![Fifty Thousand Engineering seats for AP students in Telangana every year](/styles/webp/s3/article_images/2025/02/14/engneer.jpg.webp?itok=x_BimPSl)
1,12,069 రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు..
తెలంగాణలో ఏటా 50 వేల మంది ఏపీ విద్యార్థులకు సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఏపీ విద్యార్థులకు నాన్‌లోకల్ కోటా కింద 15 శాతం సీట్లు లభించేవి. ఆ కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కోటాను తీసివేయాలని ప్రభుత్వం భావి స్తోంది. ఏటా ఏపీ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ పడతారు.
ఇందులో 16 వేల సీట్ల వరకు నాన్–లోకల్ కోటా కింద, మిగతావి జనరల్ పోటీలో ఏపీ విద్యార్థులు దక్కించుకుంటారు. ఇప్పుడు ఏపీ స్థానికతను అనుమతించకపోతే రెండు కేటగిరీల్లోనూ ఆ రాష్ట్ర విద్యార్థులకు సీట్లివ్వరు. యాజమాన్య కోటా సీట్లు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి. అయితే, ఏపీ నాన్‌లోకల్ కోటా ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది ఎప్‌సెట్‌లో ఇంజనీరింగ్ విభాగానికే 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.80 లక్షల మంది సెట్‌లో అర్హత పొందారు.
సీట్లకు డిమాండ్ తగ్గుతుందా?
రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో మొత్తం 1,12,069 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేస్తారు. 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. గత ఏడాది మరో 3 వేల సీట్ల పెంపునకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతిచ్చినా, ప్రభుత్వం అనుమతివ్వకపోవటంతో కాలేజీలు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నాయి. దీంతో ఆ 3 వేల సీట్లను ఈసారి ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో అనుమతించాల్సి ఉంటుంది.
ఏపీ విద్యార్థులు తగ్గడం, కొత్తగా సీట్లు పెరగడంతో ఈసారి ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు సీఎస్‌ఈ, కంప్యూటర్ అనుసంధాన డేటాసైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లోనే ఉన్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సీట్లను తెలంగాణ విద్యార్థులు కొంత తేలికగానే పొందే వీలుంది.
వెంటాడుతున్న న్యాయ సమస్యలు
రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లపాటు నాన్–లోకల్ కోటా అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది ఎప్‌సెట్ నోటిఫికేషన్ సమయానికి పదేళ్లు పూర్తి కాలేదు కాబట్టి నాన్–లోకల్ కోటా అమలు చేశారు. అయితే, నాన్–లోకల్ కోటా ఎత్తివేసే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌కు అధికారికంగా తెలియజేయలేదు. రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కోటా ఎత్తివేత జీవో ఇవ్వాలి. లేని పక్షంలో ఎవరైనా కోర్టుకెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అధికార వర్గాలు అంటున్నాయి.
ప్రభుత్వానికి తెలిపాం
నాన్–లోకల్ కోటా ఎత్తివేత జీవో వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం. విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటాం.
– ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment