ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు అంత ఈజీ కాదు | Permissions for engineering colleges are not easy | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు అంత ఈజీ కాదు

Published Thu, Apr 18 2019 3:58 AM | Last Updated on Thu, Apr 18 2019 3:58 AM

Permissions for engineering colleges are not easy - Sakshi

సాక్షి, అమరావతి: ప్రయివేటు రంగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యాసంస్థలకు ఇక ఫుల్‌స్టాప్‌ పడనుంది. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్‌ కాలేజీలను కట్టడి చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేయకుండా ఇకపై ఆయా రాష్ట్రాల అవసరం మాత్రమే కాలేజీల ఏర్పాటుకు అనుమతించనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలనుంచి ముందుగానే ప్రణాళికలను తెప్పించి వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ఉన్న సదుపాయాలు, ల్యాబ్‌లు, ఇతర ఏర్పాట్లు, ప్రమాణాల తీరు తదితర అంశాలపై ఆగస్టులోగా తమకు నివేదికలు పంపాలని ఏఐసీటీఈ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పండాదాస్‌ తెలిపారు.  ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూ పోతోంది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు ఇతర ఏర్పాట్లపై పైపై పరిశీలనతోనే సరిపెడుతోంది.

ఏఐసీటీఈ అనుమతి వచ్చాక రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వం వాటికి గుర్తింపు ఇవ్వక తప్పనిపరిస్థితి. దీంతో వందలాదిగా కాలేజీలు పుట్టుకొచ్చి సీట్ల సంఖ్య లక్షలకు చేరుకుంది. ఏటా వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ కాలేజీలు 20, ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు 287 ఉన్నాయి. వీటిలో వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులకు సంబంధించి మొత్తం 1,38,953 సీట్లు ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 4,834, ప్రయివేటు కాలేజీల్లో 1,34,119 ఉన్నాయి. ప్రయివేటు కాలేజీల్లోని వివిధ కోర్సులకు డిమాండ్‌ లేక, విద్యార్ధులు చేరక వేలాది సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందగా ఆయా కోర్సులను రద్దుచేసుకొనేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. దీనికి కారణం రాష్ట్రం అవసరాలను చూడకుండా  కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమే అని గుర్తించి నూతన విధానం తీసుకువచ్చారు.
 

ప్రమాణాల పెంపుకోసమే...
ఇంజనీరింగ్‌ సహా ఆయా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రమాణాల పెంపునకు వీలుగా ఏఐసీటీఈ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ కొత్త విధానం వస్తోంది. ఇంజనీరింగ్‌ విద్యపై ప్రొఫెసర్‌ మోహన్‌రెడ్డి కమిటీ నివేదిక మేరకు పలు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కార్యక్రమం కింద ప్రపంచ బ్యాంకు నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి అవకాశాల కల్పన, కమ్యూనికేషన్‌ స్కిల్స్, డొమైన్‌ స్కిల్స్‌ మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాలేజీలకు పారిశ్రామిక అనుసంధానం ద్వారా విద్యార్థుల్లో మెలకువలను పెంపొందించనున్నారు. అలాగే నేటి పారిశ్రామిక అవసరాలు, రోజురోజుకు మారిపోతున్న సాంకేతికతల నేపథ్యంలో ప్రస్తుతమున్న కోర్సుల్లోనూ అనేక మార్పులు చేయనున్నారు. సాంప్రదాయంగా ఉన్న సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ వంటి కోర్సుల్లో కొత్త సాంకేతిక అంశాలను చొప్పించనున్నారు. కొత్త అంశాలతో కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్, బ్లాక్‌చైనా, డాటా సైన్సెస్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

క్షేత్రస్థాయి అభ్యసనానికి ప్రాధాన్యం
నాలుగు గోడల మధ్య థియరీలను వినడం, చదవడం ద్వారా కాకుండా క్షేత్రస్థాయిలో అభ్యసనానికి శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నది ఏఐసీటీఈ అభిప్రాయం. ఇప్పటికే ఈ దిశగా అన్ని యూనివర్సిటీలకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న ఏడాదినుంచి పారిశ్రామిక అనుసంధానాన్ని మరింత పెంచి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యతనిస్తారు. పారిశ్రామిక శిక్షణ, ఇంటర్న్‌షిప్, ప్రయోగశాలల్లో పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement