
ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన
కోర్సుల సమతుల్యతపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలికి ఆదేశం
కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యతపై, కోర్ గ్రూపుల తిరోగమనంపైనా అధ్యయనం
కోర్సుల ఆడిటింగ్‌కు ఉన్నత విద్యామండలి నిర్ణయం
కంప్యూటర్ కోర్సుల్లో 61 వేల మంది చేరితే... స్కిల్డ్ ఉద్యోగాలొచ్చేది 5 వేల మందికే..
కనీసం 40 శాతం మందికి ఉపాధి కల్పించని కాలేజీలపై మరింత లోతుగా పరిశీలన
సమగ్ర సమాచారం సేకరణలో ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా కోర్సులు, సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. వాటిల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేవనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత దెబ్బతింటోంది. ఏటా 57 వేల మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తుండగా.. వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 5 వేలు దాటడం లేదు. మరోవైపు కోర్ బ్రాంచీలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే సీఎస్‌ఈ, దాని అనుబంధ బ్రాంచీలు తప్ప, ఈఈఈ, సివిల్, మెకానికల్‌తోపాటు అనేక కోర్ గ్రూపులకు కాలం చెల్లినట్టే.
ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. వీటికి చెక్ పెట్టాలని సంకల్పించింది. కోర్సుల సమతుల్యతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లోని బ్రాంచీలపై ఆడిటింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత పరిశీలనే దీని ప్రధాన ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. నాణ్యత పాటించని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో సీట్లకు కోత వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సీఎస్‌ఈదీ క్రేజేనా?
రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో 1.06 లక్షల సీట్లున్నాయి. ఇందులో కనీ్వనర్ కోటా కింద 87 వేల సీట్లు ఉండగా, వీటిలో 61 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ సీట్లకే పోటీ తీవ్రంగా ఉంటోంది. 2019లో రాష్ట్రంలో కంప్యూటర్ సీట్లు 22,033 మాత్రమే. 2024 సంవత్సరానికి ఇవి 61,587కు పెరిగాయి. అంటే మూడు రెట్లు పెరిగాయి.
ఇక కోర్ గ్రూపు (సివిల్, మెకానికల్, ఈఈఈ తదితరాలు)ల్లో 2019లో 43,532 సీట్లు ఉంటే, 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో కోర్ గ్రూపులో సీట్లు 25,597కు పడిపోయాయి. ప్రవేశాలు కూడా 19,739కి తగ్గిపోయాయి. కోవిడ్ తర్వాత నుంచి కోర్ గ్రూపుల్లో సీట్లు, ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోగా.. కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్ పెరిగింది. ఈ సీట్ల పెరుగుదల మూడు రెట్లు ఉన్నప్పటీకీ, నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. 56 శాతం మంది అన్‌స్కిల్డ్ ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటున్నారు.
ఇప్పుడేం చేస్తారు?
బ్రాంచీల ఆడిటింగ్ చేపట్టి వాటికి ప్రామాణికతను పొందుపరచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముందుగా కాలేజీల నుంచి సీఎస్‌ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నారు. ఫ్యాకల్టీ, కోర్సుకు కావాల్సిన లాంగ్వేజ్, లైబ్రరీ, లేబొరేటరీల వివరాలను తీసుకుంటారు. సీఎస్‌ఈ అనుమతి లభించినప్పటి నుంచీ కాలేజీల్లో ఉపాధి అవకాశాలను పరిశీలిస్తారు. కనీసం 40 శాతం ఉపాధి కల్పించని కాలేజీలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తారు.
డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉండాల్సిన ప్రమాణాలు, బోధన పద్ధతులను మార్కెట్ నిపుణుల నుంచి తెలుసుకుంటారు. ఈ తరహా ప్రమాణాలు ఎన్ని కాలేజీల్లో ఉన్నాయో పరిశీలిస్తారు. వీటి ఆధారంగా నాణ్యతను గుర్తించి, అది లోపించిన కాలేజీల్లో సీట్లను తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశముంది. మరోవైపు ప్రాజెక్టు వర్క్‌ను గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేయించేలా కాలేజీలే ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ దిశగా భరోసా ఇచి్చన తర్వాతే వాటికి అనుమతినివ్వాలని భావిస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి
కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెరిగినా... తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉండటం లేదు. చాలా కాలేజీల్లో రికార్డుల ప్రకారం బోధకులు నిపుణులే (పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసిన వాళ్లు) ఉంటున్నారు. కానీ వాస్తవంగా బోధించేది బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్లే. అరకొర వేతనాలివ్వడమే ఈ పరిస్థితికి కారణం. అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు జరిగే తనిఖీ సమయంలోనే రికార్డుల్లోని బోధకులు వస్తున్నారు.
ఇక మౌలిక వసతుల మాటకొస్తే... 76 కాలేజీల్లో కంప్యూటర్ కోడింగ్ లే»ొరేటరీలు లేవని జేఎన్‌టీయూహెచ్ వర్గాలు అంటున్నాయి. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నిష్ణాతులైన బోధకులే కరువయ్యారు. 28 కాలేజీల్లో విద్యార్థులకు కోడింగ్‌లో 20 శాతం పరిజ్ఞానం కూడా ఉండటం లేదని గత ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఓ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ ముఖ్య ఉద్యోగి తెలిపారు.
నాణ్యత కోసమే ఆడిట్
కోర్సుల ఆడిటింగ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది. క్రేజ్ కొద్దీ చేరే విద్యార్థులు ఏమేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆడిటింగ్ మంచి ఆయుధమని భావిస్తున్నాం. సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ విద్యలో ప్రైవేటు కాలేజీలు వ్యాపార ధోరణితో కాకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆడిట్‌కు సిద్ధమయ్యాం. పూర్తి ఆడిట్ నివేదికను ప్రభుత్వం ముందుంచుతాం.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment