. అండ అక్రమార్కులకే!
సాక్షి, కాకినాడ: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) పరిధిలోని అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీల్లో బోగస్ అధ్యాపకులతో తంతు కానిచ్చేస్తున్నారు. ఇటీవల వర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2,338 మంది అధ్యాపకులు ఒకటి కంటే ఎక్కువ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నట్టు తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూకే అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా వాటికి వివరణ వచ్చిన దాఖలాలు లేవు. అధ్యాపకుల డబుల్, త్రిపుల్ యాక్షన్‌ను కట్టడి చేసేందుకు ‘ఆధార్ బేస్డ్ ఆన్లైన్ డేటా ఎంట్రీ యాప్’ను వర్సిటీ అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేదు. ఇదేం నిషేధం! రాష్ట్రంలోని 8 జిల్లాల్లో జేఎన్టీయూకే పరిధిలో 260 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో వరుసగా రెండేళ్లు విద్యార్థుల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని, తరువాతి ఏడాది అడ్మిషన్లకు అనుమతులిస్తున్నారు. గతంలో కంటే విద్యార్థుల ప్రవేశాలు 25 శాతం తగ్గితే, ఎంసెట్ ఐచ్చికాల నమోదుకు అనుమతించరు. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిబంధన పెట్టింది. ఉన్నత విద్యామండలి అలాంటి కళాశాలల వివరాలను గుర్తించి వర్సిటీలకు పంపింది. ఆ వివరాల ఆధారంగా జేఎన్టీయూకే నిర్ధారణ బృందం ఆ కళాశాలలను పరిశీలించి, అనేక లోపాలను గుర్తించి ఓ జాబితా తయారు చేసింది. దీని ప్రకారం 28 కళాశాలల్లో ఈసారి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ ప్రవేశాలను నిషేధించారు. వర్సిటీ 78 కళాశాలల జాబితా పంపి, వాటిలో పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఆదేశిస్తే.. తనిఖీ బృందాలు మాత్రం కొన్నేళ్లుగా అడ్మిషన్లు లేక కొట్టుమిట్టాడుతున్న కళాశాలలను ఎంచుకున్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటున్నామని కలరింగ్ ఇచ్చాయి. భారీగా వసూళ్లు! కళాశాలల్లో తనిఖీలకు వెళ్లిన వర్సిటీ అధికారుల్లో కొందరు ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్రమాలను సక్రమం చేసేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు నివేదిక ఇచ్చేందుకు తనిఖీ బృందంలోని అధికారులు ఒక్కో కళాశాల యాజమాన్యం నుంచి స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో పీహెచ్డీ అర్హత గల అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రతి 15 మంది ఇన్‌టేక్ స్టూడెంట్లకు ఒక అధ్యాపకుడు, 1:2:6 నిష్పత్తి ప్రకారం ప్రతి సెక్షన్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. చాలా కళాశాలలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారదర్శకంగా తనిఖీలు ప్రమాణాలు పాటించని కళాశాలల్లో అడ్మిషన్లకు అనుమతులు నిలిపివేశాం. బోగస్ అధ్యాపకులను గుర్తించి ఆయా కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. ఇకపై ఇలా జరగకుండా నివారించేందుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ తీసుకొస్తున్నాం. తనిఖీల సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తాం. – డాక్టర్ సీహెచ్.సత్యనారాయణ, రిజిస్టార్, జేఎన్టీయూకే -
ఎక్కడి వారికి అక్కడే ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను తమ సమీపంలోని కాలేజీల్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. కరోనా అదుపులోకి రాకపోవడం, కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు పట్టణ ప్రాంతాల్లో 90 శాతం వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు ఉంటోందని గుర్తించింది. గత మూడు రోజులుగా యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించింది. ఆన్లైన్ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అప్పుడు సెమిస్టర్ పరీ క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా యాజమాన్యాల సంసిద్ధతపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది. జేఎన్టీయూ పరిధిలోని 180కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్లో 50 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రథమ సెమిస్టర్ విద్యార్థులు మినహా మిగతా ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే వారంతా ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీలున్న ప్రాంతాల్లో ఉండటం లేదు. కరోనా కారణంగా తమ తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి ఆన్లైన్ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠ్యాంశాల బోధన ఏ మేరకు పూర్తయిందన్న దానిపైనా యాజమాన్యాలతో సమీక్షించింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్ బాగానే అయినా, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగమే అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్ చేయడం వంటివి లేకుండా, వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. షెడ్యూలు జారీ చేసిన వెంటనే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయా కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేయనుంది. -
అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్
అనంతపురం : తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు జిల్లాల్లోని 63 ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో తమ కాలేజీలకు అనుమతులు దక్కవేమోనని కొందరు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
మొదలైన వెబ్ ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్ ఆప్షన్లు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి. శనివారం ప్రభుత్వం కొత్త కోర్సుల్లో సీట్లకు ఆమోదం తెలుపగా, ఆదివారం మధ్యాహ్నం వరకు యూనివర్సిటీలు కొత్త కోర్సులతోపాటు పాత కోర్సులకు అనుబంధ గుర్తింపును జారీ చేస్తాయని ప్రవేశాల క్యాంపు అధికారులు, యాజమాన్యాలు ఎదురుచూశాయి. చివరకు ఆదివారం రాత్రి జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును ఇస్తూ కాలేజీల వారీగా బ్రాంచీలు, ఆయా బ్రాంచీల్లో సీట్ల వివరాలను ప్రవేశాల కమిటీలకు అందజేశాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను బట్టి 176 కాలేజీల్లో 97,741 సీట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. దీంతో ప్రవేశాల క్యాంపు కార్యాలయం సీట్ మ్యాట్రిక్స్ రూపొందించి ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 176 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,365 సీట్లను (14 యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం... 3,152 సీట్లు) భర్తీ చేయనుంది. కన్వీనర్ కోటాలో సీట్ల కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. అయితే ఆప్షన్లు ఇచ్చేప్పుడు కాలేజీల ప్రాధాన్యం పక్కాగా చూసుకోవాలని, తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇక మరో 28,376 సీట్లను 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో (అందులో 15 శాతం ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా) యాజమాన్యాలు భర్తీ చేయనున్నాయి. 25 కాలేజీలు.. 13,132 సీట్లకు కోత రాష్ట్రంలోని 201 కాలేజీల్లోని 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలుపగా, అందులో 176 కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు జారీ చేశాయి. అంటే 25 కాలేజీల్లోని 13,132 సీట్లకు యూనివర్సిటీలు కోత పెట్టాయి. అందులో 14 కాలేజీలు మూత పడగా, మరో 11 కాలేజీల్లో సీట్లు తగ్గిపోయాయి. కోర్సుల వారీగా జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చిన ప్రధాన బ్రాంచీల సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ – 6960, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – 180, సైబర్ సెక్యూరిటీ – 2580, డేటా సైన్స్ – 4500, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ – 1770, కంప్యూటర్ సైన్స్ బిజినెస్ అనలిటిక్స్ – 360, కంప్యూటర్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్) – 120, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ – 300, సీఎస్‌ఐటీ – 480, కంప్యూటర్ సైన్స్ – 20913, ఈసీఈ – 16893, ఈఈఈ – 8130, సివిల్ – 7140, మెకానికల్ – 6648, ఐటీ – 4980, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 300, కెమికల్ ఇంజనీరింగ్ – 120, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ – 240, మెటలర్జి – 360, మైనింగ్ – 60, ఆటోమొబైల్ – 60, బయోమెడికల్ – 30, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ – 60, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ – 300, ఈటీఈ – 60, ఐటీ అండ్ ఇంజనీరింగ్ – 60, మెకట్రానిక్స్ – 60. -
ఆ కాలేజీలకు మంగళమేనా?
సాక్షి, అమరావతి బ్యూరో: గతంలో ఒక వెలుగు వెలిగిన ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుతం ఒక్కోటిగా కనుమరుగవుతున్నాయి. ఇంజినీరింగ్ చేసినా పెద్దగా ఉపాధి అవకాశాలు లేక సాధారణ డిగ్రీ వైపు విద్యార్థులు మొగ్గు చూపుతుండటం, గతంతో పోలి్చతే కళాశాలల స్థితిగతులు, విద్యార్థులు, లెక్చరర్ల సంఖ్యపై ప్రభుత్వం నిఘా పెంచటంతో కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో ఆరు నుంచి ఏడు కళాశాలల్లో ఆడ్మిషన్ల సంఖ్య 25 శాతం కన్నా తక్కువగా ఉంటోంది. వాటిలో కొన్ని కోర్సుల్లో చేతి వేళ్లతో లెక్కగట్టేలా విద్యార్థులు చేరుతున్నారు. ఇటువంటి కళాశాలలు ఈ ఏడాది ఆడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు, నాణ్యత లేని కళాశాలల గుర్తింపు రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. (చదవండి: హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!) జిల్లాలో ఆరు కళాశాలలపై వేటు? గుంటూరు జిల్లా పరిధిలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల కోర్సులు కలుపుకొని 16,910 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు కళాశాలలు 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు పొందుతున్నాయని సమాచారం. ఈ కళాశాలల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేకపోవటంతో వీటిలో విద్యార్థులు చేరటానికి ఇష్టపడటం లేదు. గత నాలుగైదేళ్లుగా ఈ కళాశాలలు కనీస స్థాయిలో ఆడ్మిషన్లు పొందటానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులకు ఎదురుతాయిలాలు ఇచ్చి మరీ ప్రవేశాలు పొందుతున్నాయి. అందుకోసం “మా కాలేజీలో చేరండి లాప్‌ట్యాప్ ఉచితం. ల్యాబ్ ఫీజు పూర్తిగా రద్దు, బస్ ఫీజు నామమాత్రంగా వసూలు చేస్తాం. హాస్టల్ ఫీజు భారీగా తగ్గిస్తాం...మీకు ఏమైనా డిమాండ్లు ఉంటే చెప్పండి తీరుస్తాం.’’ అంటూ ఆఫర్ల వలలు విసిరేవారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చలువతోనే వీటి మనుగడ ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి 2017లో జిల్లాలో తక్కువ అడ్మిషన్లు పొందుతున్న కళాశాలల సీట్లలో కొంత మేర కోత విధించింది. జిల్లాలో ఒక్కో కళాశాలలో 60 నుంచి 200 దాకా కోత పడి సుమారు ఐదు వేల సీట్లను రద్దు చేశారు. (చదవండి: కళకళలాడుతున్న బోధనాస్పత్రులు..) తెగ విసిగించేస్తారు... ఎంసెట్ పరీక్ష ముగిసిన నాటి నుంచి ఇంటరీ్మడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు ఒకటే ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్ వస్తాయి. తమ కళాశాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తూ, తమ కాలేజీలో చేరమని విన్నపాలు చేస్తారు. రెండు నెలల పాటు తల్లిదండ్రులు ప్రతి రోజూ ఈ ఫోన్ కాల్స్ భరించలేక తలలు పట్టుకునే పరిస్థితి.తమ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి, కొత్తగా అధ్యాపకులుగా చేరాలన్నవారికి యాజమాన్యాలు 10 మంది విద్యార్థులను చేర్చాలన్న టార్గెట్లు పెడుతుంటాయి. దీంతో సిబ్బందికి సైతం ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే. సీట్లు తగ్గితే ప్రమాణాలు పెరిగే అవకాశం... ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న వారిలో కేవలం 60 శాతం మంది మాత్రమే కోర్సు ముగిసే సమయానికి సరి్టఫికెట్లతో బయటకు వస్తున్నారు. మిగిలిన 40 శాతం మంది బ్యాక్‌లాగ్‌లతో రెండు మూడేళ్ల పాటు కుస్తీ పడి ముగించేవారు కొందరైతే, విసిగి కాడి పడేసేవారు కొందరు. కోర్సు పూర్తి చేరసిన వారిలో కేవలం 12 నుంచి 14 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారని ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ దుస్థితికి కారణం ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ చదువులే. సీట్లు తగ్గి, వాటి నాణ్యతపై నిఘా పెడితే ప్రమాణాలు పెరిగి విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి, మంచి అవకాశాలు పొందే ఆస్కారం ఉంది. -
ముందే మేనేజ్ చేశారు..!
ఇంటర్లో 94% మార్కులు తెచ్చుకున్న దుష్యంత్ ఎంసెట్‌కు సిద్ధమవుతున్నప్పటికీ మంచి కాలేజీలో సీటు కోసం మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకొనేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఓ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో చేరేందుకు యాజమాన్యాన్ని సంప్రదించాడు. అయితే ఇప్పటికే మెజారిటీ సీట్లు అయిపోయాయని, ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా డొనేషన్ రూ. 12 లక్షలు చెల్లిస్తే సీటు కేటాయిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 25% డొనేషన్‌ను అడ్వాన్స్‌గా చెల్లించి సీటు సొంతం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బరితెగించాయి. ఇంకా ఎంసెట్ జరగ కున్నా యాజమాన్య కోటా సీట్లను అప్ప నంగా విక్రయించేస్తున్నాయి. ఏ కాలేజీలో కటాఫ్ ఎలా ఉంటుందో తెలియకున్నా భారీ మొత్తంలో డొనేషన్లు దండుకునేందుకు యాజమాన్య కోటా సీట్లను వేలం వేస్తు న్నాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలన్నీ మూతపడినప్పటికీ అంతర్గతంగా బోధన, బోధనేతర సిబ్బందితో మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని బ్రాంచుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లన్నింటినీ నింపేశాయి. మరో పది రోజుల్లో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానుండగా... ఆలోపే సీట్లన్నీ భర్తీ చేసేలా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘కరోనా’ను క్యాష్ చేసుకుంటూ... రాష్ట్రంలో 183 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఈ ఏడాది వాటిలో కొన్నింటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతో ఆ కాలేజీలు మినహాయిస్తే మిగిలిన వాటిలో 70% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా మిగతా 30% సీట్లు ఆయా యాజమాన్యాలు నింపుకుంటున్నాయి. వాస్తవానికి ఈపాటికే ఎంసెట్ ముగిసి అడ్మిషన్ల కౌన్సెలింగ్ సైతం కొలిక్కి వచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో ఎంసెట్ ఇంకా జరగలేదు. దీంతో 2020–21 విద్యా సంవత్సరంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కాలేజీ యాజమాన్యలు... మేనేజ్మెంట్ కోటా సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. సీటు కన్ఫర్మ్ చేసుకుంటే పాఠ్యాంశ బోధన ప్రారంభమవుతుందని, ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా, రాకున్నా ఇబ్బందులుండవనే కోణంలో ప్రచారం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆకర్షితులవుతున్నారు. దండిగా డొనేషన్లు... ఇంజనీరింగ్‌లో ప్రస్తుతం సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ కోర్సులకు డిమాండ్ ఉంది. సీఎస్ఈ కోటాలో ఉన్న మేనేజ్మెంట్ సీట్లు టాప్ కాలేజీల్లో దాదాపుగా భర్తీ అయ్యాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ కోర్సుల్లో అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులపై యాజమాన్యలు డొనేషన్ల పేరిట భారీగా దండుకుంటున్నాయి. సగటున రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. టాప్ కాలేజీలుగా పేరున్న వాటిలో రూ. 10 లక్షలకు తక్కువగా డొనేషన్ లేదు. డొనేషన్‌తోపాటు రెగ్యులర్ ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెల్లించాలి. ఈసారి కొత్తగా సీఎస్ఈలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కేటగిరీలకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ కోర్సులవైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యలు డొనేషన్లను వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీలలో అడ్మిషన్‌కు రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులోనూ డిమాండ్‌కు తగినట్లు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. ఎంసెట్‌లో ర్యాంకు వస్తే డబ్బు వాపస్ ఇస్తామని కూడా యాజమాన్యాలు చెబుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ కింద కొంత మేర చెల్లించి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్న వాళ్లు కూడా అధికంగా ఉన్నారు. ఆ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులే... టాప్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు భారీగా డొనేషన్లు డిమాండ్ చేస్తుండగా ఆ తర్వాతి వరుసలో ఉన్న కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాంటి డొనేషన్లు వద్దంటూ ప్రచారం చేస్తున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిని రంగంలోకి దింపి కేవలం ట్యూషన్ ఫీజు చెల్లిస్తే చాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ కాలేజీల్లోనూ సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలలో సీట్ల భర్తీ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో సీటు వస్తే బుకింగ్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెబుతుండటంతో విద్యార్థులు ముందస్తుగా బుకింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఎల్బీ నగర్‌కు చెందిన మనుశ్రీని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలని నిర్ణయించిన తండ్రి... ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రఖ్యాత కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ బ్రాంచ్‌లో సీటు కోరగా రూ. 15 లక్షల డొనేషన్‌తోపాటు ట్యూషన్ ఫీజు భరించాల్సి వస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంసెట్ మాక్ టెస్ట్‌లో మనుశ్రీ స్కొర్‌ను అంచనా వేసుకున్నాక ఆ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటును కన్ఫర్మ్ చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా కొన్ని రూ. లక్షలు చెల్లించి ఎంసెట్ ర్యాంకు, సీటును బట్టి మిగతా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. -
16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడనున్నాయి. దీంతో వాటిల్లో ఉన్న దాదాపు 4 వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లోని దాదాపు 4 వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్టీయూకు దరఖాస్తు చేశాయి. గత నాలుగేళ్లుగా వాటిల్లో పెద్దగా ప్రవేశాలు లేకపోవడం, గతేడాది అన్ని బ్రాంచీల్లో కలిపి 70లోపే ప్రవేశాలు ఉండటం, అంతకుముందు సంవత్సరాల్లోనూ పరిస్థితి అలాగే ఉండటంతో ఆ కాలేజీలన్నీ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు వరుసగా మూడేళ్లు 30 శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉంటే సగం సీట్లకే అనుమతి ఇస్తామని ఏఐసీటీఈ గతంలోనే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయ్యే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతించమని తెలిపింది. ఈసారి ఆ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. -
ఇక ఆన్లైన్లోనే అనుమతులు
సాక్షి,హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీలకు ఆన్లైన్ ద్వారా గుర్తింపు ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. కోర్సుల మార్పులు లేని కాలేజీలకు ఇప్పటికే అనుమతులిచ్చిన ఏఐసీటీఈ కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు కూడా తాజాగా అనుమతుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా యాజమాన్యాల నుంచి వసతులు, ఫ్యాకల్టీ వివరాలతో కూడిన పత్రాలను ఆన్లైన్ ద్వారా పరిశీలించిన ఏఐసీటీఈ కాలేజీ యాజమాన్యాలతో ఆన్లైన్ సమావేశాలను నిర్వహణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన కాలేజీలకు ఒక్కోరోజు సమయం ఇచ్చి వారు దరఖాస్తు చేసుకున్న కొత్త కోర్సుల నిర్వహణకు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తోంది. తాము ఆన్లైన్లో అనుబంధ గుర్తిం పు ఇచ్చినా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా కోర్సుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాలేజీలతోనూ ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. కొత్త కోర్సులకు అనుమతి కోరిన 120 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 183 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో 60కి పైగా కళాశాలలు కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోలేదు. పాత కోర్సులను నిర్వహించేందుకే అవి దరఖాస్తు చేసుకోవడంతో ఈ నెల మొదట్లోనే గుర్తింపు జారీ చేసింది. ఈ విద్యా ఏడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బిగ్ డాటా, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అనుమతిస్తామని చెప్పడంతో రాష్ట్రంలోని దాదాపు 120 కాలేజీలు ఆయా కోర్సులను ప్రవేశ పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తనిఖీలు చేసే పరిస్థితి లేనందున ఆన్లైన్లోనే గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి జూన్ 15లోగా అన్నింటికీ అనుమతులిచ్చేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఈ గుర్తింపు లభించాక రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. గతేడాది అనుబంధ గుర్తింపు ఉన్న పాత కోర్సులకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నాయి. కొత్త కోర్సుల విషయంలో మాత్రం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్నాకే అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. త్వరలోనే దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
బీటెక్ కొత్త కోర్సుల్లో 21 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కొత్త కోర్సుల్లో ఈసారి 21 వేల వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త కోర్సుల్లో 20,700 వరకు సీట్లు నింపుకొనేందుకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వాలని యాజమాన్యాలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకోగా, మరో 1,500 సీట్ల కోసం దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 800 వరకు సీట్లలో కొత్త కోర్సులు నిర్వహించేందుకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సుల్లో 23 వేల సీట్లకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులు రానున్నాయి. అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) కాలేజీల్లో తనిఖీలు చేపట్టి, లోపాల మేరకు కోతపెట్టినా కనీసం 21 వేల వరకు కొత్త కోర్సుల్లో సీట్లకు అనుబంధ గర్తింపు లభించే అవకాశం ఉంది. న్యాక్, ఎన్బీఏ ఉంటేనే.. యూనివర్సిటీలు విధించిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 100కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు రానున్నాయి. జేఎన్టీయూ పరిధిలో ఇప్పటికే 90 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో మరో 10కి పైగా కాలేజీల్లో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అయ్యాయి. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ఆఫర్ చేసే కాలేజీల సంఖ్య వందకు పైనే ఉండనుంది. కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యూనివర్సిటీలు పలు నిబంధనలు విధించాయి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీతో పాటు నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు, కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) కలిగిన కోర్సులు ఉన్న కాలేజీల్లోనే కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా ఉన్న సమయం.. జేఎన్టీయూ పరిధిలో అనుబంధ గుర్తింపు కోసం ముందుగా ఇచ్చిన దరఖాస్తుల గడువు ఈనెల 12తో ముగిసినా, యూనివర్సిటీ 16 వరకు పొడిగించింది. ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తుల గడువు మరో 20 రోజుల వరకు ఉంది. జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో ఎంటెక్ కోర్సులోనూ సైబర్ సెక్యురిటీ, డేటా సైన్స్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. ఇప్పటికే 618 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేయగా, ఎం.ఫార్మసీలోనూ 45 సీట్లలో, ఫార్మ్–డీలోనూ 10 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా మొత్తం జేఎన్టీయూ పరిధిలో ఇప్పటి వరకు 21,373 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. -
సాక్షి మాక్ టెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రముఖ ఇంజనీరింగ్/మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించాలని కోరుకుంటారు. అందుకు కోచింగ్ ఫీజుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. విద్యార్థులు సైతం తమ లక్ష్యం, తల్లిదండ్రుల ఆశయం నెరవేరేలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలైన ఐఐటీలు, నిట్‌లలో ప్రవేశానికి మార్గం వేసే జేఈఈ మెయిన్, తెలుగు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించే నీట్ పరీక్షలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేలా చేయూత అందించేందుకు సాక్షి ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఏ పరీక్ష ఎప్పుడంటే.. - సాక్షి జేఈఈ మెయిన్ పరీక్ష 25–3–2020న ఆన్లైన్లో ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేది: 15–3–2020. - సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 12–4–2020, 13–4–2020న ఆన్లైన్లో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 5–4–2020 - సాక్షి మాక్ నీట్ పరీక్ష 22–4–2020∙ఆఫ్‌లైన్‌లో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 15–4–2020. - ఒక్కోపరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150. http://www.arenoane.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈ మెయిల్‌కు హాల్‌టికెట్ పంపుతారు. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు - తెలంగాణ జిల్లాలు: 9505514424, 9666013544 - గ్రేటర్ హైదరాబాద్: 9912035299, 9912671222. - చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు: 9666697219 - విజయవాడ, గుంటూరు, ప్రకాశం,పశ్చిమగోదావరి: 9912671555 - తూర్పుగోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534 -
ఇంజనీరింగ్‌పై నో ఇంట్రస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. పలు కోర్సులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఇక ఇటు యాజమాన్యాలే కాలేజీల మూసివేత, కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకుంటుండగా, మరోవైపు తగిన వసతులు, ఫ్యాకల్టీ లేక అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు వివిధ కోర్సుల్లో సీట్లకు కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా 4 వేల నుంచి 7 వేల వరకు క్రమంగా సీట్లకు కోత పడుతోంది. దీంతో అనుబంధ గుర్తింపు లభిస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతోంది. అనుమతించినా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో దాదాపు 11 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉన్నత విద్యా మండలి తేల్చిన తాజా పూర్తి స్థాయి లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్లలో 33 కాలేజీలు మూత.. ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మేనేజ్మెంట్ కోటాలో 2016 నుంచి 2018 వరకు ప్రవేశాల్లో పెద్దగా తగ్గుదల లేనప్పటికీ 2018 నుంచి 2019కి వచ్చేసరికి మాత్రం భారీగానే ప్రవేశాలు తగ్గిపోయాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కలుపుకొని 2016 సంవత్సరంలో రాష్ట్రంలోని 220 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,758 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి 187 కాలేజీల్లోని 93,790 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. అంటే నాలుగేళ్లలో 33 కాలేజీలు మూతపడగా, 10,968 సీట్లు రద్దయ్యాయి. మరోవైపు విద్యార్థులు చేరకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోయాయి. 2016లో 73,686 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరగా, 2019లో 62,744 మంది మాత్రమే ఇంజనీరింగ్‌లో చేరారు. ఇందులో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గింది. 2016లో 54,064 నుంచి 46,134కు పడిపోయింది. గడిచిన రెండేళ్ల ప్రవేశాలను పరిశీలిస్తే మాత్రం మేనేజ్మెంట్ కోటాలోనూ చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. డిమాండ్ లేని కోర్సులకు దూరం.. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. విద్యార్థులు కూడా తమ ఆలోచనను మార్చుకొని టైంపాస్ కోసం ఏదో ఓ కోర్సులో చేరాలనుకోవడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిల్లో చేరేందుకే అస్సలు ఇష్టపడటం లేదని వారంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఏటా 8 నుంచి 15 వరకు కాలేజీలు మూత పడుతూనే ఉన్నాయి. ఈసారి కూడా 10 కాలేజీలు మూసివేత కోసం జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈసారి మరో 7 వేల వరకు సీట్లు తగ్గిపోవచ్చు. అయితే మార్కెట్లో డిమాండున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి ఇప్పటివరకు అన్ని కాలేజీల్లో లేవు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి మాత్రం జేఎన్టీయూలోని అన్ని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో 3 వేల వరకు సీట్లలో ఆయా కోర్సులకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అయినా 2020 ప్రవేశాల్లో 4 వేల వరకు సీట్లు తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల్లో తగ్గుదలే తప్ప పెరుగుదల కనిపించడం లేదు. ఇంజనీరింగ్‌కు కెమిస్ట్రీ తప్పనిసరి కాదు ఇంజనీరింగ్ చదివేందుకు కెమిస్ట్రీని తప్పనిసరి సబ్జెక్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో 2021–22 విద్యా ఏడాది నుంచి అమల్లోకి తేనుంది. 2020–21 విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష గత జనవరిలో జరిగినందున వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా ఏడాదిలో ఇది అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము 2020–21 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని ఏఐసీటీఈని కోరాయి. దీంతో ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన 2020–21 అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌లోనూ మార్పులు చేసింది. దీంతో మనరాష్ట్రంలో వేలమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తప్పిన తప్పనిసరి కెమిస్ట్రీ.. ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. వాటినే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మెటీరియల్స్ కాంపొజిషన్‌లో మాత్రమే కెమిస్ట్రీ అవసరం అవుతుందని, అదీ ప్రాథమిక అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకునే వారికి కెమిస్ట్రీ అవసరం లేదని పేర్కొంటున్నారు. అందుకనుగుణంగానే బీఈ/ బీటెక్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివుండాలని, వాటితో పాటు కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్‌ను మూడవ సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులేనని అప్రూవల్ ప్రొసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేసింది. దీంతో ఇంటర్లో ఎంపీసీ చదివినవారే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు పైన పేర్కొన్న సబ్జెక్టులు చదివిన వారు కూడా బీటెక్ చేసేందుకు అర్హులే. కాగా, శనివారం జరగనున్న ఎంసెట్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ఎంసెట్ కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కమిటీ సమావేశం ఈ నెల 15న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం ఈ సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామన్నారు. ఈనెల 19న ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఫీజు రాయితీ ఇచ్చే అంశాన్ని ఖరారు చేయనున్నారు. -
ఈసారి కొత్త కోర్సులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం బీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అఖిల భారత సాంకేతిక విద్యా మండ లి (ఏఐసీటీఈ) మళ్లీ తగ్గించింది. డీమ్డ్ యూని వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, నేషనల్ అ సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఉన్న కాలేజీలు 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అమలు చేయాలని పేర్కొంది. గతంలో ఇది 1:15 ఉండగా, దాన్ని గతేడాది 1:20కి పెంచింది. ఇప్పుడు మళ్లీ 1:15కు తగ్గించింది. అలాగే పీజీ కోర్సుల్లో (ఎంటెక్) ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:12 నుంచి 1:15కు పెంచింది. 2020–21 విద్యా సంవత్సరంలో దేశంలో వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను జారీ చేసింది. అలాగే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటిస్తూ అనుమతుల కోసం ఈ నెల 6 నుంచి 29లోగా ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆలస్య రుసు ముతో యాజమాన్యాలు మార్చి 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఏప్రిల్ 30లోగా అనుమతులు జారీ చేసారు. అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు కా వాలని కోరుకునే యాజమాన్యాల కోసం ఈనెల 10న ముంబైలో, 12న ఢిల్లీలో, 13 న అనంతపూర్ జేఎన్టీయూ లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హ్యాండ్‌బుక్‌లో ప్రధానాంశాలు - నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం కొత్త కోర్సులకు అ నుమతి ఇస్తారు. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటికి అనుమతి ఇస్తారు. - కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయని, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర ఇతర కోర్సుల్లో 40 శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయిని పేర్కొంది. - ఫ్యాకల్టీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం చర్యలు చేపట్టాలి. - కాలేజీ అడ్వైజరీ బోర్డులో పా రిశ్రామిక రంగానికి చెందిన వారు ఇద్దరిని నియమించాలి. - 2020–21 నుంచి రెండేళ్ల పా టు కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు (డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం) అనుమతించబోరు. - డీమ్డ్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎం సీఏ, ట్రావెల్ అండ్ టూర్స్ కోర్సులను నిర్వహించవచ్చు. ఆయా కో ర్సుల నిర్వహణకు యూజీసీ అనుమతి తప్పనిసరి. కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాల్సినవి.. - క్యాంపస్‌లలో గ్రీనరీకి ప్రా«ధాన్యం ఇవ్వాలి. రెయి న్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. - విద్యార్థుల అభిప్రాయాల స్వీకరణ, ఫ్యాకల్టీ వివరాలను కాలేజీలో డిస్ప్లే చేయాలి. - స్టూడెంట్స్ సేఫ్టీ ఇన్సూరెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగుల కోసం గ్రూపు యాక్సిడెంట్ పాలసీ వర్తింపజేయాలి. - ఆన్లైన్ కోర్సులకు ప్రాధాన్యమివ్వాలి. - ఆన్లైన్ ఫిర్యాదులు, పరిష్కార విభా గం ఉండాలి. యూనివర్సిటీ తరఫున అం బుడ్స్మెన్ను నియమించాలి. - లైంగిక వేధింపులను అరికట్టేందుకు, ఫిర్యా దులకు కాలేజీల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. - ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. -
కొత్త కోర్సులు వస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉంటే 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కాలేజీలకు గుర్తింపి వ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5 కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ప్రవేశపెట్టగా, 2020–21 విద్యా సంవత్సరంలో సదుపాయాలు ఉన్న అన్ని కాలేజీలు ఆ కోర్సును ప్రారంభించేందుకు అనుమతులను ఇవ్వనుంది. ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ బిజి నెస్ సిస్టమ్స్ (సీఎస్బీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐటీ ఈ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుబంధ గుర్తింపివ్వాలని నిర్ణయిం చింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజీలతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తు తం జేఎన్టీయూ పరిధిలో 170 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. అయితే ఏటా జేఎన్టీయూ 85 వేల వరకు సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ప్రస్తుతం కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అదనంగా మరో 10 వేల సీట్లలో ప్రవేశాలకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు 100 ఫార్మసీ కాలేజీలు, 10 పీజీ కాలేజీ లున్నాయి. వాటిలో 50 వేల వరకు సీట్లు ఉన్నాయి. వాటిలోనూ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి, ఆయా కోర్సులను ప్రారంభించాలనుకునే యాజమాన్యాల నుంచి జేఎన్టీయూ దరఖాస్తులు స్వీకరించి అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని డ్రాఫ్ట్ అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. ఎం.ఫార్మసీలో నాలుగు కొత్త కోర్సులు.. ఎం.ఫార్మసీలోనూ 4 కొత్త కోర్సులకు అనుమతివ్వనుంది. మార్కెట్ అవసరాల మేరకు కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇతర సబ్జెక్టులతో కాంబినేషన్‌గా ఉన్న సబ్జెక్టులను ప్రత్యేక సబ్జెక్టులు గా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను నిర్వహించేందుకు కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. డిమాండ్ లేని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాసూ్యటికల్ అనాలిసిస్, క్వాలిటీ అషూరెన్స్, ఫార్మాసూ్యటికల్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అషూరెన్స్ కోర్సులు తొలగించింది. కొత్త కోర్సులతోపాటు కొత్త కాలేజీలు.. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులతో పాటు అదనపు సీట్లకు ఓకే చెప్పనుంది. మరోవైపు కొత్త కాలేజీలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే వాటికి ఓకే చెప్పాలని, ఎన్వోసీ అందజేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వర్సిటీ ఎన్వోసీ ఇవ్వాలి. అది ఉంటేనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కాలేజీల ఏర్పాటుకు, ఇంటేక్ పెంపునకు అనుమతి ఇవ్వనుంది. 2020–21 విద్యాసంవత్సరంలో కాలేజీల అనుమతులకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ ను ఇంకా విడుదల కాలేదు. అది విడుదలయ్యాక ఏఐసీటీఈ అందులో విధాన నిర్ణయానిన్న ప్రకటిం చనుంది. కొత్త కోర్సులకు అనుమతించాలని కిందటేడాదే ఏఐసీటీఈ విధానపర నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డాటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఏఐసీటీఈ వ్యతిరేకించేది ఉండదు కాబట్టి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. -
కాలేజీ ఫీజులు పెరగవు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉండదని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. గతంలో కన్నా తగ్గినా తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన కమిషన్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి. వైస్ చైర్మన్ ప్రొఫెసర్ భార్గవరామ్, సభ్యులు ప్రొఫెసర్ విజయ ప్రకాశ్, ప్రొఫెసర్ డి.ఉషారాణి (అకడమిక్) కె.విజయాలు రెడ్డి (ఫైనాన్స్) తదితరులతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి కేవలం విద్యా సంబంధ అంశాలకు అయ్యే ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని (గతంలో ఇతర ఖర్చులూ కలిపే వారు) ఫీజులు నిర్ణయిస్తున్నామని చెప్పారు. ఆయా కాలేజీలు అందించిన నివేదికలు, తమ బృందాల పరిశీలనలో వెల్లడైన అంశాల మధ్య వ్యత్యాసం ఉందని.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఫీజులు నిర్ణయిస్తామన్నారు. కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ఇలా వివరించారు. ఇవీ కమిషన్ నిర్ణయాలు.. - ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు, సౌకర్యాలు ఇతర విద్యా సంబంధ వసతులను దృష్టిలో పెట్టుకొని ఫీజులుంటాయి. ఏకరూప ఫీజులు ఉండవు. ఫీజులపై ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల వాదనలు వింటాం. ఫిబ్రవరి మధ్యలో ఫీజులు ప్రకటిస్తాం. - మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. వీటిలో ఫీజుల శ్లాబ్ విధానం ఎలా ఉండాలన్న దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయం. - యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల. - ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆయా కాలేజీలు ఫీజుల నివేదికలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. - ఈ ఏడాది ఫీజుల నిర్ణయం ఆలస్యమైంది. అందువల్ల 2020–21, 2022–23 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజు నిర్ణయం ఉంటుంది. - డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకేరకమైన ఫీజుల అమలు. - కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంటు కోటాలో కమిషన్ నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. దీనిపై ఫిర్యాదుల కోసం త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌తో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. - ఏ కళాశాల అయినా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకోరాదు. కేవలం ఫొటోస్టాట్ కాపీలను సరిపోల్చుకోవడానికి తీసుకుని, పరిశీలించిన వెంటనే వెనక్కు ఇవ్వాలి. ఈ విషయమై విద్యార్థులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - కనీస సదుపాయాలు కూడా లేని కాలేజీలకు కొంత సమయం ఇస్తాం. లోపాలు సరిదిద్దుకోకపోతే వాటిపై చర్యలకు సిఫార్సు చేస్తాం. -
కాలేజ్‌లో వికేంద్రీకరణ సదస్సు
-
సర్కారు కాలేజీలు సూపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాలివీ.. - ప్రభుత్వ రంగంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా ప్రైవేట్ సంస్థల్లో బాగా తక్కువగా ఉంది. - ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. - 71% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. - అలాగే.. 40 శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. - 58 శాతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది. ఉత్తీర్ణతలో ‘ప్రైవేట్’ అథమం రాష్ట్రంలో 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 30 శాతమే ఉందని, అంతేకాక.. ఈ కాలేజీల్లో 40% మంది తుది పరీక్షకు గైర్హాజరవుతున్నారని కమిటీ గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని కాలేజీలను కూడా సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే, 25 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ఎయిడెడ్ కాలేజీల్లో 25% కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉంటున్నాయని తెలిపింది. మరోవైపు.. గత సర్కారు 13 ప్రభుత్వ కాలేజీలను మంజూరుచేసి చేతులు దులుపుకుందని, వాటికి సిబ్బందిని మంజూరు చేయలేదని కమిటీ పేర్కొంది. -
అక్కడా.. ఇక్కడా కుదరదు
సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వివరాలను జేఎన్టీయూహెచ్కు ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం అనుబంధ కళాశాలలు ఆయా పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను జేఎన్టీయూహెచ్కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. తరగతులు ప్రారంభమై 20 రోజులకు పైగా గడుస్తుండటంతో ఇప్పటికీ వివరాలను ఇవ్వని కళాశాలలకు ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరి.. ప్రతి కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బంది తమ అర్హతలు, అనుభవం, పనిచేసే కాలేజీ, అందులో చేరిన రోజు, లేటెస్ట్ ఫొటో తదితర అన్ని విషయాలను వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్యాకల్టీకి ఒక ఐడీ నెంబర్‌ను ఇస్తారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు దరఖాస్తుచేసుకునే సమయంలోనే జేఎన్టీయూహెచ్కు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ ఐడీని అందజేయాల్సి ఉంటుంది. శుక్రవారం వరకు జేఎన్టీయూహెచ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 83, 543 మంది ఉన్నారు. గతంలో ఈ విధానం లేకపోవడంతో.. 2015 సంవత్సరానికి ముందు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ విధానం లేకపోవడంతో చాలా వరకు ఇంజినీరింగ్ కళాశాలలు వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇష్టం లేక మొక్కుబడిగా అధ్యాపకులను నియమించుకునే వారు. ఒక్కరే అధ్యాపకులు ఐదు, ఆరు కళాశాలల్లో కూడా పనిచేసే వారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు జేఎన్టీయూహెచ్ ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి అధ్యాపకుడి నుంచి పాన్‌కార్డు, ఆధార్ కార్డును ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కరే అధ్యాపకులు పలు కళాశాలల్లో పనిచేసే విధానం పోయింది. దీనికి తోడు బీటెక్ స్థాయి విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు ఎంటెక్ విద్యార్హత తప్పనిసరి అయినా బీటెక్లతోనే నెట్టుకు వస్తుండటంతో ఈ పోర్టల్‌లో ఎంటెక్ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఎంటెక్ పూర్తి చేసిన వారినే కళాశాలలు అధ్యాపకులుగా నియమించుకుంటున్నారు. అంతేగాకుండా బోధనా సిబ్బంది తాము పనిచేస్తున్న కళాశాలను మారాల్సి వచ్చినా ముందుగానే సంబంధిత కళాశాలకు తెలిపి రిలీవింగ్ లెటర్ తీసుకుని ఇతర కళాశాలకు మారాల్సి ఉంది. అవకతవకలకుఅవకాశమే లేదు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించాక అవకతవకలకు అవకాశమే లేదు. ప్రతి సంవత్సరం జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు అప్లియేషన్ పోర్టల్‌లో ప్రస్తుత ఫ్యాకల్టీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎంత మంది ఫ్యాకల్టీని చేర్చుకున్నారు, ఎంత మందిని తొలగించారు అనే వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంది. – ఎన్.యాదయ్య,జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ -
రేపటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసిపోగా, రెండో దశ సీట్ల కేటాయింపు సోమవారం పూర్తయింది. తొలిదశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో 69,544 సీట్లు అందుబాటులో ఉండగా, 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 16,432 సీట్లు మిగిలి పోయాయి. సీట్లు లభించిన వారిలో 37, 257 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, 11,755 మంది చేరలేదు. విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా, మిగిలిన సీట్ల తో మిగిలిన మొత్తం 28,187 సీట్లను ఇటీవల ప్రారంభించిన చివరి దశ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచగా, 12,700 మందికి సీట్లు లభించాయి. వారంతా మంగళ, బుధవారాల్లో కాలేజీల్లో చేరా లని గడువు విధించింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలో మరో 10 వేల మంది విద్యార్థులే కాలేజీల్లో చేరే అవకాశముంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 47 వేల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరినట్లు అవుతుంది. వారికి ఆగస్టు 1 నుంచి కాలేజీల్లో తరగతులను ప్రా రంభించేందుకు వర్సిటీలు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ఉస్మానియా, జేఎన్టీయూలు కాలేజీ యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశాయి. జేఎన్టీయూ పరిధిలోని చాలా కాలేజీలు ఆగస్టు 5 నుంచి తరగతులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. తొలుత బేసిక్ అంశాలు.. మొదటి 15 రోజులు సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు కాకుండా, విద్యార్థులకు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ బేసిక్ అంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివ్ ఆర్ట్స్, కల్చర్, మెంటరింగ్, యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్ తదితర అంశాలపై అవగాహన తరగతులు ఉంటాయి. 3 వారాల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉన్నా.. మొదట 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను చేపట్టి, ఆ తర్వాత మరో వారం తరగతులను సాయంకాల వేళల్లో నిర్వహించేలా వర్సిటీలు ఏర్పాటు చేశాయి. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన ఇంటర్న్íషిప్ పాలసీ ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకోసం ఒప్పందాలను ముందుగానే కుదుర్చుకోవాలని కాలేజీలకు వర్సిటీలు ఆదేశాలు జారీ చేయనున్నాయి. ఇంటర్న్‌షిప్ పాలసీలో భాగంగా ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థి కోర్సు పూర్తయ్యే వరకు 600 నుంచి 700 గంటల పాటు ఇంటర్న్‌షిప్/ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాదిలో రెండో సెమిస్టర్ తర్వాత 3–4 వారాల పాటు కాలేజీ పరిధిలోకి ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఇంటర్న్‌షిప్, రెండో ఏడాదిలో నాలుగో సెమిస్టర్ పూర్తయ్యాక 4–6 వారాలు ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్, మూడో సంవత్సరంలో ఆరో సెమిస్టర్ పూర్తయ్యాక 4–6 వారాలు ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. నాలుగో సంవత్సరంలో 8వ సెమిస్టర్లో 3–4 వారాలు ప్రాజెక్టు వర్క్ పూర్తి చేయాలి. -
కంప్యూటర్ సైన్సే కింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సువైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ ఇటీవల ప్రకటించిన మొదటి దశ ప్రవేశాల్లో అత్యధికం మంది విద్యార్థులు సీఎస్ఈలో సీట్లు పొందేందుకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 183 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా 53,934 మంది విద్యార్థులే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 52,628 మంది విద్యార్థులు మాత్రమే సీట్ల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో అత్యధికంగా 45,514 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో సీటు కోసం వివిధ కాలేజీల్లో 9,50,748 ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఆ తరువాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ) సీట్ల కోసం 35,937 మంది విద్యార్థులు 6,09,278 ఆప్షన్లను ఇచ్చుకున్నా రు. ఇక మూడో స్థానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిలిచింది. అందులో సీట్ల కోసం 21,646 మంది విద్యార్థులు 2,84,064 వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 20,410 మంది, సివిల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 16,608 మంది, మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 14,612 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ఐదు కొత్త కోర్సులు హౌస్‌ఫుల్.. రాష్ట్రంలోని పలు కాలేజీలు ఈసారి ఐదు కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సుతోపాటు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను అందుబాటులోకి తెచ్చాయి. ఏఐ కోర్సు కన్వీనర్ కోటాలో 84 సీట్లు అందుబాటులోకి ఉండగా వాటిల్లో చేరేందుకు 2,256 మంది విద్యార్థులు 3,580 వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు అందుబాటులోకి రాగా 135 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూ టర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్‌లో 42 సీట్లు ఉంటే వాటిల్లో చేరేందుకు 1,781 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఆచ్చుకు న్నారు. కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)లో 42 సీట్లు ఉంటే 476 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 42 సీట్లు అందుబాటులోకి రాగా, వాటిల్లో చేరేందుకు 1,644 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో దీనికి ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. -
అక్రమాలకు చెక్
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : పీకల్లోతున అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన ఇంజినీరింగ్ శాఖల భరతం పట్టేందుకు సర్కారు ఉపక్రమిస్తోంది. రహదారులు భవనాలు, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ వం టి ప్రధాన ఇంజినీరింగ్ శాఖల్లో అడ్డగోలు వ్యవహారాలపై చర్యలకు రంగంలోకి దిగింది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల్లో కొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. కావలసిన వారికి ఇంజినీరింగ్ శాఖల్లో పనులు అప్పగించారు. టెండర్ల నిబం« ధనలు, నియమాలను తుంగలో తొక్కారు. ఒకే రహదారిని బిట్లు బిట్లుగా విభజించి టెండర్లు లేకుం డా చేసి నామినేషన్ పద్ధతిలో అనుకున్న వారికి కట్టబెట్టారు. అంతేకాకుండా వారికి అడ్వాన్సు ల రూపంలో భారీగా నిధులు కేటాయించి నాణ్యతకు పాతరేశారు. దీని దృష్ట్యా చేసిన పనుల్లో నాణ్యతాలోపం, ఇతర అంశాలను ఆరా తీయడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. సుమారు 350కిపైగా గ్రామాలకు రహదారులు లేవు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడానికి రెండేళ్ల క్రితం ఉపాధి హామీ పథకం, పీఎంజేఎస్వై, ఎస్డీఎఫ్ పథకం పేరిట పలు రహదారి పనులు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయినా ఇప్పటికీ గిరిజన గ్రామాలకు రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే రాళ్లు తేలి నరకం చూడాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలన్నా, అటవీ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకు వెళ్లాలన్నా గిరి జనులకు ఇబ్బందులు తప్పడం లేదు. 25 శాతంలోపు పనులపై చర్యలు.. ఇంజినీరింగ్ శాఖల్లో అవకతవకలకు పాల్పడిన అక్రమార్కుల పనిపట్టేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని నియమ నిబంధనలను జారీ చేసింది. వీటిని అనుసరించి అంచనాలో 25 శాతంలోపు పని జరిగి ఉంటే అలాంటి వాటిని సమీక్షించి తదుపరి నిర్ణ యం తీసుకుంటారు. అంతకు పైబడి జరిగిన పనులు, వాటికి బిల్లుల తయారీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని వాటిని కొనసాగించడానికి అనుమతిస్తారు. పని ఒప్పందం కుదిరి ఇంకా ప్రారంభం కాకపోతే వాటిని రద్దు చేయనున్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో 124 రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేయడానికి పనులు చేయగా 108 పూర్తి చేశారు. ఇంకా 16 పనులు పూర్తి చేయలేదు. సుమారు రూ.23 కోట్ల మేర బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. 85 రహదారులకు అప్‌గ్రేడ్ చేయాలని పనులు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా వీటిలో 60 పూర్తి చేశారు. ఇంకా 21 రహదారులు 25 శాతం లోపే పనులు జరిగాయి. అలాగే పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రూ.66 కోట్లతో చేపట్టిన 144 పనుల్లో ఇంకా 90 వరకు పనులు ప్రారంభం కాలేదు. గత రహదారుల అక్రమాలపై చర్యలు నిల్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలో 42 రహదారుల్లో అక్రమాలు జరిగాయని ప్రజాప్రతినిధులు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నిలదీ శారు. వీటిలో కేవలం 11 రహదారులపైన విచారణ చేసి వదిలేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రహదారుల్లో నాణ్యతాపరమైన లోపాలున్నాయని సాక్షాత్తు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులే ఎత్తిచూపారు. 20 రహదారులకు సంబంధించిన ఎం బుక్‌లను సీజ్ చేసి పట్టుకువెళ్లినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సుల రూపంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖ పనులకు రూ.3 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు తెలిసింది. ఇలా పలు అక్రమాలు చోటు చేసుకోగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో విచారణ నీరుగార్చారు టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన రహదారుల నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. పనులు పూర్తి స్థాయిలో చేయకుండా, నాణ్యత పాటిం చకుండా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేయాలని గతంలో పలు పాలకవర్గ సమావేశాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రహదారుల లోపాలపై ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరిగిన నిర్మాణాలను చూసినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – ఎం.తిరుపతిరావు, గిరిజన సంఘం నాయకుడు -
పది రోజుల్లో ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు వేగవంతం చేసింది. 10 రోజుల్లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజును ఖరా రు చేసేందుకు చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయకుండా, ఫీజులను ఖరారు చేశాకే కౌన్సెలింగ్‌ను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీల ఫీజుల ను 3 రోజుల్లో ఖరారు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. సోమవారం 20 కాలేజీల ఫీజులను ఖరా రు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వ హించింది. యాజమాన్యాలు ఇచ్చిన గత రెండేళ్ల ఆదాయ వ్యయాలు, తాజా ప్రతిపాదనలను ఏఎఫ్ఆర్సీ పరిశీలించింది. ఇప్పటికే ఆడిటర్లు ఆ కాలేజీల ఆదాయ వ్యయాలను సమీక్షించిన నేపథ్యంలో సోమ వారం ఏఎఫ్ఆర్సీ సమావేశమై వాటన్నింటినీ పరిశీలించి ఫీజులను ప్రాథమికంగా నిర్ణయించింది. మంగళవారం మరో 30 కాలేజీల ఫీజులను ఖరారు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వహించనుంది. బుధవారం మరో 31 కాలేజీల ఫీజులను కూడా ఖరారు చేయనుంది. కోర్టును ఆశ్రయించి యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు ఉత్తర్వులు పొందిన 81 కాలేజీల ఫీజులను ఖరారు చేయనుంది. దీంతో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు కాకుండా, ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసే ఫీజుతో ప్రవేశాలను చేపట్టనున్నారు. కోర్టుకు వెళ్లని 108 కాలేజీల ఫీజులను కూడా వచ్చే పది రోజుల్లోగా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ 108 కాలేజీల్లో రూ.50 వేల లోపు వార్షిక ఫీజు ఉన్న కాలేజీలకు 20 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలకు 15 శాతం ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్ఆర్సీ యాజమాన్యాలతో సమావేశమై ప్రతిపాదించింది. వీటికి ఒప్పుకుంటే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వ హిస్తామని సూచించింది. తర్వాత కాలేజీ వారీగా, ఆదాయ వ్యయాల ఆధారంగా పూర్తి స్థాయి ఫీజును ఖరారు చేస్తామని వెల్లడించింది. ఇందుకు మెజారిటీ యాజమాన్యాలు అంగీకరించాయి. దీనిపై ఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇప్పుడు తాత్కాలికంగా 15%, 20% ఫీజులను పెం చి కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యార్థులు ఈ ఫీజుల ప్రకా రమే కాలేజీల్లో చేరుతారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఫీజు ఖరారు చేసినప్పుడు, ప్రస్తుతం ఇచ్చిన 15–20 శాతం పెంపునకు మించి పూర్తిస్థాయి ఫీజులో కాలే జీ ల ఆదాయ వ్యయాల ఆధారంగా పెంపుదల వస్తే గందరగోళం తలెత్తుతుందన్న ఆలోచన ఏఎఫ్ఆర్సీ వర్గాల్లో వచ్చింది. కాగా, ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు కోసం ఏఎఫ్ఆర్సీ చేపట్టిన హియరింగ్‌కు సోమవా రం టాప్ కాలేజీల ప్రతినిధులు ఏఎఫ్ఆర్సీ కార్యాలయానికి వచ్చారు. సోమవారం విచారణకు హాజరైన కొన్ని కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మంగళ, బుధవారాల్లో మళ్లీ వస్తామని గడువు కోరారు. అప్పీల్ కోరితే రూ. లక్ష వాసవి, శ్రీనిధి కాలేజీల ఫీజులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను రివ్యూ చేయాలంటే మళ్లీ ఏఎఫ్ఆర్సీకే అప్పీల్ చేసుకోవాలి. అందుకు రూ.లక్ష అప్పీల్ ఫీజుగా ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కచ్చితంగా ఉండే కాలేజీలు మాత్రమే అప్పీల్‌కు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. -
నిర్ణయాధికారం ఏఎఫ్ఆర్సీదే..
సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దేనని (ఏఎఫ్ఆర్సీ).. దీని నిర్ణయాలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫీజు నిర్ధారణ ప్రక్రియలో లోపాలుంటే కోర్టు సమీక్షించవచ్చని.. కానీ కోర్టే ఫీజులపై నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని వెల్లడించింది. వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు వివాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు కాలేజీల ఫీజులను నిర్ధారించడం ద్వారా హైకోర్టు ఏఎఫ్ఆర్సీ పరిధిలో చొరబడిందని పేర్కొంది. తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలకు సం బంధించి 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు గానూ ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ధారించింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 21 ద్వారా జూలై 4, 2016న నోటిఫై చేసింది. దీని ప్రకా రం వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వార్షిక ఫీజు రూ.86 వేలు కాగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రూ.91 వేలు. ఈ ఫీజుల నిర్ధారణ తగినరీతిలో లేదని పునఃసమీక్షకు ఆయా కళాశాలలు అభ్యర్థించగా ఫిబ్రవరి 4, 2017న ఏఎఫ్ఆర్సీ రెండు కళాశాలల ఫీజును రూ.97 వేలుగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకు! ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఆయా విద్యా సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. దీంతో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయ సమీక్ష జరిపి వాసవీ కళాశాల ఫీజును రూ.1,60,000గా, శ్రీనిధి కళాశాల ఫీజును రూ.1,37,000గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిని రాష్ట్ర ప్రభు త్వం సవాలు చేయగా.. ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మొదట వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజునే తీసుకోవాలని, అదనంగా ఫీజులు వసూలు చేయరాదని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అనంతరం సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం సోమవారం 35 పేజీల తీర్పు వెలువరించింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు డి.మహేష్ బాబు, కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి, కళాశాలల తరపున సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. ఏఎఫ్ఆర్సీ ఫీజులే వర్తిస్తాయ్ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియపైనే న్యాయ సమీక్ష ఉంటుంది. కానీ తీసుకున్న నిర్ణయంలో ఉన్న మెరిట్‌పై కాదు. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ నిర్ణయ ప్రక్రియ ఉంటే దానిని కోర్టులు సరిదిద్దవచ్చు. చట్టప్రకారం తిరిగి నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ (ఏఎఫ్ఆర్సీ)ని తిరిగి మొదటి నుంచి ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఆదేశించవచ్చు. కానీ కోర్టులు న్యాయసమీక్ష పేరుతో బలవంతంగా నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ పరిధిలోకి వెళ్లి తానే నిర్ణయం తీసుకోరాదు. అలాగే ఏఎఫ్ఆర్సీకి అప్పిలేట్ అధికారిగా కూడా కోర్టులు వ్యవహరించజాలవు’అని పేర్కొంది. ‘ఏఎఫ్ఆర్సీ ఫీజుల నిర్ధారణ ప్రక్రియ.. విద్యను పొందడంలో సమాన అవకాశాల కల్పించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని చేర్చే భావనలో ఒక భాగం. అందువల్ల నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం సమర్థించజాలనిది’అని పేర్కొంది. ‘ఇక్కడ ఏఎఫ్ఆర్సీ సిఫారసుల్లో జోక్యం చేసుకుని హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది. అందువల్ల హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతున్నాం. ఏఎఫ్ఆర్సీ ఫిబ్రవరి 4, 2017న నిర్ధారించిన ఫీజులు 2016–17 నుంచి 2018–19 బ్లాక్పీరియడ్కు అమలులో ఉంటాయి. అలాగే ప్రతివాదులైన విద్యాసంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు క్రియాశీలతను సంతరించుకొని విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి’అని ధర్మాసనం పేర్కొంది. -
ఫీజుల నియంత్రణ అధికారం నిపుణుల కమిటీదే
-
ఫీజుల నియంత్రణ అధికారం నిపుణుల కమిటీదే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల నియంత్రణ విధానంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసే అధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అడ్మిషన్ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫీజులను పెంచుతూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు.. వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల కేసులో తీర్పును సోమవారం వెలువరించింది. అయితే ప్రవేశాల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉండాలన్న న్యాయస్థానం.. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది. ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ), ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. -
‘ఇంజనీరింగ్’ ఫీజులు పెంచకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులను పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు అన్యాయం జరగకుం డా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ స్వరూపరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం దేశంలో ఏక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫీజును ఒకేసారి 40 శాతానికి పెంచుతున్నారన్నారు. దీంతో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని ప్రైవేటు కళాశాలలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వార్షిక ఫీజు కాకుండా, స్పెషల్ ఫీజు, యూనివ ర్సిటీ, అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో వేల రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీ లు ఫీజులు పెంచినా ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు మాత్రమే ఇస్తుం దన్నారు. విద్య అనేది సామాజిక సేవ అనే భావనను తప్పించి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యజమాన్యాలు వ్యాపారం చేస్తు న్నాయన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపట్టకుండా, కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూడటం వల్ల విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. -
‘ఇంజనీరింగ్’ ఫీజు పెంపు దిశగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ), ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 10 నుంచి 15 శాతం వరకు.. ఒకవేళ పాత ఫీజుల అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోకపోతే ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనలు ప్రభుత్వం ఇప్పటికే చేసింది. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే మాత్రం తల్లిదండ్రులు తీవ్ర వ్యవతిరేకత వస్తుందన్న నిర్ణయానికి అధికారవర్గాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా కొంత మేర ఫీజు పెంపు (10 శాతం నుంచి 15 శాతం)నకు అంగీకరించాలన్న అలోచనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈనెల 29న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో యాజమాన్యాల నిర్ణయం మేరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఆధారపడి ఉంది. వాస్తవానికి ఈ నెల 27 నుంచే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కోర్టు తీర్పు కాపీ అందలేదని ప్రవేశాల కమిటీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసింది. వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు స్వీకరించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఒకవేళ యజమాన్యాలు అధికార వర్గాల ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను మరికొన్నాళ్లు వాయిదా వేసి, ఫీజులను ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో ఫీజులను ఖరారు చేశాకే ముందుకు సాగే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి అందింది. అది అందాక ఆగమేఘాలపై కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శుక్రవారం నాడు కూడా అప్పీల్ చేయలేకపోయింది. కోర్టుకెళ్లిన కాలేజీలకు అదే తరహాలో.. మొదట కోర్టును ఆశ్రయించిన ఆరు కాలేజీల్లోనే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పునివ్వగా, అదే తీర్పును తమకు వర్తింపజేయాలని మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. వాటికి కూడా కోర్టు అదే తీర్పును అమలు చేయాలని శుక్రవారం ఉత్తర్వులిచ్చినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం గురువారం ఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించింది. ఆయన ఇప్పటికిప్పుడు ప్రక్రియ చేపట్టినా ఫీజుల ఖరారుకు పది రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యాలతో చర్చించేందుకు 29న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యాలు అంగీకరించాకే వెబ్ ఆప్షన్లు.. యాజమాన్య ప్రతిపాదిత ఫీజుల్లో ఒక కాలేజీ అయితే రూ. 3.19 లక్షలు ప్రతిపాదించగా.. మరో కాలేజీ రూ. 2.80 లక్షలు, ఇంకో కాలేజీ 2.30 లక్షలు ప్రతిపాదించాయి. గతంలో రూ. 1.20 లక్షల లోపు ఉన్నవి ఈ ఫీజులను ప్రతిపాదించగా, గతంలో రూ. 80 వేల వార్షిక ఫీజున్న కాలేజీలు కూడా ఈసారి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పైగా వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. కొత్త ఫీజులను ఖరారు చేశాక హెచ్చు తగ్గులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటున్నా అది అనేక సమస్యలకు కారణంగా అయ్యే పరిస్థితి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుగా ఫీజులను ఖరారు చేయాలనీ చెప్పిందని, తమ ప్రతిపాదనలకు యాజమాన్యాలు అంగీకరించకపోతే ఫీజులను ఖరారు చేశాకే వెబ్ ఆప్షన్లు, తదుపరి కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
200 శాతం పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఏకంగా 200 శాతానికి మించి ఫీజు పెంపును కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) ఏకంగా రూ.3 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించింది. మిగతా 75 ప్రధాన కాలేజీలు కూడా ఫీజుల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్ఆర్సీ) అందజేశాయి. ఫీజుల పెంపు కోసం ఇప్పటికే 6 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించి, కాలేజీలవారీగా ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, ఫీజులు ఖరారయ్యాక మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వవర్గాలు పడ్డాయి. ఫీజు ఖరారు గడువు ముగిసింది 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2019–20 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లపాటు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఫీజుల కమిటీ ఖరారు చేస్తేనే వాటికి చట్టబద్ధత ఉంటుంది. వరుస ఎన్నికల కారణంగా టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం అంశం మరుగున పడిపోయింది. చైర్మన్ నియామకం జరిగేలోగా టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి హోదాలో విద్యాశాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. యాజమాన్య ప్రతిపాదిత ఫీజులను అమలు చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 27 నుంచి ఆప్షన్లు ప్రారంభమయ్యేనా? ఆయా కాలేజీలన్నింటిలోనూ యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల పెంపును అమలు చేయాల్సి వస్తుంది. టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం తరువాత కొత్త ఫీజులను ఖరారు చేశాక మిగులు ఫీజులను సర్దుబాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ముందుగా ప్రతిపాదిత ఫీజును చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందనప్పుడు, అప్పీల్‌కు వెళ్లనపుడు 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభిస్తారా? లేదా? అనేది గందరగోళంగా మారింది. వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తే మాత్రం కచ్చితంగా కాలేజీల వారీగా ఫీజులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. 27వ తేదీలోగా కోర్టు ఉత్తర్వులు అందితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసి, కోర్టు ఉత్తర్వుల కాపీ అందాకే అప్పీల్‌కు వెళ్లాలని, ఆ తరువాతే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొంటున్నారు. -
ఆరేళ్లయినా అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపుపై ఏళ్ల తరబడి నిరాసక్తత కొనసాగుతోంది. అటు యూనివర్సిటీలు, ఇటు ఉన్నత విద్యామండలి కూడా సీట్ల పెంపుపై ఆలోచనలు చేయడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనే పూర్తి కావడం లేదని, అందుకే డిమాండ్ ఉన్నా, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంపై దృష్టి పెట్టడం లేదని అధికారులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ వంటి అనేక కోర్సులకు యూనివర్సిటీ కాలేజీల్లో భారీగా డిమాండ్ ఉంది. అయినా వాటిల్లో సీట్ల పెంపును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నా తెలంగాణ వచ్చాక కూడా ఆ దిశగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనలు చేయడం లేదు. కనీసం ఈ ఆరేళ్లలో ఒక్కసారి అయినా సీట్ల పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన దాఖలు లేవు. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపును ఇటీవల నిలిపివేశారు తప్ప గతంలో ఆమోదించారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం సీట్ల పెంపు దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో పదేళ్లుగా 420 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని మిగిలినా.. చేరే అవకాశంలేదు ప్రస్తుతం రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలోని 14 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌సహా దాదాపు ఆ సీట్లు అన్నీ వంద శాతం భర్తీ అవుతున్నాయి. చివరకు ఎన్ఐటీ, ఐఐటీలకు ఎవరైనా వెళ్లిపోతే మాత్రమే వందలోపు వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. వాటిల్లో చేరేందుకు స్లైడింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆ సీట్లలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు కొత్త సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లను పెంచవద్దని విధానపరమైన నిర్ణయం తీసుకుందని, అందుకే తాము ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. కానీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఉండే డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేయకపోవడంతో విద్యార్థులకు ఏటా నిరాశ తప్పడం లేదు. ఇవే కాదు బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఫార్మసీ కాలేజీలు 3 మాత్రమే ఉండగా, వాటిల్లో కేవలం 180 సీట్లే ఉన్నాయి. ఫార్మసీ కోర్సులకు డిమాండ్ ఉన్నా సీట్ల పెంపును పట్టించుకోవడం లేదు. ఎంబీఏ కాలేజీలు 19 ఉండగా వాటిల్లో 1,290 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 13 ఉండగా, వాటిల్లో 670 సీట్లు ఉన్నాయి. -
తెలంగాణలో 27 కాలేజీల్లో ప్రవేశాలకు నో
సాక్షి, హైదరాబాద్: ఈ సారి 27 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుమతి నిరాకరించింది. దీంతో వాటిల్లోని దాదాపు 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. జేఎన్టీయూ ఇటీవల కాలేజీలకు జారీ చేసిన అనుబంధ గుర్తింపు లెక్కలు తేలాయి. రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా జేఎన్టీయూ 156 కాలేజీలకు గుర్తింపును జారీ చేసింది. దీంతో 27 కాలేజీలకు ఈసారి బీటెక్‌లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే వాటిల్లో ఎక్కువ శాతం కాలేజీల్లో వసతులు లేని కారణంగా అనుబంధ గుర్తింపును జేఎన్టీయూ నిరాకరించింది. మరికొన్ని కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గతంలో ప్రవేశాలు లేని కారణంగా చివరలో విరమించుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలతోపాటు ఇతర కాలేజీల్లో 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. గతేడాది రాష్ట్రంలోని 202 కాలేజీల్లో ప్రవేశాల కోసం యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లోని 174 కాలేజీల్లో 793 కోర్సులకు సంబంధించిన 86,176 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 183 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 156 కాలేజీల్లోని 686 కోర్సులకు సంబంధించి 77,500 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. వీటితోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు, కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపును జారీ చేసింది. ఫార్మసీలో గతేడాది 76 కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, 73 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 73 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, అందులో 67 కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. గతేడాది 17 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 16 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 13 కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 11 కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చింది. -
ప్రైవేటు ‘ఇంజనీరింగ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమ అడ్మిషన్ల దందాకు తెరతీశాయి. బీ–కేటగిరీ మేనేజ్మెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు రెక్కలొచ్చాయి. ఎంసెట్ ఫలితాలు ప్రకటించక ముందే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు కోర్సుల వారీగా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ప్రైవేటు కళాశాలలు బహిరంగ ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంసెట్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ‘మేనేజ్మెంట్ కోటా’ఫీజులను మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు తెరచాటుగా మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటున్నాయి. ఎంసెట్ ఫలితాల ప్రకటించక ముందే, బహిరంగ ప్రకటన జారీ చేయకుండానే అక్రమంగా బీ–కేటగిరీ సీట్లను భర్తీ చేసేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ వంటి కోర్సుల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ అయిపోయాయి. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి సీట్ల అమ్మకాలపై బేరాసారాలు జరుపుతున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో అడ్మిషన్ కోసం రూ.14 లక్షల డొనేషన్‌తోపాటు ఏటా రూ.90 లక్షల ఫీజును చెల్లించాలని అడుగుతూ ఆ వీడియోలో సదరు కళాశాల ప్రతినిధి అడ్డంగా దొరికిపోయాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల భర్తీ ఇప్పటికే ముగిసిందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక ఐటీ విభాగం సీటుకు రూ.8 లక్షలు, ఈసీఈ విభాగంలో సీటుకు రూ.7 లక్షల డొనేషన్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. నిర్ణీత డొనేషన్లు చెల్లిస్తేనే సీటు దక్కుతుందని, ఎలాంటి తగ్గింపులుండవని స్పష్టం చేశాడు. ఇష్టముంటేనే డొనేషన్లు చెల్లించి సీట్లను రిజర్వు చేసుకోవాలని, లేకుంటే మేనేజ్మెంట్ సీట్ల భర్తీ కోసం తాము పత్రికల్లో బహిరంగ ప్రకటన జారీ చేసినప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం గమనార్హం. అయితే కన్వీనర్ సీట్ల ఫీజుల మాదిరిగానే బీ–కేటగిరీ సీట్ల ఫీజులూ ఉంటాయి. కానీ దీనికి విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు ఫీజులను దండుకుంటున్నాయి. ముందే మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్మేసుకుని ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వాటిని భర్తీ చేశామని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఉత్తుత్తిగా పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయని చాలా ఏళ్ల నుంచి ఉన్న ఆరోపణలకు ఈ ఉదంతం మరింత బలాన్నిచ్చింది. బీ–కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాల నిర్మూలనకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
షిఫ్టింగ్‌లో అవకతవకలు లేవు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే, తనకు లేని అధికారాలను విని యోగించుకుని కొన్ని కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీ లు ఇచ్చారని వచ్చిన ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్ అధికా రాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు కట్టబె డుతూ 2014 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న ఉత్తర్వుల ఆధారంగా ఎన్ఓసీలు జారీ చేశాన న్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సమానమేనని, ఏ ఒక్క కళాశాలకూ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. తాము కేవలం ఎన్ఓసీలు మాత్రమే ఇస్తామని, కళాశాలల షిఫ్టింగ్‌కు ఏఐసీటీఈ అనుమతిస్తుందన్నారు. తన అధికారాన్ని వినియోగించుకుని 5 ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేశానని, మరో మూడు నాన్ టెక్నికల్ కళాశాలల షిఫ్టింగ్ ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించానన్నారు. ఇంజనీ రింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు ఇవ్వడం రొటీ న్ అంశమని, పెద్ద విషయం కాదన్నారు. ఇంజనీరిం గ్ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాల కారణంగానే తనపై లేనిపోని విమర్శలు సృష్టించా రన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమతూకాన్ని కాపాడా లని, ఈ నేపథ్యంలో షిఫ్టింగ్‌ను ప్రోత్సహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఈ నేపథ్యంలో 5 కళాశాలలకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేశాన న్నారు. ఎన్ఓసీలు రద్దు చేసిన విషయాన్ని ఏఐసీటీ ఈకు సైతం తెలిపామన్నారు. ఇంజనీరింగ్ కళాశా లల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేసే అధికా రాన్ని తన పరిధి నుంచి తొలగిస్తూ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నాన్ఎయిడెడ్గా మార్చలేదు రాష్ట్రంలోని ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాలను నాన్ ఎయిడెడ్ కళాశాలగా మార్చలేదని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న కోర్సులను, విద్యార్థులు ఉండి లెక్చరర్లు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కొత్తగా నియామకాలు చేపట్టవద్దని 2005లో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, దాంతో పదోన్నతులు పొందిన వారి స్థానాలు, బదిలీలపై వెళ్లిన వారి పోస్టులు రద్దు అవుతున్నాయన్నారు. దీంతో ఎయిడెడ్ కళాశాలలు నడపడం ఆర్థికంగా సాధ్యం కావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చి, ఒకరో, ఇద్దరో ఫ్యాకల్టీ ఉంటే వారిని ప్రభుత్వ కాలేజీల్లో బోధనకు ఉపయోగిస్తున్నామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కోర్సులు రద్దు కావడం వల్ల కొన్ని కాలేజీలు ఆన్ ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయన్నారు. కోర్సుల రద్దు నిర్ణయం వల్ల జూన్ నుంచి మార్చి వరకు రూ.16.53 కోట్ల ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయన్నారు. ఎయిడెడ్ కళాశాలలకు ఉన్న భూములపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిట్లు తెలిపారు. ఈ కమిటీ ఈ నెల 30 వరకు అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సుమారు 65 వరకు ఎయిడెడ్ కళాశాలలున్నాయని, వాటిలో 5 కళాశాలలు పూర్తిగా మూతబడ్డాయన్నారు. మిగిలిన కళాశాలల్లో సైతం చాలా వరకు కోర్సులు సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. కొన్ని ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, మరి కొన్నింటికి భవన నిర్మాణం కోసం నిధులు, ఫ్యాకల్టీ నియామకం జరిపిందన్నారు. ఎయిడెడ్ కళాశాలల బోధన, బోధన సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలకు సర్దుబాటు చేశామన్నారు. జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో పదో తరగతి పాసైన విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పాసైన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. -
సీటు.. భారీ రేటు
ఎంసెట్ రాత పరీక్ష ముగియడంతో ఇంజినీరింగ్ సీట్ల హడావుడి మొదలైంది. ఏ బ్రాంచ్ బాగుంటుంది...? ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలి...? అనే విషయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో గందరగోళం కనిపిస్తోంది. పేరున్న కళాశాలల్లో చేరిస్తేనే క్యాంపస్ ఉద్యోగాలు..ఇతర అవకాశాలుంటాయనే అభిప్రాయంతో అందరూ ఆ వైపే మొగ్గుచూపుతున్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా నచ్చిన కళాశాలలో చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కళాశాలల నిర్వాహకులు యాజమాన్య కోటా పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచిఅందిన కాడికి దోచేందుకు సిద్ధమయ్యారు. జేఎన్టీయూ: జేఎన్టీయూ(ఏ) పరిధిలో మొత్తం 119 ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. నెల్లూరు జిల్లాలోనూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 30 కళాశాలలకు డిమాండ్ అధికంగా ఉంది. పేరున్న కళాశాలల్లోనే బీటెక్ పూర్తి చేస్తే పిల్లల భవిత బాగుంటుందన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు డొనేషన్ల విషయంలో వెనుకాడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుతో పనిలేకుండా యాజమాన్య కోటా(బీ–కేటగిరి) సీట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని పేరున్న కళాశాలలు కొన్ని తమకు తోచిన విధంగా ఫీజులను డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల భర్తీ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా... ఉన్నత విద్యా మండలి ఖాతరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులు, మధ్య తరగతి వారికి బీ–కేటగిరీ సీట్లు కూడాఅందే పరిస్థితి లేకుండాపోయింది. ముందస్తుగా మాట్లాడుకుంటే ఒక ధర.. చివరకు వెళితే మరో ధరను నిర్ణయిస్తున్నారు. నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటా ఫీజులనే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఇదీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఇక కంప్యూటర్ సైన్స్‌కు డిమాండ్ భారీగా నేపథ్యంలో కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లను తగ్గించుకొని ఈ సీట్లను పెంచుకోవడం చూస్తే కళాశాలల దోపిడీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రూ.35 వేల నుంచి మొదలు.. ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఆయా ఇంజినీరింగ్ కళాశాల్లో ఫీజులను నిర్ధారిస్తుంది. దీని ప్రకారమే ఆయా కళాశాలలు ఫీజులు వసూలు చేసుకోవాలి. మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ ఫీజులను సవరిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి ఇంజినీరింగ్ ఫీజులు రూ.35 వేల నుంచి రూ. 1.08 లక్షల వరకు ఉన్నాయి. కన్వీనర్ కోటా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బీ–కేటగిరి సీట్లకు వసూలు చేస్తున్నారు. సీట్ల కృత్రిమ కొరత బ్రాంచ్ కంటే ముఖ్యంగా ఏ కళాశాల అయితే బాగుంటుందనే విషయంపైనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు, కళాశాల ప్రగతిని మదింపు చేస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఈసీఈ ఉంది. అయితే అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు కూడా సీట్ల కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. అవగాహన తప్పనిసరి ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సు ఇంటర్ డిసిప్లినరీ ప్రధానమైన అంశంగా మారింది. సిలబస్ స్వరూపం మారిపోయింది. అన్ని బ్రాంచ్‌ల్లోనూ అవగాహన తప్పనిసరి అవుతోంది. మెకానికల్ విభాగం చదివే విద్యార్థి కంప్యూటర్ నాలెడ్జ్‌పైనా దృష్టి సారించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంచుకున్న బ్రాంచ్‌తో పాటు మరో బ్రాంచ్‌లో మైనర్ డిగ్రీ చేస్తున్నారు. అందువల్ల ఏ కోర్సు చదువుతున్నామనేది ప్రధానం కాదని.. సరైన శిక్షణ, సదుపాయాలు, మౌలిక వసతులు, అధునాతన ల్యాబ్ కలిగిన కళాశాల ఎంపిక కీలకమనేది నిపుణుల అభిప్రాయం. నిబంధనలు ఇలా.. ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు, తక్కిన 30 శాతం సీట్లు యాజమాన్య కోటాలో భర్తీ చేయాలి. ఈ 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్ఆర్ఐ, ఎన్నారై సంరక్షకుల కోటా కింద కేటాయించాలి. మిగిలిన సీట్లను ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలి. జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్యమివ్వాలి. అయితే ఇవన్నీ లేకుండా పెద్ద మొత్తాన్ని నిర్ణయించి యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. సమాన అవకాశాలు యాజమాన్య కోట్లా సీట్ల భర్తీలో ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే బ్రాంచ్‌పై దృష్టి సారించడం సరికాదు. అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. పట్టుదలతో చదివితే ఏ బ్రాంచ్‌తోనైనా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.– ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూడైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్ -
ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు అంత ఈజీ కాదు
సాక్షి, అమరావతి: ప్రయివేటు రంగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యాసంస్థలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలను కట్టడి చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేయకుండా ఇకపై ఆయా రాష్ట్రాల అవసరం మాత్రమే కాలేజీల ఏర్పాటుకు అనుమతించనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలనుంచి ముందుగానే ప్రణాళికలను తెప్పించి వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ఉన్న సదుపాయాలు, ల్యాబ్‌లు, ఇతర ఏర్పాట్లు, ప్రమాణాల తీరు తదితర అంశాలపై ఆగస్టులోగా తమకు నివేదికలు పంపాలని ఏఐసీటీఈ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పండాదాస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూ పోతోంది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు ఇతర ఏర్పాట్లపై పైపై పరిశీలనతోనే సరిపెడుతోంది. ఏఐసీటీఈ అనుమతి వచ్చాక రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వం వాటికి గుర్తింపు ఇవ్వక తప్పనిపరిస్థితి. దీంతో వందలాదిగా కాలేజీలు పుట్టుకొచ్చి సీట్ల సంఖ్య లక్షలకు చేరుకుంది. ఏటా వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ కాలేజీలు 20, ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు 287 ఉన్నాయి. వీటిలో వివిధ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి మొత్తం 1,38,953 సీట్లు ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 4,834, ప్రయివేటు కాలేజీల్లో 1,34,119 ఉన్నాయి. ప్రయివేటు కాలేజీల్లోని వివిధ కోర్సులకు డిమాండ్ లేక, విద్యార్ధులు చేరక వేలాది సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందగా ఆయా కోర్సులను రద్దుచేసుకొనేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. దీనికి కారణం రాష్ట్రం అవసరాలను చూడకుండా కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమే అని గుర్తించి నూతన విధానం తీసుకువచ్చారు. ప్రమాణాల పెంపుకోసమే... ఇంజనీరింగ్ సహా ఆయా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రమాణాల పెంపునకు వీలుగా ఏఐసీటీఈ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ కొత్త విధానం వస్తోంది. ఇంజనీరింగ్ విద్యపై ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి కమిటీ నివేదిక మేరకు పలు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కార్యక్రమం కింద ప్రపంచ బ్యాంకు నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి అవకాశాల కల్పన, కమ్యూనికేషన్ స్కిల్స్, డొమైన్ స్కిల్స్ మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాలేజీలకు పారిశ్రామిక అనుసంధానం ద్వారా విద్యార్థుల్లో మెలకువలను పెంపొందించనున్నారు. అలాగే నేటి పారిశ్రామిక అవసరాలు, రోజురోజుకు మారిపోతున్న సాంకేతికతల నేపథ్యంలో ప్రస్తుతమున్న కోర్సుల్లోనూ అనేక మార్పులు చేయనున్నారు. సాంప్రదాయంగా ఉన్న సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ వంటి కోర్సుల్లో కొత్త సాంకేతిక అంశాలను చొప్పించనున్నారు. కొత్త అంశాలతో కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్, బ్లాక్‌చైనా, డాటా సైన్సెస్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. క్షేత్రస్థాయి అభ్యసనానికి ప్రాధాన్యం నాలుగు గోడల మధ్య థియరీలను వినడం, చదవడం ద్వారా కాకుండా క్షేత్రస్థాయిలో అభ్యసనానికి శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నది ఏఐసీటీఈ అభిప్రాయం. ఇప్పటికే ఈ దిశగా అన్ని యూనివర్సిటీలకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న ఏడాదినుంచి పారిశ్రామిక అనుసంధానాన్ని మరింత పెంచి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యతనిస్తారు. పారిశ్రామిక శిక్షణ, ఇంటర్న్‌షిప్, ప్రయోగశాలల్లో పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు. -
ఏపీ ఎంసెట్–19 నోటిఫికేషన్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, యానిమల్ హజ్ బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ–డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను జేఎన్టీయూనే వరుసగా ఐదోసారి నిర్వహిస్తోందన్నారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో వరుసగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుం లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 4 వరకూ, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకూ, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకూ, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. http://sche.ap.gov.in/eamcet వెబ్సైట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థి మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, విద్యార్థి ప్రాధాన్యాన్నిబట్టి ఈ మూడింటిలో ఒకచోట మాత్రమే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారని తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 16 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షను ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లోను, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 23, 24 తేదీల్లోను నిర్వహిస్తామన్నారు. ఉర్దూ మాధ్యమం కావాలనుకునే వారికి కర్నూలులో మాత్రమే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీసీ విద్యార్థులకు గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40 కలిపి మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ర్యాంకును నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులను 75శాతం, 25శాతం ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతా మార్కులు లేవు. ఇతర అభ్యర్థులకు 40 మార్కులను అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష వల్ల పారదర్శకంగా, త్వరితగతిన ర్యాంకులు కేటాయించడానికి వీలవుతుందని, విద్యార్థి తమ జవాబులను ఎన్ని సార్లయినా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని సాయిబాబు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు, ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నాపత్రాలు కష్టంగాను, సులభంగాను ఉన్నాయని ఒకరితోనొకరు పోల్చుకుని ఆందోళన చెందనవసరం లేదన్నారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ (నార్మలైజేషన్) పద్ధతిలో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు విద్యార్థికి హాల్‌టికెట్‌లో కేటాయించిన రోజు అదే శ్లాట్‌లో పరీక్షకు హాజరు కావాలి. లేదంటే గైర్హాజరైనట్లుగా పరిగణిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థిని పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థికి రఫ్‌వర్కు చేసుకునే నిమిత్తం తెల్లకాగితాలను తామే అందిస్తామని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఈ ప్రవేశ పరీక్ష శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884 – 2340535, 0884 – 2356255 ఫోన్ నెంబర్ల ద్వారా, లేదా ఈమెయిల్ ఐడి 2019apeamcet@gmail.com ద్వారా సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు. -
సవిత ఇంజనీరింగ్ కళాశాలలో అగ్ని ప్రమాదం
-
246 కళాశాలల్లో విద్యార్థుల్లేరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంకట స్థితి తలెత్తింది. అత్యున్నత విద్యా ప్రమాణాలతో బోధన చేపట్టాల్సిన కాలేజీలకు నిర్వహణ భారం గుదిబండగా మారింది. ఈ పరిస్థితిని తట్టుకోలేక యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నా యి. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో బోధన నిలిచిపోయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 6,306 కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు ఏటా సంబంధిత యూని వర్సిటీ/ బోర్డు నుంచి గుర్తింపు పత్రాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీల్లో బోధనా సిబ్బంది, మౌలిక వసతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని వర్సిటీ/బోర్డు అనుమతులు జారీ చేస్తుంది. అనుమతులున్న కాలేజీల్లోనే విద్యార్థుల ప్రవేశానికి వీలుం టుంది. ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ గుర్తింపు ఉన్న కాలేజీలకే వర్తిస్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది 6,060 కాలేజీలు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఇప్పటివరకు 5,788 కాలేజీలకే గుర్తింపు పత్రాలు జారీ అయ్యాయి. మిగతా కాలేజీల గుర్తింపు ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బోధనకు దూరంగా 246 కాలేజీలు... 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు. ఇంటర్మీడియెట్ ప్రవేశాలు మాన్యువల్ పద్ధతిలో నిర్వహించగా డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో చేపట్టారు. పీజీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేశారు. ఆన్లైన్, సెట్ల ద్వారా నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియలో కాలేజీలు ముందుగా అనుమతి పత్రాలు, కోర్సు వివరాలను కన్వీనర్లకు సమర్పించాల్సి ఉంటుంది. కాలేజీలు వివరాలు ఇచ్చాకే వాటి ఆధారంగా సీట్ల లభ్యతనుబట్టి అడ్మిషన్లు పూర్తవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 246 కాలేజీలు సమ్మతి పత్రాలు సమర్పించకపోవడంతో ఆయా కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోలేదు. డిగ్రీ, పీజీ కాలేజీలే అత్యధికం... ఈ ఏడాది ప్రవేశాలు జరగని వాటిలో అత్యధికంగా డిగ్రీ, పీజీ కాలేజీలే ఉన్నాయి. డిగ్రీ, పీజీ కేటగిరీలో ఏకంగా 197 కాలేజీల్లో విద్యార్థులు చేరలేదు. అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 87 కాలేజీలుండగా... ఆ తర్వాత స్థానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 53 కాలేజీలున్నాయి. ఈ ఏడాది 15 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు జరగలేదు. అదేవిధంగా నర్సింగ్, లాబ్‌టెక్నీషియన్ కోర్సులకు సంబంధించిన పారామెడికల్ కాలేజీలు 8, ఐటీఐలు 7, బీఈడీ కాలేజీలు 4, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోని 4 పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు. యునివర్సిటీ/బోర్డులవారీగా రెన్యువల్ కాని కాలేజీలు యూనివర్సిటీ/బోర్డు కాలేజీలు ఎల్ఈటీ 7 డీఎస్ఈ 4 జేఎన్టీయూ 15 కాకతీయ 53 మహాత్మాగాంధీ 20 ఉస్మానియా 87 పాలమూరు 18 శాతవాహన 19 తెలంగాణ 6 -
కర్సింగ్ రైటింగ్
రాత్రి పన్నెండింటికి మెలకువొచ్చింది అర్జున్‌కి. గబగబా లేచి గ్లాసెడు నీళ్ళు తాగి, మరో గ్లాసెడు నీళ్ళు మొహాన కొట్టుకుని పుస్తకం తెరిచాడు. అదొక ఫోర్ రూల్ బుక్.ప్రతి పేజీలోని పై వరుసల్లో ఇంగ్లీష్ నీతి వాక్యాలున్నాయి. ఉదయానికల్లా దాన్ని నింపేయాలి. పీరియడ్ మొదలవ్వడానికి ముందే.. పెద్దాయనకి చూపించాలి.వాళ్ల అమ్మ మెల్లగా లేచి దగ్గరికి వచ్చి ’నిద్రని ఆపుకోలేవు.. ఉండు.. కాస్త బూస్టు కలిపి తెస్తాను..’ అని వంటగదిలోకి వెళ్ళింది.అర్జున్‌కి ఆవిడ మాటలేవీ వినపడలేదు. పెన్సిలు కళ్లద్దానికి దగ్గరగా పెట్టుకుని ముల్లు పదును పరిశీలించాడు. తల అడ్డంగా ఊపుతూ షార్పెనర్ల గుట్ట వైపు చూశాడు.రెండు మూడు షార్పెనర్లను పట్టుకుని తేరిపార చూస్తూ, చివరికి ఎర్రరంగుది ఎంచుకుని పెన్సిలు చెక్కుకున్నాడు. పని పూర్తవ్వగానే తృప్తినిచ్చే నవ్వు కళ్లలోంచి బయటపడి మూతి మీదకు చేరింది.ఇది హోమ్‌వర్కు కాదు.రాత్రి పన్నెండింటికి మేలుకుని మరీ చేస్తున్నాడంటే.. దాని అర్థం పనిష్మెంట్ అని! ఈ మాత్రం విషయానికి ఆశ్చర్యం రాకపోవచ్చు. కానీ..అర్జున్ వయసు నలభై రెండేళ్లు.. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోకుండా కాసేపాగి.. మతి చలించినవాడేమోలే.. అనుకోవచ్చు. కానీ.. అర్జున్ ఈజ్ ఏన్ అసిస్టెంట్ ప్రొఫెసర్.. క్రియేటివ్ రూల్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో. ఇప్పుడు సందిగ్ధంలో పడి ఉంటారు.ఏంటీ ఇతని మేటర్ అని.అమ్మ ఇచ్చిన బూస్టు తాగి శ్రద్ధగా రాయడం మొదలు పెట్టాడు. దేర్ ఈజ్ నో క్రియేటివిటీ వితవుట్ ఫెయిల్యూర్...’ నాలుగో పదం దగ్గర పెన్సిల్లో స్వేచ్ఛ ఆవిరైపోయింది.సన్నగా వొణికింది. ‘‘సి కీ ఆర్ కీ కర్సిప్ లింక్ సరిగా చేయట్లేదు..’’ వాయిస్ గుండె బ్యాక్గ్రౌండ్లోంచి గుంభనంగా వినపడింది.. వాయిస్ మాత్రమే కాదది. బెదిరింపు.. హింస. పైశాచిక ఆనందం.అది కాలేజీ స్థాపించిన పెద్దాయనది. కళ్ల నుంచి నీళ్లు ఉబికాయి. రెప్పాడిస్తే కన్నీటిబొట్టు పుస్తకం మీద పడుతుందని, పుస్తకం దూరంగా నెట్టేశాడు. అమ్మ చూడకుండా తమాయించుకున్నాడు.భుజంమీది టవల్ తో మొహం తుడుచుకున్నాడు. ఆందోళనతో కూడిన ఆ ఏడుపాగట్లేదు. ఓ కొత్త రేజర్ అందుకుని, దాని అంచుతో తప్పు అనిపిస్తున్న పదాన్ని తుడిచాడు.. ఒకసారి.. రెండుసార్లు.. మూడుసార్లు... సరిగ్గా రాశాడో లేదో తనకే అర్థం కావట్లేదు. పుస్తకం నింపేశాడు.కాలేజీ క్యాంటిన్లో ఎప్పట్లా సేమ్యా ఉప్మా పెట్టుకుని కూర్చున్నాడు అర్జున్. ఉప్మాలో సేమ్యా పుడకలు కలగాపులగంగా ఉన్న ఇంగ్లీష్ అక్షరాల్లాగ కనిపిస్తున్నాయి. వాటివంక కూడా కలవరంగా చూశాడు. ఫోర్కుతో అటూ ఇటూ కదిపాడు.. ఫోర్ రూల్ బుక్కులాగ గీతలు పడ్డాయి. అసహ్యపడి.. చప్పున దూరంగా తోసేశాడు.‘‘నేను మా పెద్దమ్మాయితో రాయించాను. బాగానే రాసింది.చూడాలి.. వాడేమంటాడో..’’ ఆనందంగా చెప్పాడు పక్కనే కూర్చున్న ప్రసాదరావు. అర్జున్ ‘అదృష్టవంతుడివి’ అన్నట్లుగా చిన్న నవ్వు నవ్విఊరుకున్నాడు.ఈలోగా అటెండరు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘మీటింగ్ హాల్ కి అర్జెంటుగా రావాలంట..’’ అని చెప్పి లైబ్రరీ వైపు కూడా కేకెయ్యడానికి దారితీశాడు.అర్జున్‌తో పాటు అక్కడున్న మరికొంతమంది ఉన్నపళంగా ఫోర్ రూల్ బుక్కులతో పరుగులు తీశారు.అప్పటికే అక్కడ కూర్చున్నాడాయన.ఆయన పేరు అప్రస్తుతం. కార్పొరేట్ వ్యవస్థను కరెన్సీతో కొలిచి కొనుక్కుని పెట్టిన కాలేజీ శాఖలను తన సామంత రాజ్యాలుగా భావిస్తాడు. తాను చట్టాలను చేయగల మేధావిగా.. సమర్థుడిగా.. నియంతగా.. వ్యవహరిస్తుంటాడు.స్టూడెంట్లు ప్రతిరోజూ హాజరవ్వాలి. యూనిఫామ్ వేయాలి. మొబైల్ నాట్ అలవ్డ్. లీవు కోసం పేరెంట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ప్రాపర్ కాజ్ సర్టిఫై చేసి చూపాలి.వాహ్.. మంచి కాలేజ్. ఈ తరం పిల్లలకు ఇలాంటిదే కరెక్టు.. అనుకుని చాలామంది జాయిన్ అయ్యారు. ఓరోజు సడెన్‌గా కర్సివ్ రైటింగ్ బుక్సు తెచ్చి మనిషికి ఓ పదేసి కాపీలు ఇచ్చారు. స్టాఫ్‌కి కూడా. డబ్బులు కట్టించుకుని మరీ.. ఇంజనీరింగ్ పిల్లలు ఎందుకు రాస్తారు? రాయలేదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఈ పెద్దాయనకి మెంటల్ అని చెప్పారు. వాళ్లల్లో పేరున్నవాళ్లు వచ్చి తిట్టారు. వార్త వైరల్ అయిపోయింది. పెద్దాయన ఇగో దెబ్బతింది. రెండ్రోజుల్లో స్టాఫ్ అందరికీ సర్క్యులర్ వచ్చింది. కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన బుక్సు చూపించాలని. ఇంక్రిమెంట్లు వేసే టైమ్.. ప్రమోషన్లు ఇచ్చే టైమ్...మధ్యతరగతి మెట్లమీద నడిచే మాస్టార్లు.. ఏంచేస్తారు? రాత్రికి రాత్రి రాశారు. రాయించారు. ఉద్యోగం కోసం.. ఉన్నతిని దిగజార్చుకున్నారు. ఆ బుక్సు దిద్దుతున్నప్పుడే మరో ఆజ్ఞ జారీ చేశాడు పెద్దాయన. ‘రేపు ఎస్సే రైటింగ్ ఎగ్జామ్. ప్రిపేర్ అయ్యి రండి..’ అని.అతని మొహంలో నవ్వు ఉంది. వీళ్లందర్నీ ఆటాడిస్తున్నానన్న అహం.. వీళ్లంతా సఫర్ అవుతూ కూడా నా ముందు వంగి వంగి ఉండాల్సిందే అన్న పైశాచిక ఆనందం.ఇంగ్లీష్ సార్ హాస్పిటల్లో ఉంటే.. ఆయనకు బుక్స్ వీపీపీలో పంపాడు. ’చిన్న విషయం’ అనుకునే స్థాయి దాటిన భావం అందరిలోనూ మొదలైంది అప్పుడే.మేథ్స్ లెక్చరర్, వెళ్లిపోతానన్నారు. రిజైన్ లెటర్ ఇచ్చినప్పటి నుంచి ఆయన్ను ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేందుకు మూడు నెలలుగా తిప్పుతున్నారు. అప్పుల్లో పడి ఆయన కుమిలిపోవడం.. ఈమధ్యనే ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. అందరిలోనూ భయాన్ని రేపింది.పెద్దాయన పక్కనే ఓ టేబుల్ మీద పుస్తకాలన్నీ పెట్టారు. అటెండరు కృష్ణ అందివ్వడానికి వచ్చాడు. పైన రీనా మేడమ్ బుక్కు ఉంది. దానికి కలర్ పేపర్ అట్ట, లేబుల్, పువ్వుల అంచు డిజైన్ ఉంది.దాన్నిఅందించాడు కృష్ణ.అందుకుని.. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి.. తెరిచాడు. ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని మూసేసి.. ‘‘రీనామేడమ్.. మీరు మరో నాలుగు పుస్తకాలు తీసుకోండి. రేపు సెలవు కదా.. ఎల్లుండి చూపించండి..’’ అన్నాడు. మళ్లీ అందరి వైపు చూస్తూ.. ఇలాంటి అట్టలు వేసి నన్ను మాయ చేయలేరు.. అంటూ నవ్వాడు.నెక్స్›్ట అంటూ పుస్తకం అందుకుని.. తెరిచీ తెరవగానే.. దాన్ని విసిరేశాడు. ‘టెన్ బుక్స్ రాసి పట్రా.. వరస్ట్ రైటింగ్..’ అన్నాడు.. అదెవరిదా అనుకుంటుండగా.. ప్రసాదరావు పరుగెత్తుకుంటూ ఆ పుస్తకం పడ్డ మూల వైపు వెళ్లాడు.అందరివీ విసిరేస్తున్నాడు..మనోజ్.. పుస్తకంలో మాత్రం మొహం పెట్టి అయిదు నిమిషాలు ఉన్నాడు. బైటికి వచ్చి. ’గుడ్.. నువ్వు ఎక్స్ట్రా బుక్ రాయక్కర్లేదు. లెవెల్ టూ బుక్ తీస్కో.. అని అభినందించాడు. లెవెల్ టూనా.. అంటూడీలా పడ్డాడతను. తర్వాత అర్జున్ పేరు చదివాడు. ‘‘నీ పిల్లలది ఎల్ కేజీ యూకేజీ అయిపోయిందా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘పెళ్ళి కాలేదండీ..’’ అన్నాడు పెద్దాయన వ్యంగ్యంగా అడిగాడని తెలిసి కూడా. ‘‘మరి ఇదెవరు రాశారు?’’ గద్దించాడాయన. ‘నేనే సార్..’’ అన్నాడు పెద్దాయనకి జవాబు తెలిసే అడిగాడని తెలిసినా. ‘‘అచ్ఛా.. తమరు మంచి ఆర్టిస్టులా ఉన్నారే.. ఓ పదిహేను పెయింటింగ్స్ గీసి తీస్కురండి..’’ అన్నాడు కాళ్లూపుతూ.. మరింత వెటకారంగా.మర్నాడు లీవు కావాలని అడగాలన్న మాట గొంతు దాటలేదు. అమ్మను హాస్పిటల్‌కి తీసు కెళ్లాలి. తతంగం పూర్తయ్యాక ధైర్యంచేసి వెనకాలే వెళ్లాడు అర్జున్.. ‘‘సార్.. రేపు లీవు..’’...‘‘మొన్న తీసుకున్నావ్ కదా.. నీకు రెండు వారాలకే నెల పూర్తవుతుందా? ఏమనుకున్నావ్? కాలేజీలో వర్క్‌షాప్ ఉంది. ఎట్లా పోతావ్? నెలకి ఒకటే సీఎల్... అర్థం కాదా మీకు.. సెలవు పెట్టి ఏదో వేరే ఎగ్జామ్స్‌కి అటెండ్ అవుతారు.. గ్రూప్ వన్నా టూనా..? నాకు తెలీదా..’’‘‘అది కాదు సార్.. అమ్మకి బాలేదు.. హాస్పిటల్‌కి..’’ ‘‘మా అమ్మకీ బాలేదు.. నేను వస్తున్నా కదా.. సాకులు.. సాకులు... వరస్ట్ మెంటాలిటీస్..’’ఆయన ఆగకుండా.. నడుస్తూనే ఉన్నాడు. కార్ డోర్ తెరిచే ఉంచారు.లోపల కూర్చుని రయ్యిమని వెళ్లిపోయాడు.దుఃఖం ముంచుకొచ్చింది అర్జున్‌కి. ఎటెండరు కృష్ణ పక్కకి వచ్చి సముదాయింపుగా తల ఊపాడు.‘సాయంకాలాలూ రాత్రిళ్లూ ఈయనిచ్చిన ఫోర్ రూల్ పుస్తకాలు నింపేసరికే అయిపోతుంది.. అమ్మ సంగతి..? అటు ఉద్యోగం ఊడిపోతే.. ఉన్నపళంగా ఏదీ తోచని బ్రతుకు..’’ గొంతు తడారిపోయింది అర్జున్‌కి..రీనా మేడమ్, పక్కనే ప్రసాదరావు.. మరికొందరు స్టాఫ్... అర్జున్ మాటలు వింటూ నిల్చుండిపోయారు.‘‘ఇద్దరు పిల్లల ఒంటరి రీనా మేడమ్.. లక్షల్లో అప్పులు తీర్చలేక నెట్టుకొస్తున్నరు ప్రసాద్ సార్.. తొంభై అయిదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న వెంకట్ బాబుసార్.. ఒకరికి కాదు.. అందరికీ.. అందరికీ.. టార్చర్ పెడుతున్నాడు. ఏమీ చేయలేరని.. వాడికేమీ చేయలేరా సార్..? కూర్చుని ఏడుస్తరు.. మా నాయనమ్మ ఓ కత చెప్పింది.. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎలకలన్నీ మీటింగు పెట్కున్నయంట. తర్వాత ఏం జరిగిందో అనవసరం. మీరు మీటింగన్నా పెట్కోలే..? అంతకన్నా హీనమా? ‘ కృష్ణ చీదరింపు ఇది ఎన్నోసారో తెలీదు.‘‘ఎవరి బతుకులు వారివి.. ఏం చేస్తాంరా కృష్ణా..’’ నిరాశగా మాట్లాడాడు ప్రసాద్సార్. ‘‘కనీసం గట్టిగా మాట్లాడండి సార్..’’ ‘‘నీకేమన్నా పిచ్చా..?’’ ‘‘ఈ మాట.. ఇదే మాట.. వాడి ఎదురుగా అనండి.. నిజంగా..’’ ‘‘మెంటల్ నా కొడుకు.. కేసు పెడితే.. మా ఉద్యోగాలు ఏమవుతాయ్? మళ్లీ ఎక్కడ వెతుక్కుంటాం..’’‘‘ఉద్యోగం పోతే మళ్లీ వెతుక్కోలేం.. అన్నది ఎంత చేతకాని మాట సార్? పీజీలూ పీహెచ్‌డీలూ చేసి ఇంత దేభ్యం బతుకు ఎందుకుసార్? సిగ్గుండాలి.. ఛత్.. జైల్లో ఖైదీల్లెక్క ఉన్నారు. ఇదా ఉద్యోగం? కాపీరైటింగు కర్సివ్ రైటింగులేంది? పిచ్చకాకపోతే? ఒకసారి సరే.. వారం వారం.. ఆదివారాలు మింగేస్తన్నాడు. సోమవారాలు ఏడుపుమొహాలతో.. సిగ్గుండాలి.. లాస్ ఆఫ్ పే సెలవు కూడాఇవ్వడా..? హలో.. బ్రిటీషోళ్లు వెళ్లిపోయి చాలాకాలం అయింది సారూ..’’‘‘అయితే ఇప్పుడేం చేయమంటావ్ రా..?’’ ‘‘ఎవడికి కాలితే వాడు.. నిలదీయాలి సార్‘ ‘‘ఎవరు చేస్తారు చెప్పు.. ఎవ్వరూ ముందుకు రారు..’’ రీనా మేడమ్ గొంతు తగ్గిస్తూ అంది.‘‘ఎవరో ఒకరు చెయ్యాలి.. ఇంతమందికి మేలు జరుగుతుందంటే.. చెయ్యరా?.. ప్రపంచం చాలా విశాలమైనది. కుటుంబాల్ని కూలి పనిచేసుకుని అయినా పోషించుకోవచ్చు ప్రసాద్ సార్! చాలామంది టైలరింగులు లాంటి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు రీనా మేడమ్!! తట్టలు మోసేవాళ్లకు కూడా తల్లిని చూడాల్సిన బాధ్యత ఉంది అర్జున్ సార్!!! వీడేమన్నా హిట్లరా? తుపాకీ ఉందా? చంపేస్తాడా? నోరెందుకు పెగలదు? ఒక్కసారి ఎదురునిల్చి మాట్లాడండి సార్.. తలదించుకుని కాదు.. వాడి కళ్లలోకి చూస్తూ.. తెలుసుగా.. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో మళ్లీ మీరే చెప్తారు అందరికీ.. ఈ ఒక్క పనితో మీకు చాలా సమస్యలు తీరుతాయి. ఈ సాయంత్రం సమస్య మీది. మీకోసం మీరే నిలబడాలి. పోరాడాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకండి.మీరొకరికి స్ఫూర్తి అవుతారు. జీవితం రేపటినుంచే కొత్తగా ఉంటుంది. నమ్మండి. నేను వెళ్లి ఏదో మాట్లాడొచ్చు.. కానీ.. ఎవరి ఆట వాళ్లు ఆడాలికదా.. నాకు కాలినప్పుడు నేను లేస్తా.. ఇక మీ ఇష్టం..’’ కృష్ణ తన తల కుడివైపుకి కాస్త వాల్చి తూటాల్లా మాటలు విసురుతుంటే.. యమస్పీడులో కర్సివ్ రైటింగ్ రాస్తున్నట్లుంది..‘‘నాకు కాల్తంది...’’ నింపాదిగానే అన్నాడు అర్జున్.‘‘ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా? విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు అన్నట్లు తిరగాలా.. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు..’’ ప్రసాదరావు తప్పుకుని వెళ్లిపోయాడు. మిగతావాళ్లు ’ఏంచేస్తాంలే.. మన లైఫ్‌లు ఇంతే..’ అనుకుంటూ నీరుగారిపోయారు...అర్జున్ ఒక్క నిమిషం పాటు కదల్లేదు. బిగుసుకున్న దవడల మధ్య అతని నిర్ణయం స్పష్టంగా ధ్వనించింది.‘‘ఛీ.. దీనమ్మా జీవితం.. ఒరే కృష్ణా.. ఏదైతే అదైంది.. కర్రీ పాయింటు పెట్టుకున్నా చాలు.. బతికేస్తా.. సగం జీవితం అయిపోయింది.. బాగా చెప్పావురా.. జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటా..’’ పరుగులాంటి నడకతో ఇంటికి బయల్దేరాడు అర్జున్. .అర్జున్ ఆరేడడుగులు వేశాడో లేదో.. వెనకాల్నించి కృష్ణ ‘‘సార్.. మీ నడకలోనే కర్సివ్ రైటింగ్ కనిపిస్తంది. సూపర్..’’ అన్నాడు. అర్జున్ వెనక్కి తిరిగి ఓ కామా పెట్టినట్లు నవ్వి బయల్దేరాడు.అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి తనే వంట చేసి ఆమెకు వడ్డించాడు. ఆమె కొడుకు చూపించే ప్రేమకు తృప్తిపడింది. అర్జున్‌కి ఆ తృప్తి మరికొంత ధైర్యాన్నిచ్చింది. భోజనాలు అయ్యాక రీడింగ్ టేబుల్ దగ్గర ఫోర్ రూల్ బుక్ తెరిచి రాయడం మొదలు పెట్టాడు. అదీ రెడ్ ఇంక్ పెన్‌తో! గంట సేపు ఏకధాటిగా రాస్తున్నంతసేపూ మొహాన చిరునవ్వు చెరగలేదు.‘‘సార్.. మన కాలేజీ చీడ మిగతా కాలేజీలకు కూడా పాకేసింది. ‘స్నేక్మూవ్స్’ కాలేజీవాళ్లు కూడా ఫోర్ రూల్ బుక్కులు పెట్టారంట తెల్సా..‘ కొత్త ప్రొఫెసర్ ఒక్కొక్కరి చెవుల్లో గుసగుసలాడాడు.‘‘మంచి మూడు అడుగులు వేసేలోపు.. పైత్యం పది కిలోమీటర్లు పోతాది మరి...’’ అన్నాడు అర్జున్. అందరూ నిర్వేదంగా నవ్వేరు.ఈలోగా మీటింగ్ హాల్ కి రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్స్పెక్షన్ కి పై అధికారులు కూడా అక్కడే ఉన్నారని మరొకాయన అన్నాడు.అందరూ పుస్తకాలను పట్టుకుని బయల్దేరారు. దొంతులు పెట్టి ఎదురుగా కూర్చున్నారు. అందరికంటే చివరగా పుస్తకాల మీద అర్జున్ పుస్తకం పెట్టాడు.పెద్దాయన పొట్ట మీద గోక్కుంటూ విలాసంగా నవ్వుతూ అధికారులకు తన నియమాలను చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మొన్న ఎస్సే రైటింగ్ పెట్టాం. అందరూ మొబైల్లో కాపీ కొట్టి రాశారు.. నాకు తెలిసింది.. ఏంచేయాలా అని ఆలోచిస్తున్నా.. వాళ్లు రాసింది హండ్రెడ్ టైమ్స్ ఇంపొజిషన్ రాయిస్తా..’’ అంటూ వాళ్లను నవ్వించాననుకున్నాడు.‘‘బై ద వే.. ఇవి మావాళ్ల ఇంప్రూవ్ మెంట్ వర్క్’’ అంటూ అర్జున్ పుస్తకం తీసి ఒకాయనకి అందించాడు.అందుకున్నాయన అది తీసి, ఒక నిమిషం చదివి ఒకటే నవ్వు! పక్కాయనకి అందించాడు.. ఆయన కూడా శ్రుతి కలిపాడు.మూడో ఆయన బైటికే చదివాడు.. ‘‘డియర్ సర్.. యూ హావ్ ఏ సీరియస్ డిజార్డర్ సమ్ థింగ్ లైక్ డీలూజన్ సిమ్టమ్స్. బెటర్ టు కన్సల్ట్ ఇమ్మీడియట్లీ. వి ఆర్ ఆల్ యువర్ వెల్ విషర్స్. వి ప్రే ఫర్ యూ.. వి లవ్ యూ.. ప్లీజ్ చెక్ యువర్ మైండ్.. ఆల్ నెర్వ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఫోర్ రూల్!.. వాటీజ్ దిస్ నాన్సెన్స్? లెటజ్ మూవ్ టు సేవ్ యూ..’’పెద్దాయన మొహాన నెత్తురు చుక్కలేదు. ‘‘ఏంటి సార్.. ఇదంతా?’’ అడిగారా అధికారి. అందరి మొహాలూ స్విచ్చులు వేసిన ట్యూబ్ లైట్లలా ఉన్నాయి. వెలగలేదింకా...! అర్జున్ లేచాడు..‘‘ఇదంతా మా బతుకు సార్.. బాధలు సార్.. ఎక్కడా చెప్పుకోలేని ఛండాలమైన టార్చర్ సార్..’’ అంటూ గుక్కతిప్పకుండా గంట సేపు మాట్లాడాడు.లైట్లన్నీ వెలిగాయి.ప్రసాదరావు.. రీనామేడమ్.. శరత్ కుమార్.. అందరూ ఒక్కో మాటా.. కర్సివ్ రైటింగ్లాగ ఎక్కడా తెగనీకుండా తేడా రాకుండా.. బాధలన్నీ చెప్పుకొచ్చారు.అధికార్ల ముందు పెద్దాయన కుక్కచెవులొచ్చిన పిల్లాడి నోట్సులా ఉండిపోయాడు. ‘క్రమశిక్షణ కోసమని రాయిస్తున్నా..‘ అని ఏదో చెప్పబోతుంటే.. ‘‘నువ్వొక పేజీ రాయవయ్యా చూస్తాం..’’అన్నాడొక అధికారి.‘‘క్రమశిక్షణ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచు. ఇష్టానుసారం పిచ్చిపనులు చెయ్యడం కాదు..’’ ముక్తాయింపునిచ్చాడు మరొకాయన.పెద్దాయన ముఖంలో ఓ తెల్లకాగితంలాంటి పశ్చాత్తాపం తలదించుకుంది. ఇప్పుడు నిలబడి ఉన్న అర్జున్, ఫోర్ రూల్ బుక్కులో ఇంగ్లీష్ మూడోబడి క్యాపిటల్ అక్షరంలా ఠీవిగా కనిపిస్తున్నాడు. - ఎస్.ఎస్.దేవసింధు -
లేటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్ సీట్లు కుదింపు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఇప్పటివరకు కల్పిస్తున్న సీట్లను (లేటరల్ ఎంట్రీ) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కుదించింది. 20% ఉన్న లేటరల్ ఎంట్రీ సీట్లను 10 శాతానికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో దీన్ని అమలు చేయాలని ఇటీవల ఏఐసీటీఈ జారీ చేసిన ఇంజనీరింగ్ కాలేజీల అప్రూవల్ హ్యాండ్ బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఈ సారి డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో లభించే ఇంజనీరింగ్ సీట్లు 10 వేలు తగ్గనున్నాయి. ఈ–సెట్లో అర్హత సాధించిన వారికి ర్యాంకును బట్టి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 20% (ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 10% సీట్లు) సీట్లలో ప్రవేశాలు కల్పిస్తోంది. దాదాపు 20 వేల సీట్లు లభిస్తున్నాయి. ఏఐసీటీఈ తాజాగా నిబంధనల ప్రకారం ఆ సీట్లు 10 వేలకే పరిమితం కానున్నాయి. డిప్లొమా విద్యార్థులకు రావాల్సిన మరో 10 వేల సీట్లకు కోత పడనుంది. 2011 వరకు రాష్ట్రంలో లేటరల్ ఎంట్రీ సీట్లు 10 శాతమే ఉండేవి. 2012లో ఏఐసీటీఈ 20 శాతానికి పెంచడంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, మంజూరైన ఇన్‌టేక్‌కు అదనంగా 20% సీట్లలో డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది. కాగా, విదేశీ విద్యార్థుల కోసం సృష్టించే సూపర్ న్యూమరరీ సీట్లు 5% కలుపుకొని లేటరల్ ఎంట్రీ కోటా 15 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేం దుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతోందనే.. బీటెక్‌లో ఒక్కో బ్రాంచి సెక్షన్లో 60 మంది విద్యార్థులకు అనుమతి ఉంది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్స రం వచ్చే సరికి లేటరల్ ఎంట్రీ ద్వారా ఒక్కో బ్రాంచికి 12 మంది అదనంగా వస్తున్నారు. వీటికి అదనంగా జమ్మూ, కశ్మీర్ వంటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సీట్లిచ్చేలా ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేస్తోంది. దీని ద్వారా మరో నలుగురైదుగురు విద్యార్థులు వస్తున్నారు. వీటికి అదనంగా విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10% సూపర్ న్యూమరరీ సీట్లు సృష్టించి ప్రవేశాలు కల్పించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వచ్చే వారే కాకుండా లేటరల్ ఎంట్రీలో మరో 5% మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల సంఖ్య క్లాస్ రూమ్ నిబంధనలను మించిపోతోంది. ఈ నేపథ్యంలో లేటరల్ ఎంట్రీ విద్యార్థుల సంఖ్యను కుదించినట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
ఫీజులను హైకోర్టు ఎలా నిర్ధారిస్తుంది?
సాక్షి, న్యూఢిల్లీ: అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ధారించాల్సిన ఫీజులను హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందన్నదే కీలక అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాసవీ కళాశాల అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ ఇదివరకే దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఏఎఫ్ఆర్సీ నిర్దేశించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని ధర్మాసనం ఇదివరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ విచారణకురాగా ఇంజనీరింగ్ కళాశాలల ఫీజును నిర్ణయించే అధికారం హైకోర్టుకు ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫీజు నిర్ణయంలో వివాదం ఉంటే ఏఎఫ్ఆర్సీకి అప్పీలు చేయాలి కదా? అని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపిస్తూ ఫీజు నిర్ధారణ అధికారం కోర్టుకు లేదని నివేదిం చారు. లాభాలు ఉత్పన్నమయ్యేలా ఫీజుల నిర్ధారణ ఉండరాదని నివేదించారు. ఫీజు నిర్ధారించే అధికారం కోర్టుకు ఉందని కళాశాలల తరపు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ విన్నవించారు. గతంలో 11 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇందుకు అవకాశం కల్పించిందని వివరించారు. ఫిబ్రవరి 10లోగా రాతపూర్వక నివేదికలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 19కి వాయిదావేసింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. -
ఫీజులపై పితలాటకం
రాష్ట్రంలో 300కు పైగా ఇంజినీరింగ్ కళాశాలల్లో 85,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య దేశంలోకెల్లా ఏపీలోనే అత్యధికం. ఎన్బీఏ, న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు కూడా రాష్ట్రంలోనే ఎక్కువ. వైఎస్సార్ సీఎం కాకమునుపు ఇంజనీరింగ్ విద్య అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షగా ఉండేది. ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో సామాన్యులకు సైతం ఆ విద్య అందుబాటులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చివరి ఏడాది పరీక్షలు ముగించడానికి, పరీక్షల అనంతరం ఆయా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. చివరకు అప్పులు చేసి కాలేజీలకు ఆ మొత్తాలను చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. బీటెక్ విద్యార్థులతో పాటు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సులు చదువుతున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఎంటెక్ విద్యార్థులు బకాయి ఫీజులు చెల్లించినా, ఆయా కాలేజీలు ఆ మేరకు వర్సిటీలకు ఫీజులను పంపడం లేదు. ఫలితంగా పరీక్షలు ముగిసినా, ప్రాజెక్టులకు సంబంధించి వైవా, ఇతర ప్రక్రియలకు వర్సిటీలు విద్యార్థులను అనుమతించడం లేదు. దీంతో కోర్సు పూర్తి చేసినా, సర్టిఫికెట్ చేతికందడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాజెక్టు ఫీజు బకాయిలు కోట్ల రూపాయల్లోకి చేరుకోవడంతో కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ వర్సిటీ (జేఎన్టీయూకే) ఆయా కాలేజీలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోగా చెల్లించి, ఫిబ్రవరి 5వ తేదీలోగా రసీదులు సమర్పించాలని ఆదేశించింది. ఇలా నోటీసులు వచ్చినా కాలేజీలు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి నిధులు వచ్చాకే వర్సిటీల ఫీజు చెల్లిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇవ్వక పోయినా, ఇచ్చేశామంటోంది.. ఇంజినీరింగ్ కోర్సులతో పాటు డిగ్రీ, ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు, స్కాలర్‌షిప్పుల మొత్తాన్ని ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పూర్తిగా విడుదల చేయడం లేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అన్ని రకాల బకాయిలు కలిపి గత ఏడాది నాటికి రూ.919 కోట్ల వరకు అందాల్సి ఉందని చెబుతున్నాయి. ఇవి కాకుండా ఈ ఏడాది ఫీజులు, స్కాలర్‌షిప్పుల మొత్తం రూ.1,252 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందంటున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం ఫీజులు, స్కాలర్‌షిప్పులను ఎప్పటికప్పుడు చెల్లించేస్తున్నామని చెబుతోంది. బకాయిలు రూ.400 కోట్లలోపే ఉన్నాయంటోంది. ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా స్కాలర్షిప్పులు, ఫీజుల మొత్తాలను మంజూరు చేసినట్లు పత్రాలపై చూపిస్తున్నా, ట్రెజరీల ద్వారా ప్రభుత్వం మొకాలడ్డుతోంది. ఆరు నెలలుగా ఇలా నిధులు విడుదల చేయడం లేదని ముఖ్య కార్యదర్శి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఫీజుల పెంపునకు సర్కారు యోచన గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజుల మొత్తాన్ని అందించేంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ విధానానికి స్వస్తి చెప్పారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీయే తదితర కోర్సులకు ట్యూషన్ ఫీజు గరిష్టంగా లక్షన్నరకు పైగా ఉంటోంది. రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఫీజులున్న కాలేజీల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. దీంతో మిగిలిన మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టాల్సి వస్తోంది. ఆ ఇస్తామన్న రూ.35 వేలు కూడా సకాలంలో విడుదల చేయక పోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పైగా ఈ మొత్తాన్ని పెంచకుండా కళాశాల ఫీజులు మాత్రం పెంచుతుండటం దారుణం అని తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతా అగమ్యగోచరంగా ఉందంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంజనీరింగ్ ఫీజును గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచిన ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మళ్లీ పెంచాలని నిర్ణయించడం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రకటనతో సర్కారు పెద్దల్లో గుబులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, దాంతోపాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నవరత్న హామీల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీ ప్రజల్లోకి బాగా చొచ్చుకు పోవడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఫీజు రీయింబర్స్మెంట్ పెంపుపై కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది. రూ.35 వేలుగా ఉన్న ఫీజును రూ.65 వేలు చేయాలని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎన్నికల ముందు ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో స్కాలర్‌షిప్పులను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అందించేవారు. కాలేజీలు విద్యార్థుల దరఖాస్తులను అందిస్తే ఈపాస్ ద్వారా మంజూరు చేయించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ కోర్సుల ఫీజులు, స్కాలర్షిప్పులన్నింటికీ కలిపి జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయించారు. ఈ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయడం, మంజూరు చేయించుకోవడం గందరగోళంగా మారింది. కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావలసి ఉండడంతో కాలేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. పలు కాలేజీల్లో సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. బకాయిలు వచ్చినప్పుడే ఇస్తామని, లేదంటే వెళ్లిపోవచ్చని తెగేసి చెబుతున్నాయి. మరికొన్ని కాలేజీల్లో సిబ్బందిని భారీగా తగ్గించారు. -
ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలోని కోర్సు ల్లో సిలబస్‌పై మార్పులు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), తెలంగాణ సీఎం, విద్యా శాఖలకు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ (ఏఐఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ) బుధవారం లేఖ రాసింది. ఏఐసీటీఈ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో సిలబస్‌ను అమలు చేయాలని లేఖలో కోరింది. అలాగే కోర్సులు, సిలబస్‌లలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులలోని సిలబస్‌లో కొన్ని అంశాలను చేర్చాలని తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, త్రీడీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ టెక్నాలజీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటేనింగ్ ఇంజనీరింగ్, ఎయిర్‌లైన్ మేనేజ్మెంట్, ఆర్టిఫీషియల్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఫిషరీస్ ఇంజనీరింగ్, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, జియో ఇన్‌ఫ్రామెటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెరైన్ టెక్నాలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్, తదితరాలను చేర్చాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 2018–19 విద్యాసంవత్సరానికి కోర్సులను ప్రవేశపెట్టడంలో జేఎన్టీయూ హైదరాబాద్, కొన్ని లోకల్ యూనివర్సిటీలు విఫలమయ్యాయి. ఏఐసీటీఈ చేసిన ప్రతిపాదన ప్రకారం 2019–20 విద్యాసంవత్సరానికైనా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలు కృషి చేయాలని ఏఐఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ జనరల్ సెక్రటరీ కేవీకే రావు అభిప్రాయపడ్డారు. అక్రెడిటేషన్, అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీలని చెప్పుకునే కొన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని వాపోయారు. -
అధిక ఫీజు వసూళ్లపై పిల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫారసు చేసిన ఫీజుల కంటే ఈ కాలేజీలు అధికంగా వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. వాసవీ కాలేజీ అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ ఇదివరకే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించింది. ఏఎఫ్ఆర్సీ నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ధర్మాసనం ఇదివరకే పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని, విచారణను జనవరి 29కి వాయిదావేసింది. -
అడ్డ‘దారులు’
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంటెక్ పూర్తిచేసి.. అదే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు తాను పీహెచ్డీ పూర్తిచేశానని తనకు వేతనం పెంచాలని కోరుతూ.. ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీకి చెందిన డాక్టరేట్ పట్టా తీసుకొచ్చి యాజమాన్యం చేతిలో పెట్టాడు. కంగుతిన్న సదరు యాజమాన్యం.. సదరు అధ్యాపకుడి ఉద్యోగ హాజరును పరిశీలించింది. సెలవులు పెద్దగా పెట్టలేదని గమనించి.. కళాశాలలో పనిచేస్తూనే పీహెచ్డీ ఎలా పూర్తిచేశావని ప్రశ్నించగా.. తెల్లముఖం వేశాడు. చేసేదిలేక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఒక్క అధ్యాపకుడే కాదు.. జిల్లాకు చెందిన చాలా మంది వివిధ రాష్ట్రాల్లో పీహెచ్డీ పూర్తిచేసినట్లు ‘నకిలీ’ సర్టిఫికెట్లు సృష్టించి.. కళా శాలల్లో చేరి.. ఉద్యోగాలు చేస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం దూమారం రేపుతోంది. కొంతమంది డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు నకిలీవి పట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం జేఎన్టీయూ (హెచ్) అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ స్థాయి హోదాలో పనిచేస్తున్నవారే నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు వెలుగుచూడడంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జేఎన్టీయూ అధికారులు ఆయా కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో పనిచేస్తున్నవారి సర్టిఫికెట్లను తనిఖీ చేస్తోంది. ఇందులోభాగంగా అనేక లొసుగులు బయటపడుతున్నట్లు సమాచారం. అధికారుల అంచనా ప్రకారం 150 మందికిపైగా అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు తనిఖీలకు రమ్మని పిలవగా.. జిల్లాలోని పలు కళాశాలల అధ్యాపకులు వెళ్లకుండా మల్లాగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు పిలిచినా వెళ్లడం లేదంటే వారి సర్టిఫికెట్లు నకిలీవేనా..? అనే సందేహాలు విద్యావేత్తలో వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి.. తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసి.. నకిలీలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటపడనున్న బాగోతం.. ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించిన వారి ఏరివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నకిలీ ధ్రువీకరణపత్రాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నవారితో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పత్రాలు సృష్టించిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 30మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 150మందికి పైగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని నోటీసులు పంపించగా.. కేవలం 60మందే హాజరయ్యారు. ఇక కరీంనగర్లో పనిచేస్తున్న వారు వెళ్లేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గవర్నర్ ఆదేశాలతో.. పీహెచ్డీ సర్టిఫికెట్లు నకిలీవీ పెట్టిన అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. గతంలోని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్య, తదితర వివరాలు పంపించాలని ఉన్నతవిద్యామండలిని కోరారు. ఇందులో ముఖ్యంగా ఏయే యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు..? ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే వివరాలు కోరారు. దీంతో ఉన్నత విద్యామండలి రెండు నెలల క్రితమే అన్ని యూనివర్సిటీలకు పీహెచ్డీ వివరాలు పంపించాలని ఆదేశించింది. అన్ని యూనివర్సిటీలు సంబంధిత వివరాలు పంపించాయి. ఈ క్రమంలోనే నకీలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జెఎన్టీయూ అధికారులు సైతం నకిలీలపై దృష్టి నోటీసులు పంపించడం, తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తేలితే కఠినచర్యలు పాల్పడనున్నట్లు సమాచారం. నకిలీలతో యాజమాన్యాలకే మోసం కరీంనగర్‌లోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు తప్పుడు పీహెచ్డీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు తీవ్ర ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నకిలీ సర్టిఫికెట్ల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. యాజమాన్యాలనే మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు వివిధ కళాశాలల నుంచి తప్పుడు పత్రాలతోనే ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం. నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విభాగానికి చెందిన అధ్యాపకుడు పీహెచ్డీ పట్టా కొనుక్కొని వచ్చారని.. అయినా యాజమాన్యం సదరు విభాగం తరఫున డాక్టరేట్‌గా యూనివర్సిటీకి చూపిస్తున్నట్లు సమాచారం. కొందరు అధ్యాపకుల సర్టిఫికెట్ల వ్యవహారం యాజమాన్యాలకు తెలిసినా.. కిమ్మనకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అర్హత ఉన్నవారితోనే విద్యాబోధన జరిగితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నకిలీలపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంటర్న్‌షిప్‌తోపాటే ఉద్యోగం!
చదువుకునే సమయంలోనే విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు వీలుగా నూతన ఇంటర్న్‌షిప్ విధానం అమలులోకి వస్తోంది. సాంకేతిక కోర్సులంటే సమాజంతో పనిలేదు అనే ధోరణి నుంచి బయటకు రప్పించేలా ఇంటర్న్‌షిప్‌ను తీర్చిదిద్దారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ను పకడ్బందీగా పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: విద్యార్థులు సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందిం చేందుకు సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ విధానంలో సమూల మార్పులు అమలులోకి రానున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమో కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ కాలపరిమితిని పెంచడంతోపాటు పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానాన్ని మెరుగుపర్చడానికి కేంద్రం ప్రభుత్వం నూతన ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల మోడ్రన్ ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాక్టికల్ విధానానికి ఇందులో పెద్దపీట వేశారు. అదే సమయంలో ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ల సంఖ్యను తగ్గించారు. బీటెక్ కోర్సులో 220 క్రెడిట్లను 160కి కుదించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కు 14 నుంచి 20 క్రెడిట్స్‌ను కేటాయించారు. డిప్లొమోలో దీన్ని 10 నుంచి 16 క్రెడిట్లుగా నిర్ణయించారు. ఇంటర్న్‌షిప్ నాలుగు నెలలకు తగ్గకుండా ఉండేలా నిబంధనలు విధించారు. దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడంతో పాటు కోర్సు పూర్తయ్యేలోగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణతో వేతనాలకు కోత ఇంజనీరింగ్, డిప్లొమో కోర్సులు చదివేవారిలో నైపుణ్యాల లేమితో మూడో వంతు మంది కూడా ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని భావిస్తున్న ఏఐసీటీఈ నూతన విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉపాధి పొందుతున్న వారిలో కూడా నైపుణ్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఆయా పరిశ్రమలు తిరిగి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. అయితే శిక్షణ పేరుతో వేతనాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వేతనాలు పొందాల్సిన వారు కేవలం రూ.1.5 లక్షలే అందుకోగలుగుతున్నారు. డిప్లొమోలో 500 గంటలు.. ఇంజనీరింగ్‌లో 700 గంటలు.. కొత్త నిబంధనల ప్రకారం డిప్లొమో కోర్సులు చేసే విద్యార్థులు 450 నుంచి 500 గంటలు, ఇంజనీరింగ్ విద్యార్థులు 600 నుంచి 700 గంటలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌టైమ్ పార్ట్‌టైమ్ వెసులుబాటు కూడా కల్పించారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌కు హాజరయ్యే వారు కోర్సు మధ్యలో ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. సెకండ్ సెమిస్టర్ నుంచి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 40 నుంచి 45 గంటల పనిగంటలను ఒక క్రెడిట్‌గా పరిగణిస్తారు. ఒక వారంలో దీన్ని పూర్తిచేయవచ్చు. ఇందులో ట్రైనింగ్, ప్రాజెక్టు వర్కు, సెమినార్ తదితర కార్యక్రమాలుంటాయి. 4, 6 సెమిస్టర్ల అనంతరం వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తదితర కార్యక్రమాలను చేపట్టవచ్చు. చివరిలో ప్రాజెక్టు వర్కు, సెమినార్లు ఇంటర్న్‌షిప్‌ను పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చిన్న, మధ్య తరహా సంస్థల్లోనూ చేయవచ్చు. చివరి 8వ సెమిస్టర్లో ప్రాజెక్టు వర్కు, సెమినార్లు లాంటివి ఆయా సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి సంస్థలో ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం ఏర్పాటు చేసి దీనికో అధికారిని ప్రత్యేకంగా నియమించాలి. అనుసంధానమైన పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఆయా సంస్థలు రూపొందించాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పురోగతిని రోజూ సమీక్షించుకోవాలి. విద్యార్ధులు ఇంటర్న్‌షిప్ దినచర్యను డైరీలో నమోదు చేసుకోవాలి. పకడ్బందీగా మూల్యాంకన విధానం విద్యార్ధుల ఇంటర్న్‌షిప్‌పై పరిశ్రమలు, సైట్ విజిట్ చేసే ఫాకల్టీ సూపర్వైజర్ మూల్యాంకనం చేయాలి. చివరిగా సంస్థలో సెమినార్, వైవా ద్వారా ఇంటర్న్‌షిప్ తీరును మదింపు చేయాలి. విద్యార్థుల నైపుణ్యాలను గమనిస్తూ పరిశ్రమలు డైరీల్లో రిమార్కులు రాయాలి. ఇంటర్న్‌షిప్‌లకు అదనంగా 100 పాయింట్లు అకడమిక్ గ్రేడ్లకు అదనంగా ఇంటర్న్‌షిప్‌లకు ఏఐసీటీఈ 100 పాయింట్లను కేటాయించనుంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని రూపొందించింది. లేటరల్ ఎంట్రీ ద్వారా (డిప్లొమో అనంతరం) ఇంజనీరింగ్‌లో చేరే వారికి 75 పాయింట్లు నిర్దేశించారు. సామాజిక సేవ, తదితర కార్యక్రమాలను ఇంజనీరింగ్ విద్యార్థులు 300 నుంచి 400 గంటలు, డిప్లొమో విద్యార్థులు 200 నుంచి 250 గంటలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ క్రెడిట్ కార్యక్రమంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి ఇందుకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలి. స్థానిక స్కూళ్లలో విద్యార్థులకు సేవలందించడం, గ్రామాల ఆర్థిక వనరులు పెంపొందించేందుకు ప్రణాళికలు సూచించడం, మంచినీటి సదుపాయాలు, నిర్వహణను అభివృద్ధి పర్చడం, టూరిజమ్ ప్రమోషన్, సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సమస్యల పరిష్కారం, విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే నూతన ప్రయోగాలు, మహిళా సాధికారతకు తోడ్పాటు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడం తదితర అంశాలను చేపట్టాలి. మోడ్రన్ ఇంటర్న్‌షిప్ లక్ష్యాలు ఇవీ – ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెంపు – విశ్లేషణ, సమస్య పరిష్కారానికి వీలుగా డిజైన్/డెవలప్మెంట్ – సంక్లిష్ట సమస్యల శోధన – ఇంజనీర్లుగా సామాజిక బాధ్యత – పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత – నైతిక విలువలతో కూడిన ఇంజనీరింగ్ విద్య, నైపుణ్యాలు – వ్యక్తిగత, బృందంగా పనిచేసే సామర్థ్యాలు పెంపొందించడం – కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం – ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఫైనాన్స్ తదితర అంశాల్లో అవగాహన – లైఫ్ లాంగ్ లెర్నింగ్ విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమలకు ప్రయోజనాలివీ.. – సమస్యను పరిష్కరించగలిగే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగడం. – తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అవగాహన చేసుకోవడం. – ఇంటర్న్‌షిప్ అనుభవాలను తిరిగి తరగతి గదుల్లో చర్చించడం. – అకడమిక్ కెరీర్, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం. – పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది సైకాలజీ, అలవాట్లు, ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడం. – ఇంటర్న్‌షిప్ ద్వారా సామాజిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలు, ప్రభావాన్ని అంచనావేయడం. –నిపుణులైన అభ్యర్థులు పరిశ్రమలకు అందుబాటులోకి వస్తారు. –విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాల ద్వారా పరిజ్ఞానం పెరుగుతుంది. –విద్యాసంస్థలకు కూడా పరిశ్రమలతో అనుబంధం పెరుగుతుంది. –ఆయా సంస్థల క్రెడిబులిటీ, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది – సంస్థలోని సిబ్బందికి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ సమకూరుతుంది. – రిటెన్షన్‌కు అవకాశం లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. -
రాష్ట్రంలో 37 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 37 అనుమతిలేని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ ) తేల్చింది. 2018–19 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తం గా 236 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలే దని వెల్లడించింది. వాటి పరిస్థితిపై ఈ నెల 4 లోగా నివేదిక అందజేయాలని రాష్ట్రాలకు లేఖ లు రాసింది. ఆ కాలేజీల్లో తరగతులు కొనసాగుతున్నట్లయితే మూసేయాలని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రంలో సగానికిపైగా నకిలీ కాలేజీలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో నివేదిక బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కాలేజీ వారీగా వివరాలు తెలుసుకోడానికి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చర్యలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చిన జేఎన్టీయూ, ఉస్మాని యా, కాకతీయ యూనివర్సిటీల నుంచి సమా చారం క్రోడీకరిస్తున్నారు. ఇటీవల ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టిన ప్రవేశాల క్యాంపు కార్యాల యం నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అనుమతుల వివరాలు ఇవ్వాలని కొన్ని డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలకు కూడా ఉన్నత విద్యా మండలి లేఖలు రాసింది. వాటి నుంచి వివరాలు రాగానే క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ పల్టీ
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆశలు, కలలు, ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయి. గత రెండు.. మూడేళ్లుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లా మొత్తంగా ఉన్న కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా, రెండు కళాశాలల్లో ‘0’ శాతం, మరో రెండు కళాశాలల్లో 4 శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరాల్లో భర్తీ కానీ సీట్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): ఒకప్పుడు విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో అయినా పర్వాలేదు సీటు దొరికితే చాలు అదృష్టంగా భావించే వారు. అప్పట్లో కళాశాలల యాజమాన్యం చెప్పిందే వేదం. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒక్క విద్యార్థి దొరికితే చాలు కళాశాలను నడుపుకుందామనే ధోరణిలో పలు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆయా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్ సమయంలో 106 మంది జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 56.56 శాతం భర్తీ ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ గత నెల 31తో ముగిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. కావలి ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రం 90.82 శాతం సీట్లు భర్తీ అయి ప్రథమ స్థానంలో, ఆ తర్వాత 88.62 శాతం భర్తీతో నారాయణ రెండో స్థానంలో నిలిచాయి. 87.04 శాతంతో శ్రీవెంకటేశ్వర మూడో స్థానం, 85.98 శాతంతో గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల నాలుగో స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,245 సీట్లు ఉన్నాయి. వాటిల్లో మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 3,538 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,707 సీట్లు మిగిలి పోయాయి. జిల్లాలో రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో జీరో శాతం అడ్మిషన్లు ఉండగా, మరో రెండు కళాశాలల్లో 4 శాతం లోపు అడ్మిషన్లు ఉండటం గమనార్హం. 20 శాతం లోపు 2 కళాశాలలో 50 శాతం లోపు 6 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్ ఇంజినిరింగ్‌లో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే సీఎస్ఈ, ఈఎస్ఈ బ్రాంచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ రెండు బ్రాంచ్‌ల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరవచ్చన్న భావనలో విద్యార్థులు ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన బ్రాంచ్‌లను పరిశీలిస్తే సీఎస్ఈలో 70.20 శాతం సీట్లు భర్తీ కాగా ఈసీఈలో 65.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.4 శాతం, ట్రిపుల్ ఈ లో 41.1 శాతం, మెకానికల్‌లో 50.2 శాతం, ఐటీ 34.5 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. మూత దిశగా కొన్ని కళాశాలలు ఇంజినీరింగ్‌లో ఆశించిన మేర విద్యార్థులు చేరక పోవడంతో కొన్ని కళాశాలలు మూత పడే దిశలో ఉన్నాయి. గత ఏడాది అనుభావాలను దృష్టితో ఈ ఏడాది సుమారు 2 వేలు సీట్లను వదులుకున్నారు. ప్రధానంగా జిల్లాలో చదివిన విద్యార్ధులు ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన చేయిస్తున్నారన్న ప్రచారం ఉంది. -
ఇంజనీరింగ్ ఫీజు.. అందినంత గుంజు
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థికి సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పోగా మిగతా మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. కాలేజీలో చేరేందుకు వెళ్లినపుడు మరో రూ. 16 వేలు చెల్లించాలని, అవి చెల్లిస్తేనే బస్ పాస్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. అంత ఫీజు ఎందుకని అడిగితే యూనివర్సిటీ ఫీజు రూ. 2,500, ఎన్బీఏ ఫీజు రూ. 3 వేలు, ప్లేస్మెంట్ ఫీజు రూ. 5 వేలు, లైబ్రరీ, ల్యాబ్ ఫీజు రూ. 5,500 అంటూ వివరించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ విద్యార్థి అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వివేక్ (పేరు మార్చాం) బీటెక్ చదువుతున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 75% హాజరు ఉండాలి. కానీ అనారోగ్యం వల్ల కాలేజీకి రాలేకపోయాడు. మొత్తంగా 65 శాతమే హాజరు ఉంది. హాజరు 65–75 శాతం మధ్య ఉంటే వర్సిటీ నిబంధనల ప్రకారం రూ. 300 వరకు మాత్ర మే కండోనేషన్ ఫీజు వసూలు చేయాలి. కానీ రూ. 10 వేలు చెల్లించాలని ఆ విద్యార్థికి యాజమాన్యం చెప్పింది. మరోసారి హాజరు తగ్గితే తమకు ఇష్టమైన చర్యలు చేపట్టొచ్చని బాండ్ పేపరుపై రాయించుకుంది. సాక్షి, హైదరాబాద్ : ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రంలోని అనేక కాలేజీలు ప్రత్యేక ఫీజుల దందాకు దిగాయి. రకరకాల కారణాలతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లకు తెరలేపాయి. కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థుల నుంచి పాత విద్యార్థుల వరకు భారీగా పిండుకుంటున్నాయి. రకరకాల ఫీజులంటూ.. కాలేజీల్లో ల్యాబ్, లైబ్రరీ తదితర ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఎందుకని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా చెల్లించాల్సిందేనని చెబుతున్నాయి. వాస్తవంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ ఫీజుల రూపంలో రూ. 5,500 (అందులో రూ. 1,000 రిఫండబుల్) తీసుకోవచ్చు. ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులో విద్యార్థి చేరితే మరో రూ. 3 వేలు వసూలు చేయొచ్చు. కానీ కాలేజీలు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి. ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులయితే అన్నీ కలిపి రూ. 20 వేల వరకు తీసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఎన్బీఏ గుర్తింపు పొందిన కోర్సులు లేని కాలేజీలూ ఆ ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయి. ల్యాబ్, లైబ్రరీకి రూ. 5,500 ఎందుకు? ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసిన ఫీజుల ప్రకారం.. ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్/రిజిస్ట్రేషన్/గుర్తింపు ఫీజు కింద (వన్‌టైమ్) రూ. 2 వేలు, విద్యార్థులకు స్పెషల్ సర్వీసుకు రూ. 1,000, కామన్ సర్వీసెస్‌కు రూ. 1,500, లైబ్రరీ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్), ల్యాబ్ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్) కలిపి మొత్తంగా రూ. 5,500కు మించి వసూలు చేయకూడదు. కానీ యాజమాన్యాలు మాత్రం ప్లేస్మెంట్ ఫీజు కింద రూ. 5 వేలు, లైబ్రరీ ఫీజుగా రూ. 5,500 చెల్లించాలని చెబుతున్నాయి. వాటికి అదనంగా యూనివర్సిటీ ఫీజు, ఎన్బీఏ ఫీజు అంటూ దండుకుంటున్నాయి. ప్లేస్మెంట్ ఫీజు తప్పనిసరా? కాలేజీలకు ఫీజులు నిర్ధారించినపుడు ప్లేస్మెంట్ ఫీజు కింద ఏటా రూ. 125 చొప్పున చెల్లించాలని ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిబంధనల్లో పేర్కొంది. ఆ ప్రకారం నాలుగేళ్లకు రూ. 600 మాత్రమే అవుతుంది. కానీ రూ. వేలల్లో చెల్లించాలని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్బీఏ గుర్తింపు కాలేజీలెన్ని? రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97 వేలు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు 50లోపే ఉన్నాయి. కానీ ఎన్బీఏ గుర్తింపు లేకున్నా కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. -
జూలైలో ఎంసెట్ రెండో విడత అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ రెండో విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫీజు చెల్లింపులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. వివరాలకు tseamcet.nic. inను సంప్రదించవచ్చు. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 67,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 52,621 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. అందులో 38,705 మంది విద్యార్థులు తమ సీట్లను కన్ఫామ్ చేసుకున్నారని వెల్లడించారు. షెడ్యూల్ వివరాలు.. - ఫీజు చెల్లింపులు: జూలై 6 నుంచి 8 వరకు - వెరిఫికేషన్: జూలై 7 నుంచి 8 వరకు - వెబ్ఆప్షన్లు: జూలై 7 నుంచి 10 వరకు - సీట్లు కేటాయింపు: జూలై 12న - ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 12 నుంచి 14 వరకు - కాలేజీలో రిపోర్టు చేయాల్సింది:జూలై 13 నుంచి 15 వరకు - తరగతులు ప్రారంభం: జూలై 16 నుంచి -
పీజీఈసెట్‌లో 89 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్)లో 89.62 శాతం మంది అర్హత సాధించారు. మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్ష రాసేందుకు 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 22,461 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 20,131 మంది (89.62 శాతం) అర్హత సాధించారు. దరఖాస్తు చేసిన వారిలో బాలికలు 11,223 మంది, బాలురు 11,238 మంది ఉన్నారు. 17 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ రాత పరీక్షలు జరిగాయని, ఇందులో 16 కోర్సులు ఇంజనీరింగ్, ఒకటి ఎం.ఫార్మసీ కోర్సు ఉందని పాపిరెడ్డి అన్నారు. ఓయూ వీసీ, పీజీఈసెట్ చైర్మన్ రామచంద్రం మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో 168 ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,374 సీట్లు ఉన్నాయని, వాటిలో 7,523 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మైనింగ్ కోర్సును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎంటెక్ మైనింగ్‌లో 18 సీట్లుంటాయన్నారు. తగ్గుతున్న విద్యార్థులు.. ఈ విద్యా సంవత్సరం పీజీ ఇంజనీరింగ్ సీట్లు తగ్గే అవకాశం ఉందని, కోర్సును శ్రద్ధగా చదవాలనుకునే విద్యార్థులే చేరుతున్నారని పాపిరెడ్డి వివరించారు. నిరంతర తనిఖీలు, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, పరీక్షలు రాయాలంటే హాజరు శాతం తప్పనిసరి చేయడం వంటి కారణాలతో పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఏటా తగ్గుతోందన్నారు. 2015 విద్యా సంంవత్సరంలో 48,992 మంది దరఖాస్తు చేసుకోగా, 2016 విద్యా సంవత్సరంలో 44,058 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఇక 2017 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 37,423 మంది దరఖాస్తు చేసుకున్నారని, 2018 విద్యా సంవత్సరంలో 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. భవిష్యత్తులో సివిల్ ఇంజనీరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పాపిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు, పీజీఈసెట్ కన్వీనర్ సమీనా ఫాతిమా, కో కన్వీనర్ రమేశ్‌బాబు, లాసెట్ కన్వీనర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్చ్.. ఇంజినీరింగ్
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా మారింది. ఎంసెట్‌లో ఆశించిన విధంగానే విద్యార్థులు అర్హత సాధించినా ఆ స్థాయిలో విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరలేదు. దీంతో యాజమాన్యాలు కలవరం చెందుతున్నాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఆయా కళాశాలల సీట్లు భర్తీని ఒకసారి పరిశీలిస్తే కేవలం మూడు కళాశాలల్లో 80శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో 10 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడంపై చర్చనీయాంశమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో 55.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ దశలో సీట్లు భర్తీకాని కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు నారాయణ కళాశాల్లో 87.57శాతం, గీతాంజలి కళాశాల్లో 83.60 శాతం, .వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో 83.33 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో వరుసగా 9.52శాతం, 6.67శాతం, 6.35 శాతం, 2.72శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 50 శాతానికి పైగా ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, 10కి పైగా 50 శాతానికి లోపు సీట్ల భర్తీ అయిన ఎనిమిది కళాశాలలు ఉన్నాయి. దీంతో ఈ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎస్‌ఈకే డిమాండ్ జిల్లాలో 22 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీఎచ్, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. అయితే ఎక్కువగా సీఎస్ఈ కోర్సునే విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. జిల్లాలో ఆయా కళాశాలల్లో సీఎస్ఈ 1,617 సీట్లు ఉండగా 1,133 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 997కు గాను 389, ఈసీఈ 1,900 సీట్లకు 1,182, ఈఈఈలో 839కి 332 సీట్లు, ఎంఈసీఎచ్‌లో 808కి 392 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో 84 సీట్లకు 44 సీట్లు భర్తీ అయ్యాయి. అదే శాతంతో పోలిస్తే సీఎస్ఈలో 70.01శాతం, సివిల్ 39శాతం, ఈసీఈ 62.2 శాతం, ఈఈఈలో 39.6శాతం, ఎంఈసీఎచ్‌లో 48.5శాతం, ఐటీలో 52.4శాతం మంది విద్యార్థులు చేరారు. జిల్లాలోని ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో 6,245 సీట్లు ఉండగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,472 మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరారు. రెండో విడతపైనే ఆశలు జిల్లాలోని ఎక్కువ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు రెండో విడత కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ జిల్లాలో మెజార్టీ కళాశాలల యాజమాన్యాలను నిరాశపెట్టాయి. రెండో విడత ఎంసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ప్రకటించలేదు. రెండో విడతలో కూడా సీట్లు భర్తీ కాకపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఆయా కళాశాలల యాజమాన్యలు ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు, నిష్ణాతులైన అధ్యాపకులు, సరిపడా కంప్యూటర్ ల్యాబ్‌లు తదితరవి లేక పోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. జిల్లా నుంచి ప్రతి ఏటా 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లోనే బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎంటెక్, పీహెచ్డీ చేసిన వారితో బోధన చెల్లించాలంటే లక్షల్లో వేతనం చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బీటెక్ పూర్తి చేసిన వారితోనే పబ్బం గడుపుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో పాటు జిల్లాలోని కళాశాలల్లో చదివితే ప్లేస్మెంట్ ఉండదని ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. -
మెరిట్‌కు పాతర.. సీట్ల జాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్డగోలు దందా సాగుతోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లు అంగడి సరుకులయ్యాయి. కొన్ని కాలేజీలు మెరిట్‌కు పాతరేసి సీట్లను బహిరంగంగా అమ్ముకుంటున్నాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. మెరిట్ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్ రాయనివారికి కూడా సీట్లను అమ్మేసుకున్నాయి. 2017–18 విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో లీలలివీ! హైదరాబాద్ శివారులోని టాప్–3 కాలేజీల్లో 663 సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే దాదాపు 490కి పైగా సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సీటుకు సగటున రూ.10 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు కోట్లు గడించినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. టాప్ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా సాగిందంటే మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. వాటిని పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా.. గండిపేట ప్రాంతంలోని ఓ టాప్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో 285 సీట్లుంటే.. అందులో 152 సీట్లను ర్యాంకులు లేని వారికే కేటాయించారు. అందులో 93 మందికి ఎన్నారై కోటాలో, మిగతా 59 మందికి మేనేజ్మెంట్ కోటాలో సీట్లను కేటాయించారు. నిబంధనల ప్రకారం ఒక కాలేజీలోని 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ప్రవేశాల కమిటీ, మరో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్లు భర్తీ చేస్తాయి. అందులో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఎన్నారై కోటాలో 93 సీట్లను మాత్రమే భర్తీ చేసి, మేనేజ్మెంట్ కోటాలో 192 సీట్లను భర్తీ చేశారు. ఈ 192 సీట్లలోనూ 59 మంది జేఈఈ కానీ, ఎంసెట్ ర్యాంకుగానీ లేనివారే కావడం గమనార్హం. షేక్‌పేట ప్రాంతంలోని మరో కాలేజీలో 198 సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే అందులో 130 సీట్లను 20 వేలకు పైగా ర్యాంకు వచ్చిన వారికి కేటాయించారు. ఇందులో 50 వేల నుంచి 94 వేల వరకు ర్యాంకు వచ్చిన వారే 40 మంది వరకు ఉన్నారు. ఇక ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోని మరో కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవే కాదు బయటకురాని మిగతా కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నాయి. వారికెలా సీట్లు వచ్చాయి? రాష్ట్రంలోనే టాప్ కాలేజీలుగా పేర్కొనే వాటిల్లో జేఈఈ, ఎంసెట్ లేకుండా సీట్లు రావడం సాధ్యమేనా అంటే సాంకేతిక విద్యాశాఖ అధికారులు అసాధ్యం అని చెబుతున్నారు. టాప్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం పోటీపడే వారిలో 10 వేల ర్యాంకు పైనున్న వారంతా ఉంటారు. 10 వేల ర్యాంకులోపు వారికి ఏదో ఒక మంచి కాలేజీలోనే సీట్లు వస్తాయి. పైగా 10 వేల ర్యాంకు వరకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది. కాబట్టి వారంతా కన్వీనర్ కోటాలోనే ఏదో ఒక మంచి కాలేజీలో చేరిపోతారు. మరీ టాప్ కాలేజీలోనే సీటు కావాలనుకునే వారు మాత్రమే డొనేషన్ చెల్లించి అయినా కోరుకున్న మేనేజ్మెంట్ కోటాలో చేరతారు. నిజానికి మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా ఫీజు సమానమే. కానీ ఏ ఒక్క టాప్ కాలేజీ కూడా ఆ కామన్ ఫీజుకు సీట్లు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. అడ్డగోలు డొనేషన్లతో సీట్లను అమ్ముకోవడం వల్లే టాప్ కాలేజీల్లో 20 వేల నుంచి లక్షకు పైగా ర్యాంకులు ఉన్న వారికి కూడా సీట్లు వస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ర్యాంకుతో పనేముంది? గండిపేట, షేక్‌పేట, ఇబ్రహీంబాగ్ ప్రాంతాల్లోని ఆ టాప్–3 కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో 663 సీట్లను భర్తీ చేస్తే.. అందులో ఎంసెట్ ర్యాంకుగానీ, జేఈఈ ర్యాంకుగానీ లేని 167 మందికి ఇంజనీరింగ్ సీట్లను కేటాయించాయి. 20 వేలలోపు ర్యాం కుతో సీట్లు పొందిన విద్యార్థులు కేవలం 170 మందే ఉన్నారు. 50 వేల ర్యాంకు నుంచి లక్షకు పైగా ర్యాంకు వచ్చిన వారు 85 మంది విద్యార్థులున్నారు. 21 వేల నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన మరో 241 మంది విద్యార్థులు ఈ టాప్ కాలేజీల్లో సీట్లు పొందినట్లు బయటపడింది. ఇవేకాదు ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, బాచుపల్లిలోని టాప్ కాలేజీలతోపాటు నగర శివారుల్లోని మరో 80కి పైగా కాలేజీల్లో కూడా ఇదే దందా సాగుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
‘ఇంజనీరింగ్’ వసూళ్లు...!
శ్రీధర్ ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. తన కుమారుడికి హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్య కోటా సీటు కోసం వెళితే.. ఏకంగా రూ.7 లక్షలు చెప్పారు. ప్రభుత్వోద్యోగి అయిన రవీందర్ కుమార్తెకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. దీంతో ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీకి వెళితే.. కంప్యూటర్ సైన్స్ యాజమాన్య కోటా సీటు కోసం రూ.15 లక్షలు అడిగారు. మంచి కాలేజీ కదా అని.. రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించి సీటు కన్ఫర్మ్ చేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజ నీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కూడా ప్రారంభం కాకముందే కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను అమ్మేసు కుంటున్నాయి. భర్తీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. ప్రముఖ కాలేజీలైతే రేట్లను మరింతగా పెంచేశాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఎలాగైనా మంచి కాలేజీల్లో చదివించాలన్న ఉద్దేశంతో అప్పులు చేసైనా అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. కాలేజీని బట్టి వసూళ్లు.. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం సొంతంగా భర్తీ చేసుకునే సీట్లుపోగా.. 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,055 సీట్లు కాకుండా) సీట్ల (70 శాతం)ను భర్తీ చేయనుండగా... యాజమాన్య కోటా (15 శాతం), ఎన్నారై/ఎన్ఆర్ స్పాన్సర్డ్ (15 శాతం) కోటాల కింద 26,389 సీట్ల (30 శాతం)ను భర్తీ చేస్తారు. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరే విద్యార్థులు ఎక్కువగా పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు. దీంతో పలు కాలేజీలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న చాలా కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా వసూళ్ల దందాకు దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.10 లక్షల వరకు డొనేషన్ డిమాండ్ చేస్తుండగా.. టాప్ కాలేజీలు రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఐటీ, ఈసీఈ కోర్సులకు కాలేజీని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. ఈఈఈ, సివిల్తోపాటు ఇతర బ్రాంచీలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెరిట్‌కు స్థానమేదీ? యాజమాన్య కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల మెరిట్ ఆధారంగా.. మిగతా 15 శాతాన్ని ఎన్నారైలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల మెరిట్ సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇదేదీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్ల కోసం కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో పెట్టాలి. ఉన్నత విద్యా మండలికూడా ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి.. ఆయా కాలేజీలకు పంపాలి. మొత్తంగా మెరిట్ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యా మండలిగానీ, సాంకేతిక విద్యాశాఖగానీ దీనిని పట్టించుకోకపోతుండటంతో.. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. గతేడాది కొన్ని టాప్ కాలేజీల్లో ఏకంగా 80వేలకు పైన ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీట్లివ్వడమే దీనికి నిదర్శనం. ఆ ‘ఇద్దరి’తో పెరిగిన రేట్లు! ఏఐసీటీఈ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన 100కుపైగా కాలేజీలకు తొలుత అనుమతి నిరాకరించింది. వాటి యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో.. ఏఐసీటీఈతో మాట్లాడి అనుమతులు ఇప్పించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి, ఓ మంత్రి పీఏ తాము చెప్పిన వారికి యాజమాన్య కోటా సీట్లు ఇవ్వాలని ఆయా కాలేజీలతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో వారు చెప్పిన మేరకు డొనేషన్ లేకుండా 10 సీట్లు ఇవ్వాల్సి వస్తోందని.. అందువల్లే ఈసారి డొనేషన్లను పెంచాల్సి వచ్చిందని, లేకుంటే కన్వీనర్ కోటా ఫీజుతో కాలేజీలు ఎలా నడపాలంటూ కాలేజీలు ఎదురు ప్రశ్నిస్తున్నాయని అధికారులే చెబుతుండటం గమనార్హం. -
ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ షెడ్యూలు ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఈనెల 24న https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 2017లో ఏ ర్యాంకు వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయో తెలుసుకునేందుకు, తల్లిదండ్రులు విద్యార్థుల అంచనా కోసం సంబంధిత వివరాలను www.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలతో పాటు కాలేజీల వారీగా ఉన్న సీట్ల వివరాలను ఈనెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీబీఎస్ఈ విద్యార్థులకు 25 తర్వాతే ర్యాంకులు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ స్కూళ్లలో 12వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఈ నెల 25 తర్వాతే ఇంజనీరింగ్ ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వారికి ఈ నెల 19న ఎంసెట్ ర్యాంకులు ప్రకటించట్లేదని తెలిపింది. వారి ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఫలితాలొచ్చాక 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంసెట్ కమిటీకి తమ మార్కుల మెమోలు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత వారి మార్కులకు వెయిటేజీ ఇచ్చి, జేఎన్టీయూ ర్యాంకు ఖరారు చేస్తుంది. వారి ర్యాంకులు ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్ ప్రవేశాలను మూడు దశల్లో చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు రెండు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక విద్యా శాఖ ఈసారి మూడో దశను కూడా నిర్వహించనుంది. జేఈఈ ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు మూడో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్‌ను కూడా ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించనుంది. విద్యార్థులకు సీట్లు వచ్చిన కాలేజీల్లోనే బ్రాంచీ మార్చుకునే అవకాశాన్ని కల్పించనుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా ఆప్షన్లకు అవకాశం కల్పించి సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు కోరుకునే బ్రాంచీల్లో సీట్లు ఉంటే వాటిని కేటాయించనుంది. గతంలో కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఉన్నా ఆ ప్రక్రియను కాలేజీలే చేసేవి. అయితే అలా బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది కాదు. ప్రవేశాల కౌన్సెలింగ్ ఫీజు ఈసారి స్వల్పంగా పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ. 500 ఉంటే ఈసారి రూ.600 చేసింది. ఇతర విద్యార్థులకు గతేడాది రూ.1000 ఉంటే ఈసారి రూ.1200కు పెంచింది. ఇదీ ప్రవేశాల షెడ్యూలు 25–5–2018 నుంచి 2–6–2018 వరకు: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు 28–5–2018 నుంచి 3–6–2018 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 28–5–2018 నుంచి 5–6–2018 వరకు: వెబ్ ఆప్షన్లకు అవకాశం 5–6–2018: వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి 8–6–2018: మొదటి దశ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 8–6–2018 నుంచి 12–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ రిపోర్టింగ్ -
బంపర్ ఆఫర్..!
ప్రకాశం, కందుకూరు రూరల్: రాను రాను ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. దీంతో అడ్మిషన్లు చేసేందుకు కళాశాలలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ పాస్ అయి, ఎంసెట్ రాసిన విద్యార్థులను మా కళాశాలలో చేరండని ఫోన్లు ద్వారా, నేరుగా ఇళ్లకు వెళ్లి అడుగుతున్నారు. కళాశాలలో చేర్పించే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తోడేస్తున్నారు. అయినా అడ్మిషన్లు సరిగా కాకపోవడంతో నేరుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటర్లో ఎన్ని సబ్జెక్టులు పోయినా సరే పరీక్ష సెంటర్ చెప్పండి మేము పాస్ చేయిస్తాం. అయితే మా కళాశాలలో చేర్పించండని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కళాశాలల నుంచి వచ్చే పీఆర్వోలు, ఆయా కళాశాలల అధ్యాపకులు ఇలాంటి ఆఫర్లు ఇస్తుండడంతో తల్లిదండ్రులు నోరెళ్ల పెడుతున్నారు. ఇంటర్ పాస్ అయిన వారిని మేము పాస్ చేయిస్తామని ఇంజినీరింగ్ కళాశాలల వారు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ అడ్మిషన్ల కోసం నగదు కూడా కట్టించుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇంజినీరింగ్ కళాశాలల వారు ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లేనని అర్థమవుతోంది. ఫెయిల్ అయినా ఇంటర్ విద్యార్థుల పరీక్ష సెంటర్లను ఇంజినీరింగ్ కళాశాలల వారు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంజినీరింగ్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫోన్ నంబర్లను ఆయా జూనియర్ కళాశాలల నుంచి సేకరించి నేరుగా ఫోన్లు చేస్తున్నారు. మా కళాశాలలో ఈ కోర్సులు ఉన్నాయి... ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఫీజులు అవసరం లేదు... స్కాలర్ షిప్ వస్తుంది అన్నీ కళాశాల వారే చూసుకుంటారని ఫోన్లు చేస్తున్నారు. ఈ ఫోన్ల తాకిడికి తల్లిదండ్రులు తట్టుకోలేక ఫోన్లు స్విచ్‌లు ఆఫ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫోన్లే కాకుండా మెసేజ్‌లు కూడా రోజుకు ఇరవై.. ముప్పై వస్తున్నాయి. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నత విద్యామం డలి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని జేఎన్టీయూను ఆదేశించింది. అనేక కాలేజీల్లో పనిచేయని కంప్యూటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు, పటిష్టమైన నెట్వర్క్ ఉండేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణ యానికి వచ్చింది. ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వ హించడానికి కాలేజీల్లో ల్యాబ్‌లను పరిశీలించగా లోపాలు బయట పడ్డాయి. చాలా కాలేజీల్లో ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సరిపడ సామర్థ్యం లేనట్టు తేలింది. ఓ వైపు దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంటే రాష్ట్రంలోని కాలేజీ ల్యాబ్‌ల్లో లోపాలు ఉండటం సరికాదన్న భావనకు మండలి వచ్చింది. ల్యాబ్‌లు పక్కాగా ఉండాలి.. 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు పక్కాగా ఉండాలని, యాజమాన్యాలు పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూడాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో లోపాలపై ప్రభుత్వం, జేఎన్టీయూ, తామూ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితం గానే ప్రస్తుతం లోపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్లు, నెట్వర్క్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు కేవలం 6 నుంచి 7వేల మంది విద్యార్థులకే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేదని, ప్రస్తుతం అది 28 వేలకు చేరిందన్నారు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
238 ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ నోటీసులు
-
నేడో రేపో ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు బుధ లేదా గురువారాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు రానున్నాయి. మంగళవారమే అనుమతులు రావాల్సి ఉన్నా సాధ్యపడలేదు. అలాగే 238 ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల ల్యాండ్ కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల గడువిచ్చింది. రాష్ట్రంలోని అనేక కాలేజీలు సరైన పత్రాలు లేకుండానే కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో కాలేజీల వారీగా పత్రాల పరిశీలనను ఏఐసీటీఈ చేపట్టింది. గ్రామ పంచాయతీ అనుమతితో నడుస్తున్నవి, భవన నిర్మాణాల అనుమతులు లేనివి, చెరువులు, సీలింగ్ భూముల్లో, అటవీ భూముల్లో నిర్మించిన కాలేజీలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. సరైన పత్రాలుంటేనే అనుమతులిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఏఐసీటీఈతో ప్రభుత్వం చర్చించిన తర్వాత పత్రాలు అందజేసేందుకు యాజమాన్యాలకు రెండేళ్ల గడువిచ్చింది. -
మే 7వ తేదీలోగా ఇంజనీరింగ్ కాలేజీల జాబితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈసారి మే నెలలోనే ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా జూన్‌లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసి జూలై ఒకటి నుంచే తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. మొత్తానికి మే నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను మే 7వ తేదీలోగా అందజేయాలని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సూచించారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలలో తనిఖీలు, అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు యూనివర్సిటీలు చర్యలు చేపట్టాయి. ఇక ఎక్కువ కాలేజీలు కలిగిన జేఎన్టీయూ మే 5వ తేదీనాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనుబంధ గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) నేతృత్వంలో తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఆ తనిఖీలు పూర్తి కావచ్చాయి. వాటి ఆధారంగా కాలేజీలకు వసతులు, సదుపాయాలు, ఫ్యాకల్టీని అనుబంధ గుర్తింపును ఖరారు చేయనున్నారు. అయితే గతంలో కంటే ఈసారి కాలేజీల్లో లోపాల సంఖ్య తగ్గినట్లు జేఎన్టీయూ ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ వంటి అంశాల్లో అనేక లోపాలు ఉండేవని, ఈసారి అలాంటి లోపాలు ఉన్న కాలేజీల సంఖ్య భారీగా తగ్గిందని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం చిన్నచిన్న లోపాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాల్లోనూ మార్పువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 11 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకోగా, మరో 8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాంచీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. దీంతో వాటిల్లో సీట్లు భారీగా తగ్గనున్నాయి. -
లక్షన్నర మందికి ఫీజు కట్!
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి 1.5 లక్షల మంది విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రంలో 968 కాలేజీలు తమ గుర్తింపును రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్‌కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. 2 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవి 6,161 కాలేజీలే రాష్ట్రంలో 7,129 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. వాటిలో 16 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో 13.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తులు సమర్పించారు. ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించిన సంక్షేమ శాఖలు.. వాటిని పరిశీలించి పథకాలకు అర్హత ఉందో లేదో తేల్చాలి. దరఖాస్తుల పరిశీలనలో ముందుగా కాలేజీకి గుర్తింపు ఉందా లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తారు. సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ నుంచి గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తేనే ఆ కాలేజీల్లో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేస్తారు. ప్రతి కాలేజీకి సంబంధిత బోర్డు/యూనివర్సిటీ గుర్తింపు ఉన్నప్పటికీ... ఏటా ఆ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పలు కాలేజీలు ఈ గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అయోమయం నెలకొంది. రాష్ట్రంలో 7,129 కాలేజీలు ఉండగా.. వాటిలో 2017–18 విద్యా సంవత్సరానికి 6,161 కాలేజీలు మాత్రమే గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 5,812 కాలేజీల గుర్తింపు రెన్యువల్ అయింది. మరో 1,317 కాలేజీల రెన్యువల్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇంకా 968 కాలేజీలు గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తులు సమర్పించలేదు. దీంతో ఈ–పాస్ వెబ్సైట్లోనూ ఆ కాలేజీ వివరాలు అప్డేట్ కాలేదు. దీంతో ఆ కాలేజీల్లో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన సందిగ్ధంలో పడింది. అవకాశం చేజారుతోంది.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గతనెల రెండో వారంలో ముగిసింది. దాదాపు ఆర్నెళ్లపాటు సాగిన ఈ ప్రక్రియతో 98 శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా గుర్తింపు రెన్యువల్ చేసుకున్న కాలేజీల వివరాలే ఈపాస్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యేవి. రెన్యువల్ చేయించని కాలేజీలు వెబ్సైట్లో లేకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు సైతం చేసుకునే అవకాశం లేకపోయేది. విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కాలేజీల వివరాలను వెబ్సైట్లో అనుమతిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. కానీ కాలేజీ గుర్తింపు రెన్యువల్ అయ్యాకే దరఖాస్తుల పరిశీలన, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ జారీ చేసేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ముగిసినా చాలా కాలేజీలు గుర్తింపును అప్డేట్ చేసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కాలేజీలు: 7,129 గుర్తింపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవి: 6,161 ఇప్పటివరకు రెన్యువల్ పత్రాలు పొందినవి: 5,812 రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పించనివి: 968 రెన్యువల్ పెండింగ్‌లో ఉన్నవి: 1,317 -
అరకొర వేతనాలు.. భద్రతలేని బతుకులు
ఎంటెక్ పూర్తి చేసిన ఆనంద్‌కుమార్ ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. కొంతకాలం వేతనాలు బాగానే ఇచ్చారు. కానీ ఏడెనిమిది నెలలగా జీతం రావడం లేదు. అదేమంటే ఫీజు బకాయిలు రావాల్సి ఉంది. వచ్చాక ఇస్తాం.. లేదంటే మీ ఇష్టం అని యాజమాన్యం తేల్చి చెబుతోంది. నల్లగొండలోని ఓ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌దీ ఇదే పరిస్థితి. హైదరాబాద్ శివారులోని కొద్దిగా పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిల్‌కుమార్ వేతనం నెలకు రూ.90 వేలుగా మాట్లాడుకున్నారు. యాజమాన్యం ఆయన ఖాతాలో మొత్తం వేతనం వేస్తున్నా.. అందులోంచి రూ.40 వేలు వెనక్కి తీసుకుంటోంది. వేరే కాలేజీలకు వెళితే ఈ మాత్రం వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేక అక్కడే కొనసాగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ..వీరిదే కాదు.. రాష్ట్రంలోని చాలా వృత్తి విద్య కాలేజీల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కాలేజీలు కొన్ని అయితే... సరిగా వేతనాలు చెల్లించని యాజమాన్యాలు మరికొన్ని. మొ త్తంగా కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కష్టాలు వచ్చిపడ్డాయి. ఇలా 2 లక్షల మంది వరకు సిబ్బంది ఇబ్బం ది పడుతున్నట్లు అంచనా. ఇక అఖిల భార త సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కొత్తగా తెచ్చిన నిబంధనతో వేలాది మంది ఫ్యాకల్టీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ‘ఫీజు’నిధులు అందక.. రాష్ట్రంలో మూడు వేల వరకు సాంకేతిక, వృత్తి విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండగా.. అందులో రెండు వేలకుపైగా ప్రైవేటు కాలేజీలే. ఇందులో సుమారు 1,100 కాలేజీల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వడం లేదని అంచనా. నాలుగైదు నెలల నుంచి 10 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లోనే ఉంటున్నట్లు ఫ్యాకల్టీ అసోసియేషన్ కూడా చెబుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన ప్రతిసారి.. యాజమాన్యాలు బోధనా సిబ్బందికి సగం, బోధనేతర సిబ్బందికి నాలుగో వంతు బకాయిలు మాత్రమే చెల్లిస్తున్నాయని, దాంతో తాము ఇబ్బంది పడాల్సివస్తోందని పేర్కొంటోంది. మరోవైపు ప్రభుత్వం సకాలంలో ఫీజు నిధులు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి కాలేజీలను నడపాల్సి వస్తోందని, వడ్డీ భారంగా మారుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో మంచి ఫ్యాకల్టీని కోల్పోవాల్సి వస్తోందని అంటున్నాయి. ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి ఇప్పటికే అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో.. బోధన సిబ్బందికి మరో శరాఘాతం తగిలింది. ఏఐసీటీఈ కాలేజీల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1ః15 నుంచి 1ః20కి పెంచడంతో బోధనా సిబ్బంది అవసరం తగ్గింది. దాంతో బోధనా సిబ్బందిని తగ్గించుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఫ్యాకల్టీకి నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో దాదాపు 5 వేల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జీతాల్లేకుండా బతికేదెలా? ‘‘వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా బతకాలి. ఫీజు బకాయిలు ఆలస్యంగా వస్తాయని తెలుసు. అయినా జీతాల చెల్లింపునకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేయడం లేదు..’’ – కె.రవిప్రకాశ్, ఫ్యాకల్టీ పాత విధానం కొనసాగించాలి ‘‘ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తిని తిరిగి 1ః15కు తగ్గించాలి. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిపై పోరాటం చేస్తాం..’’ – బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు -
11 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న, విద్యార్థులు లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 11 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. 2018–19 విద్యా సంవత్సరంలో తమకు అనుబంధ గుర్తింపు అవసరం లేదని, తమ కాలేజీలు మూసివేసుకుంటామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యాజమాన్యాల నుంచి జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 266 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 11 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, ఫ్యాకల్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు జేఎన్టీయూహెచ్ సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) తనిఖీల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కాలేజీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. ఈసారి కొత్త కోర్సులను ఇచ్చేది లేదని ఏఐసీటీఈతోపాటు జేఎన్టీయూహెచ్ కూడా చెబుతుండటం, గడిచిన మూడేళ్లలో 25 శాతం లోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గనుంది. బ్రాంచీల రద్దుకు మరిన్ని కాలేజీలు.. 8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను మూసి వేసుకుంటామని వెల్లడించాయి. దీంతో భారీ గా సీట్లు రద్దు కానున్నాయి. అలాగే 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో 15 వేల వరకు ఎంటెక్‌లో సీట్లు ఉండగా గతేడాది వాటిని జేఎన్టీయూహెచ్ 5,400కు పరిమితం చేసింది. ఈసారి 77 బ్రాంచీల రద్దుతో ఎంటెక్ సీట్ల సంఖ్య 3 వేల లోపే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాం చీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. 25 శాతం లోపు ప్రవేశాలు.. జేఎన్టీయూహెచ్ పరిధిలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. 30 శాతం ప్రవేశాలు ఉన్న కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, వాటిని మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోగా, 25 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీలను మూసివేయాలని జేఎన్టీయూహెచ్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018–19 విద్యా సంవత్సరపు ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు సోమవారం విడుదల చేశారు. బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరేపటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ బీఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా రూ. 500(ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి) రుసుము చెల్లించి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ విధానంలో ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటికీ హాజరుకాదల్చుకున్న వారు రూ. 1,000 చెల్లించాలి. అపరాధ రుసుము లేకుండా మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. అపరాధ రుసుము రూ. 500తో ఏప్రిల్ 6 వరకు, రూ. 1,000తో ఏప్రిల్ 11 వరకు, రూ. 5 వేలతో ఏప్రిల్ 16 వరకు, రూ. 10వేలతో ఏప్రిల్ 21వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు పరీక్షలు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. అగ్రికల్చర్ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగనుంది. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులో మూడు రీజనల్ సెంటర్లకు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్ ఇవ్వాలి. ఏప్రిల్ 18 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
తెలంగాణలో భారీగా ఇంజనీరింగ్ సీట్ల తగ్గింపు
-
అన్నీ ఉన్నాయి.. అధ్యాపకులు తప్ప
‘పేరుకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అర్హులైన అధ్యాపకులే లేరు. 12,333 మంది పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరమైతే ప్రస్తుతం కేవలం 1,500 మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందేదెలా? అందుకే ఐదేళ్ల వరకు మాకు కొత్త సీట్లు వద్దు’ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పరిస్థితులపై ఏఐసీటీఈకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొన్న అంశాలివీ. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే సీట్లకు కోత విధిస్తున్న ప్రభుత్వం ఇకపై కొత్త సీట్లను మంజూరు చేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి స్పష్టం చేసింది. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే కాకుండా ప్రొఫెసర్ల కొరతతో సబ్జెక్టు పరమైన నాలెడ్జి విద్యార్థులకు అందడం లేదని వివరించింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విద్యార్థుల సంఖ్య 18 శాతానికి మించడం లేదని వివిధ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లోని లోపాలను పేర్కొనడంతోపాటు భవిష్యత్ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఏఐసీటీఈ సగానికి..జేఎన్టీయూ మొత్తానికే కోత ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించే చర్యల్లో భాగంగా కాలేజీలను కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు గడిచిన మూడేళ్లలో వరుసగా 30 శాతం లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల ఇంటేక్‌లో సగం సీట్లకు కోత విధిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లోనూ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. జేఎన్టీయూ మాత్రం అనుబంధ గుర్తింపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. వరుసగా మూడేళ్లలో 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. గత మూడేళ్లను కాకుండా వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే చర్యలు.. 2017–18 విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీలు అనుమతి ఇవ్వలేదు. అన్ని సీట్లను భర్తీ చేసేందుకు ఓకే చెప్పలేదు. 28,961 సీట్లకు కోత పెట్టాయి. మరోవైపు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలోనూ 29,367 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 20 మందికో అధ్యాపకుడు ఉండాలి.. 2017–18 నిబంధనల ప్రకారం ప్రతి 15 మందికి ఒక అధ్యాపకుడు అవసరం. తాజాగా ఏఐసీటీఈ ఆ నిబంధనలో మార్పు చేసింది. 2018–19 నిబంధనల ప్రకారం ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉంటే సరిపోతుంది. మొత్తం విద్యార్థులకు అనుగుణంగా అధ్యాపకులు 1:2:6 రేషియోలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. 2017–18 లెక్కలు ఇలా పీహెచ్డీ అర్హతతో ఉండాల్సిన అధ్యాపకులు12,333 మంది ప్రస్తుతం పీహెచ్డీ అర్హతతో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 1,500 మంది 2020 నాటికి అయ్యే విద్యార్థుల సంఖ్య 5 లక్షలపైనే అందుకు అవసరమైన అధ్యాపకులు 34 వేల మంది ఎంటెక్ అర్హతతో అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 22,667 మంది పీహెచ్డీ అర్హత అవసరమైన మిగతా అధ్యాపకులు 11,333 మంది అవసరమైన ప్రొఫెసర్లు 3,778 మంది అవసరమైన అసోసియేట్ ప్రొఫెసర్లు 7,555 మంది -
2019లో ఒకే ఇంజనీరింగ్ పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే అంశం పై చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. జేఈఈ మెయిన్ ద్వారానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలతోపాటు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్ల భర్తీకీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా ఓకే పరీక్షపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొంది. మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిశా ఇప్పటికే జేఈఈ మెయిన్ మెరిట్ ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తుండగా.. తాజాగా కేరళ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ ప్రవేశాలకు అంగీకారం తెలిపింది. మిగతా రాష్ట్రాలు త్వరలోనే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలోనే(2018–19) ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రం గతేడాది భావించింది. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు అవసరమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పాటులో జాప్యం కావడంతో వాయిదా వేసింది. పైగా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశం కావడం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందునా వచ్చే ఏడాదిలో అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించే బాధ్యతను ఏఐసీటీఈకి అప్పగించింది. దీంతో ఏఐసీటీఈ లేఖలు రాసింది. ఎన్టీఏ ఆధ్వర్యంలోనే.. జాతీయ స్థాయిలో వివిధ పరీక్షలను ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. అయితే ఇతర విద్యా కార్యక్రమాలను కూడా చూస్తున్న సీబీఎస్ఈకి వాటి నిర్వహణ సమస్యగా మారుతుండటంతో కేంద్రం ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఎన్టీఏ ఏర్పాటుకు సంబంధించిన చర్యలపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్ఈ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ వంటి పరీక్షలను 2019 నుంచి ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను కూడా ఎన్టీఏ ద్వారానే నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. దీనిపై ఐఐటీ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతోంది. అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటి కోసమే జేఈఈ మెయిన్‌ను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. ఇక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను మాత్రం పలు రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షల ద్వారానే భర్తీ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా అదే చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్‌కు డిమాండ్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంసెట్ అవసరమే లేదన్న భావన ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అంశమే అప్రస్తుతం అవుతుందన్న భావన నెలకొంది. అయితే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని ఏఐసీటీఈకి తెలియజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
విద్యార్థుల ’సాఫ్ట్వేర్’ ఆశలు ఆవిరి
-
ఐటీ 'కల'కలం
సాక్షి, హైదరాబాద్ : ఎంతో ఆశతో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థుల ‘ఐటీ’ కలలు కల్లలవుతున్నాయి. చదువు పూర్తికాగానే ఉద్యోగం, మంచి వేతనం వస్తుందన్న ఆశలు కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు తగ్గించేయడం, కొన్ని సంస్థలు అసలు నియామకాల ఊసే ఎత్తకపోతుండటంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. గతేడాది దాకా క్యాంపస్ నియామకాల్లో పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఒరాకిల్, డెలాయిట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఒక్కో కాలేజీలో ఐదారుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి. ప్రముఖ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ అయితే ఈ ఏడాది దేశంలో ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం గమనార్హం. మరో అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం మేర నియామకాలు తగ్గించుకుంది. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు అదే దారిలో పయనిస్తున్నాయి. విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు ఇచ్చాయి. పాతిక కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు! ఐటీ కంపెనీలు ఏటా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ఉన్న సుమారు వంద కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు జరుపుతుంటాయి. కానీ ఈ ఏడాది కేవలం 25 కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కేవలం 15 కాలేజీలకే పరిమితంకాగా.. టీసీఎస్ 22 కాలేజీలు, విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు హైదరాబాద్‌లోని పది కాలేజీలతో సరిపెట్టాయి. ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయూ, సీబీఐటీ, వాసవి తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా నియామకాలు చేపట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీ.. ఈ ఏడాది వాటి జోలికే పోలేదు. కేవలం హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ నిట్లకు చెందిన పది మంది విద్యార్థులకు మత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. సీబీఐటీ, వాసవి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతులైన నలుగురైదుగురు విద్యార్థులను, అది కూడా ఇంటర్న్‌షిప్ కింద ఎంపిక చేసుకుంది. ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్ సంస్థ కూడా ఈసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి. ఆందోళనలో విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. కానీ ఐటీ కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుడటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు. సీబీఐటీలో గతేడాది 1,350 మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 750కి లోపేకావడం గమనార్హం. వాసవి, ఎంవీఎస్ఆర్, విజ్ఞానజ్యోతి, నారాయణమ్మ, శ్రీనిధి వంటి టాప్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నియామకాలు 60 శాతం మేర తగ్గాయి. గతేడాది హైదరాబాద్‌లో 40–50 కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ తదితర సంస్థలు ఈ ఏడాది కేవలం పది కాలేజీలకు పరిమితమయ్యాయి. ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన! వివిధ ఐటీ సంస్థలు ఈ ఏడాది దాదాపు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. వచ్చే ఆర్నెల్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్‌పెరీస్ ఐటీ–మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అటు సీనియర్ ఉద్యోగుల తొలగింపుతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన ప్రక్రియలో క్షీణత నమోదవుతున్నట్లు తేలింది. ఐటీ పరిశ్రమలోని ఈ మందగమనంతో.. స్టార్టప్‌లు, ఐటీ ఉత్పత్తులు, సర్వీస్ సంస్థలపై ప్రభావం పడుతుందని సర్వే నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలోని ఐటీ ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోకపోవడం ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతోంది. అదే నైపుణ్యమున్న ఉద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్ నైపుణ్యాలు కలిగిన వారికి 29 శాతం, బిగ్ డేటా అండ్ అనలిస్ట్‌లకు 22 శాతం, మెషీన్ లెర్నింగ్, మొబిలిటీలకు 12 శాతం చొప్పున, గ్లోబల్ కంటెంట్ సొల్యూషన్లలో నైపుణ్యం ఉన్న వారికి 10 శాతం మేర అదనంగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే... అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని ఎక్స్‌పెరీస్ సంస్థ అధ్యక్షుడు మన్మీత్సింగ్ పేర్కొన్నారు. ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచం ‘డిజిటల్ వరల్డ్’గా పరివర్తన చెందుతున్న దశలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యంత ఆవశ్యకమని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ ఏజీ రావు అభిప్రాయపడ్డారు. ‘నాస్కామ్’ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. ఆటోమేషనే ప్రధాన కారణం.. ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను సైతం ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దానికితోడు కోడింగ్ బాగా వచ్చిన వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులను మాత్రమే క్యాంపస్ నియామక పరీక్షలకు అనుమతిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ విద్యార్థులు కోడింగ్‌పై దృష్టి సారిస్తేనే మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు. – ఎన్ఎల్ఎన్ రెడ్డి, సీబీఐటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ హైదరాబాద్‌లో గత ఐదేళ్ల క్యాంపస్ నియామకాలు తీరు సంవత్సరం సంస్థలు కాలేజీలు ఉద్యోగాలు 2013 73 79 24,500 2014 69 82 26,300 2015 63 63 19,700 2016 71 55 21,200 2017 56 43 16,700 2018 17 51 3,800 (డిసెంబర్ నాటికి) -
'విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు'
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెకేట్ పిటిషన్ వేసినట్టు ఆయన చెప్పారు. ఈ అంశంపై అప్పీల్ కు వెళ్లడం గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాలేజీలు ఫీజులు పెంచాలంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే పెంచాలన్నారు. ఇప్పుడున్న రూ. లక్షా 13 వేల ఫీజును రూ. 2 లక్షలకు పెంచితే విద్యార్థులకు భారమవుతుందన్నారు. ఫీజుల పెంపుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కాలేజీలను కోరారు. -
ఇంజినీరింగ్ కళాశాలల వసూళ్ల దందా
పవన్ జేఎన్టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఎంసెట్‌లో ర్యాంకు రాగానే ఇంజినీరింగ్ కళాశాల వారు తమ కళాశాల ఆప్షన్ ఎంపిక చేసుకోమని చెప్పారు. లైబ్రరీ, ల్యాబ్, ఇతరత్రా అన్ని రకాల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని వాగ్దానం చేశారు. కళాశాలలో సీటు పొందిన మూడు నెలల తర్వాత ఫీజు మోత ప్రారంభించారు. బిల్డింగ్ ఫీజు, ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, సెమినార్ల ఫీజు అంటూ రకరకాల పేర్లతో అందినకాడికి దోచేస్తున్నారు. ఇలా పవన్ ఒక్కరే కాదు... జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని సింహభాగం అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిదీ ఇదే పరిస్థితి. జేఎన్టీయూ: ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీ ఇచ్చినట్టుగా... ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు ఎంసెట్ కౌన్సెలింగ్ ముందు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపుతారు. అలవికానీ హామీలు ఇస్తారు. వర్సిటీ నిర్ణయించిన కంటే ఒక్కరూపాయి అదనంగా తీసుకోబోమని నమ్మిస్తారు. తమ కళాశాలలో సకల సౌకర్యాలతో పాటు క్యాంపస్ ఇంటర్వూ్యలు భారీగా ఉంటాయంటూ వల వేస్తారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సీటు ఆప్షన్ ఇచ్చి.. సీటు దక్కిన తర్వాత ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ అసలు రూపం బయట పెడతాయి. ల్యాబ్ ఫీజు నుంచి వర్సిటీ ఫీజు, స్కాలర్షిప్ అప్లికేషన్ వరకు వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తాయి. ఇష్టం ఉన్నా.. లేకున్నా వారడిగినంత మొత్తం చెల్లించాల్సిందే. పోనీ అదనపు ఫీజులు కట్టలేక చదువుతున్న కళాశాలను వదిలి ..ఇతర కళాశాలకు మార్పు చేయించుకోవడానికి సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక అదే కళాశాలలోనే కోర్సు పూర్తి చేయాల్సి వస్తోంది. భరించలేనంత భారం ఉన్నత, సాంకేతిక విద్యలో నమోదు శాతం పెరగాలి. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్లే ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 35 వేల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. ఏఎఫ్ఆర్సీ( అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) కళాశాలల్లో కోర్సు ఫీజు మొత్తాన్ని పెంచింది. ఉదాహరణకు ఒక కళాశాలలో ఏడాదికి కోర్సు ఫీజు రూ. 50 వేలు అనుకుంటే, రూ.35 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ పోనూ .. తక్కిన 15 వేలు కట్టాల్సి ఉంది. ఈ మొత్తం కట్టడానికి తల్లిదండ్రులు ముందే సిద్ధమవుతారు. కానీ కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ నిర్ధారించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది తమకు తలకుమించిన భారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ లోపం ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజుల వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులపై ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాలు ఏ మేరకు కల్పించాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయడానికి ఫిర్యాదుల పెట్టే, ఈ– మెయిల్ లాంటి రహస్య సదుపాయాలు కల్పిస్తే.. విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం అధిక ఫీజుల వసూలుతు అడ్డుకట్ట వేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఇప్పటికే విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. నేరుగా ఫిర్యాదు చేయడానికి మెయిల్ ఐడీని ఇస్తాం.. విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ అనంతపురం -
ఇప్పుడో.. ఎప్పుడో!
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరలింపుపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముందుగా జూలైలో షిఫ్టు చేస్తామన్నారు.. తర్వాత దసరా అనంతరం ముహూర్తం ఖరారు చేశారు కానీ ఇంకా చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం అన్ని వసతులు ఉన్నా, తరగతుల తరలింపులో మాత్రం జాప్యం జరగుతోంది. ప్రస్తుతం మొదటి ఏడాది పీయూసీకి సంబంధించి మొదటి సెమిస్టర్ నిర్వహణకు సమయం దగ్గర పడింది. నవంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టర్ తరువాత ఇక్కడికి షిఫ్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెమిస్టర్ పరీక్ష నిర్వహణ తర్వాత డిసెంబర్లో తరగతులు షిప్టుంగ్ చేస్తారా? లేదా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి సెలవులు జనవరిలో ఉంటాయి. డిసెంబర్లో సెమిస్టర్ గ్యాప్ ఉంటుంది. షిఫ్టింగ్ సమయం ఈ రెండింటిలో ఒక సమయానికి ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి! అన్నీ సిద్ధం చేసినా.. ప్రస్తుతం మిత్రా ఇంజినీరింగ్ కళాశాలను ట్రిపుల్ ఐటీ అ«ధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెలకు రూ. 4 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ అధికారుల సూచనల మేరకు భవనాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం మొదటి ఏడాది 1000 మంది విద్యార్థులకు వసతి సిద్ధం చేశారు. ఇంటర్నెట్ ఏర్పాటు తప్ప మిగిలిన పనులన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం స్థానిక ట్రిపుల్ ఐటీ భవనాల్లో మహిళల క్యాంపస్, మిత్రా కళాశాలలో పురుషుల క్యాంపస్ నిర్వహించాలి. అయితే మొదటి ఏడాది తరగతులు ఇక్కడ ప్రారంభం కాలేదు. జూలైలో ఇక్కడకు షిఫ్టు చేస్తున్నట్లు చెప్పారు. మిత్రా కళాశాల సెప్టెంబర్ 16న నిర్ధారణ కమిటీ నిర్వహణకు అనుమతులిచ్చింది. దసరా సెలవుల అనంతరం ఇక్కడికి తరగతులు షిఫ్టు చేస్తున్నట్లు అధికారులు చెప్పా రు. అయితే అమలు కాలేదు. మిత్రా కళాశాల, ట్రిపుల్ ఐటీ భవనాలు రెండూ పూర్తయ్యా యి. కానీ తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు. ఈ రెండూ కీలకం.. మరోపక్క ఇక్కడికి తరగతులు షిఫ్టు చేయటం, వచ్చే విద్యా సంవత్సరం జూలై నాటికి రెండు వేల మందికి వసతి సౌకర్యం కల్పించడం కీలకం. ప్రారంభంలో నిర్మాణ పనులు ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం రాజీవ్ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగం పనులు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం 199.08 ఎకరాలు కేటాయించింది. మరోపక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ నుంచి 22.42 ఎకరాలు, రాజీవ్ స్వగృహ నుంచి 49.66 ఎకరాలు ట్రిపుల్ ఐటీకి అప్పగించారు. ఈ స్థానంలో ఆయా సంస్థలకు వేరే స్థలాలు అప్పగించాలి. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోపక్క ఎస్ఎం పురానికి చెందిన కొందరు తమకు ఈ ప్రాంతంలో గతంలో పట్టాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. షిఫ్టింగ్‌పై ప్రత్యేక దృష్టి ట్రిపుల్ ఐటీ షిఫ్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. త్వరలో ఇక్కడికి తరగతులు షిఫ్టు చేస్తాం. తరగతుల నిర్వహణకు ఇక్కడ పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తున్నాం. స్థా ని కంగా మహిళల క్యాంపస్, మిత్రా ఇంజినీరింగ్ క ళా శాలలో పురుషుల క్యాంపస్ నిర్వహిస్తాం. ఉన్నతా ధికారులకు నిరంతరం ఇక్కడి పరిస్థితి వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ హరశ్రీరాములు, డైరెక్టర్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ -
‘కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న 50 వేల మంది లెక్చరర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిం చి, కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల టీచర్స్ అసోసియేషన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇంజనీరింగ్ లెక్చరర్స్‌కు కళాశాలల యజమాన్యాలు అతి తక్కువ వేతనాలు చెల్లించి తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఏఐసీటీఈ ప్రకారం పర్మినెంట్ లెక్చరర్స్‌తో సమానంగా వేతనాలను చెల్లించాలని అన్నారు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాల విషయంలో అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా చేస్తున్న కళాశాల యాజమాన్యాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే టీచర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జేఎన్టీయూ నిర్వహించిన పరీక్షల వాల్యుయేషన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. -
కొత్త కాలేజీలకు అనుమతుల్లేవ్!
ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని ఏఐసీటీఈ ఆలోచనలు సాక్షి, హైదరాబాద్ : దేశంలో కొత్త ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుమతులపై నిషేధం విధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా కాలేజీలు సీట్లు ఉన్నందున, ఉన్న సీట్లలో సగం వరకు మిగిలిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే 30 శాతం లోపు ప్రవేశాలు ఉన్న బ్రాంచీలను, కాలేజీలను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్యాలు కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నందునా 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీటీఈ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలతో వేర్వేరుగా నిర్వహించిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్–2018పై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. -
800 ఇంజినీరింగ్ కాలేజీలు మూత?
►అడ్మిషన్లు లేకపోవడం ►మౌలిక వసతులు లేమి కారణాలు బెంగళూరు : వచ్చే విద్యా సంవత్సరం నుంచి 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసివేస్తున్నట్లు ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ తెలిపారు. ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవడం తదితర కారణాలతో అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏఐసీటీఈ నియమ నిబంధనలు పాటించలేక ప్రతి ఏడాది స్వచ్చందంగా 150 కాలేజీలు మూతపడుతున్నాయని ఆయన చెప్పారు. చాలా కాలేజీల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. 2014-15 నుంచి 2017-18 అకడమిక్ సంవత్సరం అనంతరం 410 కాలేజీలను మూసివేస్తున్నట్లు ఏఐసీటీఈ అధికారికంగా తన వెబ్సైట్లో ప్రకటించింది. వాటిలో 20 కాలేజీలు కర్ణాటకలో ఉండగా, మిగతావి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఉన్నాయి. -
30 శాతం సీట్లు నిండకుంటే గుర్తింపు రద్దే!
-
30 శాతం సీట్లు నిండకుంటే.. గుర్తింపు రద్దే!
ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు తేల్చిచెప్పిన ఏఐసీటీఈ అయితే బ్రాంచీల వారీగా అమలుకు యోచన ఆ విద్యా సంవత్సరంలో ఆయా బ్రాంచీలకు అనుమతి నో! తర్వాతి ఏడాది ప్రవేశాలు 30 శాతం దాటితే తిరిగి గుర్తింపు రాష్ట్రంలో ఆ తరహా కాలేజీల సంఖ్యపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు డిగ్రీ కాలేజీల్లోనూ కనీసం 25 శాతం ప్రవేశాలు ఉండాల్సిందే యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకపోతే.. ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి వాటి గుర్తింపు రద్దుకానుంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. అయితే బ్రాంచీల వారీగా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే ఏదైనా బ్రాంచీలో గుర్తింపు పొందిన సీట్లలో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకుంటే.. ఆ బ్రాంచీకి అనుమతి రద్దవుతుంది. ఈ మేరకు ప్రతి కాలేజీలో బ్రాంచీల వారీగా వివరాలను తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టేలా ఏఐసీటీఈ త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఏఐసీటీఈ ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల్లోని కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామని పేర్కొంది. ఇక కాలేజీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైనా ఆ భేటీలో చర్చించింది. అలాంటి కాలేజీల లెక్క తేల్చేపని షురూ.. వివిధ రాష్ట్రాల్లో 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల సాంకేతిక విద్యా శాఖల సేకరించేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నమూనా (ఫార్మాట్)ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం... 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6,472 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా... వాటిలో 29,98,298 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇందులో 15,41,182 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన 30 శాతం సీట్లు భర్తీ కానీ కాలేజీల సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాంటి కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, అందుకే కనీస సంఖ్యలో సీట్లు నిండని బ్రాంచీలను రద్దు చేయడమే మంచిదని ఏఐసీటీఈ భావిస్తోంది. అయితే ఓ విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో 30 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయినా... తర్వాతి ఏడాది ఎక్కువగా భర్తీ అయ్యే అవకాశముందన్న అభిప్రాయం ఉంది. దీంతో ఏ ఏడాదికా ఏడాది సీట్ల భర్తీని బట్టి అనుమతి రద్దుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోనూ కసరత్తు రాష్ట్రంలో 30శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్యను తేల్చేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల తీరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్–డి కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 22 బ్రాంచీలు పూర్తిగా నిండిపోగా.. 9 బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. కాలేజీల వారీగా చూస్తే.. 91 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 12 కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు చేరగా.. తొమ్మిది కాలేజీల్లో సింగిల్ డిజిట్‌లోనే చేశారు. అంటే ఈ 21 కాలేజీలతోపాటు మరో 30 నుంచి 40 కాలేజీల్లో 30 శాతంలోపే సీట్లు నిండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కలు తేల్చాక ఏఐసీటీఈకి నివేదించే అవకాశముంది. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశమున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. డిగ్రీలో 25 శాతంలోపు ప్రవేశాలుంటే.. ఇక డిగ్రీలో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కోర్సులను కొనసాగించవద్దని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీనిపై అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. 25శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల వివరాలను సేకరించి.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆయా కాలేజీల్లో ఆ కోర్సు ప్రవేశాలను కొనసాగించవద్దని స్పష్టం చేసింది. సదరు కాలేజీలు/కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని.. ఈ విషయంలో యూనివర్సిటీలు వచ్చే నెల 4వ తేదీ తరువాత చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. వచ్చే నెల 4వ తేదీ నాటికి నాలుగో దశ సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికలు పూర్తికానున్నాయి. దాంతో 25 శాతంలోపు విద్యార్థులున్న కాలేజీల లెక్క తేలనుంది. తర్వాత వాటిపై తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఆ కాలేజీలను మూసివేస్తాం: ఏఐసీటీఈ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీ సంఖ్యలో మిగిలిపోతున్న సీట్లపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి సారించింది. గత ఐదేళ్ల కాలంలో 30 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన ఇంజనీరింగ్ కాలేజీలను వచ్చే ఏడాది నుంచి మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డీ సహస్రబుద్ధే తెలిపారు. దేశంలోని 10,361 ఇంజనీరింగ్ కాలేజీల్లో 37 లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయ, ఏటా 27 లక్షల సీట్లు విద్యార్థులు లేక ఖాళీగా మిగిలిపోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వాటి సంఖ్యను పెంచేందుకు గాను ‘నేషనల్ స్టూడెంట్ స్టార్టప్ పాలసీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. -
ఇప్పుడే ఒరిజినల్స్ ఇవ్వొద్దు
- తుది దశ కౌన్సెలింగ్ తర్వాతే ఇవ్వండి.. - ఇంజనీరింగ్ ప్రవేశాలపై విద్యార్థులకు ప్రవేశాల కమిటీ సూచనలు - స్పెషల్ ఫీజు కూడా తుది దశ కౌన్సెలింగ్ తర్వాతే చెల్లించండి - బెటర్ ఆప్షన్ అనుకుంటేనే తుది దశ కౌన్సెలింగ్‌కు వెళ్లండి! సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులు తుది దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీల్లో ఇవ్వవద్దని ప్రవేశాల కమిటీ స్పష్టం చేసింది. ముందుగానే ఒరిజినల్స్ ఇస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. కాలేజీల్లో చెల్లించాల్సిన స్పెషల్ ఫీజును (రూ.5,500, ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు రూ.8,550) కూడా తుది దశ కౌన్సెలింగ్ తర్వాత చెల్లించాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా 56,046 మంది విద్యార్థులకు గత నెల 28న ఎంసెట్ ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన వారంతా ఈనెల 7వ తేదీ వరకు కాలేజీల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రవేశాలకు సంబంధించి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులు తరచూ ప్రవేశాల కమిటీని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులోని ప్రధాన అంశాలివి.. ► సీటు లభించిన విద్యార్థులు వెబ్సైట్లో (http://ts eamcet.nic.in) ముందుగా అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం వెబ్సైట్లోనే కచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత వచ్చే అడ్మిషన్ నంబరు తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజు (వర్తించే వారు, రీయింబర్స్మెంట్ రాని వారు) ఈనెల 7వ తేదీలోగా చెల్లించాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీటు రద్దు అవుతుంది. సీటు వచ్చిన కాలేజీల్లో చేరాలనుకునే వారు 7వ తేదీలోగా రిపోర్టు చేయాలి. ఈలోగా రిపోర్టు చేయకపోయినా ఆ సీటు రద్దు కాదు. ఒకవేళ రిపోర్టు చేసినా సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలే ఇవ్వాలి. దీంతో తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వచ్చినా వెళ్లిపోవచ్చు. ► కాలేజీలకు వెళ్లినపుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫీజు చెల్లించిన చలానా కూడా ఒరిజినల్ కాకుండా కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే సబ్మిట్ చేయాలి. తుది దశ కౌన్సెలింగ్ తర్వాత ఆ కాలేజీలో చదవాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ► ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే.. తుది దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థి కోరుకున్న కాలేజీలో సీటు లభించినా అందులో చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముందుగానే సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల వెళ్లిపోతామంటే యాజమాన్యాలు సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి. ► మొదట సీటు లభించిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీలు ఉన్నాయనుకుంటేనే, వాటిల్లో మాత్రమే చివరి దశ కౌ¯ð్సలింగ్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. చివరి దశ కౌన్సెలింగ్‌లో ఏదో ఓ కాలేజీలో ఆప్షన్లు ఇవ్వడం ద్వారా, అందులో సీటు లభిస్తే.. మొదట లభించిన సీటు ఆటోమెటిగ్గా రద్దు అవుతుంది. కాబట్టి తుది దశ కౌన్సెలింగ్ సమయంలో అప్షన్లను జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి. ► తుది దశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా సీటు రాకుంటే తొలి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు అలాగే ఉంటుంది. ► తుది దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో ఫ్రెష్‌గా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్లు పని చేయవు. ► విద్యార్థులు చెల్లించే ఫీజు కన్వీనర్ పేరుతోనే ఉంటుంది. తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వస్తే ఆ ఫీజును ఆ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండో సారి సీటు వచ్చిన కాలేజీలో ఫీజు తక్కువ ఉంటే మిగిలిన మొత్తాన్ని విద్యార్థికి తిరిగి చెల్లిస్తారు. ► మొదటి, రెండో దశల్లో సీట్లు వచ్చి, ఫీజు చెల్లించిన వారు ఆ సీట్లు వద్దనుకుంటే రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ఫీజును తుది దశ కౌన్సెలింగ్ తర్వాత మూడు నాలుగు రోజులకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ తేదీలను తర్వాత ప్రకటిస్తారు. ► తుది దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో అందులోనే చేరాలి. మరో బ్రాంచీకి మార్చుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ► కన్వీనర్ కోటాలో సీటు లభిస్తేనే.. అందులో ఫీజు రీయిం బర్స్మెంట్ వర్తించే వారికి మాత్రమే ఫీజు వస్తుంది. మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్లలో చేరే వారికి ఫీజు రాదు. ► విద్యార్థులు మధ్యవర్తులను సంప్రదించవద్దు. తమ వివరాలను ఇతరులకు ఇవ్వవద్దు. పాస్వర్డ్ చెప్పవద్దు. నెట్ సెంటర్లలో లాగిన్ అయ్యాక వెళ్లిపోయేప్పుడు కచ్చితంగా లాగ్ అవుట్ చేయాలి. -
డొనేషన్ల దందా!
- ఇంజినీరింగ్ సీట్లు మరింత ప్రియం - కొన్ని కాలేజీల ఇష్టారాజ్యం - కోర్సుల బట్టి వసూలు - లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు డిమాండ్ - అదనపు ఫీజులు మరింత భారం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు: 20 మొత్తం సీట్లు: 18,000 సాక్షి ప్రతినిధి, కర్నూలు ఇంజినీరింగ్..ఎంపీసీ చదివిన ప్రతి విద్యార్థి కల. ఈ కలను కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు డబ్బు పెట్టి కొనుక్కోమంటున్నాయి. ఇష్టానుసారంగా డోషన్ ఫీజులు వసూలు చేస్తూ దందాకు తెరలేపాయి. కౌన్సెలింగ్‌లో ఇంకా సీట్ల కేటాయింపు పూర్తి కాకముందే ఈ వ్యవహారం జిల్లాలో తారాస్థాయికి చేరింది. అయినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు డోనేషన్ల దందా నడుపుతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కోర్సులకు లక్షన్నర రూపాయల నుంచి రూ.3 లక్షల వరకూ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. లేనిపక్షంలో సీటు లేదని ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అయితే, సివిల్, మెకానికల్ వంటి కోర్సులకు మాత్రం కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు ఇస్తే చాలు సీటు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాయి. విద్యార్థులు మాత్రం మార్కెట్లో డిమాండ్ ఉన్న ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కోర్సులనే కోరుకుంటున్నారు. ఇదే అదునుగా కాలేజీలు దండుకునే కార్యక్రమానికి తెరలేపాయని తెలుస్తోంది. వీటికితోడుగా స్పెషల్ ఫీజులు, ప్లేస్మెంట్ ఫీజులు, బస్సు ఫీజుల పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి ఎటువంటి రశీదు లేకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే చెల్లించాలని కాలేజీలు షరతు విధిస్తుండటం గమనార్హం. పర్యవేక్షణేదీ? వాస్తవానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా జిల్లాలో మంచి పేరు ఉన్న కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ ఉన్న కోర్సులకు డోనేషన్లను వసూలు చేస్తున్నాయి. డబ్బులు ఉన్న పిల్లలు మాత్రం మంచి కాలేజీల్లో మంచి కోర్సులల్లో చేరుతుండగా... అంత మొత్తం చెల్లించలేని వారు మాములు కాలేజీలల్లో మాములు కోర్సులల్లో చేరాల్సి వస్తోంది. ఈ డోనేషన్లకు తోడుగా ప్రత్యేక ఫీజుల మోత కూడా విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. అయితే, ఈ మొత్తాన్ని పర్యవేక్షించడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నాయి. దీంతో కాలేజీలు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. అదనపుæ ఫీజుల మోత ఒకవైపు డోనేషన్లతో విద్యార్థుల నడ్డి విరుస్తున్న కాలేజీ యాజమాన్యాలు... అదనపు ఫీజుల పేరుతో మరింత అడ్డంగా దోచేస్తున్నారు. ప్లేస్మెంట్ ఫీజుల పేరుతో రూ.3 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా స్పెషల్ ఫీజు పేరుతో రూ.3 వేల వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఈ ఫీజులు మరింత పెంచినట్టు తెలుస్తోంది. ఇక కాలేజీలకు బస్సుల్లో వెళ్లే విద్యార్థులపై కూడా అదనపు భారం పడుతోంది. బస్సు ఫీజులను కూడా ఈ ఏడాది మరింత పెంచేశారు. అయితే, ఈ మొత్తాలను మాత్రం ఆన్లైన్లోనో, డిమాండ్ డ్రాఫ్టు/చలాన్ రూపంలో కాకుండా నేరుగా నగదు రూపంలో చెల్లించాలని పేర్కొంటున్నాయి. తద్వారా ఈ లెక్కలను ఆడిట్ సమయంలో సరిగ్గా చూయించడం లేదని తెలుస్తోంది. ఈ మొత్తాలను అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేసి లెక్కల్లో చూపడం లేదని సమాచారం. మొత్తం మీద ఇంజనీరింగ్ విద్యకు పెద్దగా డిమాండ్ లేని సమయంలో కూడా డిమాండ్ ఉన్న కోర్సుల నుంచి డోనేషన్లు వసూలు చేయడం గమనార్హం. -
ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కోత
► ప్రమాణాలు లేకపోవడమే కారణం ► జిల్లాలో 2వేల సీట్లు తగ్గింపు ప్రొద్దుటూరు: నిర్ణీత ప్రమాణాలు పాటించలేదనే కారణంతో ఇంజినీరింగ్ సీట్లలో కోత విధించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 ఇంజినీరింగ్ కళాశాలలో 2వేల సీట్ల వరకు కోత విధించినట్లు తెలుస్తోంది. అనంతపురంలోని జేఎన్టీ యూనివర్సిటీ పరిధిలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ కళాశాలలు నడుస్తున్నాయి. గత మార్చి, ఏప్రిల్ నెలలో యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీ కళాశాలలను తనిఖీ చేసింది. మొత్తం ఐదు జిల్లాల్లో 119 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 24 కళాశాలలు ఉన్నాయి. 119 కళాశాలల్లో మొత్తం 52వేల సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్‌తోపాటు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకోవాల్సి ఉంది. ఫ్యాకల్టీతోపాటు ల్యాబ్ సౌకర్యం, తరగతి గదుల ఏర్పాటు తదితర నిబంధనలు పాటించాల్సి ఉంది. పెద్దపెద్ద కళాశాలలను నిర్మాణాలను చూపుతున్న యాజమాన్యాలు చాలా వరకు ఈ నిబంధనలను పాటించడం లేదు. తెలంగాణా నేపథ్యంలోనే సీట్ల తగ్గింపు మనకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా శాఖల అధికారులు కళాశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు. ఒకే కళాశాలలో పనిచేస్తూ రెండు మూడు కళాశాలల్లో అదే పేరుతో అధ్యాపకులు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించినట్లు అధ్యాపక వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆధార్‌కార్డు అనుసంధానం చేసినట్లు తెలిసింది. ఈ కోవలోనే మన రాష్ట్రంలో కూడా కళాశాలలను తనిఖీ చేసి సీట్లను తగ్గించారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
బొబ్బిలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తçప్పవని జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ హెచ్చరించారు. సోమవారం కోమటపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తమ పరిధిలో 261ప్రైవేటు కళాశాలలు, 3 అనుబంధ కళాశాలలు ఉన్నాయని, వీటిలో 55వేల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, నిబంధనలు పాటించని అంటే ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాసులు లేని కళాశాలలపై చర్యలు చేపడతామన్నారు. ఆన్లైన్లో ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ఈ ఏడాది సైబర్, బీడీఏ కోర్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. -
పరీక్షలు పాసైనా.. ధ్రువపత్రాలివ్వరు!
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు అటానమస్ అంటే.. అటానమస్ ఉన్న కాలేజీలు యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయంపాలనలో కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణతోపాటు పలు అకడమిక్ నిర్ణయాలను సొంతంగా తీసుకోవచ్చు. సప్లిమెంటరీ పేరుతో కాలయాపన.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడంలేదు. తాజాగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే విద్యార్థులందరికి ఒకేసారి సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. మరికొన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. విద్యార్థుల తిప్పలు.. పని భారం తగ్గించుకునే క్రమంలో కాలేజీ తీసుకున్న నిర్ణయంతో విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో కొందరు విద్యార్థులు సర్టిఫికెట్ల విషయంలో గురువారం ఇబ్రహీంపట్నంలోని ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అలాగే పలు కాలేజీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. చేతులెత్తేసిన జేఎన్టీయూ... సర్టిఫికెట్ల జారీ విషయంలో అలసత్వాన్ని విద్యార్థులు జేఎన్టీయూహెచ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా కాలేజీ యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు 179 జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్నవి 145 ఇందులో అటానమస్ హోదా ఉన్నవి 8 స్వయం ప్రతిపత్తి(అటానమస్) గల ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాటి సౌకర్యార్థం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లివ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనిపై జేఎన్టీయూహెచ్ కూడా చేతులెత్తేయడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఇంజినీరంగు పడింది!
మౌలిక వసతుల లేమి, అర్హత లేని అధ్యాపకులతో పాఠ్యాంశాల బోధనపై అనంతపురం జేఎన్టీయూ మండిపడింది. నిబంధనలు పాటించని, ఆర్థిక వెసులుబాటును విస్మరించిన కళాశాలల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 3వ తేదీ లోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. నెల్లూరు(టౌన్): అసలే అంతంత మాత్రపు అడ్మిషన్లతో నడుస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు జేఎన్టీయూ తాజా హెచ్చరికలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతేడాది జూన్‌లో 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా 40 కళాశాలలు ఎంపిక చేసుకుని తనిఖీలు జరిపారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు. మౌలిక వసతులపై ఆరా ప్రధానంగా ఫ్యాకల్టీ, ఫైనాన్స్, ఇన్ఫాస్ట్రక్చర్ తదితర వాటిపై తనిఖీలు చేశారు. అర్హత లేని అధ్యాపకుల నియామకం, విద్యార్థులకు తగిన అధ్యాపకులు లేకపోవడం, కళాశాలకు అవసరమైన స్థలం లేకపోవడం, భవనాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, లైబ్రరీ తదితర సౌకర్యాలు కొరవడిన విషయాన్ని గుర్తించా రు. ఈ నేపథ్యంలో కళాశాలల డొల్లతనంపై కమిటీ సభ్యులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో మూడు కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ 3వ తేదీ లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 24 ఇంజినీరింగ్ కళాశాలు జిల్లా వ్యాప్తంగా 24 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రధానంగా మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ బ్రాంచ్‌లు ఉన్నాయి. కళాశాల సీనియారిటీని బట్టి 300 నుంచి 550 వరకు అన్ని బ్రాంచిల్లో సీట్లున్నాయి. ఏటా ఇంటర్ పూర్తి చేసుకుని జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే ఎక్కువ మంది చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అధికశాతం కళాశాలల్లో.. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధికశాతం పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తే ఒక్క కళాశాల కూడా తరగతులు జరిపే పరిస్థితి ఉండదంటున్నారు. ఏటా ప్రయోగాల కోసం జిల్లా నుంచి రెండు కళాశాలల యాజమాన్యం తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులను తరలిస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి ఆయా యాజమాన్యాలు కళాశాలలను నడుపుతున్నాయి. అవి నిలిచిపోతే జిల్లాలో మెజారిటీ కళాశాలలను మూసివేసే పరిస్థితి ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. సీట్లు భర్తీకాని కళాశాలలు ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకటి రెండు కళాశాలలు మాత్రమే 95 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. గతేడాది జిల్లాలో రెండు కళాశాలల్లో ఒక అడ్మిషన్ కూడా జరగలేదంటేనే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మరికొన్నింటిలో అధ్యాపకులు ఉన్నా అర్హత లేకపోవడం, సరైన ల్యాబ్ సౌకర్యం, సరిపడా గదులు, కంప్యూటర్లు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. ఏటా తనిఖీలు నిర్వహిస్తాం ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ ఆధ్వర్యంలో తనిఖీలు చేశాం. ఆ నివేదిక ఇంకా రాలేదు. గతేడాది తనిఖీల్లో సరైన సౌకర్యాలు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. –కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(ఏ) -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు వైఎస్సార్ విద్యార్థి విభాగం జేఎన్టీయూ: ఇంజినీరింగ్ కళాశాలలు బకాయిలు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్టీయూ అధికారుల వైఖరికి నిరసనగా బుధవారం రిజిస్ట్రార్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. ఎస్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల (నెల్లూరు) రూ. 19 లక్షలు యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ (యూసీఎఫ్) చెల్లించలేదని ఆ కళాశాలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్లు పంపకుండా నిలిపివేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం తగదన్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ కృష్ణయ్య హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ శెట్టి, ఎస్కేయూ అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తులసీ రెడ్డి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల ‘ప్రత్యేక’ దోపిడీ
ప్రాజెక్టు రిపోర్టులు స్వీకరించేందుకు ఫీజుల వసూళ్లు - ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా దండుకుంటున్న వైనం - చెల్లించకుంటే ప్రయోగ పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపు - దిక్కుతోచని స్థితిలో సొమ్ము కడుతున్న విద్యార్థులు - వర్సిటీ దృష్టికి వెళ్లిన వ్యవహారం.. పలు కాలేజీలకు నోటీసులు షేక్ ఒవైసీ అనే విద్యార్థి ఎల్బీనగర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. చివరి సంవత్సరంలో ప్రతి విద్యార్థి కోర్సుకు సంబంధించిన అంశంపై పరిశోధన చేసి, ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి. ఒవైసీ తనకు కేటాయించిన అంశంపై ప్రాజెక్టు పూర్తిచేసి, రిపోర్టు సమర్పించేందుకు కాలేజీకి వెళ్లాడు. కానీ రూ.6,500 చెల్లిస్తేనే రిపోర్టు తీసుకుంటామని కాలేజీ సిబ్బంది కొర్రీ పెట్టారు. దీంతో తప్పని పరిస్థితిలో ఆ సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలు చిల్లర వసూళ్లకు తెగబడుతున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా విద్యార్థుల నుంచి అదనపు ఫీజుల పేరిట దండుకుంటున్నాయి. తాజాగా ఫైనలియర్ విద్యార్థులు ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించాల్సిన తరుణం రావడంతో కొత్త దోపిడీకి తెరతీశాయి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించే విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజు పేరిట వసూలు చేస్తున్నాయి. చెల్లించకపోతే రిపోర్టు తీసుకునేది లేదని, ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. ఇలా అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నా.. ఆ సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం గమనార్హం. ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా.. రాష్ట్రంలో 214 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో దాదాపు 1.5 లక్షల మంది వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. అందులో ఏటా 35 వేల మంది కోర్సు పూర్తి చేస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక అంశంపై పరిశోధన చేసి నివేదిక (రిపోర్టు)ను కాలేజీలో సమర్పించాలి. ఆ పరిశోధన తాలూకు ఆవిష్కరణలు కూడా చూపాలి. ప్రాజెక్టు కోసం విద్యార్థులే సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టును బట్టి ఒక్కో విద్యార్థి సగటున రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తారు. ఇది ఇప్పటికే పేద విద్యార్థులకు భారంకాగా.. ఈ ప్రాజెక్టు అంశాన్ని అడ్డుపెట్టుకుని కాలేజీలు దోపిడీకి తెరతీశాయి. ప్రాజెక్టు కేటాయించే సమయం నుంచి రిపోర్టు సమర్పించే వరకు ప్రత్యేకంగా ఫీజులు నిర్ణయించి వసూలు చేస్తున్నాయి. చెల్లిస్తేనే ప్రాజెక్టు రిపోర్టు తీసుకుంటామని, లేకుంటే ప్రయోగ పరీక్షలో ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. ఘట్కేసర్ మండలం నారపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.13 వేలు వసూలు చేస్తోంది. జనగామలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ రూ.8 వేలు, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని కాలేజీ, కర్మన్‌ఘాట్‌లోని కాలేజీ, హన్మకొండలోని మరో కాలేజీ రూ.6,500 చొప్పున, ఉప్పల్‌లోని మరో కాలేజీ రూ.5 వేలు, కీసరలోని కాలేజీ రూ.4 వేలు, ఘట్కేసర్ కేంద్రంలోని కాలేజీలు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల రసీదులు ఇస్తుండగా.. కొన్ని యాజమాన్యాలు తూతూమంత్రంగా ఓ రిజిస్టర్లో రాసుకుంటున్నాయి. అయితే పేద విద్యార్థులు ఈ ప్రత్యేక ఫీజులతో ఇబ్బందిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేక ఫీజుల దోపిడీపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్లతో పాటు జేఎన్టీయూహెచ్ వీసీకి ఇప్పటికే ఫిర్యాదులు చేయగా.. శనివారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ వసూళ్లను నిలిపివేయాలని, ఇప్పటికే ఫీజులు చెల్లించిన విద్యార్థులకు తిరిగి ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను కోరారు. ఇలా వసూలు చేయడం అక్రమమే.. విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించి ప్రత్యేక పట్టిక రూపొందించి ఇస్తాం. ఆమేరకు మాత్రమే కాలేజీలు వసూలు చేయాలి. అలాగాకుండా విద్యార్థులు ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించే క్రమంలో ఫీజులు వసూలు చేయడం సరికాదు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేశాం. వివరణ తీసుకున్నాక తగిన చర్యలు తీసుకుంటాం. కర్మాన్‌ఘాట్ సమీపంలోని ఓ కాలేజీ వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. – యాదయ్య, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ -
ఫీజు చెల్లిస్తారా.. జరిమానా కడతారా?
వార్షిక పరీక్షలు పూర్తి కాకుండానే తర్వాతి ఏడాది ఫీజుల వసూళ్లు - తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ కాలేజీల నోటీసులు - గడువులోగా కట్టకపోతే రోజుకు రూ.50 చొప్పున జరిమానాలు - ముందే ఎందుకు ఇస్తామంటున్న తల్లిదండ్రులు - పైగా జరిమానా విధించడమేమిటని ఆందోళన - వృత్తి విద్యా కాలేజీల్లో యాజమాన్యాల ఇష్టారాజ్యం ‘‘మీ అబ్బాయి వచ్చే ఏడాది ఫీజు రూ.99,500.. వెంటనే చెల్లించండి. లేదంటే ఏప్రిల్ 8వ తేదీ నుంచి రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’’... ఓ విద్యార్థి తండ్రికి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం పంపిన నోటీసు ‘‘2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి మీ అమ్మాయి కాలేజీ ఫీజు రూ.85 వేలు. మీరు సకాలంలో ఫీజు చెల్లించలేదు. కాబట్టి రోజుకు రూ.50 చొప్పున ఫైన్‌తో వెంటనే ఫీజు కట్టండి’’... మరో విద్యార్థి తండ్రికి ఇంకో ఇంజనీరింగ్ కాలేజీ నోటీసు సాక్షి, హైదరాబాద్: ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తేవడమే కాదు. గడువులోగా ఫీజు చెల్లించకపోతే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వాస్తవానికి 2016–17 విద్యా సంవత్సరపు వార్షిక పరీక్షలే ప్రారంభం కాలేదు. వాటికి ఇంకా సమయం ఉంది. కానీ యాజమాన్యాలు అప్పుడే 2017–18 విద్యా సంవత్సరపు వార్షిక ఫీజు చెల్లించాలని నోటీసులు పంపిస్తుండటంతో కన్వీనర్ కోటాలో కాలేజీల్లో చేరిన సాధారణ విద్యార్థులు (ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనివారు) తీవ్ర ఆందోళనలో పడ్డారు. అటు యాజమాన్య కోటాలో చేరిన విద్యార్థులదీ ఇదే పరిస్థితి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం మే చివర్లోనో, జూన్‌లోనో వచ్చే విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నామని.. ఇప్పుడే చెల్లించాలంటే ఎలాగని పేర్కొంటున్నారు. మరో నెల వరకు పరీక్షలే.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనెల 13వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారం భమై మే నెలాఖరు వరకు జరుగనున్నాయి. వాటి ఫలితాలను వెల్లడించాక జూన్‌లో 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం 2017–18 విద్యా సంవత్సరపు ఫీజులను వెంటనే చెల్లించాలంటూ తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ మార్చి మొదటి వారం నుంచే నోటీసులను పంపడం మొదలుపెట్టాయి. లక్ష మందిపై ప్రభావం కాలేజీ యాజమాన్యాల తీరుపై పలువురు తల్లిదండ్రులు ఉన్నత విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కు పైగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర కోర్సులు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అందులో ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించని ఉద్యోగుల పిల్లలు, మేనేజ్మెంట్ కోటాలో చేరిన వారు లక్ష మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇప్పుడు వారి తల్లిదండ్రులంతా ఆవేదనలో పడ్డారు. యాజమాన్యాల తీరుతో అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. -
రేపటి నుంచి ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీ
జేఎన్టీయూ : జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ నెల 30 నుంచి నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు చేయనుంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు తనిఖీలు చేయనుంది. అలాగే ఏప్రిల్ 6, 7,8 తేదీలలో నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీ చేయనున్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడానికి వర్సిటీ అనుమతి ఇస్తుంది. విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థ
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఆన్లైన్లోనే ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించే వ్యవస్థలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు తదితరులెవరైనా ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే వెసులుబాటు ఉండాలంది. ఇప్పటిదాకా ఆన్లైన్ వేదికలు లేని కళాశాలలు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. ప్రతి ఏడాది కళాశాలల అనుమతులు పునరుద్ధరించేటపుడు ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థ ఉందో లేదో తనిఖీ చేస్తామంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్ని పరిష్కారం అయ్యాయి? అనే విషయాలను ప్రతి నెలా కళాశాలలు తమకు తెలియజేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. -
ఇంజనీరింగ్‌కు కూడా ఒకే పరీక్ష ఉండాలి
-
రక్త కన్నీరు...
ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల ఇష్టారాజ్యం రోగులకు గడువు ముగిసిన,ఇన్ఫెక్షన్ సోకిన రక్తం సరఫరా సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు బ్లడ్ బ్యాంక్‌ల రక్త దాహానికి రోగులు బలవుతున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు నార్మల్ సెలైన్ వాటర్ కలిపిన కల్తీ రక్తం ఎక్కించడంతో ఆమె మృతి చెందిన విషయం మరువక ముందే... తాజాగా నాచారంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులు రక్తహీనతతో బాధపడుతున్న ఓ యువతికి ఇన్ఫెక్షన్ రక్తం ఎక్కించారు. ఆమె ఓ చేయిని కోల్పోవాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిర్వహిస్తున్న పలు బ్లడ్ బ్యాంకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. గడువు ముగిసిన, ఇన్ఫెక్షన్ సోకిన రక్తాన్ని ఎక్కించడంతో బాధితులు కాళ్లు, చేతులే కాదు... ప్రాణాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చేతిని పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వైష్ణవి విషయంలోనూ ఇదే జరిగినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కనీస ప్రమాణాలు కరువు: రాష్ట్ర వ్యాప్తంగా 132 రక్తనిధి కేంద్రాలుండగా, వీటిలో హైదరాబాద్‌లోనే 61 ఉన్నాయి. వీటిలో 21 రక్తనిధి కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగు తున్నాయి. మిగిలినవి వివిధ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల అదీనంలో ఉన్నాయి. వీటిలో ఎక్కడా రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయడం లేదు. అర్హులైన టెక్నీషియన్లు లేరు. సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి, శుద్ధి చేసిన తర్వాత నిల్వ చేయడం, చివరకు బయోమెడికల్ వేస్టేజ్ నిర్వ హణ అంతా లోపభూయిష్టమే. 3 మాసాలకోసారి తని ఖీలు చేసి, ప్రమాణాలను పెంచాల్సిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం ప్రమాణాలు పాటించని కేంద్రాలకు నోటీçసులు జారీ చేసినట్లు వారు చెబుతున్నా... ఆచరణలో అమలు కావడం లేదు. యూనిట్‌కు రూ.1,500పైనే... యువజన సంఘాలు, ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అనేక మంది ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేస్తుంటారు. ఇలా సేకరించిన దానిలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేయాలి. రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్‌క్లబ్ మినహా ఇతరులెవరూ అలా ఇవ్వడం లేదు. అంతేకాదు... తలసీమియా బాధితులకు ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా... ఒక్కో బాటిల్‌పై రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. రక్తంలో నార్మల్సెలైన్ వాటర్ కలిపి కల్తీకి పాల్పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
పైన పటారం.. లోన లొటారం!
‘మా కాలేజీలో అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నాం.. పరిమిత సీట్లున్నాయి.. మీ పిల్లల్ని వెంటనే చేర్పించండి.. ఆలస్యం చేస్తే సీటు దొరకడమే కష్టం.. అసలే మా కాలేజీకి గిరాకీ పెరిగింది..’ ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాలేజీల యాజమాన్యాలు చెప్పే మాటలివి. తీరా లోపలికి వెళ్లాక చూస్తే అక్కడ సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి. ఇలా ప్రతిష్టకుపోయి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది ప్రస్తుతం కాలేజీల పరిస్థితి. హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీట్ల భర్తీ దారుణంగా పడిపోయింది. అన్ని కోర్సుల్లో కూడా సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్తోసహా అన్ని కోర్సులదీ ఇదే పరిస్థితి. అనేక కాలేజీలు మూతపడే దశకు చేరుకున్నాయి. కొన్ని కాలేజీలు అరకొర విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఉన్నట్లు లెక్కచూపుతూ వారిని పక్కనే ఉన్న మరో కాలేజీల తరగతులకు పంపిస్తున్నాయి. కాలేజీలు మూతవల్ల వచ్చే ప్రయోజనం ఉండదని, ఏదోలా కొనసాగిస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా చేరికలు పెరుగుతాయన్నది కొన్ని యాజమాన్యాల ఆశ. కాలేజీ ఏర్పాటు చేసి విద్యార్థులు చేరక మూసేశారన్న మాట రాకుండా ప్రతిష్ట కాపాడుకొనేందుకు పిల్లలు లేకపోయినా మరి కొందరు కాలేజీలను కొనసాగిస్తున్నారు. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఏటా 8 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ప్రవేశాలకు ఎంసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్, బీఈడీ కోర్సులకు బీఎడ్, లా కోర్సుల ప్రవేశానికి లాసెట్, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు పీజీఈసెట్, బీటెక్ లేటరల్ ఎంట్రీ (డిప్లొమో విద్యార్థులు రెండో ఏడాది ప్రవేశానికి) ఈసెట్, పాలిటెక్నిక్ కోర్సుల కోసం పాలీసెట్లను నిర్వహిస్తోంది. యాజమాన్య కోటాలో మరింత అధ్వానం 2017 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెలలో నోటిఫికేషన్ వెలువరించనున్న దశలోనూ కొన్ని కాలేజీలు తమ సంస్థల్లో ప్రవేశాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రవేశాలను అనుమతించాలంటూ అవి ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలూ అందిస్తున్నాయి. గడువు ముగిసిపోయి ప్రవేశాలు జరుపుతున్నా సీట్లు సగానికి దాటకపోవడం విశేషం. కన్వీనర్ కోటాలోని సీట్లే మిగిలిపోయిన తరుణంలో ఇక యాజమాన్యకోటా సీట్ల భర్తీ మరింత అధ్వానంగా ఉంది. -
ఇంజనీరింగ్ కాలేజీలకు 8 నుంచి సెలవులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు ఈనెల 8 నుంచి దసరా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. తొలుత 5వ తేదీ నుంచే సెలవులు ప్రకటించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. అయితే గురువారం యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి నుంచి సర్క్యులర్ అందినట్లు.. అందులో 8వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అన్న అంశంపై చర్చించాల్సి ఉందని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదయ్య తెలిపారు. ఈ విషయంపై సోమవారం స్పష్టత వస్తుందని, ఆ వెంటనే కాలేజీలకు సమాచారం అందజేస్తామని వివరించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలకు 2వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 13వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పీజీ కళాశాలలకు మాత్రం 8వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 17వ తేదీ నుంచి యథావిధిగా తరగతులు జరుగుతాయి. -
ఇంజనీరింగ్ కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
3 కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో తనిఖీలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణపై టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 5 మంది సభ్యులతో కూడిన బృందం ఆయా కళాశాలల్లో మౌలిక వసతులపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో బృందం గతనెల 29, 30 తేదీల్లో జిల్లాలోని మూడు ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించింది. అకౌంట్స్, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, ల్యాబ్‌ల నిర్వహణ, కంప్యూటర్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా కళాశాలల్లో లోపాలను గుర్తించి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన కళాశాలల యాజమాన్యం ఆందోళన పడుతోంది. మౌలిక వసతులు అంతంత మాత్రమే: జిల్లాలోని ఒకటి రెండు కళాశాలలు తప్ప మిగిలిన కళాశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కళాశాలలు ల్యాబ్‌ల కోసం పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై ఆధారపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. బీటñ క్ పూర్తి చేసిన వారిని ఫ్యాకల్టీగా నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక కళాశాలలో మాత్రమే 100శాతం సీట్లు భర్తీ అయ్యాయంటే కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు, టాస్క్‌ఫోర్స్, వసతుల లేమి -
అందకారంలో వర్సిటీలు
- సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విశ్వవిద్యాలయాలు - రాష్ట్రం నిధులు పెంచదు.. కేంద్ర నిధులూ అందవు - సిబ్బంది జీతభత్యాలూ చెల్లించలేని దుస్థితి - సారథులు లేరు.. ఫ్యాకల్టీ లేరు.. - బోధనేతర సిబ్బందీ కరువే - ప్రాభవం కోల్పోతున్న ఉస్మానియా - 11 మందితో నడుస్తున్న పాలమూరు వర్సిటీ - మిగతా విశ్వవిద్యాలయాలదీ అదే పరిస్థితి - వర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు దక్కని ‘గుర్తింపు’ రాష్ట్రంలో యువత బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాలు పూర్తిగా వట్టిపోతున్నాయి.. పరిశోధనలకు ప్రాణం పోయాల్సిన వర్సిటీలు నిర్వీర్యమైపోతున్నాయి.. సరైన సంఖ్యలో అధ్యాపకుల్లేక, కనీస స్థాయిలో సిబ్బందిలేక, చివరికి నడిపించే సారథులే లేక వాడిపోతున్నాయి.. విజ్ఞాన కేంద్రాలు విలసిల్లాల్సిన చోట అడ్డగోలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.. కనీస మౌలిక సదుపాయాలూ లేక కునారిల్లిపోతున్నాయి.. జీతభత్యాలూ ఇవ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తంగా పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విశ్వవిద్యాలయాల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలు కూడా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల దుస్థితిపై ఈ వారం ఫోకస్... - సాక్షి, హైదరాబాద్ ఉస్మానియాలో 669 పోస్టులు ఖాళీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1,264 బోధనా సిబ్బంది పోస్టులుండగా.. అందులో 669 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్నవారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టలేదు. దాంతో నాలుగేళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఫ్యాకల్టీ లేని కారణంగా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అంగీకరించడం లేదు. ఆ కాలేజీని ప్రారంభించిన నాటి నుంచి ఒక్కో డిపార్టుమెంట్లో ఉన్న గరిష్ట సీట్లు 60 మాత్రమే కావడం గమనార్హం. 11 మందితో నడుస్తున్న ‘పాలమూరు’ మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా బోధనలో పూర్తిగా వెనకబడింది. ఇక్కడ బోధనా సిబ్బంది 9 మంది, బోధనేతర సిబ్బంది ఇద్దరు.. మొత్తంగా 11 మందితోనే వర్సిటీ పాలన సాగుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించవచ్చు. ఓ సాధారణ డిగ్రీ కళాశాలలో ఉండే సిబ్బంది సంఖ్యలో పదో వంతు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. వాస్తవానికి పాలమూరు వర్సిటీకి 74 పోస్టులు మంజూరయ్యాయి. అందులో ప్రస్తుతం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ వర్సిటీలో చూసినా.. ► కాకతీయ విశ్వవిద్యాలయంలో మంజూరైన పోస్టుల్లో సగం సిబ్బంది కూడా లేరు. దానికి ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 4 బ్రాంచీలు ఉన్నాయి. వాటికి 60 మంది బోధనా సిబ్బంది కావాలి. కానీ ఉన్నది 11 మందే. దీంతో రూ.16 కోట్ల వరకు అందాల్సిన టెక్విప్ నిధులు రాని పరిస్థితి. ► శాతవాహన యూనివర్సిటీలోనూ 70 విభాగాలున్నాయి. ఇక్కడ కనీసం 150 మంది ఫ్యాకల్టీ కావాలి. కానీ అందులో పావువంతు కూడా లేరు. ఇక ఇక్కడ ఫార్మసీ కాలేజీ ఉన్నా.. బోధనా సిబ్బంది లేని కారణంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. ► పాలమూరు వర్సిటీలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి ఫార్మసీ కాలేజీకి గుర్తింపు లేదు. ► జేఎన్టీయూహెచ్ పరిధిలోని మంథని ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం ఐదుగురే సిబ్బంది ఉన్నారు, సుల్తాన్పూర్ కాలేజీలో ఇద్దరే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ► జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో 60 మంది వరకు ఫ్యాకల్టీ అవసరమున్నా 25 మందే ఉన్నారు. ►మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. 40 మంది వరకు అవసరమైనా రెగ్యులర్ సిబ్బంది ఒక్కరూ లేరు. అభివృద్ధికి కేంద్ర నిధులే దిక్కు యూనివర్సిటీలకు రాష్ట్రం ఇచ్చే నిధులు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులే వర్సిటీల అభివృద్ధికి ప్రధానాధారంగా మారాయి. ఒక్కో వర్సిటీకి వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులిస్తాయి. అంతేకాదు ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా వివిధ ప్రాజెక్టుల కింద నిధులు వస్తాయి. ఇక రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పరిశోధనల కోసం నిధులు వస్తాయి. యూజీసీ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కీం, సెంట్రల్ అసిస్టెంట్ ప్రోగ్రాం, టెక్విప్ల కింద.. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, సీఎస్ఐఆర్ల పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు అందుతాయి. అయితే వర్సిటీల్లో కనీస బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉంటేనే ఈ నిధులు అందుతాయి. లేకుంటే మంజూరు కావు. ప్రస్తు తం రాష్ట్రంలోని వర్సిటీల్లో తగిన సంఖ్యలో అధ్యాపకులు లేకపోవడంతో కేంద్ర పథకాల కింద నిధులు రావడం లేదు. ఇక న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్న వర్సిటీలకు యూజీసీ ‘యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్’ కింద రూ.50 కోట్ల వరకు ఇస్తుంది. 2012లో ఉస్మానియాకు రూ.50 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో ఆ నిధులు అందని పరిస్థితి నెలకొంది. గతేడాది న్యాక్ గుర్తింపు ఉన్నందునే రూ.20 కోట్లు రూసా నిధులు అందాయి. కనీస సదుపాయాలు, సిబ్బంది లేకపోవడంతో ఈసారి అవి వచ్చే పరిస్థితి లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి నిధుల కింద రూ.12 కోట్లు వచ్చాయి. ఈసారి ఇవి కూడా రాలేదు. సమస్యల సుడిగుండంలో వర్సిటీలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిండా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పుడిప్పుడే దిద్దుబాటుకు ఒక్కో అడుగు పడుతున్నా... ఇంకా ఆశించిన వేగం కనిపించడం లేదు. ప్రభుత్వం వైస్ చాన్స్లర్ల (వీసీల) నియామకాలకు చర్యలు వేగవంతం చేసినా... వర్సిటీలకు అవసరమైన స్థాయిలో నిధులివ్వలేదు. గతంతో పోల్చితే రూ.150 కోట్ల వరకు అదనంగా ఇస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో రూ.200 కోట్ల వరకు అవసరమని వర్సిటీలు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు. ఇక అధ్యాపకుల నియామకాలపై వర్సిటీల వారీగా ఖాళీల నివేదికలను తెప్పించుకున్నా.. వాటి భర్తీపై ఇంతవరకు దృష్టి సారించలేదు. దీంతో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిపోతోంది. ఎంతో ఘన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాకతీయ వర్సిటీ సహా ఇతర విశ్వవిద్యాలయాలదీ అదే పరిస్థితి. సగానికి పైగా ఖాళీలే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 యూనివర్సిటీల్లో కలిపి మొత్తంగా 2,753 అధ్యాపక పోస్టులుండగా... అందులో 1,504 పోస్టులు (54 శాతం) ఖాళీయే. కేవలం 1,249 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే వందల కోట్ల రూపాయల నిధులకు గండి పడుతోంది. ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపు ఉంటేనే నిధులు మంజూరు చేస్తామని ఏడాది కిందటే ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)’ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు స్పష్టం చేసినా... రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఏమీ పట్టనట్లుగా ఉండిపోయింది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలకు పైసా అందని పరిస్థితి నెలకొంది. నిధులు పెంచితేనే బాగుపడేది! తమకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ మొత్తానికే సరిపోవడం లేదని యూనివర్సిటీలు ఏటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. అన్ని వర్సిటీలకు గతంలో రూ.298 కోట్లు ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది నుంచి మరో రూ.150 కోట్ల నిధులు పెంచింది. కానీ ఈ పెంపు చాలదని.. మరిన్ని నిధులు ఇవ్వాలని వర్సిటీలు కోరుతున్నాయి. ఈ ఏడాది ఉస్మానియా వర్సిటీకి రూ.238 కోట్లు ఇచ్చినా.. అవి జీతభత్యాలకు సరిపోవడం లేదు. జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల కోసమే మరో రూ.70 కోట్లు అవసరమని వర్సిటీ కోరుతుంది. ఇక కాకతీయ వర్సిటీకి రూ.67 కోట్లు ఇచ్చినా... ఏటా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసమే రూ.90 కోట్ల వరకు అవసరం. తెలంగాణ వర్సిటీకి రూ.20 కోట్లు కేటాయించినా మరో రూ.25 కోట్లు కేటాయించాలని.. మహాత్మాగాంధీ వర్సిటీకి రూ.25 కోట్ల వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పగా మరో రూ.20 కోట్లు అవసరమని అధికారులు కోరుతున్నారు. ఇవేకాదు శాతవాహన, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వంటి మిగతా వర్సిటీలకూ ప్రభుత్వం నుంచి అదనంగా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు అవసరమని కోరుతున్నాయి. కానీ మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. -
ఫీజుల ఖరారు
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ధారించిన ఏఎఫ్ఆర్సీ 69 కాలేజీల్లో కనీస ఫీజు రూ. 35,000 అత్యధిక ఫీజు రూ. 1,13,500.. నాలుగు కాలేజీల్లో రూ.లక్షకు పైనే సగటున రూ. 8 వేల వరకు పెరిగిన ఫీజులు కాలేజీల వారీగా ఫీజుల వివరాలు ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులోకి.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అందజేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు, చేర్పులతో ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం రాత్రే సంతకం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉత్తర్వుల కాపీ విడుదల కాలేదు. ఇది మంగళవారం ఉదయం అందుబాటులోకి రానుంది. కాలేజీల వారీగా ఫీజుల వివరాలను విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్ æ tseamcet.nic.in లో చూసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గరిష్ట ఫీజు 1,13,500 కాగా, కనీస ఫీజు 35,000గా ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును ఖరారు చేయగా.. 69 కాలేజీలకు కనీసఫీజు రూ.35 వేలుగా మాత్రమే నిర్ణయించింది. 8 కాలేజీలకు రూ.35 వేల నుంచి రూ.39 ,000... 119 కాలేజీలకు రూ.40 వేల నుంచి రూ.59 వేల వరకు.. 17 కాలేజీలకు రూ.60 వేల నుంచి రూ.69,000.. 16 కాలేజీలకు రూ.70 వేల నుంచి రూ.79,000.. 5 కాలేజీలకు రూ.80 వేల నుంచి రూ.89,000.. 14 కాలేజీలకు రూ.90 వేల నుంచి రూ.99 వేల వరకు ఫీజు నిర్ణయించింది. ఈ ఫీజులు 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి. పెరిగిన ఫీజులు: కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా మిగతా కాలేజీల్లో ఫీజులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. కొన్ని కాలేజీల్లో మాత్రం రూ.30 వేల వరకు పెరిగింది. రాష్ట్రంలో సగటు ఫీజు రూ.49,768గా నిర్ణయించింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా.. ఈసారి 8 వేల వరకు పెరిగింది. కొన్ని ప్రధాన కాలేజీల్లో ఫీజులు కాలేజీ ఫీజు సీబీఐటీ 1,13,500 వాసవి 86,000 ఎంవీఎస్ఆర్ 95,000 శ్రీనిధి 91,000 గోకరాజు రంగరాజు 95,000 సీవీఆర్ 90,000 మాతృశ్రీ 67,000 ఎంజీఐటీ 1,00,000 కేఎంఐటీ 77,000 కిట్స్ 1.05,000 వర్ధమాన్ 1.05,000 బీవీఆర్ఐటీ 95,000 మల్లారెడ్డి 78,000 సీఎంఆర్ 75,000 అనురాగ్ గ్రూప్ 93,000 స్టాన్లీ 62,000 వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి 98,500 విద్యాజ్యోతి 80,000 వీబీఐటీ 67,000 టీకేఆర్ 57,000 జి.నారాయణమ్మ 95,000 గురునానక్ 75,000 -
రేపట్నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు!
నేడు కాలేజీల అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారు 29 నుంచి తరగతుల ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ పరిధిలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, కాలేజీల వారీగా ఫీజుల వివరాలతో కూడిన జీవో ఆదివారం రాత్రి వరకు కూడా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి చేరలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎలా ప్రారంభించాలన్న అంశంపై క్యాంపు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సోమవారం మధాహ్నం వరకు కాలేజీల జాబితా, ఫీజుల వివరాలు అందితే.. మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అ దిశగా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. కాలేజీల వారీగా ఫీజులకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి కసరత్తు పూర్తి చేసింది. సోమవారం మధ్యాహ్నంకల్లా ఈ జీవోను జారీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని విద్యార్థులు, అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఉత్తీర్ణులై ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ వివరాలు తేదీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన ర్యాంకుల వారు 5-7-2016, 6-7-2016 1 నుంచి 45 వేలు 7-7-2016, 8-7-2016 45,001 నుంచి 90 వేలు 9-7-2016, 10-7-2016 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు 10-7-2016, 11-7-2016 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లలో మార్పులకు అవకాశం 14-7-2016 సీట్ల కేటాయింపు 21-7-2016 ఫీజు చెల్లింపుతోపాటు కాలేజీల్లో రిపోర్టింగ్ =================== చివరి విడత ప్రవేశాలు 24-7-2016, 25-7-2016 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27-7-2016 సీట్ల కేటాయింపు 29-7-2016 తరగతుల ప్రారంభం -
64 ఇంజనీరింగ్ కాలేజీలు ఔట్!
- ఈ ఏడాది ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు లేనట్టే - భారీగా తగ్గిపోనున్న సీట్ల సంఖ్య - 24 కాలేజీలకు అనుబంధ గుర్తింపు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఈ ఏడాది 64 కాలేజీల్లో ప్రవేశాలే ఉండకపోగా మిగతా కాలేజీల్లో చాలా సీట్లు రద్దు కానున్నాయి. ల్యాబ్ సదుపాయాలు, ఫ్యాకల్టీ ప్రాతిపదికన కాలేజీలు, సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో 40 వేల నుంచి 50 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, యూనివర్సిటీలు ఓకే చెప్పిన 174 కాలేజీలకే మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రానికి ఆ కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి అందజేయనుంది. శుక్రవారం వీలుకాకపోతే శనివారం ఉదయమే అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యాశాఖ ప్రకటించనుంది. ఆ తర్వాత 5వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. కాలేజీల్లో లోపాలు ఇలా.. రాష్ట్రంలో 282 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 242 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరో 40 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో 24 కాలేజీల్లో భారీగా లోపాలు ఉన్నాయని అటు జేఎన్టీయూహెచ్, ఇటు విజిలెన్స్ విభాగాల తనిఖీలు తేల్చాయి. దీంతో వాటికి అనుబంధ గుర్తింపును నిరాకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరో 44 కాలేజీల్లో కూడా లోపాలు ఉన్నట్లు జేఎన్టీయూహెచ్, విజిలెన్స్ విభాగాల తనిఖీల్లో తేలింది. వీటిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో టాప్ కాలేజీలు అయిన చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ), మహత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ కాలేజీలు బాగానే ఉన్నాయని, లోపాలు లేవని ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ తేల్చినా... విజిలెన్స్ విభాగం మాత్రం వాటిల్లోనూ లోపాలు ఉన్నాఙయని తేల్చినట్టు సమాచారం. గుర్తింపు వచ్చే కాలేజీల్లోనూ సీట్లకు కోత అనుబంధ గుర్తింపు ఇచే ్చందుకు చర్యలు చేపట్టిన కాలేజీల్లోనూ భారీగా సీట్లకు కోత పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ల్యాబ్ సదుపాయాలు, విద్యార్థి, అధ్యాపకుల రేషియో అధారంగానే బ్రాంచీలు, సీట్లకు ఓకే చెప్పాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించినా వాటిల్లో భారీగా సీట్లకు కోత పడుతుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో బ్రాంచీలకు కూడా కోత పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి 40 వేల నుంచి 50 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉందని జేఎన్టీయూహెచ్ వ ర్గాలు పేర్కొంటున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని 282 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.42 లక్షల సీట్లకు అనుమతులు ఇచ్చింది. కానీ అనుబంధ గుర్తింపు ఆయా కాలేజీల్లో 90 వేల నుంచి లక్షలోపు సీట్లకే వచ్చే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని 40 కాలేజీల్లో 25 వేల వరకు సీట్లు రద్దు కానుండగా.. అనుబంధ గుర్తింపు నిరాకరించాలన్న నిర్ణయానికి వచ్చిన 24 కాలేజీల్లో మరో 15 వేల సీట్లకు కోత పడుతుంది. లోపాలు ఉన్నట్లు తేల్చిన 44 కాలేజీల్లోనూ 10 వేల సీట్ల వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. -
సగం సీట్లు ఖాళీ
ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యేనా? యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు ఫుల్ {పైవేట్ కళాశాలల్లో అరకొర అడ్మిషన్లు భర్తీ కాని సీట్ల సంఖ్య 8 వేలు 50శాతం భర్తీకాని కాలేజీల సంఖ్య 10 జిల్లాలో చాలా ఇంజినీరింగ్ కళాశాలల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. సోమవారం రాత్రి ఎంసెట్ అడ్మిషన్ల తొలివిడత సీట్ల భర్తీకి సంబంధించి సీట్ల కేటాయింపు జరిగింది. దాదాపు 8 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోవడం విశేషం. గత ఏడాది 6 వేల సీట్లు మిగిలిపోతే ఈ యేడాది ఈ సంఖ్య పెరగడం పట్ల కళాశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 11వేల 236 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేశారు. 10వేల 793 మంది ప్రవేశ పరీక్ష రాశారు. 9,800 మంది అర్హత సాధించారు. యూనివర్సిటీ క్యాంపస్: జిల్లాలోని చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలివిడత సీట్ల ప్రకటన తర్వాత ఎక్కువ సీట్లే మిగిలిపోయాయి. 39 ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు 2 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రయివేటు రంగంలోని 39 కళాశాలలు జేఎన్టీయూ అనంతపురానికి అనుబంధంగా ఉన్నాయి. వీటిలో దాదాపు 16వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 6 నుంచి జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌కు 6,260 మంది హాజరయ్యారు. 6,100 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వీరిలో దాదాపు 6వేల మందికి సీట్ల కేటాయింపు జరిగింది. అందుబాటులో ఉన్న 16వేల సీట్లలో మేనేజ్మెంట్ కోటా పోగా 8 వేల సీట్లు మిగిలాయి. ఎస్వీయూలో... ఎస్వీ యూనివర్సిటీలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ, కెమికల్ బ్రాంచిల్లో 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భర్తీ అయ్యాయి. 97 ర్యాంకు నుంచి 6000 లోపు ర్యాంక్ పొందిన వారందరికీ సీట్లు వచ్చాయి. వీరు జూలై 1 లోపు రిపోర్ట్ చేయాలి. గత ఏడాది 250 మంది మాత్రమే చేరారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 360 సీట్లు భర్తీ అయినప్పటికీ ఎన్ఐటీ, ఐఐటీలో సీట్లు రావడంతో 110 మంది వెళ్లారు. ఈసారి విద్యార్థులు వెళ్లే అవకాశం లేదు. ప్రైవేట్ కళాశాలల్లో... జిల్లాలోని 39 ఇంజినీరింగ్ కళాశాలల్లో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయి. కొన్ని గుర్తింపు పొందిన కళాశాలలకు సీట్లు పూర్తిగా భర్తీకాగా చాలా కళాశాలల్లో సీట్లు మిగిలిపోయాయి. 50శాతం కంటే ఎక్కువ సీట్లు మిగిలిన కళాశాలల్లో 10 వరకు ఉన్నాయి. మహిళా యూనివర్సిటీలో.. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ లలో 360 సీట్లు ఉన్నాయి. వీటిలో గత ఏడాది 36 సీట్లు మిగిలాయి. ఈ సంవత్సరం ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ద్వారా 360 సీట్లు భర్తీ అయ్యాయి. -
4 కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజు
69 ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.35 వేల కనీస ఫీజు - ప్రతిపాదనలు సిద్ధం.. పరిశీలించిన ప్రభుత్వం? - 2న టీఏఎఫ్ఆర్సీ కమిటీలో పూర్తిస్థాయిలో ఖరారు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు సంబంధించి ప్రతిపాదనలను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సిద్ధం చేసింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును నిర్ణయించింది. 69 కాలేజీలకు కనీస ఫీజు రూ.35 వేలు మాత్రమే ఇచ్చేలా నిర్దేశించింది. వీటన్నింటినీ ప్రభుత్వం కూడా పరిశీలించినట్లు సమాచారం. వచ్చే నెల 2న టీఏఎఫ్ఆర్సీ పూర్తి స్థాయి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. అదే రోజు ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపిస్తే 3న సవరించిన ఫీజుల అమలుకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇవి వచ్చే మూడేళ్లపాటు (2016 - 17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) అమల్లో ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఈ నెల 30న ఇచ్చేందుకు ప్రభుత్వం, జేఎన్టీయూహెచ్ సిద్ధమయ్యా యి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జేఎన్టీయూహెచ్ తనిఖీ నివేదికలను పరిశీలించి గుర్తింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనిపై జేఎన్టీయూహెచ్ ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో 30న వీలు కాకపోతే ఆ తరువాతి రోజున కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. కాగా, జూలై 3న ఫీజుల ఉత్తర్వులు వచ్చిన వెంటనే 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. సగటు ఫీజు రూ.49,768 రాష్ట్రంలోని 269 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ కాలేజీలు పోగా మిగితా 248 కళాశాలల్లో వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన ఫీజులను టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. వాటన్నింటి సగటు ఫీజును రూ.49,768గా ఖరారు చేసింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా, ఈసారి కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా చాలా కాలేజీల్లో రూ.8 వేల నుంచి 10 వేల వరకు పెరిగింది. మరికొన్ని కాలేజీల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. ఇవన్నీ ప్రతిపాదిత ఫీజులే. ప్రభుత్వం వీటికి తుది ఆమోదం తెలిపేటపుడు కాలేజీల ఫీజుల్లో హెచ్చుతగ్గులుండవచ్చు. ఇక ఏపీలో సగటు ఫీజు 51,193గా నిర్ణయించింది. ప్రస్తుతం టాప్ కాలేజీల్లో కొన్నింటికి ఫీజులను తగ్గించగా, గతంలో సాధారణ ఫీజులున్న కాలేజీల్లో ఈసారి భారీగా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. గతంలో రూ.1.13 లక్షలున్న చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫీజును ఈసారి రూ.1.09 లక్షలకు తగ్గించినట్లు తెలిసింది. ఇక గతంలో రూ. 75 వేలున్న వర్ధమాన్ కాలేజీ ఫీజు రూ.1.05 లక్షలకు పెరిగింది. బయోమెట్రిక్ హాజరుంటేనే... ప్రస్తుతం కాలేజీల వారీగా ఫీజులపై నిర్ణయం చేసిన ఏఎఫ్ఆర్సీ.. ప్రతి కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తేనే ఈ ఫీజులను ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల్లోనూ ఆధార్ నంబరు తప్పనిసరి చేస్తోంది. 23 కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఏఎఫ్ఆర్సీ నిర్ణయిం చిన ఫీజులను రాష్ట్రంలోని 23 కాలేజీలు నిరాకరించినట్లు తెలిసింది. ఏఎఫ్ఆర్సీ నిర్ణయం తమకు ఆమోదం కాదని ఆయా కాలేజీలు వెల్లడించినట్టు సమాచారం. తాము కల్పిస్తున్న సదుపాయాలకనుగుణంగా ఫీజుల్ని పెంచకపోవడంతో ఏఎఫ్ఆర్సీ నిర్ణయానికి ఆయా కాలేజీల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో వారు ఫీజుల ఉత్తర్వు వెలువడగానే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఏపీలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు భారీగా పెరిగాయి. 273 కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మూడేళ్ల వరకు పెంచిన ఫీజుల విధానం అమలు కానుంది. బీటెక్ కోర్సులకు గరిష్ట ఫీజు రూ. లక్షా 8వేలు, కనిష్ట ఫీజు రూ.35 వేలుగా నిర్ధారించారు. ఎంటెక్ గరిష్ట ఫీజు రూ. లక్ష, కనిష్ట ఫీజు రూ.45 వేలు చేశారు. బీటెక్‌లో గరిష్ట ఫీజులు ఉన్న కాలేజీల వివరాలు.. వీఆర్ సిద్ధార్థ కాలేజీ రూ. లక్షా 2వేలు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీ లక్షా 8వేలు గాయత్రి విద్యా పరిషత్ లక్షా 3వేలు, జీఎమ్ఆర్ఐటీ లక్షా వెయ్యి గాయత్రి ఉమెన్స్ కాలేజ్ 97 వేల 600 రూపాయలు ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో ఫీజుల వివరాలు ఉంచనున్నారు. 27న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుందని మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 29న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. జూలై 1 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు
ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు కాకినాడ: ఇంజనీరింగ్ కళాశాలల్లో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్ల మార్పు, చేర్పులు ఈనెల 19, 20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందన్నారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంట ర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్వర్డ్ చాలా కీలకమని, ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరు కాలేకపోయినా తరువాత రోజు హాజరు కావచ్చని వివరించారు. -
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
భువనగరి (నల్గొండ జిల్లా) : భువనగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ భగవాన్, డీఎస్పీ సత్తెన్న, సీఐ శివశంకర్ గౌడ్, ఎస్ బాషాతోపాటు పలువురు పాల్గొన్నారు. రికార్డులను పరిశీలించి కళాశాలలో వసతులు ఎలా ఉన్నాయో చూశారు. వాత్సల్య, కేడీఆర్ ఇంజనీరింగ్, యూనిటీ ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు కొనసాగుతోన్నాయి.