సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీపై ఈసారి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలో కార్యాచరణ వెలువడనుంది. ఇప్పటికే ఈ విధానంపై ఉన్నత విద్యా మండలి నివేదిక రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి అందించనుంది. బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజును నిర్ణయించే అధికారం ఫీజులు, నియంత్రణ కమిటీకి అప్పగించాలని నివేదికలో పేర్కొంది. సీ కేటగిరీ ఫీజుల విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేకున్నా, బీ కేటగిరీ సీట్ల ఫీజుల విషయంలోనే తర్జన భర్జన కొనసాగుతోంది. మరోవైపు ఈ తరహా నియంత్రణపై ప్రైవేటు కాలేజీలు విముఖంగా ఉన్నాయి. తమ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎఫ్‌ఆర్‌సీ, ప్రభుత్వాన్ని కోరాయి.
నియంత్రణ ఎలా?
రాష్ట్రంలో దాదాపు 1.32 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 70 శాతం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతంలో 15 శాతం బీ కేటగిరీ కింద, 15 శాతం సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ అధికారం కాలేజీలకే ఉంది. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి. వీటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. కానీ చాలా కాలేజీలు బీ కేటగిరీ సీట్ల భర్తీలో నిబంధనలు పాటించడం లేదు. అధిక ఫీజు చెల్లించినవారికే సీట్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.
రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉండటంతో, ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక్కో సీటుకు రూ.6 నుంచి రూ.18 లక్షల వరకు అనధికారికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో కమిటీ వేసింది. ఆన్‌లైన్ విధానంలో ఈ సీట్ల భర్తీని చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆ కమిటీ నిర్ణయించింది. సీ కేటగిరీ సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు ఇస్తారు. ఈ కేటగిరీలో విద్యార్థులు లేకపోతే కాలేజీలు ఇష్టానుసారం అమ్ముకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు కేటగిరీలపై నియంత్రణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కాలేజీల తనిఖీలకు రంగం సిద్ధం
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ వచ్చే వారం మొదలవ్వబోతోంది. వివిధ బ్రాంచీలకు తగ్గట్టు మౌలిక వసతులు ఉన్నాయా? అధ్యాపకులు ఏమేర ఉన్నారనే అంశాలను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఈసారి అఫిలియేషన్ ఇస్తామని విశ్వవిద్యాలయాల వీసీలు చెబుతున్నారు. ముఖ్యంగా సీఎస్‌సీ, డేటా సైన్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల విషయంలో ప్రత్యేకంగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ముగ్గురు నిపుణుల చొప్పున ఒక్కో తనిఖీ కమిటీ వేసి కాలేజీల్లో వసతులు పరిశీలించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఆన్‌లైన్ విధానమే మంచిది
యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో చేపడితేనే సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం
ఆధారంగా ముందుకెళ్తాం.
–ప్రొ. బాలకిష్టారెడ్డి,ఉన్నత విద్యామండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment